సుష్మ ఇంట్లో నుంచి రోడ్డు మీద కొచ్చేసరికి ప్రకాష్ కారు కనిపించింది.
ఆమె ఆశ్చర్యపోయింది "మీరా..." అంది అతనివేపు చూసి నవ్వుతూ.
"అవునండీ! నేనే...భలే తమాషాగా వుంది కదూ! రోజూ సరిగ్గా ఇక్కడే మనం కలుసుకోవటం?" అన్నాడతను గంట నుంచీ అక్కడే వెయిట్ చేస్తున్న సంగతి చెప్పకుండా.
"అవును! అదే నేను సర్ ప్రైజ్ అవుతున్నాను."
"టెరిఫిక్ 'కో ఇన్సిడెన్స్' నేను సరిగ్గా టి.వి.స్టూడియోకి వెళ్ళేప్పుడు మీరూ టి.వీ. స్టూడియోకెళ్తూ ఇక్కడ కలవటం కదూ?"
"అవును! అంటే ఇప్పుడు మీరూ టి.వి.స్టూడియో కొస్తున్నారా?" మరింత ఆశ్చర్యంగా అడిగిందామె.
"చెప్పాను కదా! రాకపోతే వాళ్ళు బాగా ఫీలవుతారు. వెరీ గుడ్ ఛాన్స్."
"ఓ... మీ పాట రికార్డింగ్ వుంది కాబోలు."
"అహహ లేదు. ఐ మీన్ వుంది. అంటే వుందన్నమాట. పాటంటే పాట కాదు. కొంచెం అలాంటిదన్న మాట!"
"అలాంటిదింకేముంటుంది?"
"ఇంకా వాళ్ళకూ సరిగ్గా తెలీదన్నమాట...! ముందు మీరు మా స్టూడియోకొచ్చేయండి. తర్వాత ఏదొకటి చేద్దాం అన్నారు వాళ్ళు అందుకని వస్తున్నాను."
మామూలుగానే వాళ్ళ సంభాషణ వల్ల వాళ్ళ కారు వెనుక ఆగిపోయిన ట్రాఫిక్ సంఘం అధ్యక్షుడు ముందుకొచ్చి కొంచెం కోపంతో కూడిన సంజ్ఞలు చేశాడు. అది గ్రహించి ఇద్దరూ కారులో బయలుదేరారు.
దూరదర్శన్ ఆఫీస్ లు మామూలుగానే చాలా హడావుడిగా వున్నాయ్. న్యూస్ రీడర్ మామూలుగానే తను అనధికార పూర్వకంగా సెక్రటరీగా వున్న ఓ రాజకీయపార్టీ తాలూకు కొన్ని కార్యక్రమాలు కవర్ చేసుకురమ్మని అవుట్ డోర్ యూనిట్స్ ని ఆదేశిస్తున్నాడు.
ఆ పొజిషన్ రాజకీయ పార్టీలతో లింక్స్ వున్న అవుట్ డోర్ యూనిట్ ప్రొడ్యూసర్ ఎలాగయినా ఈ కార్యక్రమం కవరేజ్ టి.వి.లో రాకుండా వుండటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
అధికారపార్టీకి చెందినా ఓ సినిమా స్టార్ ని రెండు వందల పధ్నాలుగోసారి ఇంటర్వ్యూ చేయడానికి ఓ టి.వి. భట్రాజు పొగడ్తలతో ఓ ఇంటర్వ్యూ పుస్తకాల నిండా రాసుకుని కారిడార్స్ లో తిరుగుతూ బైహార్ట్ చేసుకుంటున్నాడు.
ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తే డైలాగులతో డ్రామాలు రాసే రచయితలు క్యాంటీన్ దగ్గర నిలబడి అప్పటికప్పుడు కొన్ని డైలాగులు అల్లి డ్రామా సెక్షన్ ప్రొడ్యూసర్ కి వినిపిస్తున్నారు.
స్టూడియోలోని ఫ్లోర్ లో రెండేళ్ళక్రితం సగం షూటింగ్ చేశాక మధ్యలో అధికార రాజకీయపార్టీ పడిపోవటం వలన ఆపేసిన డ్రామా తాలూకు మిగతా భాగం షూటింగ్ చేయడానికి లైట్స్ ఆన్ లైట్సాఫ్ అంటూ సందిద్ధమౌతున్నారు.
"నిజంగా జీవితమంతా ఇలా కళలకు అంకితమైపోతూ గడిపితే ఎంత బాగుంటుంది?" అంది సుష్మాసహానీ.
"అవును. నా కోరిక కూడా అదే" అన్నాడు కె.యస్.ప్రకాష్.
ఆమె ఆశ్చర్యంగా అతనివేపు చూసింది "నిజంగా జీవితం అంతా కూడా ఇలాగే కళాకారునిగా గడపాలనుకుంటున్నారా?"
