Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 26

    మా ఇంట్లో అన్నీ ఇలా నెమ్మదిగా ఒకోటి కొన్నాం. ఆయన సంపాదన ఇంటి ఖర్చుకి, నా సంపాదన ఇంట్లో వస్తువులకి" అంది సుశీల నవ్వుతూ.
    జ్యోతి సిగ్గుపడింది.
    ఓరోజు ఆ శ్యామల కబుర్లు నమ్మి వీళ్ళు లంచాలతో ఈ వస్తువులు కొన్నారు అనుకుంది. నిజానిజాలు తెల్సుకోకుండా ఎంత తొందరపడింది?    "ఇంట్లోపని, తీరిక సమయంలో ఈ పని. అంచేత నాకు అసలు ఖాళీటైమే కనబడదు సాయంత్రం తప్ప. అది తెలియక అందరూ నేను మిగతావాళ్ళల్లా ఎండవేళతిరగడానికి రానని నాకు గర్వం అంటారు. అనుకోనీయండి నాకేం బాధలేదు" మృదువుగా నవ్వింది సుశీల.
    శ్యామల మాటలు ఈవిడకీ తెలిసే అలా అంటుందేమో అన్పించింది జ్యోతికి.
    "దాన్దేముందిలెండి? ఎవరిష్టం వారిది. మీ పని డిస్ట్రబ్ చేస్తున్నాను. వెళతాను" అంది జ్యోతి.
    "అబ్బే లేదు. ఒక కలర్ వేశాక ఆరడానికి టైముపడ్తుందిగా.... అందుకే కూర్చున్నాను" అంది సుశీల.
    కాసేపు కూర్చుని లోపలికి వచ్చేసింది జ్యోతి.
    సుశీలనిగురించి ఎంత అపార్థం చేసుకుంది? ఆ శ్యామల ఎలా మాట్లాడింది? ఎంత నీచంగా, గతిలేనిదానిలా చిత్రించింది తనని? ఛీ.... జ్యోతి మనసు ఆవేశంతో ఎగసిపడింది.
    వెళ్ళి అడిగేయాలన్న ఆవేశం వచ్చింది కాని.... కాని ఏమడుగుతుంది?
    అడిగినా అన్నానంటుందా? ఇదన్నమాట ఆవిడకి తనమీద వున్న అభిప్రాయం.
    రెండు మూడుసార్లు స్నేహంగా వెళ్ళేసరికి ఎలా మాట్లాడింది? సుబ్బారావు చెప్పిందే నిజం అన్నమాట! ఆ రోజంతా జ్యోతి బాధపడింది.
    సుబ్బారావుతో తగవు, శ్యామల మాటలు అన్నీ కలిసి జ్యోతి మనసు పాడయింది ఆ రోజంతా - చచ్చినా ఇంక అక్కడికి వెళ్ళకూడదు అనుకుంది.
                   *             *            *            *
    వారం పదిరోజులు గడిచాయి ప్రతిరోజూ మురారి వస్తాడేమోనని ఎదురుచూస్తూనే వుంది జ్యోతి.
    ఏరోజుకారోజు అతను వస్తాడేమోనని ప్రత్యేక శ్రద్ధతో సాయంత్రాలు బాగా ముస్తాబయి, మంచి చీర కట్టుకునేది. పదిరోజులు గడిచినా అతను రాకపోతే నిరుత్సాహపడింది. ఒకరోజు ఇంక వుండబట్టలేక యధాలాపంగా అడిగినట్లు-
    "ఏడీ మీ ఫ్రెండ్? రానేలేదే. అంత క్లోజ్ ఫ్రెండ్ అదీ యిదీ అన్నారు" అంది సుబ్బారావుతో.
    "మురారా? బావుంది. వాడికెన్ని పనులు. బొంబాయి, కలకత్తా, ఢిల్లీ పన్లమీద ప్లేనుల్లో తిరుగుతూనే వుంటాడు. అయినా పాపం ఆమధ్య ఓరోజు మా బ్యాంక్ కి ఫోను చేశాడు. ఈ ఆదివారం వూర్లో వుంటే వస్తానన్నాడు."
