Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 29

    "అబ్బబ్బ! నీ సినిమాపిచ్చి మరీ ఎక్కువవుతూంది. ఒరేయ్! నీవు జ్యోతిని అడిగిన సినిమాకల్లా తీసుకెళ్ళి మరీ పాడుచేస్తున్నావురా....." అని కసిరేవాడు అప్పుడప్పుడు.
    "ఆ పుస్తకాలు అన్నీ ఇస్తున్నావు. ఇంక బొత్తిగా నాతో మాట్లాడడమే మానేసింది" అనేవాడు నవ్వుతూ కంప్లైంట్ చేస్తున్నట్టు.
    అలా నాలుగైదుసార్లు అన్నాక జ్యోతి మురారి వెళ్ళాక ఓరోజు విరుచుకుపడింది.
    "అమ్మ పెట్టదు, అడుక్కు తిననీదు అన్నట్టు - మీరు తీసుకెళ్ళరు, పుస్తకాలు కొనలేరు. అతను తీసుకెళుతుంటే మీకేం నష్టం? రోజంతా ఇంట్లో ఏడుస్తాను. పుస్తకాలైన లేకుండా కాలక్షేపం ఎలా అవుతుందనుకుంటారు?" గయ్ మంది.
    "ఎంత ఫ్రెండయితే మాత్రం అలా మొహమాటం లేకుండా సినిమా సినిమా అని నీవు వాడొచ్చేసరికి గెంతడం ఏమిటి అసహ్యంగా? సినిమాకోసం మొహం వాచినట్లు పదిసార్లు వల్లిస్తావు. వాడేమన్నా అనుకుంటాడని కూడా తట్టదా నీకు -" సుబ్బారావు కాస్త కోపంగా అన్నాడు.
    జ్యోతికి ఒళ్ళు మండింది.
    "అతనేమన్నా అనుకునేరకం అయితే మనింటికి రానేరాడు. అతనే అడుగుతాడు రాగానే" తీక్షణంగా అంది.
    "ఆ..... నీ సినిమాపిచ్చి కనిపెట్టి అడుగుతాడు" సుబ్బారావు ఎత్తి పొడిచాడు.
    "ఇదిగో మీరనవసరంగా మాటలు అనకండి. అతను తీసుకెళుతున్నాడు మధ్య మీకేం బాధ? నేనేదో కాస్త సంతోషంగా వున్నావని మీకు బాధ. మన మొహాన ఏ ముచ్చటా తీర్చుకునే యోగంలేదు. అతనితోనన్నా వెళ్ళనీయండి" ఉక్రోషంగా అంది.
    "పుస్తకాలు మీరెలాగూ కొనలేరు. అతను తెచ్చియిస్తుంటే చదవడంకూడా తప్పేనా?" రెట్టించింది జ్యోతి.
    "తప్పనలేదు. కాని రోజంతా ఎలాగో చదువుతాను పోనీ సాయంత్రం నేను వచ్చాక అయినా కాస్త సరదాగా మాట్లాడకూడదూ. సాయత్రం, రాత్రి ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలే పట్టుకుకూర్చుంటావు. రోజంతా ఆఫీసులో ఏడుస్తాను. కాస్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మాటామంతీ లేకుండా కూర్చుంటే-"
    "ఆఁ- ఏం మాటలు వుంటాయి? పెద్దబోర్" మొహం చిట్లించింది జ్యోతి.
    సుబ్బారావు అహం దెబ్బతింది.
    "అవును నేనంటేనే బోర్! నాతో మాట్లాడటం ఇంకా బోర్" తీక్షణంగా అన్నాడు.
    జ్యోతి పెడసరంగా "ఆఁ అవును. ఆమాత్రం తెల్సుగదా, పదే పదే ఎందుకు నన్ను వేధిస్తారు? నా మానాన నన్ను వదలండి" రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది.
    సుబ్బారావు బాధగా నిట్టూర్చాడు.
    మొత్తానికి మురారికి తెలియకుండానే భార్యాభర్తలు మరింత ఎడం అవడానికి తోడ్పడుతున్నాడు. అతను జ్యోతికి చేరువవుతున్న కొద్దీ జ్యోతి సుబ్బారావునించి మరీ దూరం అవసాగింది.
