అన్ని న్యూస్ పేపర్లలోనూ ఈ వార్త మార్మోగిపోయింది.
రెండో రోజున విప్లవ్ కి సెన్సార్ ఆఫీసర్ నుంచి కబురు వచ్చింది.
"మీ సినిమా కేవలం రెండు కట్స్ తో రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది" అన్నాడు ఆఫీసరు.
వెంటనే బయటకు పరుగెత్తి "ఇంక్విలాబ్" అని అరిచాడు విప్లవ్.
అందరూ "జిందాబాద్" అని అరిచారు.
విప్లవం గెలిచిందీ
కుట్ర- ఓడిందీ
సెన్సార్ బోర్డ్ - డౌన్ డౌన్.
మారణహోమం - జిందాబాద్.
అందరూ కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సినిమా రిలీజయి రెండొందలు రోజులాడి ఇంకా ఆడేయసాగింది. వెంటనే రెండో సినిమా తీసేశాడు విప్లవ్.
ఒక మంచి రోజు చూసుకుని సెన్సార్ ఆఫీస్ కి టాక్సీలో చేరుకున్నాడు.
"హలో హలో హలో- విప్లవ్ గారా! రండి! కూర్చోండి" అన్నాడు సెన్సార్ ఆఫీసర్.
"మా 'అగ్ని కణం' సినిమా ఎగ్జిమినింగ్ కమిటీవాళ్ళు చూశారా?" అడిగాడతను.
"చూశారండి! నేనే మీకా విషయం ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చేశారు."
"ఇది కూడా 'బాన్' చేస్తున్నారు కదూ!"
"నో నో నో- లేదండీ! నో బాన్!" చిరునవ్వుతో అన్నాడు ఆఫీసర్.
విప్లవ్ అదిరిపడ్డాడు.
"ఏమన్నారు? బాన్ చేయడం లేదా?"
"లేదండీ! బాన్ చేయాలన్న ఐడియా అసలెవ్వరికీ రాలేదు-"
విప్లవ్ మొఖం పాలిపోయింది.
"ఇది అన్యాయం! అక్రమం" అంటూ టేబుల్ మీద గట్టిగా చరిచాడు.
ఆఫీసర్ అదిరిపోయి లేచి కుర్చీ వెనక్కు వెళ్ళి నిలబడ్డాడు.
విప్లవ్ కళ్ళముందు తన సినిమాను కొనడానికొచ్చిన జిల్లాలవారీ కొనుగోలుదార్లు కనబడుతున్నారు. తన సినిమా చూడ్డానికి తండోపతండాలుగా వచ్చిన జనం కనబడుతున్నారు-
"ఈ సినిమాకు సెన్సారోళ్ళు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చార్రా! అంటే చెత్త పిక్చరయి ఉంటుంది" అనుకుని జనం వెనక్కు వెళ్ళిపోతున్న సీన్ కళ్ళముందు కనబడుతోంది.
"అయ్యా మా జిల్లాకు రెండొందల అరవై రూపాయలకయితే కొంటాను" అంటున్నాడో కొనుగోలుదారు.
"ఏమిటీ రెండొందల అరవయ్యా! నీకేం మతిపోలేదు కదా!"
"అంతే గురూజీ! ఈ విప్లవాలు, గొడవలూ చాలా సినిమాల్లో ఉన్నాయి. మనక్కావలసింది అదికాదు. అదివరకులాగా "బాన్" చేయడం మీరు నానా గోఅవ చేయడం జరిగితే మంచి పబ్లిసిటీ అయి జనం చూడ్డానికొస్తారు" అనేసి వెళ్ళిపోయాడతను.
"ఇది అన్యాయం అంటున్నాను-" మళ్ళీ బల్ల గుద్దాడతను.
"ఏది అన్యాయం?" అయోమయంగా అడిగాడు సెన్సార్ ఆఫీసర్.
"మా సినిమా" అగ్నికణం బాన్ చేయాలని సజెస్ట్ చేయకపోవడం."
