Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 28

    "మిస్టర్ మనోహర్! మిస్ మాయను ఆఫీసులో మొట్టమొదటిసారి ఎక్కడ, ఎలా చూశారు?" అడిగాడు ఆదిత్య.
   
    మనోహర్ చెప్పడం ప్రారంభించాడు.
   
    "నేను ఆ ఆఫీసులో జాయిన్ కావడానికి వెళ్ళిన రోజున థర్డ్ ఫ్లోర్ లోని పర్సనల్ ఆఫీసరు దగ్గరకు వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కాను. లిఫ్ట్ లో అప్పటికే వున్న వ్యక్తిని మాయాదేవి అని గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. కాలేజీ నుంచి విడిపోయాక చాలా రోజులకు ఆమెను చూశాను. ఆమె నన్ను చూసి సన్నగా నవ్వింది. ఆమె ఆ కంపెనీ ఎం.డి. అని నాకు తెలీదు" చెప్పి ఆగాడు మనోహర్.
   
    "లిఫ్ట్ లో ఏం జరిగింది?" అడిగాడు ఆదిత్య.
   
    "లిఫ్ట్ లో ఏ జరుగుతుంది?" ఎదురు ప్రశ్న వేశాడు మనోహర్ అమాయకంగా. ఆ ప్రశ్నకు జడ్జీతో సహా అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు చిన్నగా.
   
    "ఏం జరిగిందీ అంటే....దానర్ధం మీ మధ్య సంభాషణ ఏమీ జరగలేదా....అని" అన్నాడు లాయర్ ఆదిత్య.
   
    "లేదు జరగలేదు."
   
    "తరువాత.....?"
   
    "నేను పర్సనల్ ఆఫీసర్ కు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాక, ఆయన నా సీటు చూపించాడు. మిగతా కొలీగ్స్ కు పరిచయం చేశాడు. ఆ సమయంలో నా టేబుల్ మీదున్న ఇంటర్ కమ్ మోగింది. నాకు ఫోన్ ఏంటని ఆశ్చర్యపోతూ లిఫ్ట్ చేశాను...." ఒక్కక్షణం ఆగాడు మనోహర్.
   
    "చెప్పండి" అన్నాడు ఆదిత్య.
   
    "కంగ్రాచ్యులేషన్స్...." అన్న లేడీ వాయిస్ వినిపించింది. ఆ తరువాత 'ఎట్టకేలకు పంజరంలో చిక్కావు....తప్పించుకోలేవులే....'అన్నమాటలు విన్పించాయి. ఆ తరువాత చిన్న నవ్వు. ఆ వాయిస్ ఎవరిదో, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలీదు. అంతలోనే ఫోన్ కట్ అయింది" చెప్పాడు మనోహర్.
   
    "మీకలా ఫోన్ చేసింది మిస్ మాయాదేవేనా?"
   
    "ఆ క్షణంలో తెలీలేదు! ఆ తరువాత తెలిసింది" చెప్పాడు మనోహర్.
   
    ఆదిత్య, జస్టిస్ మెహతావైపు చూశాడు.
   
    "వాద ప్రతివాదనలు రేపటికి వాయిదావేయడమైనది" అని భారంగా ఊపిరి పీలుస్తూ, చేతి వాచీవైపు చూసుకున్నారు జస్టిస్ మెహతా.
   
    కోర్టులో సందడి మొదలయింది.
   
    ప్రెస్ రిపోర్టర్స్, ఛానెల్స్ రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్స్ బారి నుంచి తన కారు దగ్గరికి వచ్చేసరికి మాయాదేవికి తలప్రాణం తోక కొచ్చింది.
   
    పి.ఎ. పక్క సీట్లో కూర్చోగా, తను కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసి, వెహికల్ స్టాండ్ వేపు చూసింది మాయాదేవి.
   
    హీరోహోండా స్టార్టు చేస్తున్నాడు మనోహర్. అతని చుట్టూ ప్రెస్ రిపోర్టర్స్ వున్నారు.
   
    "కోర్టులో కేసు నడుస్తున్నందువల్ల, నేనేం చెప్పలేను.....సారీ" హీరోహోండాని స్టార్ట్ చేస్తూ చెప్పాడు మనోహర్.
   
