Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 30


    భజన్ రావ్ కళ్ళల్లోకి మెరుపు వచ్చింది.
    "ఓ.కే. సర్! గుర్తుంచుకుంటాను"
    "ఏమిటి భారతదేశం అంటున్నారు?"
    "తను ఇండస్ట్రీ పెట్టుకోడానికి ఆర్ధికసాయం చేయమని భారత ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నాడట... ఆ విషయంలో నన్ను రికమెండ్ చేయమంటున్నాడు."
    పూజ పగలబడి నవ్వేసింది_
    "వీడి ముఖానికి ఇండస్ట్రీ పెడతాడా? ఏమి ఇండస్ట్రీ?"
    "ఫాస్ట్ ఫుడ్ సెంటర్"
    "అంటే ఇక్కడ ఉద్యోగం మానేద్దామని ప్లాన్లో వున్నాడా?"
    "అలాగే కనబడుతున్నాడు డియర్!"
    "రాస్కెల్! ఈ విషయం అక్కతో చెప్పేస్తాను."
    "ఓకే డియర్! ప్రస్తుతానికి ఫాస్ట్ ఫుడ్ గాడిని వదిలేస్తే.. మనం నీలాంటి అందమయిన రచయిత్రులు తెలుసుకోవాల్సిన రచనా మెళకువల గురించి చర్చించుకుందాం! ఉదాహరణకు మీరో రొమాంటిక్ నవల రాయాలనుకోండి... ఎలా రాస్తారు?"
    "కాగితం మీద."
    "అఫ్ కోర్స్... అఫ్ కోర్స్! సెంట్ పర్సెంట్ కరెక్ట్. కాగితం మీద ఎలా రాస్తారు?"
    "పెన్ తో."
    "ఒండర్ ఫుల్! సూపర్బ్ ఆన్సర్. కానీ ఏం రాస్తారు?"
    "రొమాన్స్"
    "అదెలా రాస్తారు?"
    "అది తెలియకే కదా మిమ్మల్నడిగింది."
    "ఎస్! దానికి రెండు పద్ధతులున్నాయి."
    "ఏమిటవి?"
    "మొదటి పద్ధతేమిటంటే చాలా పాతది. మన పాత రచయిత్రులు విరివిగా వాడిన సూత్రం అన్నమాట! అదేమిటంటే మనకు తెలీనిదాన్ని గురించి రాసేప్పుడు వూహించి రాసేయటం, కొంతమందికి వూహించటం రాదనుకోండి. అప్పుడు వాళ్ళు అదే విషయం నిద్రపోయేముందు బోలెడు సార్లు అనుకుని, తలచుకుని దాన్ని గురించి దిగులుపడి అప్పుడు నిద్రపోతారు. అప్పుడదే కలలోకొస్తుంది. ఉదాహరణకు మీరు రొమాంటిక్ నవల రాయాలనుకోండి... రొమాన్స్ గురించే ఆలోచిస్తూ నిద్రపోయి... నిద్రలో రొమాన్స్ తాలూకూ కల ఒకటి కంటారన్నమాట. ఆ కలలో మీరు ఓ హీరోతో రొమాన్స్ జరుపుతుంటారు. మేఘాల్లో తేలిపోతూ, నీళ్ళల్లో ఈతకొడుతూ, లేక ఎక్కడో ద్వీపం మీద పరిగెడుతూ, అలా మోస్ట్ కలర్ ఫుల్ కల అన్నమాట. మర్నాడు పొద్దున్న నిద్రలేవగానే హీరోనీ, ఆ ప్రకృతినీ, ఆ రొమాన్స్ నీ గుర్తుంచుకుని నవలలో రాసేస్తారు. ఇదీ పాత పద్ధతి. ఇందులో సహజత్వం తక్కువ వుంటుంది. ఎందుకంటే కలకు రీజనింగ్, నేచురాలిటీ వుండదు కదా. దానిష్టం.. ఎటుపడితే అటు వెళ్ళిపోతుంది. ఇక రెండో పద్ధతి ఏమిటంటే ఇది మోడ్రన్ పద్ధతి ఫాలో అయ్యే రచయిత్రులేం చేస్తారంటే రొమాంటిక్ నవల రాయాలనుకోండి వెంటనే తమకు అతి సమీపంగా వున్న హీరోని చూసి చిరునవ్వు నవ్వుతారు. దాంతో హీరో లవ్ లో పడతాడు. ఇద్దరూ రొమాన్స్ ప్రారంభిస్తారు. ఆ రొమాన్స్ తాలూకూ ప్రతి మూడ్ నీ, మూవ్ మెంట్ నీ, ఫీలింగ్స్ నీ, అన్నీ ఎప్పటికప్పుడు నోట్స్ రాసేసుకుంటుందన్నమాట!
    ఉదాహరణకు హీరో ఆమెను కౌగలించుకున్నాడనుకోండి.
