Previous Page Next Page 
సాహసి పేజి 30


    మరి కాదనలేకపోయింది ఇందుమతి. మరే మాత్రం ఆలస్యం చెయ్యకుండా, కపాలేశ్వర్ తుప్పలదారి పట్టాడు "నేనూ... వెళ్తాను... ఫోటో తీస్తాను" ఉత్సాహంగా అంది వైశాలి.

    "పదినిమిషాల్లో వచ్చేయండి..." చెప్పింది ఇందుమతి.

    కపాలేశ్వర్, వెళ్ళినవేపే పరుగుతీసింది వైశాలి. నీళ్ళు లేని వాగులో నడుస్తున్నారు యువరాజు, ఇందుమతి, ముత్యాలనాయుడు, రెండు గజాల తర్వాత ఒకచోట కూర్చుండిపోయారు.


                   *    *    *    *


    పెనుభూతం లాంటి చెట్టు చాటున నుంచున్నాడు కపాలేశ్వర్. అక్కడికి పదడుగుల దూరంలోనే, తతంగమంతా జరుగుతోంది. ఒకవేపు పూజారి, వారి భాషలో మంత్రోచ్చాటనం చేస్తున్నాడు. మరోపక్క, అర్ధచంద్రాకారంలో గిరిజనులు, ఆడా, మగా, పిల్లలు, వృద్ధులూ నిలబడ్డారు.

    గుడి ముందు, అయిదు వరసల్లో పేర్చిన గంధపు చెక్కలు... ఆకాశం ఎత్తున మండుతున్నాయి.

    ఆ మంటలకు కొంచెం దూరంలో, నులక మంచంమ్మీద ఒక నడ వయస్సు స్త్రీ శవం నగ్నంగా వుంది.

    పూజారి చేసిన సంజ్ఞతో వాయిద్యాల హోరు ఎక్కువ కావడం, నడివయసు స్త్రీ శవాన్ని కొందరు వ్యక్తులు అటూ ఇటూ పట్టుకుని, ముందుకు తీసుకురావడం, ఉయ్యాల ఊపినట్లుగా ఊపుతూ ఆ శవాన్ని మంటల్లోకి విసిరెయ్యడం క్షణకాలంలో జరిగిపోయింది.

    మరో క్షణం తర్వాత-

    గుడిసెలోంచి మరో గిరిజన స్త్రీ దాదాపు నెలల పసికందుని తీసుకొచ్చి, పూజారి చేతికిచ్చింది. ఆ పసికందు కాళ్ళను పట్టుకుని, తలని కిందకి వేలాడదీసి పసుపూ, కుంకుమ రాస్తున్నాడు పూజారి, గిరిజన అరుపుల్లో, పసికందు ఏడుపు కల్సిపోతోంది.

    రెండే రెండు క్షణాలు గడిచాయి... చూస్తుండగానే.

    రెండు చేతుల్లో ఆ పసికందుని పట్టుకుని మంటల్లోకి విసిరేశాడు ఆ పూజారి.

    అది చూస్తూనే ఒణికిపోయింది వైశాలి.

    కళ్ళముందే చచ్చిపోయిన తల్లి ఎముకలు మండి విరిగిపోతున్నాయి. మంటల్లో పడిన పసికందు, నుగ్గయి పోవడానికి క్షణం పట్టలేదు. "బార్బేరియస్" చెట్టు చాటునుంచి భయంగా అరిచింది వైశాలి.

