Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 25

    "క్షమించడం ఎందుకు? మీరు మొగుడు. పెళ్ళాన్ని కొట్టడం, తిట్టడం అన్నింటికీ హక్కు వుంది. మా ఆడవాళ్ళం చచ్చినట్లు అన్నీ భరించడం రివాజేగా?" విసురుగా చెయ్యిలాక్కుని తీక్షణంగా చూస్తూ అంది.
    సుబ్బారావు నవ్వడానికి ప్రయత్నిస్తూ "క్షమించమన్నానుగా, అయినా నువ్వు మనిషిని రెచ్చగొడతావు జ్యోతీ! అంతా నాదే తప్పంటావా?"
    "అబ్బే మీదేం తప్పులేదు. అంతా నాదేతప్పు. అసలు మిమ్మల్ని పెళ్ళాడడమే నా మొదటి తప్పు, విసురుగా వెళ్ళిపోయింది జ్యోతి. సుబ్బారావు మొహం చిన్నబోయింది.
    ఇలాగే మాట్లాడి ఎప్పటికప్పుడు తన అహంమీద దెబ్బతీస్తుంది. ఎంతకని ఓర్పు, సహనం? నిట్టూర్చాడు సుబ్బారావు.
    ఆరోజంతా మూడీగానే వుంది జ్యోతి, ఆ మూడ్ కి తోడు ఇంటి పై ఆవిడ శ్యామల తనని గురించి ఎవరితోనో అంటున్న మాటలు వినగానే జ్యోతి మనసంతా పాడయింది.
    సుబ్బారావు ఆఫీసుకి వెళ్ళాక మూడ్ బాగోలేదని కాసేపు శ్యామల దగ్గరకి వెళ్ళి కబుర్లు చెప్పాలని పైకి బయలుదేరింది.
    కేవలం కాలక్షేపంకోసమేకాక రాత్రి తమకు ఎంత గొప్ప మిత్రుడు దొరికాడో, హోటల్ కెళ్ళి ఎంత బాగా కాలక్షేపం చేశారో గొప్పగా చెప్పాలని ఆరాటపడింది జ్యోతి.
    తీరా మెట్లెక్కి తలుపుదగ్గర నిలబడేసరికి ఎవరితోనో శ్యామల అంటున్న మాటలు విని చకితురాలైంది.
    "అబ్బబ్బ - ఆ కింద ఒక గుమస్తా వున్నాడులెండి, అతని పెళ్ళాం జ్యోతి అని వుందిలెండి - అబ్బ! ఆవిడని చూస్తే వళ్ళు మండుతుంది. ఓ వేళాపాళాలేదు.
    ఎప్పుడుబడితే అప్పుడు రావడం, డిస్ట్రబ్ చెయ్యడం. జిడ్డులా ఎంతకీ వదలదు.    
    ఆ మొహానికి మా ఇంట్లోవి అన్నీ ఇదెక్కడ కొన్నారు, అది ఎక్కడ కొన్నారు అంటూ దుంప తెంపుతుంది. దేభ్యంలా ప్రతీది అడిగి ప్రాణాలు తీస్తుంది.
    వట్టి నాటుసరుకు, వస్తే ఎప్పుడు పోతుందా అని చూస్తాను బొత్తిగా ఎదురుగుండానే చెప్పలేక వూరుకుంటున్నాను. అయినా ఎవరి తాహతులో వాళ్ళుండాలిగాని ఇలా ఎగబడి ఇంటిమీద పడడం ఎందుకు చెప్పండి?" అంటూంది.
    జ్యోతి నిర్ఘాంతపోయింది.
    మొహంలోకి రక్తం పొంగింది. ఒక్కక్షణం అచేతనురాలై కర్తవ్య విమూఢురాలైనట్లు నిలబడిపోయింది.
    ఆ తరువాత సిగ్గు, అవమానంతో చకచక మెట్లుదిగి కిందకి వచ్చేసరికి వాళ్ళ గుమ్మంలో నిలబడి సుశీల కన్పించింది.
    జ్యోతి గతుక్కుమంది.
    ఎర్రబడ్డ జ్యోతి మొహం చూసేసరికి సుశీలకి ఆశ్చర్యమనిపించింది.
