Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 28


                                               మళ్ళీ పెళ్ళి

    సుగుణ , భాస్కరరావులు ఆరోజు రిజిష్టరు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు! తరువాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళ సూత్రం కూడా కట్టాడు భాస్కరరావు లాంచనంగా.
    రోజూ ఎన్ని వేలమందో పెళ్ళి చేసుకుంటున్నారు. అందులో సుగుణా భాస్కరరావులు ఒకరు. అందులో ఏం వింత వుందని ఎవరన్నా అనుకోవచ్చు? పెళ్ళి చేసుకోడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింత అల్లా వితంతువుని అందులో పిల్లాడి తల్లిని భాస్కరరావు పెళ్ళాడడం వింతేగా మరి! భాస్కరరావు కి రెండో పెళ్ళే! అయినా మగాడు. అందులో ముప్పై ఏళ్ళవాడు రెండో పెళ్ళి చేసుకోడం అది మామూలు విషయం!
    అందుకే భాస్కరరావుని పొగడ్తలతో, శుభాకంక్షలతో సహోద్యోగులు, మిత్రులు, అధికారులు ముంచెత్తారు. అతని సంస్కారాన్ని ఆదర్శాన్ని పొగిడారు. అతని హృదయ వైశాల్యాన్ని కొనియాడారు. భాస్కరరావు హృదయం గర్వంతో మరింత విశాలం అయింది. చాలా మంచి పని . ఘనకార్యం సాధించిన తృప్తితో అతని మనసు నిండిపోయింది.
    ఇంక సుగుణ స్థితి!.....ఆమెకి యిప్పటికీ యిదంతా నిజం కాదేమో భ్రమే మోననే అనుమానం! ఈ పెళ్ళి నమ్మశక్యం కాని విషయంలాగే అనిపిస్తుంది.
    పెళ్ళి అయిన ఎనిమిది నెలలకే కారు ఏక్సిడెంట్ లో భర్త పొతే ఇంకెందుకీ బ్రతుకనుకుంటూ అందరి లాగే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. దేన్లో నన్నా పడి చద్దామనుకుంది. ధైర్యం చాలకపోవడం కాక తనతో పాటు మరో ప్రాణిని హత్య చేయడం పాపం అన్న పాప భీతితో ఆ పని చేయలేకపోయింది. తరువాత .....పిల్లాడు పుట్టాక వాడికోసం బ్రతకక తప్పదని నిశ్చయించుకుంది. ప్రాణాలు ఆశలు, కలలు అన్నీఆ పసికందు మీదే నిల్ఫుకుని నిర్లిప్తంగా రోజులు వెళ్ళదీయసాగింది.
    నా అని చెప్పుకోడానికి ఒక అన్న మాత్రం వున్నా .....ఆ అన్న మీద జీవితాంతం ఆధారపడి వుండడం యిష్టం లేక, ఉన్న డిగ్రీ ఆధారంతో ఉద్యోగంలో చేరింది.
    సహద్యోగి అయిన భాస్కరరావుతో పరిచయం, ఎనార్ధంలో యీ విధంగా మలుపు తిరిగి రూపు దాలుస్తుందని సుగుణ ముందుగా ఎన్నడూ అనుకోలేదు. తీరా చేసి రూపు దాల్చాక ఏం చెయ్యాలో తోచని అయోమయంలో పడిపోయింది సుగుణ.
    పరిచయం అయిన ఎనార్ధం తర్వాత భాస్కరరావు 'పెళ్ళి చేసుకుందాం" అని అడిగినపుడు సుగుణ తడబడిపోయింది.! భయపడింది! బాధపడింది! ముందుగా సహద్యోగిగా , తరువాత మంచి మిత్రుడిగా, ఇంకొన్నాళ్ళ తర్వాత శ్రేయోభిలాషిగా మాత్రం అనుకుంది భాస్కరరావుతో పరిచయం పెరుగుతున్న కొద్ది! అంతకు తప్ప మరో భావం ఆమె మానసులో ఎన్నడూ లేదు. అందుకే కలవర పడిపోయింది భాస్కరరావు అడగ్గానే.
