"సినిమాకా....." సుబ్బారావు లేకుండా జ్యోతితో సినిమాకి వెళితే బాగుంటుందా అన్న మీమాంసలో ఇబ్బంది పడ్డాడు మురారి.
అదేం గుర్తించలేదు జ్యోతి. సినిమా పిచ్చిలో అంతదూరం ఆలోచించే ఓపికలేదు ఆమెకి.
"వాడు లేడు..... మనిద్దరం వెళితే బాగుంటుందా....." గొణిగాడు మురారి.
"బాగుండడానికి ఏముంది? మార్నింగ్ షో. మూడుగంటల లోపల ఇంటికి వచ్చేయచ్చు. ప్లీజ్ వద్దురూ. తోచక బోర్ కొడుతూంది" అంది జ్యోతి ఉత్సాహంగా.
మురారి ఇంకేమనలేకపోయాడు. రాత్రి షో కాదు. జ్యోతి అన్నట్టు మూడుకల్లా వచ్చేయచ్చు. ఇందులో తప్పేంవుంది? తనకీ మహా బోర్ గా వుండే వచ్చాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలిగనక?
"సరే.... అప్పుడే పదిన్నర అయింది. భోజనం?"
"నాకోసం అన్నీ వండుకున్నాను. ఒక్క అన్నం ఒక్కటీ మీ కోసం వండేస్తాను. ఎంతసేపు" చిన్నపిల్లలా సంబరంగా అంది.
ఇద్దరూ భోంచేసి, జ్యోతి ముస్తాబయివచ్చి కారులో కూర్చునేసరికి పదకొండున్నర దాటింది. జ్యోతి, సుబ్బారావు ఇద్దరూ ముందుసీట్లోనే కూర్చునేవారు. ఆ అలవాటుతో జ్యోతి మామూలుగా ఫ్రంట్ సీటులోనే కూర్చుంది.
సుబ్బారావు లేకుండా జ్యోతి ఒక్కదానితో అలా కూర్చుని వెళ్ళడానికి అదోలా అన్పించింది మురారికి.
జ్యోతి కారులో కూర్చున్నాక సుశీల కిటికీలోంచి చూడటం గమనించింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యంలాంటిది. చూశాక గర్వంగా నవ్వుకుంది.
సుబ్బారావు లేకుండా ఇలా వంటరిగా మురారితో వెళ్ళడం ఇది కొత్త అనుభవం జ్యోతికి. చాలా ఫ్రీగా, హాయిగా ఉన్నట్లనిపించి గలగల మాట్లాడుతూనే వుంది.
ఎండలోంచి వచ్చాక ఎయిర్ కండిషన్ ధియేటర్లో అడుగుపెట్టగానే, ఎంతో హాయి అనిపించింది. ఖరీదయిన సీట్లో మురారి పక్కన కూర్చోడం ఆమెకి చాలా గర్వంగా వుంది.
రెండోసారో మూడోసారో వచ్చిన సినిమా ఏమో జనం ఆట్టేలేరు. వచ్చేసరికి ఏవో ఏడ్వర్టెయిజ్ మెంట్సు చూపిస్తున్నారు. ఎప్పుడూ సుబ్బారావు ఉండడంవల్ల మురారి పక్కన సుబ్బారావు, ఆ తర్వాత జ్యోతి కూర్చునేవారు.
సీట్లు మరీ దగ్గర దగ్గరగా వున్నాయేమో మురారిని అంటిపెట్టుకు కూర్చున్నట్టే వుంది. అతని భుజం, చేయి తగిలేసరికి జ్యోతికి తెలియకుండానే ఆమె వళ్ళు పులకరించింది.
అతని దగ్గరనించి వచ్చే పరిమళం ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె మనసంతా హఠాత్తుగా ఏదో అయి పులకింతలాంటిది కలిగింది. కనిపించీ కన్పించని ఆ వెలుతురులో పక్కనించి మురారి రూపం మనోహరంగా కన్పించి ఆమె మనసు చెదిరింది.
