Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 26


    సమీపంలో వున్న ఫ్యాన్సీ షాపులోకి వెళ్ళి ముగ్గురికీ మూడేసి హార్లిక్స్ చాక్లెట్స్ కొని పెట్టాడు. వాళ్ళు శ్రీధర్ వేపు నవ్వి, అభినందనగా చూసి, చాక్లెట్ తింటుంటే తిరిగి అడిగాడు శ్రీధర్ ఆశగా.

 

    "ఆ పాతాళభైరవి క్యాసెట్ ఇచ్చిన అమ్మాయి ఎక్కడుంటుంది? క్యాసెట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావమ్మా... కైలాస్... అభిషేక్ నాకు తెలుసు మీరు చాలా మంచివాళ్ళు, ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్ మి. సరేనా...?"

 

    "మరి...మాకు ఫ్రూటీ కావాలి..." అడిగాడు అభిషేక్ అనే కుర్రాడు.

 

    చిర్రెత్తుకొచ్చింది శ్రీధర్ కి.

 

    వాళ్ళిద్దర్నీ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేయాలన్నంత కోపం వచ్చిందతనికి.

 

    అపరిచితురాలి జాడ కనుక్కుంటానని విసిరినా సవాల్ గుర్తొచ్చి ఆ పని చేయలేక పోయాడు. మరేం మాట్లాడకుండా కూల్ డ్రింక్ షాపులో కెళ్ళి అందరికీ ఫ్రూటీలు కొనిచ్చాడు. ఒకర్నొకరు చూసుకుంటూ, నవ్వుకుంటూ ఆనందంగా ఫ్రూటీలు తాగేశారు వాళ్ళు, ఆత్రంగా మళ్ళీ అడిగాడు శ్రీధర్-

 

    "చెప్పండ్రా...బాబూ మీకు దండం పెడ్తా....రాత్రి మీలో క్యాసెట్ తీసుకొచ్చి యిచ్చిందెవరు?" అన్నాడు కోపాన్ని దిగమింగుకొని.

 

    "క్యాసెట్ లేదు...గీసెట్ లేదు...పదండిరా వెళ్ళిపోదాం... హేయ్.... అంటూ పరుగులు పెట్టారు వాళ్ళు.

 

    తనని ఫూల్ చేసి వాళ్ళలా పరుగులు తీయడంతో ఫూల్ అయినట్టు ఫీలయ్యాడు శ్రీధర్.

 

    'తననెవ్వరూ గమనించలేదు కదా' అనుకొని చుట్టూ చూశాడు. ఎవ్వరూ చూళ్ళేదన్న అభిప్రాయానికొచ్చి అక్కడ్నుంచి కదిలాడు తిన్నగా. రోజూ ఆఫీసుకు ఆటోలో వెళ్ళేవాడు ఆ రోజెందుకో బస్సులో వెళ్ళాలనిపించి బస్టాపుకెళ్ళి మెట్రోలైనర్ ఎక్కాడు.

 

    విండో పక్కనున్న సీట్లో కూర్చున్న శ్రీధర్ అటూ ఇటూ చూసుకున్నాడు...ఎవరన్నా ఫాలో చేస్తూ గమనిస్తున్నారేమోనన్న సంశయం నుంచి అతనింకా తేరుకోలేదు. అసహనంగా ఫీలవుతూనే అంతర్లీనంగా తనను తాను పరిశీలించుకున్నాడు. ఎంత విచిత్రం...? తను కూర్చున్న ఆ బస్సు తమ కంపెనీ మ్యానుఫాక్చర్ చేస్తున్న ప్రొడక్ట్ లో ఒకటని అతనికి తెలుసు.

 

    అయినా బస్సులో వున్న ఎంతోమంది ప్యాసింజర్ల మధ్య ఒక సామాన్యమైన పౌరుడిగా, గుప్తంగా కూర్చుని వున్నాడతను. బస్సు స్పీడ్ అందుకుంది. అతనిలో రేగుతున్న ఆలోచనలకీ, అసహనానికీ అడ్డుకట్ట వేస్తూ ప్యారడైజ్ స్టేజి దగ్గర ఆగింది బస్సు...అక్కడ దిగి, అక్కడ్నుంచి ఆఫీసుకేసి నడిచాడు.


                                                      *    *    *    *


    టేబుల్ మీదున్న ఫైల్స్ తెరచి మార్కెటింగ్ తాలూకు లెక్కలు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సంస్థకి రావాల్సిన బ్యాలెన్సింగ్ వివరాల గురించి పరిశీలిస్తున్నాడే కానీ రాత్రి ఫోన్లో అపరిచితురాలు జరిపిన సంభాషణ, పాతాళభైరవి క్యాసెట్ ని కుర్రాడి చేత పంపించిన వుదంతం, ఉదయానే పిల్లల దృష్టిలో భంగపడిన వైనం- అన్నీ అతని మెదడులో గిర్రున తిరుగుతున్నాయ్.

