చేతికి అందిన పుస్తకం తీసుకుని కూర్చుంటే ఇక ఆయనకి మరో ధ్యాస ఉండదు. అది పూర్తి కావటమో, రోజు పూర్తి కావటమో- అంతే! మళ్ళీ రాత్రి ఎనిమిదింటికి భోజనానికి దిగివస్తాడు. మళ్ళీ కబుర్లు మాటలు, నవ్వులు అంతే. తొమ్మిదింటికి మేడ ఎక్కితే భార్య మాణిక్యమ్మా, ఆయనా మళ్ళి దిగివచ్చేది తెల్లవారాకనే.
ఈ కార్యక్రమంలో ఆయన కొడుకు చంద్రయ్య విషయం కానీ, కూతురు విశాల విషయం కానీ పట్టించుకోడు. వాళ్ళంతకు వాళ్ళే పాఠశాలకి వెళ్ళి చదువు కుంటారు. ఎలిమెంటరీ చదువు అయిపోయాక హైస్కూలుకి పంపించవచ్చు లెమ్మని అనుకున్నారాయన.
బ్రహ్మాండంగా అక్షరాభ్యాసం వేడుకలు జరిపించి తనూ, భార్య వెళ్లి పాఠశాలలో వదిలి పంతులుగారికి బాధ్యత అప్పగించి రాగానే తన కర్తవ్యం నెరవేరిందని భావించాడు భూషయ్య. దైవ సమానుడైన గురువు శిష్యుడి అంతరంగాన్ని తీర్చి దిద్దుతాడనీ, శిష్యుడి జీవితాన్ని సక్రమమైన పంధాలో మలుపుతాడనీ భావించాడాయన. నిజమే. ఆయన చదువుకున్న తీరూ, ఆయన్ని చిన్నతనంలో తీర్చిదిద్దిన ఆయన గురువు చెంచయ్యగారి పంధా అలాంటివే!
చంద్రయ్య బడికైతే వెళ్ళి వస్తున్నాడు కానీ, అతనికి గజస్నానం లాగా విద్య ఒంటపట్ట లేదు. పదేళ్లు వచ్చేసరికి అతనికి బాగా అబ్బింది తన యీడు కుర్రాళ్లతో వెళ్ళి తోటలూ దొడ్లూ తిరగటం, మధ్యాహ్న సమయాల్లో బావుల్లో ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శిస్తూ ఈత కొట్టటం, గోలీలు, చెడుగుడు, బిళ్ళంగోడి మొదలైన ఆటలు ఆడటం.
ఒక రోజు ఏదో ధ్యాసతో భోజనాల వేళలో ఆయన వచ్చిన బంధువులముందు మాట ప్రస్తావనగా వేమన పద్యాన్ని చెప్పి, వేమన ఎంత గొప్ప కవో చెప్పి, పొగిడి, తనకు తెలిసిన విషయం చెప్పి తృప్తితీరక కొడుకుతో కూడా వేమన పద్యాలు చెప్పించాలని ఉబలాటపడి, కొడుకుని చూసి "చంద్రా! వేమన పద్యాలు నాలుగు చెప్పరా! మీ బాబాయ్ గారూ, మీ మామగారూ వింటారు" అన్నాడు గర్వంగా.
ఆ మాటలు వినగానే చంద్రానికి పై ప్రాణాలు పైనే పోయాయి. అయిదేళ్లు బడికి వెళ్ళివచ్చాడు కానీ, అతనికి వేమన ఎవరో తెలియదు పాపం! అతని లోకం వేరు. అతనికి తెలిసింది వేరు బిక్కముఖం వేసిన కొడుకుని చూచి భయపడుతున్నాడేమోననుకుని భ్రమపడిన భూషయ్య గారికి అదంతా తన భ్రమ మాత్రమేనని అర్ధమైంది.
రోషంతో, అవమానంతో, కోపంతో ఆయన ఒళ్లు మరిచిపోయాడు. ఫలితం కొరడా గాలిలో కదిలింది. చంద్రం శరీరంపై వాతలు వేసింది. ఎవరెంత అడ్డువచ్చినా ఆయన ఆగలేదు.