    కొన్ని క్షణాల తరువాత హీరోహోండా, ఆ స్పెషల్ కోర్టు ప్రాంగణంలోంచి రోడ్డు మీదకి వచ్చింది.
   
    ఎక్కడయినా వేడిగా కాఫీ తాగితే తప్ప, తను రిలాక్స్ కాలేడు. ఆ ఆలోచన రాగానే, అటూ-ఇటూ చూశాడు.
   
    పది అడుగుల దూరంలో హోటల్ కామత్ కనిపించింది.
   
    హీరోహోండా ఆపి, లోనికి ఎ.సి. రూమ్ లోకి నడిచాడు మనోహర్. మాయాదేవి మారుతీకారు మనోహర్ ణే ఫాలో అవుతూ, ఆ కామత్ హోటల్ ముందే ఆగిందనే విషయం అతనికి తెలీదు.
   
                                             *    *    *    *
   
    ఎ.సి. రూమ్ చల్లగా వుంది.
   
    బేరర్ వస్తే కాఫీ ఆర్డర్ చేసి, ఆలోచిస్తున్నాడు.
   
    మాయాదేవి మనస్తత్వం అతనికేమీ అర్ధం కావడంలేదు. కాలేజీ రోజుల్లో ఆమెపై తను ప్రత్యేకమయిన ప్రేమను వ్యక్తం చేయలేదు.
   
    ఆమె మీద తనకేమీ వ్యామోహంగానీ, కోరికగానీ లేవు.
   
    ఎందుకు ఆమెకు తన మీద కక్ష?
   
    ఇది కక్షా....ప్రేమా?
   
    అణచుకోలేని ప్రేమ, మహోధృతమయిన జలపాతంలా, కోరికలా మారి, ఆ కోరిక కక్షలా మారుతోందేమో!
   
    ఇది స్త్రీల విషయంలో చాలా సహజం అంటాడు చలం.
   
    ఈ కోర్టులు, ఈ గొడవలు...చివరికి ఏం సాధిస్తుంది మాయాదేవి?
   
    ఎలాగైనా తనని పెళ్ళి చేసుకుంటుందా?
   
    ఆమెను పెళ్ళి చేసుకుంటే తను సుఖపడగలడా?
   
    లేడు.....తను పెళ్ళి చేసుకోలేడు.
   
    బేరర్ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. కాఫీ కప్పును అందుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి గబుక్కున ఆ కాఫీ కప్పుని అందుకుని ఎదురుగా కూర్చోవటం జరిగిపోయింది క్షణాల్లోనే.
   
    ఆ వ్యక్తి మాయాదేవి.....
   
    ఆమెను అక్కడా అలా చూడగానే ఆశ్చర్యపోయాడు మనోహర్.
   
    ఒళ్ళు మండిపోయింది అతనికి.
   
    సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు.
   
    ఐబ్రో పెన్సిల్ తో దిద్దుకున్న కనురెప్పలు...నుదుటి మధ్యన గుండ్రంగా బొట్టు....వదులుగా వదిలేసిన జుత్తు...ఆ పాయల్లోంచి ప్రవహించే ఫారిన్ షాంపూ స్మెల్.
   
    వంటికి స్ప్రే చేసుకున్న ఇంటిమేట్ డ్యురోడెంట్.
   
    సాసర్ లో సగం కాఫీని అతనివేపు తోస్తూ....
   
    "హేవిట్....సగం.....సగం ఎప్పటికైనా తప్పదుగా...." అంది నవ్వుతూ మాయాదేవి.
   
    మాయాదేవి నవ్వు బావుంటుంది.
   
    కాలేజీ రోజుల్లో మనోహర్ కి మనోహరంగా అన్పించేది ఆనవ్వే రేర్ స్మైల్....ప్రీతీజింటా నవ్వే నవ్వులాంటి నవ్వు.
   
    కొంతమంది వంటి విరుపుల్లో సెక్సప్పీల్ వుంటే, మరికొంత మంది నవ్వులో సెక్సప్పీల్ వుంటుంది.

 Previous Page Next Page