    "అతని కౌగిలి ఇనుప కౌగలిలాగా వుంది. శరీరం ఆ కౌగిట్లో నలిగి పౌడర్ అయిపోతుందేమో అనిపించింది. అతని చేతులు తాకిన చోటల్లా అగ్నిగుండాలేర్పడుతున్నాయి" ఇలా పచ్చి నిజాలు, పచ్చి ఊహలు అన్నీ రాసేస్తుంటారు. అంతా ప్రాక్టికల్ కనుక వాళ్ళకు ఆ ఆవేశంలో తాము అతి భయంకరమైన బూతు రాస్తున్నామని కూడా తెలీదు. కానీ వయసులో వున్న పాఠకులు ఆ బూతుని ఉవ్విళ్ళూరుతూ, కసిగా చదువుతూండేసరికి మరింత బూతుని సరఫరా చేయటం ప్రారంభిస్తారు. అంత బూతు ప్రాక్టికల్ గా రాయాలంటే ఇంకా ఎక్కువ సమయం రొమాన్స్ కి కేటాయించాలి. గనుక చివరకు ఆ హీరోనే పెళ్ళి చేసేసుకుంటారు_
    ఇదీ రెండో పద్ధతి. ఈ రెండింట్లో మీకేది బెటరనిపిస్తే అదే ఫాలో అవవచ్చు" అని ఆమె రియాక్షన్ కోసం ఎదురుచూడసాగాడతను.
    పూజ కొద్ది నిమిషాలు ఆలోచించింది.
    "ఓ.కే. అయ్ వాంట్ టు బి ఎ మోడ్రన్ రైటర్."
    భవానీశంకర్ ఆనందంతో తప్పట్లు కొట్టాడు.
    "సూపర్బ్ చాయిస్! మీరు కనుక మొదటి పద్ధతి అంటే మీకూ నాకూ గుడ్ బై_ మీరెప్పటికీ సక్సెస్ ఫుల్ రైటర్ కాలేరని చెప్పేవాడిని_ ఓ.కే. ఇవాళ్టికి ఈ లెసన్ చాలనుకుంటాను. నేను కొద్దిసేపు మీ బావ గోపాల్రావ్ తో కొన్ని అత్యవసర విషయాలు డిస్కస్ చేసుకుని వస్తాను_ సీయూ."
    భవానీశంకర్ బయటపడ్డాడు.
    ఇంక అనుమానం లేదు పూజ తన వలలో పడినట్లే.
    రేపు స్కీమ్ నెంబర్ టూ అమలుపరచాలి.
    గోపాల్రావ్ టెర్రేస్ మీద కూర్చుని సీత తాలూకూ సైడ్ యాంగిల్ అందాన్ని పొగుడుతూ కెమెరాతో తెగ స్నాప్ లు కొడుతున్నాడు.
    "ఆహా! ఈ యాంగిల్ ఎంత బావుందో తెలుసా? సినిమా స్టార్లు బలాదూర్ నీ ముందు."
    "నిజంగానా?"
    "రేపు ఫోటోలు వచ్చాక మీ ఫ్రెండ్స్ నే అడుగు_తెలుస్తుంది."
    "హలో బ్రదర్! ఏమిటి అర్జంటుగా ఫోటోలు తీస్తున్నావు సిస్టర్ని? ఎనీ అకేషన్?"
    "ఎస్!"
    "ఏమిటది?"
    "నిన్న మా మిసెస్ బర్త్ డే."
    భవానీశంకర్ కి ఏమీ అర్థం కాలేదు.
    "నిన్నా?"
    "ఎస్ ఫ్రెండ్."
    "మరి హడావుడి యివాళేమిటి?"
    "అదే మన స్పెషాలిటీ."    
    "అంటే అందరూ ఇవాళ చేసే పనిని మనం రేపు చేయటం" అంది సీత హేళనగా.
    "ఎస్ కరెక్ట్! మనకి ఏ పని అయినా పదిమందిలో చేయటం యిష్టముండదు."
    సీత వెళ్ళిపోయింది.
    "ఇప్పుడో పెద్ద ప్రాబ్లెమ్ వచ్చిపడింది" అన్నాడు గోపాల్రావ్.
    "ఏమిటి మిత్రమా అది?"
    "ఆ అమ్మాయికి రేపు ఆ పెన్ యిస్తానని చెప్పాను_ మా ఆఫీసుకి వస్తుంది."
    "ఏ అమ్మాయి బ్రదర్?"
    గోపాల్రావ్ మళ్ళీ కథంతా చెప్పాడు.
    "నన్నడిగితే ఆ అమ్మాయికి అలాంటి పెన్ యింకోటి కొనిచ్చేయటం ఉత్తమం సార్" అన్నాడు భజన్ రావ్ మళ్ళీ 'టీ' తీసుకొస్తూ.
    "ఎందుకని భజన్ రావ్?"
    "ఎందుకంటే ఆ పెన్ సీతా మేడమ్ గారు పూజా మేడమ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు కదండీ. దానిని కల్నల్ గారు చూసి ముచ్చటపడి నాకిచ్చేయమని అడిగి తీసుకున్నారండీ. మరి ఏ వస్తువయినా ఒకసారి కల్నల్ గారి చేతుల్లో పడిందంటే తిరిగిరాదని రత్నప్రభ మేడమ్ గారంటూండగా విన్నానండీ"

 Previous Page Next Page