                  *            *            *           *
    "హలో..... ఏమిటంత పరధ్యానంలో వున్నారు? హారన్ రెండు సార్లు కొట్టాను. వినిపించుకోలేదు మీరు. ఏం చేస్తున్నారు? సుబ్బారావు ఏడీ?" అన్నాడు మురారి చనువుగా లోపలికి వచ్చి కూర్చుంటూ.
    జ్యోతి సంభ్రమంగా, ఆనందంగా చూసి "అరే - ఎప్పుడొచ్చారు? చూడనేలేదు. రండి - రండి" అంటూ ఆహ్వానించింది.
    "ఇంకా రమ్మని ఆహ్వానం ఎందుకు? వచ్చి కూర్చున్నగా? సుబ్బు ఏడి? ఇంట్లో లేడా?"
    "ఊళ్ళో లేరు. నిన్న రాత్రి వాళ్ళ నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని టెలిగ్రాం వస్తే వెంటనే ఆదరాబాదరా బయలుదేరి వెళ్ళారు."
    "అరే.... తెలియలేదే. ఎలావుందో ఇప్పుడు? మీరు వెళ్ళలేదే?" మురారి ఆరాటంగా అన్నాడు.
    "ఏదీ, ఆయన ట్రైన్ అప్పుడు వుందని పావుగంటలో తయారైవెళ్ళారు. అవసరం అయితే టెలిగ్రాం ఇస్తానన్నారు."
    "అలాగా! వాడుంటాడని బయలుదేరి వచ్చాను అనవసరంగా. ఆదివారం కాసేపు....."
    "ఏం ఆయన లేకపోతే రాకూడదన్నమాట" జ్యోతి కినుకగా అంది.
    మురారి నవ్వాడు.
    "అబ్బే అదికాదు. వాడు లేకుండా...." ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు.
    "బోర్ కొట్టిపోతూంది. పుస్తకాలు అన్నీ అయిపోయాయి. చదవడానికి ఏంలేవు. ఏంచేయడం అని తోచక కొట్టుకుంటున్నాను. ధేంక్ గాడ్! మీరొచ్చారు" జ్యోతి ఆనందంగా అంది.
    జ్యోతి ఏదో మాట్లాడుతూనే వుంది. సుబ్బారావు ఉన్నప్పుడు జ్యోతీ, మురారీ ఎక్కువ మాట్లాడుకునేవారు. కాని ఈరోజు సుబ్బారావు లేకపోయేసరికి మురారి కాస్త ఇబ్బందిపడ్డాడు. సంభాషణ జరగలేదు. ఓ పావుగంట కూర్చుని -
    "మరి వెళతాను. రేపు వూరికి వెళుతున్నాను, వచ్చాక వస్తానని సుబ్బారావుకి చెప్పండి."
    జ్యోతి నిరుత్సాహంగా - "అదేమిటి అప్పుడే వెళ్ళిపోతారా? ఏం మీ ఫ్రెండ్ లేకపోతే వెళ్ళిపోవడమేనన్నమాట. నేను మనిషిలా కనబడటంలేదేమిటి? కూర్చుందురూ కాసేపు. ఎలాగో వచ్చారు. కాసేపు పేకాడుకుందామా?" అంది జ్యోతి.
    మురారి ఇబ్బందిగా వెళ్ళలేక, మానలేక బిడియపడ్డాడు.
    "ఉండండి, కాఫీ తెస్తాను. తాగి పేకాడుకుందాం" అంటూ జ్యోతి లోపలికి వెళ్ళింది.
    కాఫీ తెస్తూ "ఏమండీ! అన్నట్టు 'లేరె మేరే సప్నా' మార్నింగ్ షో ఆడుతుంది. అప్పుడు చూడలేదు. మిస్ అయ్యాను. మీరు చూశారా? వెళదాం రాకూడదూ?" అంది జ్యోతి ఆశగా.
    "చాలా మంచి సినిమా అండి. తప్పకుండా చూడాలి. ఒక్కర్తినీ వెళ్ళలేక వూరుకున్నాను. ప్లీజ్ పదండి వెడదాం. పన్నెండుకి వుంది" అంది జ్యోతి ఆశగా.

 Previous Page Next Page