    భాస్కరరావు అయితే సుగుణని చూసిన ముందు రోజు నుంచీ ఒకే అభిప్రాయంలో ఉన్నాడు. అందంగా వుంది అయినింటి పిల్ల! పెళ్ళాడు దామనుకున్నాడు. ఆమె విధవ అని తెలియక పూర్వం! తీరా చేసి ఆ సంగతి తెలిశాక, అప్పటికే అతని మనస్సులో నాటుకుపోయిన కోరికని పీకీ పారేయడం అతని వశంలో లేకపోయింది. రెండో పెళ్ళి అయితేనేం.....నాకు మాత్రం రెండో పెళ్ళి కాదా! యిలాంటి విషయాలలో పురోగమించాలి. అని సర్ది చెప్పుకున్నాడు. పిల్లాడు వున్నాడన్న విషయం మీద చాలా రోజులు ఆలోచించాడు భాస్కరరావు. ఆఖరికి వుంటేనేం వాడిని వాళ్ళమ్మ చూసుకుంటుంది. తనేం చెయ్యాలి. వాడి పోషణ ఖర్చేగా, వాడి పోషణ ఖర్చు వాడి అమ్మే పెట్టుకుంటుంది. ఉద్యోగం చేస్తుందిగా, తనకేం నష్టం వుండదు. అనినచ్చచెప్పుకున్నాడు. ఈ పెళ్ళిని అభ్యంతర పెట్టె పెద్దలు తనకి ఎవరూ లేరు. అన్నగారున్నా అయన యీ కాలం వాడే గనక అభ్యంతరం పెట్టడు. అసలు కలుగ చేసుకోడు తన విషయం. అన్నీ నిశ్చయించుకుని తన ఉద్దేశం సుగుణ ముందు బయట పెట్టాడు.
    సుగుణ ముందు కాదంది. అలాంటి పని చేయలేనంది. భాస్కరరావు అనేక విధాల నచ్చచెప్పాడు. రోజులు మారాయి, మనమూ మారాలి అన్నాడు. తప్పొప్పుల ప్రసక్తి ఏం లేదని నొక్కి చెప్పాడు. ఆలోచించుకోమన్నాడు.
    సుగుణ ఒక రోజు కాదు. మూడు నెలలు రాత్రింబవళ్ళు ఆలోచించింది. యీ సమస్య ఎన్నాళ్ళు ఆలోచించినా ఎటూ తేల్చుకోలేని అయోమయంగానే కనపడింది ఆమెకి! పోయిన భర్తకి ద్రోహం చేస్తున్నట్టు బాధ, ఏదో కానిపని చేస్తున్నట్టు పాపభీతి, నలుగురికీ మొహం ఎలా చూపడం, ఏమనుకుంటారన్న కుశంకలు ఓ వైపు, మరోవైపు...... మోడై పోయిన తన జీవితం మళ్ళీ చిగిర్చి పుష్పిస్తుందన్న ఆశ.
    ---యిలా ఎటూ తేల్చుకోలేక నలిగి పోయింది. ఈ రెండేళ్ళలోనే తన బ్రతుకులో ఏర్పడిన వెలితి, నిర్లిప్తత తలచుకొని, ముందు రోజులు ఇంకెలా గడుస్తాయో ఊహించి తనకి దొరికిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదూ అన్న ఆలోచన వచ్చేది. తను తన బిడ్డని పోషించుకో గలదు, కాని....కానీ పట్టుమని పాతికేళ్ళు లేని తను....పట్టుమని ఆరునెలలు కూడా కాపురం చెయ్యని తను.....ఆ ఆరునెలల ని తల్చుకుంటూ అరవై ఏళ్ళు వంటరిగా బ్రతకగలదా! బ్రతుకులో మాధుర్యం చచ్చిపోయి, చావలేక బ్రతుకుతూ అవకాశం కాళ్ళ ముందుకు వచ్చి నిల్చుంటే తానెందుకిలా ఆలోచిస్తుంది! తరతరాలుగా భారత స్త్రీ సంస్కృతీ, సంప్రదాయాలు, జీర్ణించి పోయిన భారత స్త్రీ వారసురాలు సుగుణ, కనకే సుగుణ అన్నాళ్ళు యీ విషయం ఆలోచించింది . అన్నగారి ముందు యీ సమస్యని పెట్టింది సుగుణ, అభ్యంతరం చేపుతాడను కున్న అన్న కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. నీ యిష్టం, వ్యక్తిత్వం వచ్చినదానివి, చదువుకున్న దానివి, నీకు నేనేం చెప్పను? ఆలోచించుకో, ముందుకి అడుగు వేయాల్సిందానివి నీవే, ఆ పర్యవసానం ఎలాంటిదైనా అనుభవించాల్సిందీ నీవే, నీవేం చిన్నపిల్లవి గావు, నేనేం చెప్పగలను" అన్నాడు. నీ యీ పనివల్ల నన్ను వెలేస్తారని యీ రోజుల్లో భయం లేదు. కనక ఆలోచించుకుని నీ యిష్టం వచ్చినట్టు చెయ్యి. నీవు మళ్ళీ పసుపు కుంకుమతో సుఖంగా వుంటానంటే నేను మాత్రం సంతొషించనా? అన్నాడు. అనుకున్న ఆ అభ్యంతరం కూడా లేకపోయిం తర్వాత యింకేన్నాళ్ళు ఆలోచించలేదు  సుగుణ. అన్నగారు కూడా తన బరువు బాధ్యతలని ఇంకెన్నాళ్ళు మోయలేడని సుగుణకీ ఈ మధ్య అర్ధం అవసాగింది. తను సంపాదిస్తున్నా, తన బరువు మోయడం అన్నగారికి ముఖ్యంగా వదిన గారికి యిష్టం లేదని యీ మధ్య చాలా సందర్భాలలో గ్రహించింది సుగుణ. అలాంటి పరిష్తితిలో పిల్లాడిని పెట్టుకుని వంటరిగా వుండి రోజులు భయం భయంగా వెళ్ళబుచ్చడం కంటే మళ్ళీ తను, తన ఇల్లు, సంసారం అంటూ ఏర్పరచుకుంటే తప్పేమిటనుకుంది సుగుణ.

 Previous Page Next Page