తను కిందకి వెళ్ళాలో అక్కరలేదో తెలియలేదు వాణికి. రాజారావు నిన్న చీరలు తెప్పిస్తానని మళ్ళీ ఆ మాట మరిచిపోయాడు. మొన్న రుక్మిణి యిచ్చిన కొత్తచీర కట్టుకుంది. రాజారావు పిలిస్తే కిందకు వెళ్ళచ్చు ననుకుంది..
కిందనించి ఒకటే కోలాహలంగా మాటలు నవ్వులు వినిపించాయి.
కాఫీలు పట్టుకెళ్లారు పనివాళ్ళు. కిందనించి సిగరెట్ వాసన గుప్ మని వస్తూంది. కిటికీలోంచి అట్టే బాగా కనపడక పోయినా వచ్చిన వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళలా కన్పించారు వాణికి. మగవాళ్ళు ఉల్లి పోరాలాన్తి జుబ్బాలు, గ్లాస్కోపంచెలు కన్పించాయి. ఆడవాళ్ళ బాబ్డు హెయిర్, లిప్ స్టిక్ లు, బొడ్డుకింద చీరలు వేషం చాలా ఆధునికంగా వున్నట్టు కన్పించింది వాణికి.
పేకాట సాగుతూంది కాబోలు మాటలు జోరుగా విన్పిస్తున్నాయి, ఆసు, రాజు, రాణి అంటూ.
పన్నెండున్నర ప్రాంతంలో డ్రైవరు వచ్చి "అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు" అంటూ వచ్చాడు.
వాణి చీర సర్దుకుని, మొహం అద్దంలో చూసుకుని కాస్త జంకుగా కిందకి దిగి వెళ్ళింది.
పేకాడుకోడానికి వీలుగా కింద తివాచీ చుట్టూ తెల్లటి బాలీసులు, తలగడలు వేసుకొని అంతాకింద కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళ ఎదుట నోట్లు చిల్లర దొమ్తులు వున్నాయి. ప్రతీవాళ్ళదగ్గిర గ్లాసులలో మద్యం వుంది. సీసాలు, ఐసు ఫ్లాస్కులు, చిప్స్, జీడిపప్పు మధ్యగా వున్నాయి.
అందరూ మహా కుషీగా నవ్వుతూ, తుళ్ళుతూ, జోక్స్ వేసుకుంటూ, మధ్యమధ్య తాగుతూ జోరుగా హుషారుగా పేకాట ఆడుతున్నారు.
వాణి వచ్చి గుమ్మంలో నిలబడడం ఎవరూ గమనించలేదు. ఆ గదిలో వాతావరణం వాణికి కొత్త. ఎన్ని రకాల సెంట్లు, సిగరెట్, విస్కీ వాసనలు కలిసి గదిలో ఊపిరి ఆడనట్టు ఉక్కిరి బిక్కిరి అయింది వాణికి.
ఆడవాళ్ళూ మగవాళ్ళతో సరిసమానంగా కూర్చుని తాగుతూ, పేకాడుతున్నారు. వాళ్ళను చూడగానే ఎవరికీ గౌరవం ఇవ్వాలని పించనంత విముఖత కల్గింది వాణికి.
వాణిని చూసి రాజారావు మొహం చిట్లించాడు. వాణి చీరని చూస్తూ తీక్షణంగా ఆమెవంక చూశాడు. అంతలో సర్దుకుని "రా... ఇదిగో వీళ్ళు నా ఫ్రెండ్సు...నిన్ను చూస్తామంటే పిల్చాను" అంటూ ఒక్కసారి పేరు చెప్పి వాళ్ళ బిజినెస్ లు, ఎవరికెన్ని హోటళ్ళు, సినిమాహాళ్ళు వున్నాయో, లక్షాధికార్లని పరిచయం చేస్తూ దర్పంగా అన్నాడు. "ఈవిడ పేరు వాణి-ఎవరో చెప్పక్కరలేదుగా" అన్నాడు తన మిత్రులతో నవ్వుతూ.
వాణి అందరివంకా చూస్తూ నమస్కారం పెట్టింది. మగవాళ్ళలో ఇద్దరు నమస్కరించారు. ఇద్దరు వాణి నమస్కారం అందుకున్నట్టు తలలాడించారు దర్పంగా. ఆడవాళ్ళిద్దరూ వాణిని చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని కళ్ళతో సౌజ్ఞలు చేసుకున్నారు.
ఆ వాతావరణంలో ఒక్కక్షణం నిలబడాలనిపించలేదు వాణికి. వెంటనే వెళ్ళిపోవాలో వద్దో తేల్చుకోలేక సందిగ్ధంగా నిలబడిపోయింది.