    "ఆదివారం అంటే ఇంక రెండు రోజులు. "ఏమండీ, బొత్తిగా ఇంటికి ఎవరన్నా వస్తే కూర్చోడానికి రెండు కుర్చీలయినా లేవు. ఓ నాలుగు ఫ్రేంకుర్చీలో, గాడ్రెజ్ ఛెయిర్సోనన్నా కొనండి. రేపు మీ ఫ్రెండ్ వస్తే కూర్చోడానికి ఓ మంచి కుర్చీ అన్నాలేదు" అంది జ్యోతి బతిమిలాడుతున్నట్టు.
    జ్యోతికేదన్నా పని కావాల్సినప్పుడు, ఏదన్నా కొనాలన్నా, సినిమా కెళ్ళాలన్నా కాస్త సౌమ్యంగా మాట్లాడుతుంది. ఆ సంగతి సుబ్బారావు పాపం గుర్తించలేదు.
    ఈ మధ్య జ్యోతి ప్రతీ సాయంత్రం మురారి వస్తాడేమోనని శ్రద్ధగా అలంకరించుకుని, ఆవేళకి సుబ్బారావుతో దెబ్బలాడితే బాగుండదని కాస్త చిర్రుబుర్రులు కసుర్లు తగ్గించి, సౌమ్యంగా మాట్లాడుతుంటే పాపం అదంతా తనకోసమే ననుకున్నాడు సుబ్బారావు. ఆ రోజు రాత్రి తరువాత జ్యోతి కాస్త మారింది.
     దార్లో పడుతూంది అని సంతోషించాడు. జ్యోతి అంత సౌమ్యంగా అడుగుతూంటే ఆనందపడ్డాడు.
    "బాగుంది వాడొస్తున్నాడని వాడికితగ్గ హోదా మనం ఎక్కడ తేగలం? మనకి తగినట్లుంటాంగానీ" అన్నాడు.
    "అబ్బ. ఏం చెప్పినా అలాగే అంటారు. ఇంట్లో రెండు కుర్చీలన్నా లేకపోతే, ఎవరొచ్చినా నాకెంత సిగ్గేస్తుందో, ఏమైనాసరే అప్పు చేసయినా నాలుగు కుర్చీలు కొనాల్సిందే" అంది జ్యోతి పట్టుదలగా.
    సుబ్బారావుకి ఆ మాట నిజమే అన్పించింది. ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఒకేసారి వచ్చారంటే మరోకుర్చీ లేక నానా ఇబ్బంది అవుతూంది.
    "సర్లే! చూద్దాం" అన్నాడు సుబ్బారావు.
    "ఆఁ. చూద్దాం కాదు. రేపు కావాల్సిందే" అంది జ్యోతి.
    ఆ మర్నాడు నాలుగు కుర్చీలు కొన్నారు. జ్యోతి తను కట్టుకోని పాత నైలెక్స్ చీరచింపి కిటికీలకి, గుమ్మాలకి తెరలు కట్టింది. అలమరలో పుస్తకాలు నీట్ గా సర్దింది.
    అప్పుడూ అప్పుడూ కొన్న కొండపల్లి బొమ్మలు కిటికీలమీద, అలమరలోతన నేర్పు, అభిరుచి కలిపి సర్దింది. వీధిలో కప్పులు సాసర్లు అమ్మేవాడి దగ్గిర రెండు సెట్లు కప్పులు కొంది.
    ఓ గాజు ఫ్లవర్ వాజ్ కొని ప్లాస్టిక్ పూలు అమర్చి, టేబుల్ మీద పెట్టింది.
    మొత్తానికి ఓ రూపుకి తెచ్చింది ముందుగది. జ్యోతి అంత శ్రద్ధగా గదిని అలంకరించినందుకు సుబ్బారావు సంతోషించాడు. "బాగుంది...." అన్నాడు మనస్ఫూర్తిగా.
    "డబ్బుండాలేగాని డబ్బుతో చెయ్యలేనిది ఏంవుంది.....?" అనుకున్నాడు.
    ఆదివారం నాల్గుగంటలకల్లా హల్వా, పకోడీలు చేసి, ఫిల్టరులో కాఫీ పోసి రెడీగా వుంచింది. తను శ్రద్ధగా ముస్తాబయి మంచి చీరకట్టుకుంది.

 Previous Page Next Page