రాజారావు తీక్షణంగా "నోర్ముయ్- చూస్తూంటే నీకు ఆ కిషోర్ మీద మహామోజు పుట్టినట్లుందే- వాడి సంస్కారం, మంచితనం అంతలో బోధపడిపోయిందా నాల్గు రోజుల్లో" హేళనగా ఎకసెక్కంగా అన్నాడు.
రాజారావుతో యింకా మాటలు పెంచాలంటే అసహ్యం అన్పించింది- కళ్ళు మూసుకుని సీటు వెనక్కి జారగిలబడింది.
కారు యింటికి చేరేసరికి ఎదురుచూడని మరో దుర్ఘటన ఎదురయింది వాణికి- కిషోర్ పంపగా ఉత్తరం పట్టుకుని వచ్చిన మనిషి వరండాలో రాఘవులుతో మాట్లాడుతున్నాడు. రాజారావు వాణి కారు దిగి వచ్చి రాఘవులు చేతిలో కాగితం చూసి "ఏమిటిది?" అన్నాడు రాజారావు ప్రశ్నార్ధకంగా చూసి.
"కిషోర్ బాబు.... అమ్మగారికిమ్మని పంపారు! ఈ ఉత్తరం" అన్నాడు రాఘవులు బెదురుగా.
రాజారావు చటుక్కున వాణి చేతిలోని కాగితం లాక్కున్నాడు వాణివంక అనుమానంగా చూస్తూ- వాణి మొహం వెల వెల బోయింది.
రాజారావు డ్రాయింగు రూములోకి వచ్చి ఉత్తరం చదివాడు.
"వాణిగార్కి-మీ తమ్ముడు సత్యం వచ్చాడు-మీరు కోరినట్లు రెండువేలు యిచ్చి పంపాను- నెమ్మదిగా వీలు వెంబడి ఆ అప్పు తీర్చవచ్చు- మీరు గాభరా పడకండి. అన్నీ సర్దుకుంటాయి-మీకు సహాయపడగలిగినందుకు సంతోషిస్తూ" -మీ కిషోర్.
ఉత్తరం చదవగానే రాజారావు మొహం జేవురించింది- మెట్లెక్కి పైకి వెళ్ళబోతున్న వాణిని 'ఆగు' అని గద్దించి ఆమె మీదకి ఆ కాగితం విసిరి "ఏమిటిది; నీకెంత ధైర్యం? నా వెనకాతల యింత నాటకం ఆడతావా, నాకంటే నీకు ఆ కిషోర్ ఎక్కువయ్యాడా? వాడితో ఉత్తరాలా మీ కిషోర్ ట! ఏమిటీ ప్రేమలేఖలు? రాజారావు రంకెలు వాణి చెవిలో సగమే దూరాయి- కిషోర్ ఏం రాశాడో చదువుకుంది-ఆరాటంగా అందులో అభ్యంతర కరమైనదేం లేదనీ తెల్సుకున్నాక రాజారావు వంక నిబ్బరంగా చూసింది.
"ఆగండి, ఇది ప్రేమలేఖ కాదన్న సంగతి మీకు తెలుసు. డబ్బవసరం నాది- అది మీరు యియ్యలేనపుడు మరొకరిద్వారా ఆ సహాయం పొందడంలో ఏం తప్పు వుంది, యిందులో మిమ్మల్ని అవమానించింది ఏముంది?" వాణి కూడా తీక్షణంగానే అడిగింది.
అప్పటికే పని వాళ్ళంతా గుమ్మాలచాటున నిలబడి వినోదం తిలకిస్తున్నారు.
"నోర్ముయ్-యింకా తప్పేం వుందని అడుగుతున్నావు నేను వుండగా ఆ ముష్టి వెధవని డబ్బడిగితే యింక ఆ వెధవకి పట్టపగ్గాలుంటాయా- నాకంటే నీకు వాడు ఎక్కువయ్యాడా-ఇది అవమానించడం కాదా?" కోపంగా హుంకరించాడు.
వాణికి యింకేం మాట్లాడాలనిపించలేదు- మాట్లాడిన కొద్దీ అతను రెచ్చిపోయి కిషోర్ ని తిట్టడం మినహా ఏం ప్రయోజనం లేదు. అందుకే మౌనంగా ఓసారి రాజారావుని చూసి మేడ ఎక్కేసింది.
తరువాత అనసూయమ్మ వాణిని పిలిచి సంగతి అడిగి తెలుసుకుంది- ఎటూ చెప్పలేక ఆవిడ బాధగా నిట్టూర్చింది.
రేపొక్క రోజు యిక్కడ గడిపి యింటికెళ్ళగానే తల్లికి చెప్పేయాలి- మామయ్యతో యీ సంబంధం వద్దని కబురంపాలి .....ఇటువంటి ఆలోచనలతో అశాంతిగా పరువు మీద రాత్రంతా దొర్లింది వాణి-అన్నింటికంటే తనగురించి కిషోర్ ఎలాంటి అపోహపడుతున్నాడో నన్నదే ఆమెని ఎక్కువ బాధించింది.
* * *
ఉదయంనించి రాజారావు స్నేహితుల రాకకోసం ఏర్పాట్లు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. డ్రైవరు సిటీ నించి సోడాలు, విస్కీ బాటిల్సు తెచ్చాడు. కారు వాళ్ళ కోసం వెళ్ళింది.
ఇంట్లో వంటలు స్పెషల్ గా ఆరంభమయ్యాయి. కోడి మాంసం, చేపల వేపుడు మటన్ వగైరాల మాంసాహారం ప్రత్యేకం తయారుచేయడానికో వంటవాడు వచ్చాడు.
"ఇదేమిటి మాంసం అదీ వండుతున్నారు యింట్లో?" అంది వాణి ఆశ్చర్యంగా సీతమ్మతో.
సీతమ్మ అదోలా నవ్వి "బాబుగారి స్నేహితులు వస్తున్నారంటే ఇవన్నీ తప్పవు" అంది.
"అయ్యగారూ తింటారా?" అంది ఆశ్చర్యంగా వాణి.
"ఆహా-అయ్యగారు ఎప్పుడూ తింటారు పైకి వెళ్ళి నప్పుడల్లా-పెద్దమ్మగారు యింట్లో వండడానికి యిష్టపడరని యిక్కడున్న నాల్గురోజులు తినరు. పెద్దమ్మగారు లేకపోతే యింట్లోనే వండించేవారు అయ్యగారు" సీతమ్మ వివరించింది.
వాణి ప్రమేయం లేకుండానే అలవాటయినట్లు నౌకర్లు చకచక ఏర్పాటులు చేసుకుపోతున్నారు.
రాజారావు మామూలుగా తన టైముకి ఎనిమిది గంటలకి లేచాడు. రాత్రి సంగతి మరిచిపోయినట్లు వాణిని నవ్వుతూ పలకరించాడు.
"పదిగంటలకల్లా తయారవు, వాళ్ళంతా వస్తారు" అన్నాడు కాఫీ తాగుతూ.
అంతలో కోపం, అంతలో ప్రసన్నతి ఏమిటీ మనిషి వైఖరి? అన్ని మాటలు నిన్న అని ఈ పూట ఎంత తేలిగ్గా పలకరిస్తున్నాడో నని ఆశ్చర్యపోయింది వాణి.
పదిగంటలకి కారులోంచి బిలబిలలాడ్తూ అరడజను, మంది-నలుగురు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు దిగారు మేడమీద గది కిటికీలోంచి వాణి కుతూహలంగా చూసింది.