Previous Page Next Page 
బంధితుడు పేజి 27


    సరోజకు అదేం పట్టినట్టులేదు. గాజులు చేతులకు తొడుక్కొని ఆనందంగా చూసుకుంది.

    సరోజ బలవంతం మీద సత్యనారయణ తలంటు స్నానం చేశాడు.

    బావమర్ధులు యిద్దరూ వేడివేడి గారెలు తింటూ కబుర్లలోకి దిగారు.

    సత్యనారాయణకు ఉన్నట్టుండి పద్మా, పిల్లలూ గుర్తొచ్చారు. నోట్లో వున్న గారెముక్క చేదుగా అన్పించింది.

    పద్మ పండగ చేసిందో లేదో? చేసి వుండదు పిల్లలు బిక్కముఖాలు వేసుకొని వుంటారు.

    "ఏదన్నా పనిమీద వచ్చావా? మేమురావాల్సిందే గాని నువ్వు సాధారణంగా రావే పని లేకపోతే?" సాలోచనగా అడిగాడు హరి.

    "అబ్బే ఏమీలేదు, చూసిపోదామని వచ్చాను.."

    "పది రోజులు కూడా కాలేదు మీ చెల్లెలువచ్చి! ఇంతలోనే చెల్లెలు గుర్తొచ్చిందా? అదీ పండగపూట వచ్చావ్!"

    "అన్నయ్యా! వదినా, పిల్లలూ కులాసాగావున్నారా? మాట మారుస్తూ అడిగింది సరోజ!

    "ఆఁ! అన్నాడు సత్యనారాయణ పరధ్యానంగా.

    సత్యనారాయణకు దిగులుగా వుంది. పద్మ మాటిమాటికీ గుర్తు రాసాగింది.

    పద్మ దీపాలు పెడుతుందా?

    పిల్లలచేత మందుసామాను కాల్పిస్తుందా? మందుసామాను కాలుస్తూ కేరింతలు. మేనల్లుడ్నీ, చేల్లెల్నీ చూస్తుంటే, పద్మా, పిల్లలూ దీనంగా చేకతిని చూస్తూ  నిల్చున్నట్టుగా ఊహచిత్రం కళ్ళముందు కదిలింది.

    ఆ రాత్రి పడుకున్న తర్వాత సత్యనారాయణ మధన పడసాగాడు.

    ఏమిటిది?

    తనేం చూస్తున్నాడు?

    హరి భార్యను బాధపెడ్తున్నట్టు ఎక్కడా కన్పించడంలేదు.

    వాళ్ళిద్దరూ ఎంత ఉత్సాహంగా, అన్యోన్యంగా వున్నారు?

    మరి సరోజ తనకు అలాంటి ఉత్తరం ఎందుకు రాసింది?

    హరి చెప్పే రాయించాడా?

    ఇద్దరూ కలిసి ఆడిన నాటకమా ఇది?

    అనుమానం (అవమానం) తాలూకు పిచ్చి పిచ్చి  ఊహలు అతని మనసును కుమ్మరి పురుగులా తోలచసాగినయ్.

    ఏమైతేనేంలే?

    తన చెల్లెలు సంతోషంగా వుంది! తనకు అంతకంటే ఏం కావాలి?

    అతని హృదయం తృప్తితో నిండిపోయింది.

    కాని ఆ తృప్తి చాటునుంచి ఏదో సన్నని బాధ ప్రారంభమైది.

    పండగపూట పిల్లలు ఎలా వున్నారో? పద్మ ఎలా....? ఏమయినా తను పద్మ  నగలు తెచ్చి మంచి పని చెయ్యలేదేమో? పద్మకు అసలే పట్టుదల ఎక్కువ! ఎట్టా వుందో!

    ఆఁ అదంతా తన పిచ్చికాకపోతే ఏమిటీ ఆలోచనలు? అందరూ బాగానేవుంటారు.

    కాని అనవసరంగా వున్నవీ లేనివీ ఊహించుకొని తనే బాధ పడ్డాడు.

    సరోజను గురించి పిచ్చిపిచ్చి ఊహలతో ఎంత దారుణంగా బాధ పడ్డాడు తను?

    హరిలో తనకే మార్పు కన్పించడం లేదు. ఎప్పటిలాగే వున్నాడు.

    కాని సరోజ! తను ఉత్తరంలో చూసిన చేల్లెల్నే  ణా తను యిక్కడ చూస్తూంది?

    ఇద్దరూ ఎంత అన్యోన్యంగా, చిలకా గోరింకల్లా వున్నారు మరి తన కెందుకు అలాంటి ఉత్తరం రాసింది?

    బహుశా హరి తనముందు నటిస్తున్నాడేమో? ఎంతకయినా తగినవాడు.

    తన చెల్లెలే అమాయకురాలు.

    పక్క గదిలోనుంచి కిలకిల నవ్వులూ గాజులచప్పుడూ.

    సత్యనారాయణ ఆలోచనలు ఆగిపోయాయి.