అప్పటికి గాని సెన్సార్ ఆఫీసర్ కి విషయం అర్థం కాలేదు. కానీ ఆశ్చర్యం నుంచి మాత్రం ఇంకా తేరుకోలేదు.
"కానీ మీ పిక్చర్ లో అభ్యంతరకరమయిన దృశ్యాలు, డైలాగులు ఏమీలేందే- "బాన్" ఎలా సజెస్ట్ చేస్తారు?"
"అభ్యంతరకరమయిన దృశ్యాలు ఏమీలేవా?" ఇంకా కోపంతో రెచ్చిపోతూ అన్నాడు విప్లవ్.
"లేవు అనే అంటున్నారు-"
"వాళ్ళకు మతిపోయి అంటున్నారు. లేకపోవడమేమిటి? సినిమా మొదట్నుంచీ చివరివరకూ ఉన్న సీన్లలో ముప్పై సీన్లు పరమ అభ్యంతరకరమైనవి. పోలీసులు- ఓ పిల్లల తల్లి రిపోర్టివ్వడానికొస్తే ఆమెను రేప్ చేయడం- ఆమె వాళ్ళ మీద రిపోర్టివ్వడానికి కలెక్టర్ దగ్గరకెళ్ళితే అతనూ రేప్ చేయడం- చివరకు మంత్రి కూడా ఆమెను రేప్ చేయడం- అప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడం- అది చూసి ఆమె తమ్ముడు కత్తి తీసుకుని వారందరినీ చంపడం- అక్కడితో ఆగక విప్లవ నాయకుడయి ప్రజల్ని సమీకరించి డబ్బున్న వాళ్ళనూ, ఆఫీసర్లనూ, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులనూ అందరినీ నరుక్కుంటూ వెళ్ళి- ప్రభుత్వాన్ని పడగొట్టి, అడ్డువచ్చిన మిలటరీని చిత్తుగా ఓడించి- కొత్త ప్రభుతం ఏర్పాటు చేయడం- ఇవన్నీ ఏమిటి? అభ్యంతరం కాదా? మాకే తెలుసా విషయం! కాదని మీరెలా అనగలరు?"
సెన్సార్ ఆఫీసరుకి చిరాకు పుట్టుకొచ్చింది.
"చూడండి! మా ఎగ్జామినింగ్ కమిటీ చెప్పాల్సిన విషయాలవి! వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాం గానీ - మీరు చెప్పినట్లెలా చేస్తాం?"
విప్లవ్ కొద్ది క్షణాలకు ఆవేశం అణచుకుని కుర్చీలో కూలబడిపోయాడు మళ్ళీ. జేబులోనుంచి కర్చీఫ్ తీసి చెమటను తుడుచుకున్నాడు.
"సరే- జరిగిందేదో జరిగింది! కట్స్ ఏమేం సజెస్ట్ చేశారు? అవయినా పదిహేనో, ఇరవయ్యో ఉన్నాయా?" అడిగాడతను.
క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నామండీ! కట్స్ కూడా ఎవ్వరూ సజెస్ట్ చేయలేదు- సినిమా నీట్ గా, చక్కగా ఉంటుందన్నారు అందరూ! ఇంకా కట్సెందుకు" చిరాగ్గా అన్నారు సెన్సార్ ఆఫీసర్.
దాంతో విప్లవ్ ఉగ్రుడైపోయాడు.
"ఇది అన్యాయం అని ఇందాకన్నాను గుర్తుందా? సెన్సార్ ఆఫీసర్ని అడిగాడతను.
"అవును! గుర్తుంది! ఎందుకు?"
"ఇప్పుడా మాట ఉపసంహరించుకుంటున్నాను. ఇది అన్యాయం కాదు- కుట్ర. నా పరువు ప్రతిష్టలు, నా భవిష్యత్తూ, నా సినిమా కలెక్షన్లు అన్నీ మంట కలపాలని మీరాడుతున్న నాటకం! దగా, మోసం-" బిగ్గరగా అరిచాడతను.
అతని అరుపులకి ఆఫీస్ లోని స్టాఫ్ అంతా పరుగుతో వచ్చారక్కడికి- "ఏమిటలా అరుస్తున్నారు?" అడిగారు వాళ్ళు.
