యోగి తన సీటుకేసి వెళ్ళిపోయాడు.
శ్రీధర్ ఫైల్స్ పరిశీలించడంలో లీనమైపోయాడు. అంతలో ఫోను మోగింది. రిసీవరు ఎత్తాడు.
"పాపం ఎంతటి వేదనికి గురవుతున్నావో కదా..." ఆ మాటలు విని అప్రతిభుడయ్యాడు శ్రీధర్. అది అపరిచితురాలి నుంచి వచ్చిన కాల్...ఆఫీసు ఫోన్, వుద్యోగం, చిరునామా కూడా తెలుసుకుందన్న మాట! సామాన్యమయినది కాదీ పిల్ల... ఘటికురాలే అనుకున్నాడు శ్రీధర్.
"ఈ పోకిరి పిల్ల సామాన్యురాలు కాదు...మహా గడుసుది అని అనుకుంటుంటావ్ నా గురించి, అవునా...?" కిలకిలా నవ్వుతూ అందామె ఫోన్ కి ఆవేపు నుంచి.
ఒక్క క్షణం ఉలికిపాటుగా సీట్లోంచి కదిలాడు శ్రీధర్.
"నేను నువ్వనుకుంటున్నట్లుగా గడుసుదాన్ని కావచ్చేమో కాని... గొప్ప తెలివితేటలు గలదాన్ని మాత్రం కాదు..."
ఏం సమాధానం చెప్పలేక శిలలా బిగుసుకు పోయాడు శ్రీధర్.
"నీలాంటివాళ్ళే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటుంటారు. రాత్రి నీ దగ్గరకొచ్చిన పిల్లాడ్ని వదిలేసి - ప్రొద్దుటే ప్లేగ్రౌండ్ కెళ్ళి, అల్లరి పిల్లల దెబ్బకి బలైపోయావ్ కదా? గాల్లో బాణాలు వదలటం అన్నది ఎప్పుడూ సత్ ఫలితాలివ్వదు. అవతల వ్యక్తులు అమాయకులైనప్పుడు, ఏమరుపాటుగా వున్నప్పుడు మాత్రమే బాణం ఫట్ మని తగులుతుంది. పదేపదే వదిలే గాలి బాణాలు గాల్లోనే వృధా అయిపోతాయి. అవునూ... ఎప్పుడూ ఆటోలో వెళ్ళే నువ్వు ఈ రోజేంటో మెట్రోలైనర్??? పరిసరాల మీద ఓ కన్నేసి నా ఆచూకీ తెల్సుకుందామనా?" చిన్నగా నవ్వుతూనే అడిగిందామె.
ఉక్రోషం వుప్పెనలా ముంచెత్తింది శ్రీధర్ ని.
ఫోన్ డిస్ కనెక్ట్ అయిందావేపు.
సాయంత్రం ఐదింటికి ఆఫీసునుంచి బయటపడ్డారు యోగి, శ్రీధర్. దగ్గర్లో వున్న కేఫ్ కెళ్ళి చెరో ఎగ్ పఫ్ తిని టీ తాగారు. శ్రీధర్ బిల్ పే చేశాడు. అక్కడ్నుంచి నడుచుకుంటూ రోడ్డు దగ్గరకొచ్చి, ఆటోఎక్కి థియేటర్ కెళ్ళారు.
మరో పది నిమిషాల్లో థియేటర్ చేరుకున్నారిద్దరూ. థియేటర్ వద్ద జనం రద్దీగా వున్నారు. ప్రేమలేఖ యువతరం అంతరంగాల్లో సంచలనం సృష్టిస్తున్న చిత్రమని నగరమంతా ఒకటే టాక్.
యోగి బాల్కనీ కౌంటర్ దగ్గరికెళ్ళి రెండు టిక్కెట్లు పట్టు కొచ్చాడు. థియేటర్ లోపలికి ప్రవేశించారు. షో బిగినైంది. సినిమా చూస్తున్న యోగి ప్రతి సీన్ కీ పులకరించసాగాడు. చిత్ర దర్శకుడి ప్రతిభను తనకిష్టమొచ్చినరీతిలో పొగిడెయ్యసాగాడు.
అతనీ సినిమాకు అంతకుముందే చూశాడేమో రాబోయే సీన్ ని కూడా విడమర్చి చెప్పేస్తున్నాడు. శ్రీధర్ కి చిర్రెత్తుకొచ్చింది. అతిగా స్పందించడాన్నీ, అతిగా పొగడటాన్నీ ఇష్టపడని శ్రీధర్ అసహనంగా ఫీలయ్యాడు. యోగి ప్రవర్తనపట్ల దాదాపు విసుగొచ్చిందతనికి. "రేయ్... సినిమా బాగుందనే కదా నేను వచ్చింది. నీ చెండాలపు కామెంట్స్ తో మంచి సీన్ ని ఎందుకురా పాడుచేస్తావ్... మనశ్శాంతిగా చూడనీ...రా...
