ఒక భారతీయ మహిళ, అందులోనూ ఒక కంపెనీకి ఎమ్.డి. అయినా ఎమ్.బి.ఏ. చదువుకున్న యువతి ఒక యువకుడ్ని రేప్ చెయ్యడం నిజమా__కొంతమంది మా పాఠకుల్ని విద్యావంతుల్ని ఈ విషయంపై ప్రశ్నించిన మీదటఒక స్త్రీ, పురుషుడ్ని రేప్ చెయ్యడం అసంబద్ధమని, పురుషుడే స్త్రీని రేప్ చేసి, తను తప్పించుకోడానికి, కోర్టులో కేసువేసి వుంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై కొంతమంది ప్రముఖ ఫెమినిస్ట్ లీడర్స్ (వారిపేర్లు రహస్యంగా వుంచడమయినది). మనోహర్ అనే వ్యక్తి ఒక స్త్రీని బలాత్కరించి, ఆమె తనని బలాత్కరించిందని, దొంగకేసు పెట్టాడని, దీనిని సామూహికంగా స్త్రీలందరూ ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
మనోహర్ అనే వ్యక్తి స్త్రీ జాతిని అవమానించాడని, ఈ విషయమై తాము ఆ నిందితుని ఇంటి ముందు ధర్నా చేయడానికి పూనుకుంటామని హెచ్చరించారు.
ఈ ఆరోపణల గురించి ప్రశ్నించడానికి మనోహర్ కి మా ప్రత్యేక విలేకరి ఫోన్ చేయగా, ఆయన అందుకు జవాబు చెప్పడానికి తిరస్కరించారు.
(మనోహర్ కాలేజీలో ర్యాలీలు, రేపటి సంచికలో చదవండి)
ఆ వార్తని చదవగానే పేపర్ ని పరపరమని చింపి విసిరేశాడు మనోహర్.
రెండు నిముషాల్లో హేంగర్ కి తగిలించిన షర్టూ, పాంటుల్ని తీసి, వేసుకుని ఫాలాక్షుడిలా ఇంట్లోంచి బయటకొచ్చి హీరోహోండా ఎక్కి స్టార్ట్ చేశాడు.
"కోపంగా ఎక్కడికెళుతున్నాడు వీడు__ఒరేయ్.....మనూ...." అరుస్తున్నాడు మేనమామ.
ఆ పిలుపుల్ని వినపించుకోలేదు మనోహర్. అప్పటికే హీరో హోండా స్టార్ట్ అయింది. ఆ ఇంటి పరిసరాలను దాటేసి రోడ్డుపై దూసుకుపోయింది.
'జనాంధ్ర' డైరీ పేపర్ ఎడిటర్ చాంబర్ లోకి విసురుగా దూసుకొచ్చిన మనోహర్ వేపు ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు ఆయన. అప్పటికే అతని ఫోటో రెండుసార్లు పత్రికలో వెయ్యడం వల్ల వెంటనే గుర్తు పట్టాడతను.
"నా పేరు మనోహర్! ఇవేళ న్యూస్ పేపర్లో నామీద న్యూస్ రాసిన రిపోర్టర్ ఎవరు?" ఆవేశంగా ప్రశ్నించాడు మనోహర్.
"కూర్చోండి....దేనికీ?"
"నేను జవాబు చెప్పడానికి, తిరస్కరించానని రాశారు. జవాబు చెప్పడానికొచ్చాను" సాధ్యమైనంత కూల్ గా అన్నడతను.
"పిలుస్తాను...." అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. ఫ్యూన్ లోనికి రాగానే "వెళ్ళి వాసుని పిలువు" అన్నాడు.
వాసు అనే విలేకరి లోనికి వస్తూనే మనోహర్ ని చూసి కంగారుపడ్డాడు.
ఎడిటర్ పెద్ద జాకాల్ అయితే...వీడొక చిన్న జాకాల్....ట్రైనీ జాకాల్....