    ప్రక్కగదిలో నుంచి వస్తున్నా సంభాషణ వినాలని  వినకపోయినా వినిపిస్తూనే వుంది.

    "అది సరేగాని! మీ అన్నయ్య ఉన్నట్టుండి పండగ పూట ఎందుకు వచ్చినట్టు?" అన్నాడు హరికృష్ణ.

    మా అన్నయ్యకు ణా మీద ప్రేమలేదన్నారుగా? ఇప్పుడు తెలిసిందా మా అన్నయ్యకు నేనంటే ఎంత ఇదో!"

    "నేను నీమీద మీ  అన్నయ్యకు ప్రేమలేదన్నానా? ఎప్పుడు?' ఆశ్చర్యంగా అడిగాడు హరికృష్ణ.

    "అనలేదూ? ఈ రోజు సినిమా- అదే అన్నా చెలులు సినిమా- చూసిన రోజు ఏమన్నారు?"

    "ఓ అదా? వట్టి ట్రాప్ ! వెధవ సెంటిమెంటు. అన్ని త్యాగాలు -కష్టాలూ--చెలెలికోసం జీవితాన్ని- చివరికి ప్రాణాల్ని ఒదులుకోవడం కన్నపిల్లల్ని కూడా గాలికి ఒదిలేయ్యడం.....సినీమాల్లోనే కాని నిజజీవితంలో వుండదాన్నాను వాస్తవానికి దూరంగా తీసే సినిమాలంటే నాకు అసహ్యం అన్నాను."

    "అప్పుడు నేను, ఎందుకుండరూ? అలాంటి అన్నయ్యలు వుంటారనీ, మా అన్నయ్య నాకోసం ఏమైనా చేస్తాడనీ అన్నాను. అప్పుడు మీరు నన్ను ఎగతాళి చేశారు. నేను పందెం కూడా వేశాను. నేనే గెలిచాను. నాకు వందరూపాయలు యివ్వాలి ఇవ్వండి" తన ధోరణిలో గలగలా మాడ్లాడేసింది సరోజ.

    "ఏమిటి అలా తెల్లబోయి చూస్తారు?"

    అదంతా మీ అన్నయ్యకు రాశావా?"

    "అది రాయలేదు"

    "మరేం రాశావు?"

    "ఏదో ఒకటి రాశాను. అది మీకు అనవసరం. నేనే పందెం గెలిచాను! ణా ఉత్తరం చూడగానే మా అన్నయ్య ఆ సినీమాలో అన్నయ్యలాగే రెక్కలు కట్టుకొని నాముందు వాలిపోయాడు"

    హరికృష్ణ మౌనంగా భార్య ముఖంలోకి చూశాడు ఓ క్షణం.

    "సంతోషించాలే! అసలు ఇన్నింటికీ ఏం రాశావో చెప్పు."

    "బలే ఉత్తరం రాశాను! కథల్లో సినిమాల్లో రాసే ఉత్తరం లాంటిదే రాశాను తెలుసా? మీరునన్ను కాల్చుకు కుంటున్నారానీ, ఈ మధ్య కొట్టటం కూడా ప్రారంభించారానీ రాశాను."

    "నేను కొట్టానా?"

    "అలా రాస్తేగాని మా అన్నయ్య పరుగెత్తుకురాడుగా? మరి  మా అన్నయ్యకు నామీద వున్న ప్రేమను మీకు చూపించడం ఎలా?"

    "మరి ఆ గాజులు..."

    "అదే నాకు వదిన గాజులులాంటివి వేసుకోవాలని వుందనీ, మిమ్మల్ని చేయించమంటే నన్ను అవమానించి కొట్టారని రాశాను. మా అన్నయ్య ఒట్టి పిచ్చివాడు. నా మీద వల్లమాలిన అభిమానం! డబ్బు సమయానికిలేదేమో వదినగాజులు తెచ్చాడు. మా వదిన సంగతి నాకు బాగా తెలుసు, తను  మనస్ఫూర్తిగా ఇచ్చి వుండదు. చాలా పెద్ద  రగడే జరిగి వుంటుంది. మరి చూశారా! మా అన్నయ్యకు వదినకంటే నా మీదే ఎక్కువ ప్రేమ! అచ్చం ఆనాటి సినీమాలో అన్నయ్యలాగా...."

    "ఛీ! నువ్వు మనిషివేనా? మనుషుల మంచితనాన్ని ఈ విధంగా నీ స్వార్థంకోసం ఉపయోగించు కోవడానికి సిగ్గులేదూ! పైగా  నిన్ను కన్నబిడ్డలూ చూసుకొనే అన్నయ్యను అబద్దాలతో మోసం చేస్తావా?' కస్సున లేచాడు హరి.

    "ఇందులో మోసం ఏముందీ? నాకు అలాంటిగాజులు వేసుకోవాలని వుంది. మీరేటూ చేయించలేరు. మా అన్నయ్య యివ్వా తగడా? నేను తీసుకో తగనా?" ఆమె కంఠంలో గర్వం తొంగిచూసింది.

 Previous Page Next Page