"అవును సుష్మాజీ! చిన్నప్పటినుంచీ కూడా అదే ధ్యేయం నాది! కానీ అలా జరగాలంటే ముందు అదే ధ్యేయం గల జీవిత భాగస్వామిని దొరకాలి కదా?"
ఆమె అతని మాటలకు కొంచెం సిగ్గుపడింది. ఇద్దరూ రెండేళ్ళక్రితం సగం షూటింగ్ చేసిన డ్రామా తాలూకూ సెట్ మీదకొచ్చి ఒక కర్టెన్ వెనుక కూర్చున్నారు.
అందమైన పూలతోట పెయింట్ చేసి వుందక్కడ.
"అంటే మీరు కళారంగంలో వున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటున్నారా?"
"అవును. మరి మీరో?"
"నా ఉద్దేశ్యమూ అదే అనుకోండి. కానీ...."
"కానీ ప్రాబ్లం ఏమిటి?"
"అలాంటి వ్యక్తులెవరు దొరుకుతారు ఈ రోజుల్లో? కట్నం ఇవ్వలేని ఆడపిల్లను చేసుకోవడమే గగనం. దానికి తోడు జీవితమంతా కళలకు అంకితమౌతామనే భార్య కావాలని ఎవరు కోరుకుంటారు? అందుకే నిర్ణయించుకున్నా. అసలు వివాహమే చేసుకోకూడదని.
ప్రకాష్ కంగారు పడ్డాడు.
"ఆ! అలా నిర్ణయం తీసుకున్నారా? అన్యాయం సుష్మాజీ! మగాళ్ళలో ఎక్కువ భాగం కట్నాలను ప్రేమించే వాళ్ళుండవచ్చుగానీ అందరూ అలాంటివారంటే నేనొప్పుకోను. ఉదాహరణకు నన్నే తీసుకోండి!"
సుష్మ ఆశ్చర్యంగా అతనివైపు చూసింది "మరి మీ వాళ్ళు మీ ఆశయాలను హర్షించవద్దూ?"
"హు! మా వాళ్ళు? ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డల జీవితాలను శాసించే అధికారం, బలవంతపు మూర్ఖపు సంస్కార రహిత నిర్ణయాలను, సాంప్రదాయాలను మన మీద రుద్దే హక్కు వారికెక్కడుంది? నేను మా మావయ్యనెప్పుడూ లెక్కచేయను సుష్మా! బంగారు త్రాసులో ప్రపంచాన్నంతా ఒకవైపు, మిమ్మల్ని రెండో వైపూ వుంచితే నేను మిమ్మల్నే కోరుకుంటాను. బంధుమిత్రులతోనూ, మిత్రు బంధువులతోనూ కనక ధనరాసులతోనూ, రాసి దనకకాలతోనూ నాకు పనిలేదు సుష్మా! నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను. ఛస్తే రెండో పెళ్ళి చేసుకోను జైహింద్" అన్నాడు నిజంగానే ఆవేశంగా.
సుష్మ ఉలిక్కిపడింది "అదేమిటి? జైహింద్ అన్నారు ఆఖర్లో?"
"ఎలక్షన్ మీటింగ్స్ లో ఉపన్యాసాలను ట్రాఫిక్ జామ్స్ వల్ల చాలా సార్లు వినాల్సివచ్చింది. అందుకని కొంచెం ఎక్కువ మాటలు మాట్లాడినప్పుడల్లా ఆటోమేటిగ్గా 'జైహింద్' అని వచ్చేస్తోంది. ఏమనుకోకండి. మన పెళ్ళయిన ఆరు నెలల్లోగా ఈ అలవాటు మానుకుంటాను. జైహింద్"
ఆమె సిగ్గుపడిపోయింది. "మన పెళ్ళా?" అంది సిగ్గుగా.
"అవును సుష్మా! నేను ఆరో ఏట నుంచీ ఎదురుచూస్తున్న అమ్మాయి మీరే! నా జీవన జీవిత మృదు మధుర దివ్య విచరిత మానవ మహోజల త్రిపురాంత సదృశ్యకారుణ్య వినీల విచక్షణా విభావరి సులక్ష్య సంబోధనా సార్ధకత సంచేయినాత్మక శీలనారి మీరే!"
ఆమె తెల్లబోయింది. "అంటే?" అడిగింది అనుమానంగా.
"అంటే ఖచ్చితంగా అర్థం తెలీదనుకోండి! చాలా గొప్ప అర్థం వుండే వుంటుంది. టెన్త్ క్లాస్ లో నేర్చుకున్నానిది ఓ పాఠంలో. కాకపోతే తర్వాత మర్చిపోవటం వల్ల కొత్త పదాలు జాయినవటం, అసలయినవి మిస్సవటం జరిగిందన్నమాట. మరి మీ ఆహిప్రాయం ఏమిటి సుష్మాజీ? మీ చేతిని అందుకునే భాగ్యం నాకు కలిగిస్తారా?"