బాది బాది అలసిపోయిన భూషయ్యగారి కోపం పంతులుగారిపై ప్రసరించింది. పాలేరు వెళ్ళి పిలుచుకుని వచ్చాడు పంతులుగారిని. కొత్త పంతులుని చూసి ఆశ్చర్యపోయాడు భూషయ్యగారు. తాను నెలక్రితమే ఇక్కడికి వచ్చానని, తన పూర్వం ఉన్న మాస్టరుగారు ట్రాన్స్ ఫర్ అయిపోయారనీ చెప్పాడు ఆయన.
పంతులు గారితో కొడుకు విద్యావివేకాలు పరీక్షించాడు భూషయ్య. ఓ కి ఎన్ని వంకరలున్నాయో కూడా తెలియని కుమారుడిని చూచి నిలువునా క్రుంగి పోయాడు.
దిగులుతో, పగిలిన గుండెతో తన గదికివెళ్ళి భార్యనీ, పెద్ద పాలేరు శివయ్యనీ పిలిపించు కున్నాడు. బాగా తర్జన భర్జన చేసుకున్నాక ఇక అబ్బాయిని పంతుళ్ళని నమ్మి బడికి పంపటం శ్రేయస్కరం కాదని, పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసి ఊళ్లేలవలసిన అవసరం లేకపోయినా ఇంతటి సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు అవసరమైన చదువు కావాలనీ, అందుకని పంతులుగారినే ఇంటికి పిలిపించి చదువు చెప్పించాలనీ నిర్ణయించుకున్నాడు.
అక్షారాభ్యాసం చేయించాడు మళ్ళీ. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శివయ్య కొడుకు రమణయ్యని చూసి వాడితో కలిసి చదువుకోమన్నాడు. చంద్రం తనకంటే రెండేళ్లు చిన్న అయిన రమణయ్యతోటీ, నాలుగేళ్లు చిన్నదయిన చెల్లెలు విశాలతోటీ కలిసి రెండేళ్ళలో ప్రాథమిక విద్య అంతా పూర్తి చేశాడు.
కాలం అలాగే సాగితే చంద్రం ఇంకా చదివేవాడేమో కానీ, అకస్మాత్తుగా భూషయ్య మేడ ఎక్కినవాడు అలాగే పైకి వెళ్ళిపోవటంతో ఆ ఇల్లు దిక్కులేని దైంది. ఏదెక్కడుందో, ఎంతెంతుందో సరిగ్గా తెలియని మాణిక్యమ్మకి శివయ్య అండగా నిలిచాడు. వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తెచ్చాడు. ఆడ్యుడు చనిపోయాడని అన్యాయాలు చేయబోయిన వాళ్ళని అలాగే ఆమడ దూరంలో నిలిపాడు. నోట్లు అన్ని ఆమెపేర తిప్పి వ్రాయించాడు. వీలయినవి వసూలు చేశాడు. పొలాల గట్లన్ని మామూలుగా బందోబస్తు చేయించాడు.
మాణిక్యమ్మకి ఒక్క భర్తలేని లోటు తప్ప మిగతా అన్ని నమ్మినబంటులా నెరవేర్చాడు సీతమ్మవారికి హనుమంతుడిలా నమ్మకమైన బంటు దొరికాడని ఊరు ఊరంతా అనుకుంది. సంసారాన్ని చక్కదిద్దటానికి శివయ్యకి ఆరునెలల పట్టింది.
ఈ ఆరునెలలూ చంద్రం రమణయ్యతో కలిసి పంచుకున్నాడు అనుభవాల్ని. మట్టిపిసుక్కుని జీవించే కుటుంబం వాడైన రమణయ్య చంద్రానికి వ్యవసాయంలో ఆసక్తిని కలిగించాడు.
కుటుంబ వ్యవహారాలన్ని చక్కదిద్దుకొన్నాక కొడుకుపై దృష్టి మళ్ళించి జూన్ లో పాఠశాలలో చేర్చాలని ప్రయత్నం చేసిన మాణిక్యమ్మకి కొడుకు ధ్యాస అంతా వ్యవసాయంమీదనే వుందని చదువుపై ఏమాత్రం ఆసక్తి లేదనీ గ్రహించింది.
వృధాశ్రమ పడేకంటే అబ్బాయిని ఇష్టమున్న మార్గాన నడవనివ్వటం మంచిదనీ అంతగా అవసరమైతే అదే పంతులుగారితో ఇంగ్లీషు నేర్పించవచ్చనీ చెప్పాడు శివయ్య. శివయ్య సలహా ఆమెకు నచ్చింది.
