Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 29


    "నన్ను తిట్టిన వాళ్ళు సంవత్సరం తిరక్కుండా పోతారు" అన్నాడు పాపారావు.


    "ఛా?"


    "నేను పేకాట్లో మోసం చేశానని సుబ్బడు తగువు పెట్టుకున్నాడా?"


    "సుబ్బడెవరు?"


    "సుబ్రహ్మణ్యం. మీ వీధిలోనే ఉంటాడు. నాతో పేకాట్లో తగువు పెట్టుకున్నాడు సుబ్బడు. నా దగ్గర ఎక్స్ ట్రాగా దొంగముక్కలు ఉన్నాయన్నాడు. కొట్టబోయాడు. మర్నాడే పాము కరిచి చచ్చిపోయాడు."


    "అలాగా!" అన్నాడు మల్లికార్జునరావు. ఇంకేమనాలో తోచక.


    "నన్ను నిష్కారణంగా తిట్టి మీ నాన్న అకాల మృత్యువు వాత పడ్డాడు. తండ్రిలేని వాడివి. నీ మీద నాకు జాలి! నీకు ఉపకారం చెయ్యదలచుకున్నాను"


    ఊరికే చూస్తూ ఉండిపోయాడు మల్లికార్జునరావు.


    "అర్జున్! నీకు రష్యాకి రైస్ ఎక్స్ పోర్ట్ చెయ్యడానికి పర్మిట్ ఇప్పించనా?"


    "రష్యాకి రైసా?" అన్నాడు మల్లికార్జునరావు ఆశ్చర్యంగా.


    "ఆ మధ్య నేను రష్యా వెళ్ళినప్పుడు బియ్యపు అన్నం తినడం అలవాటు చేసి వచ్చాలే!"


    "నువ్వు రష్యా ఎప్పుడెళ్ళావ్?"


    "ఆ మధ్య మూడు నెలలు కనబడకుండా పోయానే! అప్పుడు."


    "రాజమండ్రి జైల్లో ఉండి వచ్చావన్నారే!"


    "ఎవరన్నదీ! రక్తం కక్కుకు చస్తారు. నువ్వు అన్నావా?"


    "అన్లేదు - విన్నాను" అన్నాడు అర్జున్ భయంగా.


    "అది అలా ఉండనివ్వు. లండన్ లో మనకి తెలిసిన దొర ఒకాయన ఉన్నాడు. "పాపారావ్! లండన్ వచ్చేయ్! నిన్ను రాణిగారికి పరిచయం చేసి లార్డ్ ని చేసేస్తా" అంటుంటాడు. కానీ ఇక్కడ పనుల్లో ఇరుక్కుపోయాను గదా! ఇదిగో! ఉన్నపళంగా ఢిల్లీ రమ్మని టెలిగ్రాం!" అన్నాడు నలిగిన ఒక కాగితం చూపిస్తూ.


    "బావుంది!" అన్నాడు అర్జున్.


    "మరి రైస్ ఎక్స్ పోర్ట్ చేద్దామా?"


    "మనకెందుకులే భాయ్! ఉన్నదానితో జరిగిపోతుంది కదా!" అన్నాడు అర్జున్.


    "నీకు కట్టుకుపోయినంత ఆస్తి ఉంది! పండిన ధాన్యం రైతులచేత అమ్మిస్తావ్. వాళ్ళు సహానికి సహం తినేస్తారు. రైతుల ఎదాన కొట్టే బదులు రష్యాకి ఎగుమతి చెయ్యమంటున్నా"


    "నాకు ఇంట్రెస్టు లేదయ్యా!"


    "కనీ నీ మీద నాకు ఇంట్రెస్టు ఉంది"


    "నాకు పని ఉంది - బొంగుల బజారు వైపు వెళ్ళి రావాలి"


    "నేనూ అటే! పద!"


    మొత్తానికి పాపారావు అర్జున్ ని వదలలేదు. గాదెలో ధాన్యం ఉంది. పందికొక్కు కనిపెట్టింది. కంత పెట్టింది. మూడు నెలల పాటు అర్జున్ తో తిరిగాడు పాపారావు. మూడు నెలల్లో అర్జున్ డబ్బు చాలా పోయింది. సిగరెట్లు కాల్చడం మాత్రం వచ్చింది.


    "మనం రష్యాకి రైస్ ఎగుమతి చేయడం అయ్యేపని లాగా కనిపించడం లేదయ్యా! ఇంక వదిలేద్దాం" అన్నాడు అర్జున్ ఒకరోజున.


    "నాకూ అదే అనిపిస్తోంది" అన్నాడు పాపారావు.


    "ఏమని?"


    "మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాం"


    "అంటే?"


    "నిన్న మధ్యాహ్నం ఆయన దిగబడ్డాడు"


    "ఎవరు?"


    "ఇంకెవరు! పరమశివుడే!"


    "ఏమిటీ?"


    "అవునయ్యా! ప్రతిరోజూ అర్థరాత్రి వస్తాడు. ఇద్దరం ఓ అరగంట హస్కేస్తాం! మొన్న నైటు కుదరలేదుట. అందుకని నిన్న మధ్యాహ్నం వచ్చాడు సరిగ్గా భోజనాల టైంలో. పండు మిరప్పళ్ళ కారం,గోంగూర పచ్చడీ, వెన్నపూసా పెట్టి భోజనం పెట్టా! తిని తేనుస్తూ అన్నాడు - "పాపారావ్! ఇంత అనాగాడివేవయ్యా! చెప్పింది అర్థం చేసుకోవూ!" అని.


    "మా అర్జున్ సంగతేనా?" అన్నా.


    "ఇంపోర్టు చేసుకోమంటే ఎక్స్ పోర్టు చెయ్యడానికి చూస్తారేమయ్యా! సరిగ్గా విన్లేదా ఏం?"


    "సరిగ్గా మీరు చెప్పే టైంకి సైగలు పాట ఏదో వస్తూ ఉండి ఉంటుంది స్వామీ" అన్నా.


    "ఈసారన్నా సరిగ్గా విని ఏడు! భూటాన్ నుంచీ బార్లీ దిగుమతి చేసుకోండి! అన్నాడయ్యా! సరే అనేశా!"


    "పాపారావ్! నన్ను వదిలేయ్! ఏదో చెప్పావు. మూడు నెలలు తిరిగా! పని కాలేదు. పాతిక వేలు వదిలాయ్! పోతేపోనీ! కానీ ఇంక డబ్బు తగలేసే ఆలోచనలు చెప్పకు!!"

 Previous Page Next Page