Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 26


    ఆమె మౌనంగా తలూపింది.
    కె.యస్.ప్రకాష్ ఆనందంతో పొంగిపోయాడు.
    "కానీ" అందామె.
    "మళ్ళీ కానీ ఏమిటి?"
    "మా అమ్మగారు మన పెళ్ళికి ఒప్పుకోవాలి!"
    "ఓశ్...అంతేనా? ఇప్పుడే మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడాలా?"
    "మా అమ్మ కాళ్ళ మీద పడిన వాళ్ళనల్లా ఆశీర్వదించే రకం కాదు. ఆమె కాళ్ళమీద రోజుకి పాతిక జంటలు పడుతుంటాయి. అయినా ఆమె కేర్ చేయదామె."
    "అదేమిటి? రోజూ ఆమె కాళ్ళమీద పడే ఆ పాతిక జంటలూ ఎవరు?"
    "తమ పిల్లలకు లోయర్ కే.జి. సీట్ కావాలని అడిగేవాళ్ళు."
    "కానీ లోయర్ కే.జీ.సీట్లు కావాలంటే స్కూళ్ళకు వెళ్ళి ప్రిన్సిపాల్ కాళ్ళమీద పడాలి. మీ మదర్ కాళ్ళమీద పడితే ఏం లాభం?"
    "మా అమ్మగారు కూడా ఓ పెద్ద స్కూల్ కి ప్రిన్సిపాల్ కాబట్టి"
    "ఆ! అలాగా! ఆమె పేరేమిటి?"
    "కల్పనారాయ్."
    "ఆ...ఆ...కల్పనారాయ్ మేడమ్ మీ అమ్మా?"
    "అవును ఆ పేరు విన్నారా మీరు?"
    "వినటం ఏమిటి? నా చెవు ఆమె చేతిలో ఆరేళ్ళుంది"
    సుష్మ పగలబడి నవ్వేసింది. "అయితే మన పని చాలా సులవయిపోతుందేమో."
    "థాంక్యూ" అంటూ వారిద్దరి దగ్గరకూ వచ్చి అరిచాడు ఓ లావుపాటి వ్యక్తి నల్ల డ్రస్ లో. సుష్మ, ప్రకాష్ ఇద్దరూ ఉలిక్కిపడి లేచి నుంచుని ఆ వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూశారు. "ఎందుకండీ థాంక్స్!" అంది సుష్మ.
    "అదే... ఎక్కడా కట్స్ లేకుండా ఒకటే టేక్ లో లాగించేశారు కదా సీనంతా!" అన్నాడతను ఆనందంగా.
    "సీన్ లాగించటమేమిటి?"
    "అదే... రెండేళ్ళ క్రితం మిగిలిన డ్రామా తాలూకు సీన్ షూటింగ్ చేయాలి కదా! మీరు రిహార్సల్ చేస్తున్నారని మాకు తెలుసు. అయినా గానీ ప్రయత్నిద్దాం అని మీకు తెలీకుండా కెమెరా ఆన్ చేయించాను. డైలాగ్స్ బాగా బట్టీ పట్టేసినట్లున్నారు మీరు. అందుకని ఒక్క తప్పు కూడా రాలేదు. ఎక్స్ ప్రెషన్ కూడా ఇద్దరివీ చాలా బాగా వచ్చాయ్! థాంక్యూ! ఇక మీరు వెళ్ళిపోవచ్చు."
    "మైగాడ్! మేము మాట్లాడుతోంది డ్రామా డైలాగ్ లనుకున్నారా? కాదండీ! పరస్పర విషయాలు మాట్లాడుకుంటున్నాం."
    అతను నవ్వాడు "జోక్ లేయకండి సుష్మాజీ! దూరదర్శన్ అంటే మరీ అంత తెలివితక్కువ వాళ్ళలా కనిపిస్తున్నారా మీకు? వరకట్నాల గురించి మీరు మాట్లాడిన అంతంత పెద్ద డైలాగులు దూరదర్శన్ లో తప్ప పర్సనల్ టాక్ లో ఎందుకుంటాయ్? అదీగాక అతను జైహింద్ అని మాటలాడితే అనటం లేదూ? వారెవా! నన్నే జోక్ చేస్తున్నారా? నేనంత తేలిగ్గా దొరికే రకాన్ని కాదండోయ్ బాగా స్టడీ వున్నవాళ్ళం. గాలివాటం సరుకుకాదు" అనేసి క్యాసెట్ తీసుకుని వెళ్ళిపోయాడు.