రాజారావు వాణి ఇబ్బంది చూసి వాచి చూసి "భోజనాల ఏర్పాట్లు చూడు- అన్నీ ఏర్పాట్లుచేసి కబురంపు" అన్నాడు యింక వాణిని వెళ్ళమన్నట్టు సౌజ్ఞ చేస్తూ.
బతుకుజీవుడా అని గదిబయటపడింది ఒక్క అంగలో.
వాణి గడప దాటిందో లేదో "మైగాడ్? ఏమిటి బాబూ ఆ మనిషి- పందొమ్మిదో శతాబ్దంలోలా వుంది...ఎలా నచ్చింది రాజా? చూస్తూ చూస్తూ ఎలా పెళ్ళాడుదామనుకుంటున్నావు యిలాంటి ఆవిడమృగాన్ని "మరొక ఆమె హేళనగా అంది.
"మైడియర్ షీలా- భార్యలు యిలాంటివారయితేనే హాయి....ఏదో వంట గింట చేసుకుంటూ పిల్లల్ని కంటూ యింట్లో పడుంటారు మనకి ఎదురు చెప్పకుండా - బయట నీలాంటి వాళ్ళుండగా నాకేం లోటు చెప్పు" రాజారావు జోక్ చేస్తున్నట్టు పగలబడి నవ్వాడు.
"కరెక్ట్ మైబాయ్ -మన రాజాకి ఎంతైనా అనుభవం వుంది- మొదటిసారి పాఠం నేర్చుకుని జాగ్రత్తపడ్డాడు ఎంతైనా తెలివైనవాడు. మహా పవిత్రంగా పనికొచ్చేదాన్ని సంపాదించాడు" మరోడు విట్టు వేశాడు.
"ష్-ష్- కాస్త నెమ్మది ఇంకా పెళ్ళవలేదు నాయనా, పిట్ట బెదిరిపోగలదు" అన్నాడు రాజారావు రహస్యంగా.
అంతా మరోసారి పగలబడి నవ్వారు.
తన ప్రసక్తి రాగానే గుమ్మం అవతల ఆగిపోయిన వాణి ఈ మాటలు వింటూ మాన్పడిపోయింది. సిగ్గుతో, అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది.
'ఛీ...ఛీ....వీళ్ళూ నాగరికులు-తను అనాగరికురాలట! ఈ రాజారావుకి ఎంత ధైర్యం? పెళ్ళాం అనేది వంటకోసం, పిల్లల కోసం అని ఎంత ధైర్యంగా తెగేసి చెప్తున్నాడు- ఆ వచ్చినవాళ్ళలో ఒక ఆమెతో ఇతనికి సంబంధం వుందన్న మాట-ఎంత ధైర్యంగా యింటికి తీసుకువచ్చాడు! హు అందుకే యిదంతా సహించలేక పద్మావతి వెళ్ళిపోయి వుంటుంది. నయమే-తను ముందుగానే తెల్సుకుంది-చచ్చినా ఈ రాజారావుని పెళ్ళాడదు తను- జరిగింది చాలు- యింక ఆలోచించడానికి ఏం లేదు-వెంటనే వెళ్ళిపోవాలి- రేపటి దాకా కూడా అక్కరలేదు. వీలయితే యీ రోజే వెళ్ళాలి' వాణి పెదాలు బిగబట్టి స్థిరంగా నిర్ణయించుకుంది.
భోజనాలకి అంతా టేబిల్ చుట్టూ చేరారు.
ఏమిటేమిటో మాట్లాడుకుంటూ, విరగబడి నవ్వుకుంటూ, హాస్యాలాడుకుంటూ ఒకగంట భోంచేశారందరూ ప్రతివాళ్ళూ తాగివున్నారని అందుకే వాళ్ళ మాటలు ఆ వివరాలు అని అన్పించింది వాణికి- వాళ్ళని చూస్తూ అట్టే సేపు భరించలేక మేడమీదకి వెళ్ళిపోయింది-తనుండి చేసేది కనబడలేదు.
అంతా భోజనాలు చేసి వాళ్ళకోసం ఏర్పాటుచేసిన గదుల్లో విశ్రమించారు. తిరిగి మళ్ళీ మూడు గంటలనించి గోల ఆరంభం, కాఫీలు మళ్ళీ పేకాట. ఈసారి పాటలు, చప్పట్లు కేకల జోరు మరింత ఎక్కువయ్యాయి- గదిలో కూర్చున్నా రాను రాను ఎక్కువవుతున్న ఆ గోల భరించలేకపోయింది వాణి-