విప్లవ్ వాళ్ళందరినీ చూసి మళ్ళీ స్పృహలో కొచ్చాడు.
"నేను గట్టిగా మాట్లాడానా?" వాళ్ళనడిగాడు అయోమయంగా.
"మాట్లాడడమేమిటి సార్! అరిచారు."
"అయామ్ సారీ!" వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ.
"ఇదిగో విప్లవ్ గారూ! ఇందాకటి నుంచీ చూస్తున్నారు మీ డైలాగులు నాకేమాత్రం అర్థం కావటం లేదు. మీ సినిమాకి క్లీన్ సర్టిఫికెట్ దొరుకుతుంటే సంతోషించక- బాన్ ఎందుకు చేయలేదు? కట్స్ ఎందుకు లేవు? ఇదంతా కుట్ర అంటారేమిటి?' విసుగ్గా అడిగాడు సెన్సార్ ఆఫీసర్.
విప్లవ్ శాంతించాడు. తను ఆవేశపడితే ఏమాత్రం లాభం లేదని అర్థమైపోయింది.
"అయ్యా! నేను ఇంతకుముందు తీసిన సినిమాకు మీరు ఓ పట్టాన సర్టిఫికెట్ ఇవ్వకపోవడం మూలాన ఆ సినిమాకు అది పబ్లిసిటీ అయింది. నా సినిమా రిలీజ్ కి అనుమతి ఇవ్వాలంటూ నేను నానా గొడవ చేసి పేపర్ల నిండా స్టేట్ మెంట్లిచ్చి, ఆఖరికి మీరు కొన్ని కట్స్ తో పర్మిషనిచ్చాక "సెన్సార్ వారితో పద్దెనిమిది నెలకు హోరాహరీ పోరాటం తర్వాత రిలీజవతున్న మహోజ్వల చిత్రం" అని వాల్ పోస్టర్ల మీదా, గోడల మీదా రాయించి రిలీజ్ చేసేసరికి మేము నాలుగు వారాలాడుతుందనుకున్న సినిమా ముప్పయ్ వారాలాడింది. మా పార్టనర్స్ కూ, డిస్ట్రిబ్యూటర్స్ కీ, బైయర్స్ కీ అందరికీ తెగ లాభాలొచ్చాయ్. ఈ సినిమా క్కూడా అదే పబ్లిసిటీ ఇవ్వవచ్చని ఆశపడ్డాం! అంతేకాదు. ముందే వాల్ పోస్టర్లూ, ఇతర పబ్లిసిటీ మెటీరియల్ అంతటా-" సెన్సార్ వారి కబంధ హస్తాల నుండి- తీవ్ర పోరాటం ద్వారా రిలీజవుతున్న "వీర విప్లవ అగ్నికణం" అని ఫ్రింట్ చేయించేశాం. ఇప్పుడు మీరు మాతో వివాదం పెట్టుకోకపోతే మా సినిమా ఏమయిపోతుంది? మేమేమయిపోతాం? అంచేత దయచేసి కనీసం కొన్ని కట్స్ అయినా సజెస్ట్ చేయండి- నేను వాటిని తిరస్కరిస్తాను. అప్పుడు అది రివైజింగ్ కమిటీ కెళుతుంది. వాళ్ళూ ఆ కట్స్ ని సజెస్ట్ చేస్తారు. నేను ఒప్పుకోకుండా మొండికేస్తాను. అప్పుడది సెన్సార్ బోర్డ్ చైర్మెన్ కెళ్తుంది. నేను వాళ్ళ మాటా వినను- అలా నేనూ మీరూ పేచీలు పడుతూ- కిందామీదా పడుతూ- స్టేట్ మెంట్లిస్తూ- హడావుడి చేస్తుంటే అప్పుడుగాని దానికి పబ్లిసిటీ రాదు సార్! అప్పుడుగాని కనీసం నాలుగు వారాలాడదు. అప్పుడు గాని మాకు నాలుగు డబ్బులు మిగలవు!