    సుశీలని చూసి నవ్వాలని ప్రయత్నించింది జ్యోతి.
    "ఏం వచ్చేశారు, ఆవిడలేదా?" అంది సుశీల జ్యోతిని చూసి.
    "అబ్బెబ్బే.... లేదు.... ఎవరో వున్నారు. అందుకు...." అంది తడబడుతూ.
    "అయితే రండి. కాసేపు మా ఇంట్లో కూర్చుందాం" అంటూ ఆహ్వానించింది.
    అప్రయత్నంగానే జ్యోతి అటువేపు అడుగులు వేసింది.
    జ్యోతి వెళ్ళేసరికి సుశీల ఏదో వాయిల్ చీరమీద పయింట్ చేస్తుంది. ఒకరంగు వేశాక ఆరగానికి టైమిచ్చి గుమ్మంలో నిలబడింది. ఆ పెయింట్స్ ని, ఆ చీరని చూస్తూనే జ్యోతి ఆశ్చర్యంగా.
    "మీకు పెయింటింగ్ చేయడం వచ్చునా, అబ్బ ఎంత బాగుంది? ఆ చీర, ఆ రంగుల మేళవింపు, ఆ డిజైను ఎంతో అద్భుతంగా వుంది. ఇంత బాగా పెయింట్ చేయడం వచ్చా మీకు? ఎప్పుడూ చెప్పలేదే?" అంది విస్మయంగా.
    "చెప్పడానికి అవకాశం రాలేదుగా? ఇవాళ చూశారు గనక మీకు తెల్సింది. లేకపోతే వూరికే అలా గొప్పలు చెప్పుకోడానికి అందరికీ చెప్పాలా?" అంది సుశీల నెమ్మదిగా నవ్వి.
    "మొదట్లో నాకోసం సరదాగా ఒకటి. రెండు చీరలు చేసుకున్నాను. అదిచూసి స్నేహితులు చేసిపెట్టమని అడిగితే చేశాను. ఒకనాటి హాబీ, ఇప్పుడు బతుకుతెరువుగా కూడా ఉపయోగిస్తుంది."
    జ్యోతి అర్థంకానట్టు చూసింది.
    'ఏముంది, ఒకరికీ ఇద్దరికీ అంటే వూరికే చెయ్యగలం. శ్రమ ఎలా వున్నా రంగులు కొనాలిగా, దాంతో చీరకింత అని తీసుకోవడం ఆరంభించాను.
    అలా అలా ఒక చీరలషాపు అతను నా పెయింట్ చీరలుచూసి చాలా బాగున్నాయి. రెగ్యులర్ గా మేం చీరలు పంపిస్తాం మాకు చేయండి అన్నాడు.
    బాగానేవుంది. అదీ ఒక రాబడే అని ప్రారంభించాను. హాబీకి హాబీ, కాలక్షేపానికి కాలక్షేపం, డబ్బుకి డబ్బు వస్తుంది" అంది.
    "ఆహా.... చీరకి ఎంతిస్తారు?" కుతూహలంగా అడిగింది.
    "డిజైనుబట్టి పదిహేనుకి తక్కువుండదు. ఇరవై, పాతిక అలా వుంటాయి రేట్లు."
    "ఒక చీరకి ఎన్నాళ్ళు పడుతుంది?"
    "అదీ డిజైనుబట్టే అనుకోండి. మూడు నాలుగురోజులకి ఒకటి చేసేయగలను. సాధారణంగా నెలకి ఎనిమిది చీరలకి తక్కువ చేయను."
    "బాగుందే. చక్కగా ఇంట్లో కూర్చుని సంపాదిస్తున్నారు. నిజంగా చాలా బాగా చేస్తున్నారు."
    "ఏదో వేడినీళ్ళకి చన్నీళ్ళు. చేతిలో వున్నపని. పోచికోలు కబుర్ల కంటె ఇలా మన ఆడవాళ్ళు ఎవరికీ తోచినవి, వచ్చినవి వాళ్ళుచేస్తే నాలుగు డబ్బులు పోగుచేసుకుని ఇంటికి కావాల్సిన ఒక్కో వస్తువు అమర్చుకోవచ్చు. 

 Previous Page Next Page