"నువ్విక ఈ జన్మకు మారవు! చీటికి మాటికి నా మీద అలిగి పుట్టింటి కెళతావు! నెలలకొద్దీ అక్కడేకూర్చుని వస్తూ వస్తూ ఏవేవో కొనిపించి పట్టుకొస్తావ్ !యూ....యూ"
"ఏం, తెచ్చుకుంటే తప్పా? ఎవరి దగ్గర తెచ్చుకుంటున్నానేటి? మా అన్నయ్య దగ్గరేగా?" నిర్లక్ష్యంగా అన్నది.
"ఎంతసేపూ నీ గురించిన ఆలోచనలే. అవతలవాళ్ళ పరిస్థితుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? వాడు ఒట్టి సెంటిమెంటల్ పూల్. అందుకే నీ ఆటలు సాగుతున్నాయ్! నేనైతేనా? నీ చెల్లెల్ని...."
"ఇంత మాత్రానికే ఎందుకండీ అంతేసి మాటలంటారు" ఏడుపు గొంతుతో అన్నది సరోజ.
"ఇది చిన్న విషయమా? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడంలేదు. అయిందేదో అయింది. రేపు మీ అన్నయ్యకు నిజం చెప్పి క్షమాపణ వేడుకో!"
సరోజ మౌనంగా కళ్ళు తుడుచుకుంది.
"ఏం మాట్లాడావ్? ఆ గాజులు తిరిగి ఇచ్చెయ్!"
"ఎందుకేమిటి?" బొంగురుపోయిన కంఠంతో అన్నది గారాలుపోతూ.
"ఎందుకా? అది కూడా నేనే చెప్పాలా? ఇన్నేళ్ళు వచ్చే ఆ మాత్రం ఆలోచించలేవూ?"
"ఎందుకండీ ఊరికే తిడతారూ?" దాదాపు ఏడుస్తూ.
"ఇన్నింటికీ గాజులు ఇచ్చేస్తావా లేదా?"
"మాట్లాడవేం అవి అతని భార్య గాజులు, భార్య గాజులు తెచ్చి చెలెలు కివ్వడానికి అతనికి బుద్ధిలేకపోతే పెట్టుకోవడానికి నీకైనా వుండాలి ఛ! ఏం మనుషులు!"
"తీరాతెచ్చాక తిరిగిచ్చేస్తే అన్నయ్య బాధడడూ? సాగదీసింది.
"అన్నయ్య బాధగురించి ఆలోచించే దానివైతే ఇలా ప్రవర్తిస్తాతావా? నీ బాధంతా గాజుల్ని తిరగి ఇచ్చెయ్యడానికి మనసు రావడంలేదు."
"అనండి! అనండి! ఎన్నైనా అనండి! మీకూ ఓ చెల్లెలు వుంటే తెలిసివచ్చేది మీరేదైనా మీ చెలెలికి ఇస్తే, ఆమె తిరస్కరిస్తే బాధపడరా?"
"చస్తే బాధపడను. నా పెళ్ళాం చేతిగాజులు లాక్కెళ్ళి చెలెలికి ఇచ్చేంతటి మూర్ఖుణ్ని కాదు నేను. తోడబుట్టిన వాళ్ళను ఎంతవరకు ఎలా ఆదరించాలో నాకు తెలుసు. వెధవ సెంటిమెంట్లకి బానిసనై బాధ్యతల్ని విస్మరించను" అతని కంఠం ప్రవక్తకంఠంళా మోగింది.
సరోజ వెక్కి వెక్కి ఏడవ సాగింది.
"ఛీ! మాట్లాడితే నీళ్ళకుండ నెత్తిన వుంటుంది. ఒక్కసారి ఆలోచించు. నీ గాజులు తీసుకెళ్ళి మా పిన్ని కూతురికి ఇస్తే ఊరుకుంటావా? కమలను స్వంత చెల్లెలిగా నే ప్రేమిస్తున్నాను. కానీ గుడ్డిగా కాదు. నాకు బాధ్యతలు తెలుసు. ఎవర్ని ఎంతవరకు ఆదరించాలో తెలుసు"
"అనండి! అనండి!" వెక్కిళ్ళు పెద్దవైనాయ్!
ఊర్కో! ఏడవకు! నేను చెప్పేదాన్ని గురించి కొంచెం ఆలోచించు! ఆ గాజులు రేపు మీ అన్నయ్యకు ఇచ్చేయ్! పాపం ! మీ వదిన ఎంత పడుతుందో? ఇచ్చేస్తావా? ఏడవకు"
"ఇవ్వను!" వెక్కిళ్ళు మధ్యనే ఖచ్చితంగా అన్నది సరోజ.
"ఇవ్వవూ?" గట్టిగా అన్నాడు హరికృష్ణ.
తలఊపింది.
"అయితే సరే! రేపు మీ అన్నయ్య వెంట వెళ్ళిపో మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు. ఈ గడపలో కాలు పెట్టకు" దృఢంగా పలికింది అతని కంఠం.