వాసువేపు ఒకసారి చూసి, ముందుకు దూసుకెళ్ళి, అతని షర్ట్ పట్టుకున్నాడు. ముందు నా చెంపా, ఈ చెంపా వాయించేసి, ఇష్టమొచ్చినట్టుగా అతన్ని చితకబాదేశాడు. అడ్డుగా వచ్చిన ఎడిటర్ వేపు రుద్రుడిలా చూశాడు.
"చూడు మిస్టర్! ఎడిటర్ స్కూప్స్ అంటే ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని డామేజ్ చేసే వార్తలు కావు. మరొక్కసారి ఇలా జరిగిందా మీ పేపర్ ఆఫీసుని లేపేస్తాను. మేము మిమ్మల్ని హెచ్చరించినట్టుగా రాసుకోండి...నామీద పోలీస్ కేసు పెట్టుకోండి" సీరియస్ గా ఎడిటర్ కి వార్నింగిచ్చి, ఆ రూమ్ లోంచి బయటపడి లిఫ్ట్ ఎక్కి, కిందకి దిగి హీరోహోండా ఎక్కాడు.
ఒక గంట తర్వాత రిపోర్టరు వాసుని ఎమ్.డి. సస్పెండ్ చేశాడు.
* * * *
మర్నాడు ఉదయం పది గంటలు....
పర్సనల్ ఆఫీసర్ ఎదురుగా నుంచున్నాడు మనోహర్.
"ఈ పరిస్థితుల్లో మీ 'లీవ్'ని యాక్సెప్ట్ చెయ్యడం లేదా రిజెక్ట్ చెయ్యడం నా చేతుల్లో లేవు....ప్లీజ్ మీట్ ఎమ్.డి." చెప్పాడతను.
పి.ఓ. ఆ పితలాటకం పెడతాడని మనోహర్ కి తెల్సు.
ఎమ్. డి. ఛాంబర్ వేపు నడిచాడు మనోహర్.
ఎమ్ డి.పి. ఏని కలిశాడు.
"ఎమ్.డి . కోర్టుకెళ్ళే బిజీలో వున్నారు. మీకిప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవచ్చు" అంటూనే ఇంటర్ కమ్ లో మనోహర్ వచ్చిన విషయాన్ని మాయాదేవికి చెప్పింది.
అప్పుడు సమయం పదిగంటల పది నిమిషాలు....
"వెళ్ళండి..." అందామె మనోహర్ వేపు చూస్తూ.
మాయాదేవి ఛాంబర్ లోకి అడుగుపెట్టాడు మనోహర్.
ఎల్లోకలర్ శారీమీద, వయొలెట్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ లో మాయాదేవి మనోహరంగా వుంది.
"ఏం పని?" అడిగింది ఏదో ఫైలుచూస్తూ మాయాదేవి.
"లీవ్ లెటర్..."
"నిన్న నువ్వు చెప్పకుండా మానేశావు."
"కోర్టు పనివల్ల..." చెప్పాడతను.
"ఇష్టమొచ్చినట్టు చెప్తే సరిపోదు" అందామె పొగరుగా.
"నాకు పదిరోజులు లీవ్ కావాలి. ఏ కంపెనీలో పనిచేసే ఉద్యోగికైనా కోర్ట్ కి వెళ్ళాల్సి వచ్చినపుడు లీవ్ పెట్టుకునే సౌకర్యం వుంది." అంటూ లీవ్ లెటర్ ని, కోర్ట్ ప్రొసీడింగ్స్ ని ఆమె టేబుల్ మీద పెట్టాడు. కోర్టు ప్రొసీడింగ్స్ ని అడ్డం పెడతాడని వూహించని మాయాదేవి ఖిన్నురాలైంది. అయినా క్షణాల్లోనే తేరుకుందామె.
ఏదో ఒక నెపంతో మనోహర్ ని కోర్టుకి వెళ్ళకుండా ఆపగలిగితే తాను గెలుస్తుంది. మనోహర్ తన స్వంతమవుతాడు. ఇదే మాయాదేవి ఉద్దేశం తప్ప - శాశ్వితంగా అతన్ని ఓటమికి గురి చేయటం కాదు.
ఏం చెయ్యాలో నాకు తెలుసు. అన్నట్టు తల పంకించి ఇంటర్ కమ్ ప్రెస్ చేసింది మాయాదేవి.