సెన్సార్ ఆఫీసర్ నవ్వాడు. "సారీ కుదరదు. మీ పిక్చర్ కి క్లీన్ సర్టిఫికెట్టే ఇస్తాం."
విప్లవ్ కుర్చీలో నుంచి లేచాడు.
"అలా అనకండి సార్! ఇంతకుముందు ఇవే దృశ్యాలు తీసినప్పుడు కట్ చేయమన్నారు, బాన్ చేయమన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అవే తీస్తే- క్లీన్ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. చెప్పండి సార్! ఇది కావాలని చేస్తున్న అరాచకం కదూ?"
"సెన్సార్ నిబంధనలు మారాలని మీ నిర్మాతలే అప్పుడు గొడవ చేశారు కదా! అందుకని కొన్ని మార్చారు ఇదిగో మిష్టర్ విప్లవ్! మేము ఎవరికీ కావాలని ఏమీ చేయము. మా ఎగ్జామినంగ్ కమిటీ ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అంతే!"
"మా అగ్నికణం" చూసిన ఎగ్జామినంగ్ కమిటీ సభ్యులెవలెవరు సార్?"
"ఎందుకు?"
"వారినందరినీ పర్సనల్ గా కలుసుకుని ఏదో ఒక కట్ సూచించమని ప్రాధేయపడతాను"
"అదేం కుదరదండీ! ఇంక మీరు వెళ్ళవచ్చు-"
"బాబ్బాబు! అలా కోప్పడకండి! పోనీ ఒక్క కట్ చెప్పండి చాలు"
"కుదరదండీ! మాకు ఎక్కడా తప్పు కనిపించనప్పుడు, నిబంధనలు, అతిక్రమించనప్పుడు మేమెందుకు కట్ చేస్తాం?"
"బాబోయ్- అంత మాటనకండి! పెళ్ళాం బిడ్డలు గలవ్వాడిని. మా సినిమా హీరోకి రివల్యూషనరీ హీరోగా ప్రేక్షకుల్లో మంచి పేరుంది సార్! అతనెప్పుడూ బీదలనాదుకుంటాడనీ, ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాడనీ అందరికీ తెలుసు. అలాంటి హీరో స్నిమాకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిస్తే సినిమా ఒక్క వారంలో ఔటయిపోతోంది. అంతేకాదు! ఆ తరువాత అస్సలు మా సినిమాలు చూడరు. హీరో కూడా ఈగళు తోలుకోవలసిందే!"
"అందుకు నేను చేయగలిగిందేమీ లేదు-"
విప్లవ్ ఉక్రోషం, కోపం, ఆవేశం ముంచుకొచ్చాయ్. అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయాడు.
మర్నాడు మళ్లీ నాలుగు టాక్సీలు సెన్సార్ ఆఫీసుకొచ్చి ఆగాయి.
వాటిల్లో నుంచి విప్లవ్ అతని యూనిట్ సభ్యులు బిలబిల దిగారు.
మరుక్షణంలో వారికేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోసాగింది.
సెన్సార్ బోర్డ్- డౌన్ డౌన్.
"సెన్సార్ నిబంధనలు- ఇంకా కఠినం కావాలి.
ప్రతి సినిమాకు ఒక్క కట్ అయినా - విధించాలి.
బాన్ చేయాలా వద్దా అనే విషయం- నిర్మాతకే వదలాలి!
క్లీన్ సర్టిఫికెట్- ఛీ! ఛీ!
పాత సెన్సార్ నిబంధనలు- జిందాబాద్!
లిబరలైజ్ డ్ సెన్సారింగ్ పాలసీ - మాకొద్దు!
సెన్సార్ కత్తెర - జిందాబాద్!
ఆ చుట్టూపక్కల చేరిన జనం కూడా ఉత్సాహంగా వాళ్ళల్లో చేరి కేకలు వేయడంలో యధాశక్తి సాయం చేయసాగారు.
క్లీన్ సర్టిఫికెట్- ఛీ! ఛీ!
సెన్సార్ కత్తెర - జిందాబాద్.
* * * * *