    "అది ఈ తెగ సంప్రదాయం... భయపడకు" దగ్గరగా వచ్చిన ఏదో ఉచ్చ్వాస, దాంతోపాటు విన్పించిన మాట... తల తిప్పి చూసింది వైశాలి-

    కపాలేశ్వర్... ప్రపంచంలోని కోర్కెనంతటినీ తన కళ్ళల్లో నింపుకుని వున్నాడు. గుడి ముందునుంచి, గిరిజనులు గుంపులు, గుంపులుగా ముందుకెళ్ళిపోతున్నారు. మంట వెలుగు, చల్లారుతోంది క్రమంగా- కపాలేశ్వర్ లో కోర్కెల మంట రాజుకుంది. నెమ్మదిగా ముందుకెళ్ళి ఆమెని ఆనుకుంటూ నిలబడ్డాడు. ఒకింత సేపటి తరువాత అకస్మాత్తుగా కపాలేశ్వర్ చేతులు, వైశాలి భుజమ్మీద పడ్డాయి. ఆ చేతులు నెమ్మది, నెమ్మదిగా క్రిందికి పాకుతున్నాయి. వేడిగా పాకుతున్నాయి కపాలేశ్వర్ లో- వైశాలి వేడి వయసు, యువరాజునూహించుకుంటోంది. కపాలేశ్వర్ చేతులు, వైశాలి గుండెల మీదున్నాయి- అవి మెత్తగా కదులుతున్నాయి.

    పరుగులాంటి నడక ఏదో వింపిస్తే, కళ్ళు తిప్పి చూసి, ప్రమాదాన్ని శంకించి.

    గబుక్కున వైశాలిని వదిలేసి, గబగబా దట్టమైన పొదల్లోకి మాయమైపోయాడు కపాలేశ్వర్.

    ఏం, అర్ధం కాని వైశాలి... ముందుకు రాబోయి ఆగిపోయింది ఎదురుగా-

    ఆమె వేపేకోపంగా చూస్తున్న రెండు కళ్ళు.

    ఆ కళ్ళు యువరాజువి...


                  *    *    *    *


    ఎండిపోయిన ఎద్దు కపాలం, ముత్యాలనాయుడు కాలికింద పడి, ఫళుక్కున విరిగి బండరాళ్ళమీంచి దొర్లింది.

    ఆ శబ్దానికి కుక్క భౌ... భౌమని అరవడం ప్రారంభించింది. ఒక్క క్షణం ముత్యాలనాయుడి గుండె వేగం హెచ్చింది.

    "కంచూరువాక ఉందని తెల్సినా... అది కపాలకోనలోనే ఉందని తెలీదు... ఇక్కడ నుంచి మనం, కొంచెం అప్రమత్తంగా వుండాలి..." అన్నాడు అంతకు ముందే అక్కడ ప్రత్యక్షమయిన కపాలేశ్వర్ ఏమీ జరగని వాడిలా- మరేమీ తెలీనివాడిలా.

    "విశ్వరూపశర్మ గారు చెప్పిన ప్రకారం... కంచూరువాక, ముప్పై మైళ్ళ పరిధిలో ఉన్న కొన్ని భయంకరమయిన గిరిజన గ్రామాల సముదాయం మేప్ లోని విషయాలు... ఇక్కడ బయటపడే అవకాశం ఉందంటారా" ప్రశ్నించింది ఇందుమతి.

    "అక్కడికెళితేనేగాని- మనం ఏ విషయం చెప్పలేం..."

    "బాగా అలిసిపోయాం... ఇక్కడెక్కడైనా... ఆగి, ఏదైనా తింటే బాగుంటుందమ్మా-" ముత్యాలనాయుడు అన్నాడు.

    "యువరాజూ... మంచి ప్రదేశం చూడు..." ఇందుమతి నోటివెంబడి ఆ మాట రాగానే ఆగిపోయాడు యువరాజు.

    భోజనాలయ్యాక ఎవరూ కదల్లేకపోయారు... మూడుగంటలసేపు 'రెస్టు' తీసుకుని, బయలుదేరాలని నిర్ణయించింది ఇందుమతి. అంతా రాళ్లూ, గుట్టల మయం కావడంవల్ల, గుడారాలు వెయ్యడానికి వీలుకాక పోవడంతో, చదునుగా వున్న కొండరాళ్ళమీదే, టార్పాలిన్ల మీద వరసగా పడుకున్నారు అందరూ...

    వైశాలికి నిద్ర పట్టటం లేదు.