కాలగర్భంలో మరో నాలుగేళ్లు గడిచాయి. ఒకరోజు పొలం కాపలాకి వెళ్ళిన శివయ్య పాముకాటుకి బలిఅయిపోయాడు.
ఒంటరిగాడైన రమణయ్యతోపాటు తనో దిక్కుమాలినదై పోయాననుకున్న మాణిక్యమ్మకి ఎదిగివచ్చిన కొడుకు చుక్కానిలా కనిపించాడు.
మంచి వ్యవహర్తలా అన్నీ చూసుకుంటూ ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ పొలం పనులన్నీ జాగ్రత్తగా చేయించుకుంటున్న చంద్రాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చిందామె.
రమణ తండ్రి స్థానాన్ని అనుకోకుండానే ఆక్రమించాడు. చంద్రానికి అండదండగా తిరుగుతూ, అంతరంగికుడులా మారిపోయాడు.
3
ఇంటి పెత్తనం చేతికివచ్చాక చంద్రం తరహా మారిపోయింది. మీసాలు వచ్చే వయస్సులో దేశాలు కనుపించవు అని పెద్దలన్నట్టుగా వ్యవహరించసాగాడు. పొంగిపొరలుతున్న యవ్వనం, అంతులేని ఐశ్వర్యం, అదుపులేని పెద్దరికం చంద్రయ్యని ఊరిపాలు చేశాయి.
భూషయ్య ఇల్లు వదిలి వెళ్ళినవాడు కాదు. చంద్రానికి ఇంట్లో ఉండాలంటే ప్రాణసంకటంగా ఉంటూంది. ఎప్పుడు ఊరూ పొలాలూ, హద్దుమీరి తిరగసాగాడు చంద్రం.
ఓరోజు మధ్యాహ్నం మూడుగంటల వేళ పొలం నుంచి తిరిగి వస్తున్న రమణకి మామిడితోట పక్కగా వస్తూండగా తోటలో ఉన్న బంగళాలో నుండి మాటలు వినపడినాయి.
అది భూషయ్యగారు వేసవిలో విశ్రాంతిగా ఉంటుందని ఆరెకరాల మామిడితోటలో ఇష్టపడి కట్టించుకున్న బంగళా. ఒక వసారా, ఒక హాలు, ఒక పడక గది, బాత్ రూమ్, లెట్రిన్, వంటగది- అన్ని సౌకర్యాలు అమర్చుకున్నారాయన. భూషయ్య చనిపోయిన తర్వాత ఆ బంగళాలో ఎవరూ ఉండటంలేదు.
అనుమానంతో అసహనంగా అటు కదిలాడు రమణ.
గేటు తిరిగి తోటలో నడుస్తూ బంగళా ముందుకు వెళ్ళిన రమణకి వరండాలో కుర్చీలు వేసుకుని పేకాడుతూన్న చంద్రం, భోగం రమాసుందరి కూతురు ఇందిర కనుపించారు.
రమణని చూసిన ఇందిర క్షణకాలం తొట్రుపడింది. రమణ ఎంత కఠినుడో, యజమాని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఊరి కంతటికీ తెలుసు. అందుకే ఆ జంకు. అయినా చంద్రం అండ చూసుకున్న ఇందిర మరుక్షణంలోనే తిరిగి పేకపై దృష్టి నిలిపింది.
"ఏరా, రమణా! మడి నుంచే వస్తున్నావా?" అని అడిగాడు. ఒకసారి రమణని చూసి తిరిగి పేకపై దృష్టి నిలిపిన చంద్రం.
తలఊపాడు రమణ నోరు పెగలక.
"ఇదిగో! ఇంటికేనా వెళుతున్నావ్? కాస్త కాఫీ ఫలహారాలు పంపమని హోటల్ రాఘవయ్యకి చెపుతావా?"
మండిపోతూంది రమణకి, 'నిప్పులాంటి భూషయ్యగారి పరువు ప్రతిష్ఠలు వేలం వేస్తున్నావ్!' అనుకున్నాడు.
"త్వరగా వెళ్ళి పంపిస్తావా? ఆకలేస్తుంది." మళ్ళీ చెప్పాడు చంద్రం.
"చంద్రం" దాదాపు సమాన వయస్కులు కావటం, ఒకే కులం వాళ్లు కావటం చిన్నతనం నుంచీ కలిసి చదువుకుని, కలిసి తిరగటంతో రమణకి చంద్రాన్ని పేరుతో పిలిచే చనువు ఏర్పడింది.