    సుష్మ రెండు చేతులతో తల పట్టుకుంది. "మైగాడ్! నాకు అంతా అయోమయంగా వుంది! ఈ డ్రామా మిగిలిన భాగంలో నేనున్నమాట నిజమే గానీ హీరో ఇంకొకతనుండాలి, మరి మిమ్మల్ని హీరో అని ఎలా అనుకున్నారు? నాకేం అర్థం కావడం లేదు."
    ప్రకాష్ ఆ షాక్ నుంచి కోలుకున్నాడు "దీన్నే జన్మజన్మల బంధం అంటారు సుష్మాజీ! మన జంటను దూరదర్శన్ వాళ్ళు విడదీయటం సాధ్యంకాక కలిపేశారు. ఇంక మనం మీ ఇంటికెళ్ళి మీ మదర్ తో కూడా 'ఓ.కె.' అనిపించుకుంటే"
    "ఆల్ రైట్ పదండి" అందామె.
    ఇద్దరూ కట్ చేసేసరికి కల్పనారాయ్ కాళ్ళమీదున్నారు.
    "లోయర్ కే.జీ.సీట్స్...ప్లీజ్ గెటౌట్" అందామె వాళ్ళవంక చూడకుండానే.
    "మాక్కావలసింది సీట్ కాదు మేడమ్" అన్నాడు కె.యస్.ప్రకాష్.
    "అప్పర్ కేజీలో కూడా ఫుల్" అందామె.
    "మాక్కావలసింది జీవితంలో సీట్ మేడమ్."
    "ఒకేషన్ సీట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్లీజ్ గెటౌట్."
    "ఒకేషన్ సీట్స్ కాదు మేడమ్. జీవితం అనే కోర్స్ లో కాపురం అనే సీట్."
    అప్పుడు ఆమె అనుమానంగా కళ్ళజోడులో నుంచి కిందకు చూసింది. సుష్మ, కె.య.ప్రకాష్ లను చూసేసరికి ఉలిక్కిపడిందామె.
    "కె.య.ప్రకాష్! నువ్వా!" అతనిని చెవి పట్టుకుని లేపిందామె.
    "ఎస్ మేడమ్."
    "మీరిద్దరూ కలిసి వచ్చారేమిటి? ఐమీన్ మీరొకరికొకరు ఎలా తెలుసు?"
    "నిజానికి ఇంతకుముందు తెలీదండీ! ఈ మధ్యే తెలుసుకుని, ఒకరి నొకరు ఎక్కువగా అర్థం చేసుకుని, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని, ఆ తర్వాత అర్థం చేసుకుని అప్పుడు మీ దగ్గరకొచ్చామండీ"
    "స్టుపిడ్! చిన్నప్పటి జబ్బు ఇంకా పోలేదు. ఎవరికీ అర్థం కాకుండా మాట్లాడటం. సుష్మా ఏమిటిదంతా?"
    "అమ్మా సంగతేమిటంటే నేను వివాహం గురించి ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నీ నీకు చెప్పాను కదమ్మా! వాటన్నిటికీ ఇతను సూటవుతాడనిపించింది, అందుకని నీతో మాట్లాడటానికని తీసుకొచ్చాను" సిగ్గుపడుతూ అంది సుష్మ.
    "ఓహో! అలాగా!" అర్థం చేసుకుంటూ అంది కల్పనారాయ్.
    "అవునండీ! మోస్ట్ సూటబుల్ కాండిడేట్ సుష్మేనని అనిపించిందండీ! అంతేకాకుండా సుష్మను పెళ్ళి చేసుకోకుండా జీవితం గడపలేనని కూడా నా వుద్దేశ్యమండీ! అంతే కాకుండా..."
    "కె.య.ప్రకాష్" కోపంగా పిలిచిందామె.
    "ఎస్ మేడమ్!"

 Previous Page Next Page