    దూరంగా పడుకున్న యువరాజు మీదే ఆమె చూపులున్నాయి. కపాలేశ్వర్ నిద్రపట్టడం లేదు- అటూ, ఇటూ దొర్లుతున్న వైశాలి మీదే అతని చూపులున్నాయి.

    రెండు జాములు గడిచాయి. కాపలాగా ఉన్న ముత్యాలనాయుడు నెమ్మదిగా రాతి బండకు చేరబడి నిద్రపోతున్నాడు- తనకు తెలీకుండానే.

    దూరంగా పడుకున్న యువరాజు మీదే ఆమె చూపులున్నాయి. కపాలేశ్వర్ కి నిద్రపట్టడం లేదు- అటూ, ఇటూ దొర్లుతున్న వైశాలి మీదే అతని చూపులున్నాయి.

    రెండు జాములు గడిచాయి. కాపలాగా ఉన్న ముత్యాలనాయుడు నెమ్మదిగా రాతి బండకు చేరబడి నిద్రపోతున్నాడు- తనకు తెలీకుండానే.

    దూరంగా రాజేసిన కేంప్ ఫైర్ ఆరడానికి సిద్ధంగా ఉంది. కపాలేశ్వర్ నెమ్మదిగా లేచి, అటూ ఇటూ చూస్తూ, ఒక గులకరాయిని తీసుకుని, వైశాలికి మాత్రమే తగిలేటట్లుగా విసిరి-

    కేంప్ ఫైర్ వెలుతురుకు అందని చీకట్లోకి వెళ్ళాడు. వెనక్కి చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు.

    ఎలాగైనా, ఈ రాత్రి వైశాలితో గడపాలి తప్పదు. 

    కోరికతో తహతాహలాడిపోతున్న వైశాలి మనసు కపాలేశ్వర్ సంజ్ఞను అర్ధం చేసుకుంది. నులివెచ్చని చలితో కూడుకున్న ఆ వాతావరణం, పరిసరాలు ఆమెలోని కోర్కెలకు ఊపిరి పోస్తున్నాయి.

    నెమ్మదిగా లేచింది. అటూ ఇటూ చూసింది. వైశాలి లేవడం చూసిన "రాకీ" భౌ, భౌమని అరవడంతో ముత్యాలనాయుడికి మెలకువవొచ్చేసింది.

    "ఏవమ్మా నిద్రపట్టటం లేదా- కీచురాళ్ళ సొద- ఎక్కువా ఉంది కదూ..." అన్నాడు ఆప్యాయంగా.

    "అవునవును-" కంగారుగా అనేసి, మళ్ళీ పక్కమీద వాలిపోయింది వైశాలి- పావుగంట గడిచింది.

    ఆర్ధరాత్రి చీకట్లో ఓ ఆర్తనాదం విన్పించింది.

    "హెల్ప్... హెల్ప్..." ఆ అరుపు కపాలేశ్వర్ ది. ఆ అరుపుతో అందరికీ మెలకువొచ్చింది. ఒకే ఒక్క క్షణం అందరూ అలర్టయి పోయారు. యువరాజు చెంగున లేచి, టార్చిలైటు పట్టుకుని పరుగెత్తాడు- అతని వెనుక ముత్యాలనాడుడు-  
ఆ వెనుక ఇందుమతి...

    "కపాలేశ్వర్... కపాలేశ్వర్... కపాలేశ్వర్..."

    అందరూ ఎలుగెత్తి అరుస్తున్నారు.

    ఎక్కడా... కపాలేశ్వర్ నుంచి జవాబు విన్పించడం లేదు.

    ఏమయ్యాడు కపాలేశ్వర్?

    గంట... రెండు గంటలు... మూడు గంటలు గడిచిపోయాయి. కొండలన్నీ వెతికి, వెతికి అలసిపోయారు అందరూ.

    అప్పటికి పూర్తిగా తెల్లవారింది.