సరోజ ఏడుస్తూ కూర్చుంది. సమాధానం ఇవ్వలేదు.
"నీ ఉత్తరం చదివి మీ అన్నయ్య ఎంత గాబరాపడి పరుగెత్తుకొచ్చాడో ఆలోచించావా? భార్యతో ఎంత గొడవపడి వచ్చాడో!"
"తప్పంతా మీదే!" అన్నది సరోజబెక్కుతూ
"నా తప్పా? నేనేం చేశాను? మీ అన్నయ్యకు అలాంటి ఉత్తరం రాయమన్నానా?"
"మీరు పందెం వెయ్యలేదూ? అందుకే ఆ ఉత్తరం రాశాను. మా అన్నయ్యకు నా మీద ఎంత ప్రేముందో చూపించడానికే ఆ ఉత్తరం రాశాను"
"సరే! నాదే తప్పని ఒప్పుకుంటున్నాను. మరి ఆ గాజులు ఇచ్చేస్తావా?"
సరోజ మాట్లాడలేదు. ఆలోచనలో పడింది.
మాట్లావేం? చివరి సారిగా ఒకేమాట చెబుతున్నాను జాగ్రత్తగా ఆలోచించుకో! నీకు నేను కావాలో ఆ గాజులు కావాలో నిర్ణయించుకో!"
సరోజ కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది.
"నీకు ఆ గాజులే కావాలికదూ? సరే!" అంటూ దిగ్గున లేచి నిల్చున్నాడు హరికృష్ణ.
"నాకు గాజులు అక్కర్లేదు, మీరే కావాలి! అంటు సరోజ హరికృష్ణ చెయ్యిపట్టుకుంది.
"మరి రేపు" ఆ గాజులు ఇచ్చేస్తావా?
"ఆ ముష్టిగాజులు నా కెందుకూ? పైగా అవి ఆవిడగారు పెట్టుకొని అరిగిపోయిన గాజులు!"
హరికృష్ణ భార్య ముఖంలోకిచూస్తూ "సరోజ ఎప్పటికైనా మారుతుందా?" అనుకున్నాడు.
సత్యనారాయణ ఆపై మాటలు వినిపించలేదు.
చెలెలి మాటలు సత్యనారాయణ గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. కంకరరాళ్ళలా తగిలాయి.
ఛీ! ఏం ఆడవాళ్ళు!
తన చెల్లెలు ఎంతో అమాయకంగా కన్పించే తన చెలెలేనా....తనను చదరంగంలోని పావునుచేసి ఆడుకుంటోంది? అమాయాకంగా కన్పించే తన చెల్లెలు ఇంత నాటకం ఆడిందా?"
తన దీనికోసం ఎంత నాటకం ఆడిందీ?
ఎంత వ్యధను అనుభవించాడు!
ఎంత ఆవేదనకు గురి అయ్యాడు!
తన భార్యను కొట్టాడు.
అవమానించాడు.
కాళ్ళకు చుట్టుకొన్న పిల్లవాడ్ని ఈసడించాడు.
ఎందుకు? ఈ చెల్లెలి కోసమేగా?
ఇంతకాలం చెల్లెలు మెగుడ్ని గురించి చెప్పినవన్నీ కట్టు కథలేనా? నను పిచ్చి వాణ్ని చేసి ఆడించిందా?
మరణశయ్య మీద వున్న తల్లికి వాగ్దానం చేశాడు.
తల్లి తనను వాగ్దానంతో బంధించింది, అనురాగబంధం తన పాలిటి నాగబంధం అయిందా?
ఇంతకాలం తను బంధాలమధ్య నలిగిపోయాడు ఒక వైపు వివాహంబంధం, మరోవైపు రక్తసంబంధం, ఈ రెంటి మధ్య నగిలిపోతూ బాధ్యతల్ని కూడా విస్మరించాడు. హరి అన్నట్టు తనునిజంగా సెంటిమెంటల్ పూలే!
భార్యతో ఎంత గొడవ పడ్డాడు?
ఆ గాజులు పెళ్ళాన్ని తన్ని మరీ తెచ్చాడు.
ఆమె నగల్ని చెప్పకుండా, దొంగతనంగా తెచ్చాడు. తన చెల్లెలికోసం తనింట్లోనే తను దొంగగా మారాడు.
తను ఎంత మానసికవ్యధకు గురై అంత పనిచేశాను? రెక్కలు కట్టుకొని చెల్లెలి ముందు వాలాడు.
చెల్లెలి సుఖంకోసం తను చేసింది ఏమిటి?
తనకు ఎదురైంది ఏమిటి?
"ఆ ముష్టిగాజులు నా కెందుకూ?" అంటుందా?
మొగుడు బాధపెడ్తే అన్నయ్య కావాలా?
చివరికి మొగుడూ పెళ్ళాం ఒకటే! బయటివాడూ! చెడ్డవాడూ తనే! హరిమంచివాడు! ఆ భార్యతో వాడు కాబట్టే కాపరం చేస్తున్నాడు.