 

    "ఏమిట్రా శ్రీధర్! ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాడిలా డల్ గా వుంటావ్? కాస్త యాక్టివ్ గా వుండొచ్చు కదరా..." శ్రీధర్ దగ్గరికి రావడంతోటే అన్నాడు యోగి.

 

    "నీకేం తెలుస్తాయిరా నా బాధలు... ప్రేమను పెంచుకున్న ప్రేయసేమో దూరమై వేధిస్తుంటే ఆచూకీ చిక్కని చిన్నదేమో పదేపదే ఫోను చేసి సవాల్ చేస్తోంది. నా పరిస్థితేంటో స్పష్టంగా నాకే తెలియట్లేదు..." నిట్టూరుస్తున్నట్లుగా అన్నాడు శ్రీధర్.

 

    వాళ్ళ సంభాషణకి అడ్డుకట్టవేస్తూ సరిగ్గా అపుడే రింగయింది ఫోను. రిసీవరు ఎత్తాడు శ్రీధర్.

 

    "నీకేరా ఆపరేటర్ కనెక్ట్ చేసింది...మద్రాస్ నుంచట" అంటూ యోగికి ఫోనందించాడు శ్రీధర్.

 

    యోగి ఒక్క క్షణం ఆలోచించి ఫోనందుకుని "హలో...నిర్మలా నువ్వా హౌ ఆర్యూ..."

 

    అతని కళ్ళల్లో కాంతిరేఖలు విచ్చుకోవడం గమనించాడు శ్రీధర్.

 

    "ఎన్నాళ్ళకి నీ మాటలు వినే భాగ్యం కలిగింది నిర్మలా" అతని కంఠంలో ఎప్పుడూలేని ఆత్రం తొణికిసలాడింది.

 

    "నన్ను మరిచిపోయి వుంటావనుకున్నాను...."

 

    "నీ మనసులో నాకింకా స్థానం కల్పించి నా ప్రేమను పదిలపరిచావంటే నిజంగా నేనెంతో అదృష్టవంతుడ్ని నిర్మలా...?"

 

    "ఏంటి హైదరాబాద్ వచ్చేస్తున్నావా....?

 

    "ఓ.కె. హార్టీ వెల్ కమ్..." ఫోన్ పెట్టేశాడు యోగి.

 

    "ఎవర్రా ఆ అమ్మాయి?" అడిగాడు శ్రీధర్.

 

    "నా డ్రీమ్ గర్ల్. డిగ్రీలో నా క్లాస్ మేట్...నేను నిర్మలని గాఢంగా ప్రేమించాను. ఆమె కూడా నన్నలాగే ప్రేమించింది. మా ప్రేమ పెళ్ళివరకు వచ్చేసరికి మత విబేధాలూ, పెద్దల పట్టుదలలూ ఆస్తి అంతస్తుల తేడాలు అడ్డొచ్చాయి. సహజంగా మెతక మనసున్న నిర్మల వాటన్నింటిని ఎదిరించడానికి సాహసించ లేకపోయింది....

 

    తదనంతరం మద్రాసులో పేరున్న ఒక బిజినెస్ మాగ్నెట్ తో ఆమె వివాహం జరిగిపోయింది. ఒకరికి అంకితమైపోయిన నిర్మలను నాటి నుంచి పట్టించుకోవడం మానేశాను. ఆమె జ్ఞాపకాలను మర్చిపోవడం కోసం... కొత్త అమ్మాయిలతో పరిచయాల కోసం అన్వేషించడం అలవాటు చేసుకున్నాను. ఎంతయినా మొదటి ప్రేమ మొదటి ప్రేమే..."

 

    కాసేపు ఆగాడు యోగి.

 

    అతని కళ్ళల్లో ఎప్పుడూ నిజమైన, నిండైన ఆనందాన్ని గతంలో చూడలేదు శ్రీధర్. పైగా కుండబ్రద్దలు కొట్టినట్టు చెప్పుకుపోతున్న అతనిలో కొత్త యోగిని చూస్తున్నాడు శ్రీధర్.

 

    "నేనెలా తిరిగినా ఎంతమంది అమ్మాయిలతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నా, హికార్లు తిరిగినా ఆమె జ్ఞాపకాల అలలు మాత్రం నా హృదయ సంద్రంలో అలజడిని రేకెత్తించేవి..."

 

    ఎప్పుడూ చలాకీగా, ఫన్నీగా, ప్రేమ గురించి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని యోగి గుండె వెనుక ఇంతటి ప్రేమ దాగుందా...? అనుకొని ఆశ్చర్యపడ్డాడు శ్రీధర్.

 Previous Page Next Page