నీరసంగా నవ్వాడు పాపారావు.
"నేను చెప్పేదేమిటి? ఆ పరమశివుడే చెప్పాడు. రేపోసారి మీ ఇంటివైపు రమ్మంటాన్లే! ఆయన పేరే పెట్టుకున్నావ్ - నువ్వంటే స్పెషల్ లైకింగు! మొన్న శివరాత్రికి కాశీ వెళ్ళా - కిటకిటలాడే జనం - లింగాన్ని తాకాలి. క్యూలో ఎక్కడో ఆమడ దూరంలో ఉన్నా - అప్పుడేమయిందో తెలుసా! అందరూ చూస్తుండగానే నా చెయ్యి అలా అలా సాగిపోయింది. లింగాన్ని తాకా - అభిషేకం చేశా! ఇదంతా ఉత్తర హిందూస్థానం పత్రికల్లో పడింది. అదలా ఉంచు - అమెరికాకి అప్పడాలు ఎగుమతి చేస్తే ఎట్లా ఉంటుందీ? ఖర్చులేని వ్యవహారం! ఎలాగూ మనం మనకోసం అప్పడాలు చేసుకోక తప్పదు. మా చెల్లెలు పుణ్యవతి ఎక్స్ పర్ట్! కారం అప్పడాలు, చప్పటి అప్పడాలు - ఆ! వడియాలు - గుమ్మడి వడియాలు!"
"అమెరికాలో అప్పడాలూ, వడియాలూ ఎవరు తింటారయ్యా?"
"తినకపోతే ఇక్కడే అమ్ముదాం - కుటీర పరిశ్రమని పోషించినట్లు అవుతుంది. గాంధీ వాదానికి ఏదో ఉడతా భక్తిగా..."
అర్జున్ కి ఈ ఆలోచన నచ్చింది.
"పై ఖర్చులకి" డబ్బు తీసుకుంటూ పాపారావు అన్నాడు "అన్నట్లు నైజాంలో ద్రాక్షకి మంచి స్కోపు ఉందిటోయ్! అనాబ్ షాహి అని కొత్తరకంట - ఇలా వెయ్యడం - అలా కొయ్యడం! నైజాం సర్కార్ దగ్గర పనిచేసిన ఓ నవాబు నా ఫ్రెండ్. అన్వర్ అలీ జంగ్. ఆయన అంతా చూసుకుంటాడులే! నిజామాబాద్ లో చవగ్గా ఎకరాలు కొనొచ్చుటయ్యా! ఇక్కడివాళ్ళే అక్కడికెళ్ళి ఇక్కడ రెండెకరాలు అమ్మిన డబ్బుతో అక్కడ వందెకరాలు కొంటే ఎలా ఉంటుందీ? వారి వెయ్యొచ్చు. అనాబ్ షాహీ తోటలు హైదరాబాద్ చుట్టుపక్కల వెయ్యొచ్చు. మంచి బ్రాందీ తయారవుతుందిటయ్యా అనాబ్ షాహీతో! బ్రాందీ రుచి చూశావూ?"
"ఇంకా నయ్యం!"
"బ్రాందీ తాగకపోతే బతికేం లాభమండీ! బలుసాకు తినడమేనా జీవితం! ఇవాళ ఓ చుక్కేసుకో! ఎన్నాళ్ళూ మిల్కు బేబీలా ఉండిపోతావా ఏం? మొగాడివి కాదూ?"
పాపారావుని రానివ్వ వద్దని తల్లి మొత్తుకునేది.