ఆ క్షణంలో జ్యోతి తనో వివాహితురాలినన్న సంగతి మరచిపోయింది. పెళ్ళికాకముందు ఆమె కలల హీరో పక్కనే ఉన్నట్టు, ఆ కలల హీరోతో సినిమా చూస్తున్నట్టు అన్పించి మైమరచిపోయింది.
యధాలాపంగా మురారి కాలో, చెయ్యో తగిలినా ఆమె పులకించిపోసాగింది. దానికితోడు సినిమాలో లవ్ సీన్లు చాలా బాగున్నాయోమో ఆ దృశ్యాలలో హీరో హీరోయిన్లు తాను, మురారే అయినట్లు ఊహలలోకి జారిపోయింది.
ఆ లవ్ సీన్లు ఇచ్చే ఎక్సైట్ మెంటు, పక్కన మురారి - జ్యోతి ఆ మూడుగంటలు వేరే లోకంలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రేమికులని చూస్తూ సిగ్గుపడిన మురారిని చాటుగా చూసింది. మురారి తదేకంగా సినిమాలో లీనమయి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు.
అతని కళ్ళు చీకట్లో మెరిశాయి. మురారిని కాసేపు చూస్తూ, సినిమాని కాసేపు చూస్తూ ఏం చూస్తున్నదీ తెలియకుండానే జ్యోతి సినిమా చూస్తుంది.
మురారి చెయ్యి కుర్చీ కమ్మీమీద పెట్టుకున్నాడు. ఆ చెయ్యి అతను కావాలనే పెట్టినట్లు తన చేతికి వేడిగా తగులుతున్నా కదలకుండా, మెదలకుండా తన చెయ్యి లాక్కోలేదు జ్యోతి.
ఎయిర్ కండిషన్డ్ ధియేటర్ లోనూ జ్యోతికి చెమటలు పట్టాయి. సినిమాలో పెళ్ళి, మొదటిరాత్రి దృశ్యాలు అబ్బ! ఎంత బాగున్నాయి? ప్రతి సీన్ లో తెరమీద తామిద్దరినే ఊహించుకుంది జ్యోతి.
మురారి తన భుజంచుట్టూ చెయ్యివేసి దగ్గరికి లాక్కున్నట్టు, తన చెయ్యి మురారి బలిష్టమైన చేతిలో నలిగిపోతున్నట్టు, చీకట్లో మురారి తనవైపు లాక్కుని పెదాలమీద ముద్దు పెట్టినట్టు, తను మైమరచి అతని గుండెలమీద తల ఆన్చినట్టు జ్యోతి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.
ఆమె ఏదో పారవశ్యంతో మైకంలో పడిపోయింది. అదే మొదలు జ్యోతికి మురారిపట్ల కోరిక కల్గడం.
ఇంటర్వెల్ లో ఒక్కసారిగా గప్పున లైట్లు వెలిగేసరికి ఉలిక్కి పడింది. మురారి మొహంలోకి చూడలేకపోయింది.
"పిక్చరు బాగుందికదూ, లవ్ సీన్లు చాలా బాగా తీశారు" మురారి అలా అనేసరికి కొత్త పెళ్ళికూతురిలా సిగ్గుపడిపోయింది జ్యోతి తన గురించే అలా అన్నట్టు భావించింది.
కూల్ డ్రింక్స్ తీసుకువచ్చాను మురారి. పిక్చరు మళ్ళీ మొదలు అయ్యింది.
ఈసారి అసలు సినిమా చూడలేకపోయింది జ్యోతి. సినిమా మరో గంటలో అయిపోతుంది. మురారి, తను మళ్ళీ ఎవరికీ వారు అయిపోతారు.
మళ్ళీ తను, తన రెండుగదుల కొంప, జిడ్డుమొహం సుబ్బారావు తయారు. మురారి ఎప్పుడో తన చీకటి బతుకులో ఓ అరక్షణం మెరుపులా మెరిసి మాయమయిపోతాడు.
ఇంతే! మురారి తనకేం కాడు. తను చూసేది అంతా కల! భ్రమ, ఈ జన్మకింతే! తన ఆశలు, కలలు అన్నీ వ్యర్థం అయిపోయాయి. మురారికి, తనకు అందనంత దూరంవుంది.