Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 29


    "అందులో అనుమానమే లేదు కల్నల్! నేను హిప్నాటిజంలో ప్రొఫెసర్ని."
    "అవును డాడీ! చంద్రకాంత్ గారు తన హిప్నాటిజంతో ఓ చిన్న పాపను ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి గుండె ఆపరేషన్ చేయించి తర్వాత మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చేశారట. ఆ పాపకు ఎనిస్తేసియా ఇవ్వాల్సిన అవసరం లేకపోయిందట"
    "అవునా చంద్రకాంత్?"
    "ఎస్సర్! ఇటీజే ఫాక్ట్."
    "ఐసీ! ఇటీజేలై. అదంతా అబద్ధం."
    "నో.. ఇటీజే ఫాక్ట్."
    "ఆల్ రైట్! ఆ పాప తల్లిదండ్రుల అడ్రస్ చెప్పు_ రేపే ఆ విషయం నిజమో కాదో ఉత్తరం రాసి తేల్చుకుంటాను."
    భవానీ కొంచెం కంగారుపడ్డాడు.
    "వాళ్ళ అడ్రస్సా?"
    "ఎస్!"
    "వాళ్ళు కలకత్తాలో ఉండేవాళ్ళుగానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో వుంటున్నారని తెలిసింది.
    "బంగ్లాదేశా?" నిరాశగా అడిగాడు కనకారావ్.
    "అవును. ఢాకాకి అరవైరెండు కిలోమీటర్లలో" అబద్ధాన్ని నిజంగా చూపే ప్రయత్నంలో ఇంకో ట్రిక్ వుపయోగించాడు.
    "ఆల్ రైట్! వాళ్ళు లేకపోతే పోనీ_ ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరూ, అడ్రసూ యివ్వు_ రేపే తేల్చేస్తాను."
    "ఇంకెక్కడి డాక్టర్! సరిగ్గా సంవత్సరం క్రితం లారీ యాక్సిడెంట్ లో మొత్తం ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది."
    "వాట్_ చచ్చిపోయాడా?"
    "మొత్తం ఫ్యామిలీతోపాటు"
    "నేన్నమ్మను."
    "బరియల్ గ్రౌండ్ అడ్రసిస్తాను_ సమాధి నెంబర్స్_ సెవెన్, ఎయిట్, నైన్, టెన్ అండ్ లెవెన్. కేరాఫ్ బంజారాహిల్స్ బరియల్ గ్రౌండ్."
    కల్నల్ కేం చేయాలో తోచలేదు.
    "ఓకే! నీతో వాదించటం నాకిష్టం లేదు. ఐయామే ప్రాక్టికల్ మేన్! రేపు నన్ను హిప్నటైజ్ చేసి చూపించాలి. అప్పుడే హిప్నటిజం సైన్స్ అని నమ్ముతాను. లేకపోతే ఇంకెప్పుడూ ఈ బుద్ధి తక్కువ రాతలు రాయను అని నీతో బాండ్ పేపరు మీద రాయించి అన్ని పేపర్లకూ కాపీలు పంపిస్తాను."
    "అయ్యో! మీకు తెలీటం లేదు డాడీ! చంద్రకాంత్ ఎంత జీనియస్సో! మిమ్మల్ని అయిదు నిమిషాల్లో హిప్నటైజ్ చేసేస్తాడు."
    "ఏడ్చాడు_ నేనేం బ్లడీ ఫూల్ ని కాదు, ఎవడేం చేస్తే అది అయిపోడానికి."
    అందరి భోజనాలు ముగిశాయి.
    భవానీశంకర్ తన గదిలో పడుకుని పూజని త్వరగా లవ్ లో పడేసేందుకు ప్లాన్లు ఆలోచిస్తూంటే భజన్ రావ్ మధ్యాహ్నం మూడు గంటలకు 'టీ' తీసుకొచ్చి అందించాడు.
    "మీతో ఒక విషయం అర్జంటుగా మాట్లాడాలి సార్!" అన్నాడు సీరియస్ గా.
    "దానికి అపాయింట్ మెంట్ అవసరంలేదు మిత్రమా! చెప్పేసెయ్_ మనసులో దాచుకుంటే రేపు సడెన్ గా హార్ట్ ఎటాక్ తో ఎగిరిపోయావనుకో_ నీ ఆత్మ ఇక్కడే తిరుగుతూండిపోతుంది అసంతృప్తితో."
    "సంగతేమిటంటే సార్! ఇందాక బ్యాంక్ కెళ్ళాను. మీరిచ్చిన చెక్ చెల్లదు పొమ్మన్నారు" తాపీగా చెప్పాడు.
    "చెల్లదన్నారా?"
