Previous Page Next Page 
సాహసి పేజి 28


    నుదుటున, భుజాల మీద విభూతి రేఖలు- మెడలో రుద్రాక్షమాల- పట్టుపంచె కొత్త అవతారంలో కపాలేశ్వర్ విచిత్రంగా ఉన్నాడు. ఆశ్చర్యంగా చూసింది అతనివేపు ఇందుమతి.

    "గిరిజనులు మనల్ని చూసి భయపడకుండా ఉండాలంటే ఇలాంటి వేషం తప్పనిసరి లేకపోతే నిన్న రాళ్ళతో కొట్టారు. రేపు బాణాల్తో కొట్టిస్తేనో" భయంగా అన్నాడు కపాలేశ్వర్.

    వైశాలి నవ్వింది అతని మాటలకు.

    "మీరయితే వేషం మార్చారు మేమెలా మార్చడం" నవ్వుతూ అంది వైశాలి.

    "ఎవరు... ఎప్పుడు... ఏ వేషం వెయ్యాల్సి వస్తుందో... పోనీ యువరాజూ... రైట్... రైట్..." హుషారుగా అన్నాడు ముత్యాలనాయుడు. జీపు కదిలింది వెనకసీట్లో కురవ భీముడు పక్కన నిల్చున్న రాఖీ పళ్ళ నిండా రక్తం తడి ఇంకా ఆరలేదు. అందరిలోనూ ఏదో తెలీని ఉద్విగ్నత గూడు కట్టుకుంది.


                  *    *    *    *


    దారంతా బూర్జ చెట్లు, కుంకుడు చెట్ల మయం. ఎగుడు దిగుడు రాళ్ళతో కూడుకున్న దారి.

    తుప్పల్లోంచి మేకదవడ పూలు చిత్రంగా మెరుస్తూ కన్పిస్తున్నాయి. స్వచ్చమయిన ఉదయపు అడవి వాసన- పూల నుంచి కారుతున్న తేనె వాసన- చెట్లు ఊపిరి పీల్చుకుంటున్న పచ్చని వాసన- ఆహ్లాదంగా ఉన్నాయి పరిసరాలు.

    "మనం జింకల తోపులోకి ప్రవేశిస్తున్నాం- తర్వాత వెదురు వనం-"  చెప్పాడు కురవభీముడు. మరికొద్ది నిమిషాలకు జీపు ఆ వనంలోకి ప్రవేశించింది. జింకల తోపు నిజంగా జింకలతోపే. జీపు శబ్దానికి అటూ ఇటూ పరుగెడుతున్న వందలకొద్దీ జింకల, రకరకాల జింకల, రంగు రంగుల జింకలు...

    జింకల తోపుకి ఎడమవేపున ఎవరో తవ్వినట్టుగా ఒక అర ఎకరం మేర గోతులు... ఎర్రమట్టి గోతులు.

    "ఏంటా గోతులు..." అడిగింది ఇందుమతి.

    "యువరాజూ జీపాపు" గార్డు భీముడు మాటతో జీపు ఆపాడు యువరాజు. గబుక్కున భీముడు జీపులోంచి దూకి ఆ గోతుల దగ్గరకు వెళ్ళి ఎర్రమట్టి ముద్దని తీసుకొచ్చి చిన్న చిన్న ఉండలుగా చేసి మనిషి కొకటి ఇచ్చాడు.

    "తినండమ్మా... చెపుతాను" జీపులో కూర్చుంటూ అన్నాడు భీముడు.

    "ఉదయాన్నే మట్టి తినిపిస్తావేంటయ్యా..." అంది ఇందుమతి నవ్వుతూ.

    "మామూలు మట్టి కాదు... తీపిమట్టి... తిని చూడండి" గోళీకాయ ల్లాంటి ఆ మట్టిని అందరూ నోళ్ళలో చాక్లెట్టలా పెట్టుకున్నారు.

    "హౌ స్వీట్స్... ఇటీస్... భలేగుందే?" అంది వైశాలి.

    "ఈ ఏరియాలోని మాట్టే... ఎందుకో తియ్యగా ఉంటుందమ్మా! మా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళం ఈ మట్టిని తీసికెళ్ళి టెస్టింగ్ కి పంపాం. రిపోర్టింకా రాలేదు. గిరిజనులు ఎలా రుచిమరిగారో తెలీదు. ఎన్నేళ్ళుగా తింటున్నారో తెలీదు. అవి నిజంగా తవ్విన గోతులు కావమ్మా... సంతలకొచ్చే గిరిజనులు మనిషో మట్టిముద్ద తీసుకోగా ఏర్పడిన గోతులు"

    చెప్పాడు గార్డు కురవభీముడు.

    "ఇక్కడ మట్టే తియ్యగా వుంటే... నీళ్ళెలా ఉంటాయో?" ఆశ్చర్యంగా అన్నాడు యువరాజు.