    "కపాలేశ్వర్ మీద పులి దాడి చేసిందేమో" అనుమానం వెలిబుచ్చాడు ముత్యాలనాయుడు.

    కీలకమయిన సమయంలో అలాంటి సంఘటన జరగడంతో, ఇందుమతి బాగా అప్ సెట్ అయిపోయింది.

    అందరిలోనూ నిరాశ నిస్పృహలు ఆవరించాయి. అప్పటికీ, యువరాజు తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. రాతిబండమీద బొమ్మలా కూర్చుండి పోయింది ఇందుమతి.

    "మేడమ్... నిరాశపడకండి... కపాలేశ్వర్ పులివాత పడ్డాడని నేననుకోవడం లేదు..." అన్నాడు యువరాజు ఓ పక్క చెవులు రిక్కించి, కళ్ళతో పరిసరాలను గమనిస్తూ.

    "ఎలా చెప్పగలవు-? మాన్ ఈటర్- రాజకీయ నాయకుడు ఒకటే నంటారు. ఆ రెండు జాతులకు దయాదాక్షిణ్యాలుండవు..." అంది ఇందుమతి.

    "పులి మనిషిని తీసికెళితే చంపిమాత్రమే తీసుకెళుతుంది బతికుండగా- తీసికెళ్ళలేదు... ఒకవేళ కపాలేశ్వర్ ని పులి చంపితే... ఆ ప్రాంతంలో కనీసం రక్తమైనా కనిపించాలి గదా... ఒక్క చుక్క రక్తపు బొట్టు లేదు..." పులుల గురించి ఎంతో తెల్సినవాడిలా విశ్లేషిస్తున్న యువరాజు వేపు ఆశ్చర్యంగా చూసిందామె.

    తను చేసే పనిపట్ల ఏకాగ్రత తప్ప, మరో ధ్యాసగానీ విసుగు కానీ, ఏమాత్రమయిన చిరాకుగానీ వ్యక్తం చెయ్యని యువరాజు వ్యక్తిత్వాన్ని మనసులోనే మెచ్చుకుంది ఇందుమతి.

    దూరంగా కొండెక్కి, వైశాలి బైనాక్యులర్స్ లోంచి నాలుగువైపులా చూస్తోంది.

    ఇందుమతి దగ్గర్నుంచి లేచి, వైశాలి వేపు నడిచాడు యువరాజు.

    "అసలు రాత్రేం జరిగింది..." ఆ మాటలకు తలతిప్పింది వైశాలి. కపాలేశ్వర్ మాయం అవగానే, మొదట వైశాలినే అనుమానించాడు యువరాజు.

    "వాట్ డు యూ మీన్..." చిర్రెత్తుకొచ్చింది వైశాలికి.

    "ఐ మీన్ దట్- సమ్ థింగ్ ఈజ్ బిహైండ్ యూ... నాకు తెలుసు... నిన్ను కపాలేశ్వర్ ఇష్టపడుతున్నాడని... నేనన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను... చెప్పు..." సీరియస్ గా అన్నాడు యువరాజు.

    "రియల్లీ... ఐ డోంట్ నో ఎనీథింగ్ రాజూ- బిలీవ్ మీ..." తొట్రుపాటుతో అంది వైశాలి.

    అదే సమయంలో, కుక్కతోపాటు, అక్కడికి ముత్యాలనాయుడు రావడంతో ఏదో చెప్పబోయి ఆగిపోయాడు యువరాజు.

    "ఒక గవ్యూతి (రెండు కోసులు- అనగా నాలుగు మైళ్ళు...) దూరం వెతికితేనే తప్ప... లాభం లేదు... ఎందుకంటే పులి కేవలం కొన్ని అంగల్లో వెళ్ళే దూరం ఒక గవ్యూతి... రాకీ మాత్రం- ఆ కొండల దగ్గరే తిరుగుతోంది తప్ప- ఆ కొండల్ని దాటి వెళ్ళడం లేదు..." చెప్పాడు ముత్యాలనాయుడు.  

 Previous Page Next Page