కానీ అప్పటికే అర్జున్ కి పాపారావులో కొన్ని ప్లస్ పాయింట్లు కనబడ్డాయి. వాటిలో మొదటిదీ, ముఖ్యమైనదీ ఏమిటంటే - అతను నిరంతరం ఆశావాది! అతనిది అడ్వెంచరస్ స్పిరిట్. దేనికీ భయపడడు. ఎవరికీ తలవంచడు. కలెక్టర్ తో అయినా సరే సమాన ఫాయీతోనే మాట్లాడుతాడు. గవర్నర్ ని కలిసినా తల నిమిరినట్లు మాట్లాడతాడే గానీ తలవంచడు. అతను అందగాడు కాకపోయినా కూడా, చాలా సరసుడని అర్జున్ గ్రహించాడు. అతనికి 'ఆడ స్నేహాలు' చాలానే ఉన్నాయి. అతను మాట్లాడుతుంటే అరచేతిలో వైకుంఠం కనబడినట్లే ఉంటుంది. సినిమా రచయితలు కొందరు ఉంటారు. వాళ్ళు సినిమా కథ చెబుతూ ఉంటే, వినేవాళ్ళకి పెళ్లాం మెడలో పుస్తెలతో సహా తెగ నమ్మేసి ఆ కథని సినిమాగా తియ్యాలనిపిస్తుంది. స్పెషల్ ఎఫెక్ట్సుతో, బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ తో హావ భావాలతో ప్రేక్షకుల చప్పట్లూ, విజిల్సుతో సహా అభినయం చేసి, "ముందుగా మీరు ఓ లారీ కొనుక్కోవాలి. వచ్చిన డబ్బులు బ్యాంకుకి తీసుకెళ్ళడానికి బెంజి బండి అయితే తప్ప సరిపోదు" అని సలహా ఇస్తే, నమ్మేసి ఆస్తులు అమ్మేసే నిర్మాతలు లేకపోలేదు.
అలాంటి వాక్చాతుర్యం పాపారావుది. ఆ తర్వాత కొన్ని దృశ్యాలు ఫాస్ట్ ఫార్వర్డ్ అయినట్లు గబగబ తిరిగిపోయాయి కాశీ మనో ఫలకం మీద.
వాటి సారాంశం.
అర్జున్ కీ, పాపారావుకీ విడలేని దోస్తీ కుదిరింది. పాపారావు ఫిలాసఫీ అర్జున్ కి బాగా వంటబట్టింది. పాపారావు ఫిలాసఫీతో బాటుగా అతని వ్యసనాలన్నీ కూడా వంట్లో జీర్ణించుకుపోయాయి. మాండ్రాక్స్ మాత్రలూ, మార్ఫిన్ ఇంజెక్షన్లూ అర్జునే పాపారావుకి అలవాటు చేశాడు.
మనోవ్యాధితో మంచం పట్టి అర్జున్ తల్లి మరణించింది.
అర్జున్ చేత అనేక రకాలైన బిజినెస్ లు పెట్టించాడు పాపారావు. అతనికి బిజినెస్సంటే ప్రాణం. తనకు ఇష్టమైన బిజినెస్ లు అన్నీ అర్జున్ చేత మొదలు పెట్టించేవాడు. రెండేళ్ళు కాగానే ఆ బిజినెస్ ను 'దివాళా' ఎత్తించేవాడు. పాపారావుకి డబ్బు మిగిలేది. అర్జున్ కి అనుభవం మిగిలేది.
సారా సీసాల కోసం డ్రమ్ము, సిగరెట్ల కోసం వేస్ట్ పేపర్ బాస్కెట్. పొద్దున్నే తాగడం మొదలు.
ఒకరోజున పాపారావుకి అమోఘమైన ఆలోచన వచ్చింది.
"గురు! మనిషికి అన్నిటికంటే అవసరమైనది ఏమిటి?" అన్నాడు.
"తిండీ తిప్పలు" అన్నాడు అర్జున్.
"కరెక్టు! తిండి అంటే అన్నం - తిప్పలు అంటే లిక్కరు. మనం లిక్కర్ డీలర్ షిప్పు తీసుకుంటే, మన సర్కిల్ లో మనకు ఎంత ప్రిస్టేజి! ఆలోచించు!"
ఎక్కువ ఆలోచించలేదు అర్జున్. సరే అనేశాడు.
"తిండి తిప్పల తర్వాత మనకు కావాల్సింది?" అన్నాడు పాపారావు.
"తలదాచుకునే గూడు"
"ఓరీ అమాయకుడా! గూళ్ళు అమాయకపు పక్షులకి. మనలాంటి మొగాళ్ళు రాత్రింబవళ్ళు గడిపేది క్లబ్బులో! కదా?"
"అవును"