అసలు నీతో సినిమాకి రావడం నాదే బుద్ధి తక్కువ" అన్నాడు ఒకింత కోపంగా.
ఆ దెబ్బతో యోగి నోరుమూసుకొని చూడసాగాడు.
అరగంట గడిచింది.
సినిమాలో దేవయాని, హీరో కోసం ఫోన్ చేస్తూ అవస్థపడే సీన్ జరుగుతోంది. సరీగా అప్పుడు గుర్తొచ్చింది శ్రీధర్ కి అపరిచితురాలు, ఫోన్ చేస్తానని చెప్పిన సంగతి. వెంటనే యోగికేసి చూశాడు. అతను సినిమా చూడ్డంఓ విలీనమై వున్నాడు. "రేయ్! నేను ఫ్లాట్ కెళ్ళిపోతున్నా" అన్నాడు శ్రీధర్. "ఏంట్రా...ఏమైంది? ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతా నంటున్నావ్...? మంచి సినిమా, చూడరా బాబూ" యోగి అన్నాడు.
"లేదురా...అపర్ణ ఫోన్ చేస్తుంది. ఎలాగైనా రిసీవ్ చేసుకోవాలి. నువ్వు చూసిరా...నే వెళతాను."
"సరే నీ యిష్టం...ఈ సినిమాని మధ్యలో వదిలిపెట్టబుద్ధవట్లేదు" అన్నాడు యోగి.
శ్రీధర్ థియేటర్ నుంచి బయటపడ్డాడు.
* * * *
ప్రేమ అనేది పెళ్ళికి ముందు సూర్యోదయంలాగా, పెళ్ళయిన తరువాత సూర్యాస్తమయంలాగా కనిపిస్తుంది తన క్లాస్ మేట్ నిర్మలనుంచి మధ్యాహ్నం ఆఫీసుకి ఫోన్ వచ్చినప్పుడు యోగి అన్న మాటలు గుర్తుకొచ్చాయి శ్రీధర్ కి.
వాటి గురించే ఆలోచిస్తూ చేతివాచీకేసి చూసుకొని కంగారుపడిపోయాడు.
అప్పటికే ఏడయిపోయింది. తను సరిగ్గా 7-30కి ఫోన్ చేస్తానంది. ఆ టైమ్ కి తను ఫోన్ దగ్గర ఠంచనుగా వుండితీరాలి అన్న ఆలోచన అతన్ని నిలవనీయలేదు. అప్పుడే అటుగా వెళుతున్న ఆటోని ఆపి అతను అన్యాయమైన ఫేర్ అడిగినా, ఒప్పేసుకొని, ఆటో ఎక్కేశాడు శ్రీధర్.
* * * *
కారిడార్లో పరిగెడుతూనే వాచికేసి చూసుకున్నాడు.
7:29:30
కేవలం అరనిమిషమే వుంది. అనుకుంటూనే వేగం పెంచి డోర్ దగ్గరకు చేరుకొనేసరికే లోపల్నించి ఫోన్ రింగవుతున్న శబ్దం వినిపించింది.
జేబులోంచి సేఫ్టీలాక్ తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఫోన్ రింగవుతూనే వుంది.
అదంత తేలిగ్గా ఓపెన్ అయ్యే లాక్ కాదు.
చిరాకుపడిపోతూ కంగారుకి లోనవుతూ, దాన్ని తెరిచే ప్రయత్నం చేస్తూనే తనని తాను నిందించుకున్నాడు యోగి పిలవగానే సిన్మాకి వెళ్ళి నందుకు.
మొత్తానికి రెండు నిమిషాలు నిర్విరామంగా ప్రయత్నించాక డోర్ ఓపెన్ అయింది.
అంతే... ఆ మరుక్షణం రాకెట్ లా ఫోన్ వద్దకు దూసుకు పోయాడు.
అలుపు తీర్చుకొనే ప్రయత్నం కూడా మానుకొని ఫోన్ కోసం చేయి చాపుతుండగానే ఫోన్ రింగవ్వటం ఆగిపోయింది.
చాపిన చేతిని వెనక్కి తీసుకొని నుదురు రుద్దుకున్నాడు అసహనంగా. అప్పుడు టైం 7:32:20.