* * *
ఆరోజు సాయంకాలం మూడు గంటల వేళ కాఫీ త్రాగేసి నాయర్ మరో రెండు కప్పులు ఫ్లాస్కులో పోసిస్తే తీసుకుని పైకివెళ్ళి రీడింగ్ రూంలో కూర్చుంది సత్య.
ఈమధ్య ఇంగ్లీషు బాగా పెంపొందించుకోవాలని అర్ధమైనాకాకున్నా ఛేస్ నవల్సూ, దికెన్న నవల్సూ, షా నాటకాలు, షేక్ నాటకాలూ చదువుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా పూర్తి చేస్తుంది.
డిగ్మాలియన్ పూర్తిచేసేసి ఆలోచనల్లో పడిపోయింది.
తను మొదటినుంచీ ఐశ్వర్యానికీ, భోగలాలనతకి దూరం. తను పుట్టి పెరిగినప్పటినుంచీ సామాన్య జీవితాన్నే ఇష్టపడింది కానీ సుఖ జీవితాన్ని కోరుకోలేదు. వందమంది శ్రమించిపెడితే- పెట్టుబడిదారీ విధానంలో ఆ లాభాన్ని అనుభవించే వాళ్ళంటే గిట్టేదికాదు.
తనవి కమ్యూనిస్టు భావాలు కావు, సోషలిస్టుకి వ్యూస్ తనవి. తను ఐశ్వర్యాన్ని ద్వేషించిందా? ఊహుఁ ఆ ఐశ్వర్యాన్ని ఆధారంగా చేసుకుని దౌర్జన్యం చేసేవాళ్ళని ద్వేషించింది.
ఇదెలా వచ్చింది తనకి.
తన తండ్రి భూస్వామి. తల్లి సంపన్నుల ఇంటి బిడ్డ. తనని అల్లారుముద్దుగానే పెంచారు. మరి యీ మార్పెలా వచ్చింది.
ఇది అమ్మమ్మ చలువ. ఆమె పెంపకంలో వచ్చిన గుణం. ఆమె వ్యవసాయం చేయించినా కూలీలని బానిసలుగా ఏనాడూ చూడలేదు, తనను నమ్ముకుని బ్రతికిన వాళ్ళకి తన చేతనయినంత ఇచ్చేది.
ఇది ఆమె నేర్పిన పాఠమే.
కానీ ఇక్కడికి వచ్చాక తీయనీటికి చేపలెక్కినట్టుగా తన ఊహలు అన్నీ యీ ఐశ్వర్యం చుట్టూ, అది కల్పించే భోగాల చుట్టూ తిరుగుతున్నాయి. యీ సంపద తనదికాదు. తనతో స్నేహంగా వుండే సతీష్ దీ కాదు.
కృష్ణది ఈ ఐశ్వర్యం.
నిజంగా తను కృష్ణని ద్వేషించాలి.
కానీ చిత్రం! తను ఆరాధిస్తోంది.
ఇదెలా సాధ్యమైంది?
బహుశా అతను తన అయిశ్వర్యాన్ని ఉపయోగించుకున్న తీరు తనని ఆకర్షించి వుండొచ్చు.
అతను తన మనుషుల్ని నీచంగా చూట్టంలేదు. వాళ్ళమీద నమ్మకంతో అంతా వాళ్ళకే వదిలేసి వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాడు. తను దేశంకాని దేశం తిరుగుతూ నిద్ర, సుఖం అనుకోకుండా అజమాయిషీ చేస్తూ తన వాళ్ళంటూ ఎవరూ లేకపోవటంతో తన మనుషులకే అంతా వదిలేశాడు.
అందరూ అలాగే ఉంటారా?
ఊహుఁ
"అందుకే తనకి కృష్ణ అంటే ద్వేషభావం లేదు. మరేమిటి?".... పైగా...."
ఆమె మనస్సు జల్లుమంది.
"తను అతన్ని ఆరాధిస్తోందిగా?"
ఊహుఁఊహుఁ వద్దు వద్దు. తన మనస్సులో అలాటి ఆలోచనలే రాకూడదు. అయినా తను ప్రేమిస్తే అవుతుందా? తిరిగి అతనూ ప్రేమించద్దూ?
అతను తనని చూళ్ళేదు. తనతో మాటాళ్ళేదు.
ఇంత ఆస్థీ ఇంత విశ్వాసం వున్న అతనికి తను కంటికానుతుందా? తనేం మంత్రి కూతురా? జమిందారు బిడ్డా? దిక్కు మొక్కులేని అనాధ. ఎవరూలేని అతి సామాన్యమైన మనిషి.
తను అందగత్తెల్లోనే జమ! కానీ దేశదేశాలు తిరిగే అతనికి తన అందం ఆనుతుందా కళ్ళకి?
"ఊహుఁ నమ్మకంలేదు.
తను అతనిపై ఆశపడకూడదు. అతన్ని గురించిన ఊహే మనస్సు నుండి తుడిచేయాలి అంతే!
తనకి ఎవరూలేరు, ఉద్యోగంలేదు. బంధువులు లేరు.
తనకి రక్షణ ఏముంది? జీవనాధారంగా ఏ ఉద్యోగమూ లేదు. అయినా టెన్త్ అయినా పాస్ తనకి ఉద్యోగం ఎవరిస్తారు? ఆ వచ్చిన డబ్బు శేర్స్ గా పెడితే వచ్చే ఆదాయం చాలన్నాడు సతీష్....
సతీష్....సతీష్....
అతనికి తనంటే ఎంత అభిమానం? ఎంత ప్రేమ?
అతను---అతను---తనని ప్రేమిస్తున్నాడా?
అది ప్రేమ ప్రేమనా? జాలివల్ల కలిగిందా? లేక పెళ్ళి....
పెళ్ళిమాట మనసులోకి రాగానే ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.
కళ్ళు అలవోకగా మూతపడ్డాయి.
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువయ్యాయి. ఊపిరి బరువుగా వస్తోంది.
పెదాలు అదరసాగాయి.
"సతీష్....సతీష్...." అనుకుంది.
అంతలో క్రింద బజార్ మ్రోగించారెవరో!
హఠాత్తుగా స్వప్నలోకాలనుండి బయటపడింది.
"సతీష్ వచ్చినట్టున్నాడు!" అనుకుంది.
క్షణం క్రితం తన మనస్సులో అతన్ని గురించి వచ్చిన వూహల్ని గుర్తు చేసుకుని సిగ్గు పడిందామె.