    "ఇక్కడ నీళ్ళు విషం. ఏ నీళ్ళు కన్పిస్తే ఆ నీళ్లు తాగకూడదు జాగ్రత్త" చెప్పాడు భీముడు.

    "వైశాలీ... నువ్వు కెమేరా తెచ్చావు కదూ..." అడిగింది ఇందుమతి.

    "తెచ్చాను" అంది వైశాలి ఎందుకో అర్ధంకాక.

    "ఇకనుంచి ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్ ని, ఇంపార్టెంట్ సీన్ నీ ఫోటో తియ్యడం నీవంతు దేన్నీ మిస్ కాకూడదు" అంది ఇందుమతి.

    "ఓ.కే. ఇందూ" అంది వైశాలి కెమేరాని బయటకు తీస్తూ.

    ఒకటీ, అరా గిరిజన గ్రామాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి.

    జట్లు- జట్లుగా వెళుతున్న గిరిజనులు జీపుని చూసి భయంతో పొదల్లో దాక్కుని, జీపు వెళ్ళిపోయాక అలా బొమ్మలా నిలబడిపోయి చూస్తున్నారు.

    "వెదురు వనం దగ్గర జీపు ఆపు. నేను, జీపు అక్కడ ఆగిపోతాం" బాంబుని పేల్చాడు గార్డు భీముడు.

    "ఏం?" అడిగాడు యువరాజు ఆశ్చర్యంగా.

    "డీప్ ఫారెస్ట్ అక్కణ్ణించే ఆరంభం. కొండలు, గుట్టలు, లోయలూ అక్కడ నుంచి నడవాలి. జీపు ఇకపై కదలదు" చెప్పాడు కురవభీముడు.

    వైశాలి గుండెల్లో రాయిపడింది.

    "పులులుంటాయా అక్కడ?" నీరసంగా అడిగిందామె.

    "పులులు కాదు... మనకు తెలీని వ్యక్తులుంటారు. అసలయిన ట్రైబల్స్ అడవి. ఎవరైనా వెదురువనం నుంచి లోనికెళ్ళడానికే జంకుతారు" చెప్పాడు గార్డు.

    "వెదురువనం ఇంకా ఎంతదూరం?" అడిగింది ఇందుమతి.

    చెప్పాడు గార్డు.

    "ఏనిమల్ హంటింగగైనా, ట్రజర్ హంటింగైనా ప్రారంభమయ్యేది అక్కడి నుంచే" విశ్వరూపశర్మ చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది ఇందుమతి.

    హేండ్ బుక్ లోని మ్యాప్ ని తీసి ముఖ్యమైన ప్రదేశాల్ని చూసుకుంటున్నాడు కపాలేశ్వర్.

    అక్కడకు యాభయ్ కిలోమీటర్ల దూరంలోనే వుంది వెదురువనం.


                   *    *    *    *


    నిర్విరామంగా డ్రైవ్ చేస్తున్నాడు యువరాజు.

    వెదురువనం దగ్గర పడుతోందంటే ఏదో భయంగా వుంది వైశాలికి.

    దట్టమైన అడవి కావడంతో ఎండ వేడి తెలియడంలేదు.

    రెండు కొండల మధ్య నుంచి ఇరుకైన దారి- డ్రైవింగ్ చాలా కష్టంగా వుంది యువరాజుకు. ఏమాత్రం అటూ ఇటూ పోయినా మరిక మిగిలే పనేలేదు. దారికడ్డుగా నెమళ్ళ గుంపులు... కొన్ని వేల నెమళ్ళు. ఆకాశంలోని ఒక భాగం అలా నేలమీదకు వచ్చి వాలినట్లుగా అంతంతీసి ఫించాల్తో ఎగురుతూ, ఆడుతూ నెమళ్ళు హడావిడిగా వెళ్ళిపోతున్నాయి.

    వెదురువనం నెమ్మదిగా దగ్గరపడింది. ఎత్తయిన కొండ ఒడ్డున జీపుని ఆపాడు యువరాజు.

    కింద పెద్ద లోయ. లోయలోకి దిగి మళ్ళీ ఎక్కితే మరో కొండ. ఒక్కొక్కరూ జీపు దిగుతున్నారు.

    జీపు చుట్టూ చూసింది ఇందుమతి. సూర్యుడు కనపడని దట్టమైన అడవి.

    ఉదయం పదకొండు గంటల టైమ్ లోనే సాయంత్రం ఆరుగంటల్లా వుంది.

    "యువరాజూ! జీపునెక్కడైనా ఏ రహస్య ప్రదేశంలోనో పెట్టు. దానిపై ఆకులు కప్పేస్తే ఎవరికీ కనబడదు. అందరూ టిఫిన్ లవీ చేసేస్తే సామాన్లు మూటలు కట్టుకోవచ్చు. ఇక్కడ్నించి అందరూ అప్రమత్తంగా వుండాలి. బండరాయి మీద కూర్చుంటూ చెప్పాడు కురవభీముడు.