    "అవున్సార్!"
    "అందుక్కారణం ఏమయినా చెప్పారా బ్రదర్?"
    "చెప్పారు సార్"
    "ఏమిటిది?"
    "ఎకౌంట్లో అస్సలు డబ్బు లేదండీ!"
    "లేకపోతే ఏమయింది బ్రదర్! ఇంత గొప్ప రచయిత చెక్ ఇచ్చినప్పుడు ముందు హానర్ చేసి తర్వాత కట్టమంటే కట్టేస్తాం కదా?"
    "కానీ ఆ మాట అనుకోవలసింది మనం కాదు కదండీ_ వాళ్ళు_ వాళ్ళలా అనుకోవటం లేదు మరి."
    "అలాగా! అయితే సరే బ్రదర్! తొందరేముందీ? ఎకౌంట్ లో డబ్బు వున్నప్పుడే తీసుకుందువుగాని."
    "ఎకౌంట్ లో డబ్బు ఎప్పుడు వుంటుంది సార్?"
    "రేపే వుండవచ్చు. లేదా పదేళ్ళ తర్వాత వుండవచ్చు."
    "అంతవరకూ నేనేం చేయాలి సార్?"
    "ప్రతిరోజూ బ్యాంక్ కెళ్ళి బ్యాలెన్స్ ఎంతుందో కనుక్కోవటం"
    "ఒకవేళ నా పదివేలూ ఇప్పుడే క్యాష్ ఇవ్వాలనీ... లేకపోతే మీరు డూప్లికేట్ చంద్రకాంత్ అన్న విషయం సీత మేడమ్ తో చెప్పివేస్తాననీ అన్నాననుకోండి... మీరేం చేస్తారు?"
    "తెలివిగలవాడివయితే నువ్వలా చెప్పవు మిస్టర్ భజన్ రావ్."
    "ఎందుకు చెప్పను?"
    "ఎందుకంటే ఇందాకే నువ్వు సీతా మేడమ్, పూజ దగ్గర నువ్వు నా అభిమానివనీ, మా ఖమ్మం వచ్చి నా ఫోటో, నా ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళావనీ చెప్పావ్. అవునా కాదా?"
    "అవును."
    "మరి నా ఫోటో అప్పుడు చూసిన వాడివి... ఇప్పుడు ఉదయం నేను అసలు రచయితను కాదని వారికి ఎందుకు చెప్పలేదు? ఇతనే రచయిత చంద్రకాంత్ అని ఎలా కన్ఫాం చేశావ్?"
    భజన్ రావ్ కేం చెప్పాలో తోచలేదు.
    "అప్పుడు పొరబాటు పడ్డానని అంటాను."
    "కానీ నేను వూరుకోనుగదా! అప్పుడు నేనే చంద్రకాంత్ నని అందరికీ దొంగసాక్ష్యం చెప్పటానికి నా దగ్గర పదివేలు అడిగాడని చెప్పాననుకో రెడ్ హాండెడ్ గా దొరికిపోతావు. ఆ చెక్ నువ్వే బ్యాంకుకి తీసుకెళ్ళినట్లూ, క్యాష్ చేసుకోడానికి ప్రయత్నించినట్లూ కూడా ఋజువులున్నాయి."
    "భజన్ రావ్ భయపడిపోయాడు. కొద్ది క్షణాలు అటూ ఇటూ పచార్లు చేశాడు.
    "ఆల్ రైట్ సార్! నేనే ఓడిపోయాను."
    "ఎవడి కోసం ఓడిపోవు బ్రదర్! తెలివితేటలు ఎవడబ్బసొమ్మని... నీకు ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో".
    పూజ పరుగుతో గదిలోకొచ్చింది_
    "చంద్రకాంత్ గారూ! నేను రడీ. కాగితం పెన్ తో వచ్చేశాను."    
    "అద్భుతమయిన పనిచేశారు. భజన్ రావ్ ప్రస్తుతం నువ్వు బయటికెళ్ళి ఇంకో గంటలో మళ్ళీ మా ఇద్దరికీ 'టీ' తీసుకొస్తావు. ఎందుకంటే అప్పటికి మేమిద్దరం హాట్ డిస్కషన్ తో అలసిపోయి వుంటాం. వాట్ పూజాజీ?"
    "అవును."
    భజన్ రావ్ దిగులుగా చూశాడు_.
    "అంత దిగులుపడాల్సిన పనిలేదు భజన్ రావ్! నీ ప్రవర్తనావళి మెరుగుపడితే నీకు కొంత సహాయం చేయడానికి భారతదేశం ఏమాత్రం వెనుకాడదు... గుర్తుంచుకో."

 Previous Page Next Page