Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 29


    తను చేస్తున్న పనిలో తప్పులేదని తనకి తను నచ్చ చెప్పుకోడానికి సుగుణకి మూడు నెలలు పట్టింది. ఆ తర్వాత భాస్కరరావుకి తన అంగీకారాన్ని చెప్పింది సుగుణ.
    భర్త పోయిన రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ విధవ వేషం లోంచి వధువు వేషంలోనికి మారటం ఏదో కాలలో మాదిరి అన్పించసాగింది సుగుణకి.
    అది సుగుణా భాస్కరరావులకి మొదటి రాత్రి. ఇద్దరికిమొదటి రాత్రి అనుభవం తీరిపోయినా, ఇద్దరూ కల్సిన మొదటి రాత్రి అది! సుగుణ అన్నగారు ఆ మూడు రోజులు తన యింట గడిపి వెళ్ళమని కోరాడు దంపతులని.
    గది చాలా సింపుల్ గా వుంది. ఓ మంచం మీద తెల్లటి దుప్పటి పరిచిన ప్రక్క, డ్రస్సింగ్ టేబిల్ మీద మంచి నీళ్ళు, నాలుగు రకాల ఫలహారాలున్నాయి. నాలుగు అగరవత్తులు మాత్రం వెలిగించారు. రెండో పెళ్ళికి యింతకంటే ఆర్బాటం అట్టహాసం చేయడం బాగుండదని గది మాములుగానే వుంచారు.
    పది దాటి ఇరవై నిమిషాలు అయినా యింకా గదిలోనికి రాని సుగుణ మీద విసుక్కుంటున్నాడు భాస్కరరావు! ఆమె రాక కోసం మహా ఆరాటంగా తలుపు వైపు పదేపదే చూస్తూ నిరీక్షిస్తున్నాడు. కాసేపు పేపరుంటే తిరగేశాడు. కాసేపు ఇటూ అటూ పచార్లు చేశాడు. మరోసారి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుని పౌడరు రాసుకున్నాడు ఎన్ని చేసినా సుగుణ రాకపోవడంతో అశాంతిగా ప్రక్క మీద కూర్చున్నాడు.
    అక్కడ ....ఇంకో గదిలో పిల్లాడిని పడుకోబెట్టడానికి సుగుణ నానా తంటాలు పడ్తుంది. "వెళ్ళవమ్మా సుగుణా, అతన్నిందాకనగా గదిలోకి వెళ్ళమన్నాం.... బాగుండదు.....అప్పుడే పదిన్నర అయింది. నీ వెళ్ళు నేను చూస్తానులే రవిని' అంది వదినగారు , అంది గాని రవి తల్లిని వదిలి పెడితేనా! వదినగారు ఎట్టుకోబోతే పెద్ద పెట్టున రాగం ఆరంభించాడు. మెడ కావలించుకుని వదలకుండా పడుకున్న రవిని తప్పించుకుని ఎలా వెళ్ళడమో సుగుణకి అర్ధం గాలేదు.
    "ఎలా వదినా, వీడు నిద్రపొందే....ఏడుస్తున్నాడు ఎలా వెళ్ళడం? అంది కాస్త బిడియంగా . రోజూ యీ పాటికి నిద్రపోయే రవి, యివాళ యింతవరకు నిద్ర పోకుండా కళ్ళు విచ్చుకుని చూస్తున్నాడు. తల్లి అలంకరించుకోవడం, తనని వంటరిగా వదలి ఎక్కడకో వెళుతుందన్న సంగతి రెండేళ్ళ రవికి అర్ధమై పోయింది....అందుకే కాస్త కళ్ళు మూస్తూ, తెరుస్తూ ప్రక్కలో తల్లి వుందో లేదోనని చూసుకొంటూనే వున్నాడు. జోకొట్టి నిద్రపోయాడు అనుకుని నెమ్మదిగా లేచేవేళకి మళ్ళీ రవి లేచి కూర్చునేవాడు. గంట నించీ యీ భాగోతం జరుగుతుంది.
    "బాగుంది ఇవాళ వీడు యిలా అల్లరి పెడుతున్న డేమిటి? అతను విసుక్కుంటాడో ఏమిటో. కాసేపు ఏడిస్తే ఏడిచాడు నీవు వెళ్ళు" అంది మళ్ళీ వదినగారు.
    కొడుకు యిక్కడ వంటరిగా ఏడుస్తుంటే తనక్కడ.....? ...ఛా...ఎలా? 'ఎలా వదినా?" అంది నిస్సహాయంగా సుగుణ, ఇలాంటి పరిస్థితి ని ఎలా ఎదుర్కోడం? సుగుణకి ప ప్రక్క సిగ్గు, బిడియం. భాస్కరరావు ఏమనుకుంటాడోనన్న బెదురు. రావి నిద్రపోకుండా ఎలా వెళ్ళడం అన్న ఆలోచనలో ఆమె మనసులో అదో మాదిరిగా తయారయింది.
    "పోనీ వేడిని తీసికెళ్ళి అక్కడే పడుకో బెట్టుతాను" అంది ఆఖరికి సిగ్గువిడిచి సుగుణ పడుకొండు అవవస్తుంటే.
    "అతనేం అనుకుంటాడో....అలా బాగుండదు! అంది వదినగారు కాసేపు అలా ఇద్దరూ మొహాలు చూసుకుంటూ కూర్చున్నారు. ఈలోపల నిద్రకి ఇంక ఆగలేక రవి కళ్ళు మూతలు పడ్డాయి. మరో ఐదు నిమిషాలు అలాగే చూసి నెమ్మదిగా చడీ చప్పుడు కాకుండా లేచింది సుగుణ.' 'అమ్మయ్య ' అనుకున్నారిద్దరూ.