    "ముందు టిఫిన్ ల సంగతి చూడండి. తర్వాత మిగతా కార్యక్రమం దీనమైన వైశాలి ముఖంవేపు చూస్తూ అంది ఇందుమతి.

    ఓ చెట్టువారన టార్పాలిన్ పరిచాడు యువరాజు. అడవి అరటి ఆకులు కోసి తెచ్చాడు ముత్యాలనాయుడు.

    టిఫిన్ లయ్యాక తను వెనక్కి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కురవభీముడు "కనిపిస్తున్న కోనని కపాలకోన అంటారు. కొండెక్కి దిగి... పది కిలోమీటర్లు నడిస్తే ఆ కోన వస్తుంది గిరిజన రాజ్యానికి ఈ వెదురు వనమే సరిహద్దు. కపాలకోన దగ్గరనుంచి వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి. వారి సాంప్రదాయాల్నీ, ఆచారాల్నీ మన్నించేవార్నే వారు గౌరవిస్తారు- సహాయం చేస్తారు. లేని పక్షంలో వీడు మనకు శతృవు అని గుర్తించే పక్షంలో నిర్దయగా చంపేస్తారు- జాగ్రత్త-

    అలాగే- ఇక్కడ కొండరెడ్ల గిరిజన తెగలో రెండు జాతులు వున్నాయి. వాళ్ళు పరమ కర్కోటకులు. రెండు తెగలకూ ఇద్దరు నాయకులు ఉంటారు. వాళ్ళని మంచి చేసుకుంటే మంచిది. వాళ్లు మనల్ని నమ్మాలంటే వాళ్ళు పెట్టే పరీక్షల్లో మనం నెగ్గాలి అంతే- ఇమ్మీడియట్ గా ఎదురయ్యేవాళ్ళు... వీళ్ళు... తర్వాతం ఏం ఎదురవుతాయో... అంతా మీ అదృష్టం మీద ఆధారపడి వుంటుంది" చెప్పాడు భీముడు.

    "కంచూరువాక ఎక్కడ?" సడన్ గా ఏదో గుర్తుకురాగా అడిగింది ఇందుమతి.

    "కపాలకోనకి పదిమైళ్ళ దూరంలో వుంది" చెప్పాడతను.

    హేండ్ బేగ్ లోంచి వందరూపాయల నోటు తీసిచ్చింది ఇందుమతి. 

    కళ్ళకద్దుకుని, అందరివేపూ చూసి యువరాజు భుజంమీద చెయ్యి తట్టి గబగబా పెద్ద అంగాలు వేసుకుంటూ వెనుదిరిగి కొండదారి పట్టాడు గార్డు కురవభీముడు.

    రెండు కిలోమీటర్లు వెనక్కి వచ్చేసాక, ఇందుమతితో చెప్పాలనుకున్న ఒక విషయం జ్ఞాపకానికొచ్చింది కురవభీముడికి.

    అది-

    "కుందేళ్ళను కుక్క చంపలేదని... ఎవరో చంపి తెచ్చి అక్కడ పడేశారని..."

    ఎవరు చంపారో, ఎందుకు చంపారో అతనికే తెలీదు. ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా ఉండమని చెపుదామనుకున్నాడు. వీలు కాలేదు....


                   *    *    *    *


    గంట గడిచింది.

    'జీపులోని పెద్ద పెద్ద సామాన్లని మూడు భాగాలుగా, చిన్న చిన్న సామాన్లను రెండు భాగాలుగా చేశాడు యువరాజు.

    కొండవార లోయలో దట్టమైన పొదలమధ్య జీపునుంచి, లాక్ చేసి దానిపై ఆకులు, అలములు కప్పేసాడు. అక్కడో జీపుందని చెప్తేనేగాని ఎవరూ పోల్చుకోలేరు.

    సరిగ్గా పదకొండు గంటలైంది-

    "ప్రయాణం... మొదలెడదామా... చీకటిపడే టైమ్ కి లోయ దిగి కొండెక్కితే బాగుంటుంది. లేకపోతే పురుగూ- పుట్రా-" అన్నాడు ముత్యాలనాయుడు.

    "పురుగూ- పుట్రా అంటే..." అడిగింది వైశాలి.

    "అంటే... మనిషికి కనబడకుండా తిరిగే పురుగులన్న మాట... మన ఎదురుగానే ఉంటాయి కానీ పోల్చుకోలేం..." భయపెట్టడానికి అన్నాడు యువరాజు.

    "అంటే... పులుల్లో కూడా దెయ్యాలుంటాయా..." గుండెలమీద చేతులేసుకుంటూ అడిగింది వైశాలి.

    ఆ చేతులవేపు చూస్తున్నట్లుగా గుండెలవైపు చూసి, మనసులోనే నిట్టూర్చాడు కపాలేశ్వర.

 Previous Page Next Page