    సుగుణని గదిలోకి పంపి వదినగారు రవి మంచం దగ్గిర ప్రక్కేసుకుని పడుకుంది.
    భాస్కరరావు గదిలోకి వచ్చిన సుగుణని చూసి అంతవరకూ పడిన అసహనం, చిరాకు మరిచి నవ్వుతూ ' యిప్పుడా తీరుబాటు అయింది రావడానికి' అన్నాడు దగ్గరికి వచ్చి.
    "రవి....రవి యిప్పటివరకు పడుకోలేదు....నన్ను వదలి పెట్టకుండా ఏడిచాడు" తలవంచుకొని కాస్త సిగ్గు పడుతూనే అంది సుగుణ. కారణం విన్న భాస్కరరావు మొహం అదోలా అయింది. అయినా తొందరగా మొహంలో భావం మార్చేసి "నేనిక్కడ నీకోసం గంట నించి ఎంతలా ఎదురుచూస్తున్నానో తెలుసా, నీకలా ఏం ఆత్రుత లేదన్న మాట. అక్కడ కూర్చున్నావు అలా....' అంటూ భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకోబోయాడు. సుగుణ హటాత్తుగా ఎందుకో త్రుళ్ళి పడింది. భాస్కరరావు స్పర్శకి, ఆమె ఎందుకో కుంచించుకు పోయింది. హటాత్తుగా తన మొదటిరాత్రి గుర్తువచ్చింది! మనసంతా ఏదో బాధగా నిండింది! ఏదో కానిపనికి పాల్పడినట్లు ఆమె హృదయం గిలగిలలాడింది. సుగుణ ఆస్థితిలో వుండగానే గదిలో నించి రవి ఏడ్పు వినపడడం మొదలుపెట్టింది. సుగుణ కంగారు పడింది. మళ్ళీ లేచినట్టున్నాడు. ఈ రెండేళ్ళనించి, భర్త పొయిందగ్గరి నుంచి వాడిమీదే ప్రాణాలన్నీ పెట్టుకుని అనుక్షణం వాడితోనే గడిపేది. రాత్రిళ్ళు వాడిని ప్రక్కలో పెట్టుకునే పడుకునేది. తల్లి దగ్గర తప్ప విడిగా పడుకోడం అలవాటు లేని పిల్లడు తల్లి ప్రక్కలో లేని సంగతి నిద్రలో కూడా గ్రహించి సుగుణ వెళ్ళిన వెంటనే మళ్ళీ లేచి కూర్చున్నాడు. వాడిని సముదాయించడం, మళ్ళీ నిద్ర పుచ్చడానికి వదినగారు పడే పాట్లు సుగుణకి అన్నీ వినిపిస్తూనే వున్నాయి. వదినగారు పెరట్లోకి లేచి వెళ్ళింది గాబోలు అక్కడ నించి కూడా వాడి ఏడ్పు గట్టిగా విన్పిస్తుంది. సుగుణ ఏం చెయ్యాలో తోచనట్టు బెదురుగా చూసింది భాస్కరరావు వంక. అతను అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. ఐదు నిమిషాలు గడిచినా రవి ఏడ్పు అంతకంతకీ ఎక్కువవుతుంటే సుగుణ భరించలేకపోయింది. అమ్మా....అమ్మా.....అన్న పసివాడి ఏడ్పు ఆమె గుండెలకి తాకి ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. అలా పిల్లాడు ఏడుస్తుంటే తనిక్కడ.....ఛా.....ఆమె హృదయం కొడుకు ఏడ్పు విని ఇంకా సహిస్త్గూ వుండలేకపోయింది. భాస్కరరావు చేతుల నించి తప్పించుకుంది, "యేమిటి!" అన్నాడు  కాస్త ఆశ్చర్యంగా భాస్కరరావు.
    "బాబు....రవి.....ఇందాకటి నుంచి ఏడుస్తున్నాడు ....' అంది గొణుగుతూ.
    'అయితే" అన్నాడు కాస్త అసహనంగా భాస్కరరావు. "వాళ్ళెవరో చూస్తారులే.....పడుకో పెడ్తారులే...." అన్నాడు మళ్ళీ. నిస్సహాయంగా చూస్తూ వాడి ఏడ్పు వింటూ మరి రెండు నిమిషాలు చూసింది ఇంక ఆగలేక "వస్తాను.....ఇప్పుడే వస్తాను" అంటూ వారిస్తున్నా భాస్కరరావు చేతులనించి తప్పించుకుంటూ తలుపు తీసుకొని బయటకు వెళ్ళింది. ఊరుకోబెట్టలేక అవస్థ పడుతున్న వదినగారి చేతుల్లోంచి పిల్లాడిని తీసుకుంది.
    "వదినా!" అంది బేలగా సుగుణ. పిల్లాడిని గుండెల కదుముకుంటూ.
    'అమ్మా" అంటూ రవి సుగుణ మెడని గట్టిగా వాటేసుకున్నాడు. సుగుణ కళ్ళలో అప్రయత్నంగా నీరు తిరిగింది.
    "అమ్మా!....నీవు నాదగ్గర బజ్జో!' అన్నాడు మాటలు స్పష్టంగా వచ్చిన రెండేళ్ళ రవి. "నీవు వెళ్ళవద్దు నా దగ్గిరే వుండు" అన్నాడు.
    "ఏమిటమ్మా యిలా అల్లరి పెడుతున్నాడు ఇవాళ...... ఏం చెయ్యడం" అంది వదినగారు విసుగ్గా! "ఇవాళ నిన్ను వదిలేట్టు లేడు....ఏం చేస్తావు? అతనే మానుకుంటాడో ఖర్మ!..."

 Previous Page Next Page