"చెప్పండి!"
"మీ ఇల్లెక్కడా?"
"నా అదృష్టానికి ఇల్లు కూడానా?"
"మరెక్కడ ఉంటున్నావు?"
"మొన్నటివరకు కాలేజ్ హాస్టల్లో ఉండేదానిని!"
"ఎవరు చదివించేవాళ్ళు నిన్ను?"
"మా తాతయ్య"
"మీ అమ్మ, నాన్నా ఏమయిపోయారు?"
"లేరుగా! చిన్నప్పుడే పోయారు. అప్పటినుంచి మా స్కూలు హాస్టల్లో ఉంచి చదివించాడు నన్ను. మా తాతయ్యకు 'డాన్స్' అంటే చాలా ఇష్టం. అందుకే నాకు డాన్స్ నేర్పించాలని డాన్స్ కాలేజ్ లో చేర్పించారు. తీరా కాలేజ్ పూర్తయ్యేలోగానే ఆయనా పోయారు. దాంతో డాన్స్ పరీక్షలు ఇవ్వలేకపోయాను. ఆ రోజు నుంచీ మా కాలేజ్ ప్రిన్సిపాల్ సహాయం చేస్తుండేవాడు. చివరకు నన్ను నేను పోషించుకోవటం కోసం పెళ్ళిళ్ళల్లో భరతనాట్యం ప్రోగ్రామ్స్ ఇవ్వటం ప్రారంభించాను. మీ బర్త్ డేకి నా డాన్స్ ప్రోగ్రాం ఇస్తే డబ్బు ఎక్కువ ఇస్తారని మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు. అందుకని ఒప్పుకున్నాను. అనుకున్నదొకటీ, జరిగిందొకటీ! నిజంగా దిక్కులేని నాలాంటి దానికి భగవంతుడే మీలాంటి ఉత్తముడిని భర్తగా ఇచ్చాడేమో అనిపిస్తోంది."
చిరంజీవి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆలోచనల్లో మునిగిపోయాడు.
అతనికి సంగీత మీదే ఉంది మనసంతా! సంగీతలాంటి అప్సరసను మర్చిపోయి ఇలాంటి మామూలు అమ్మాయికి తనెందుకు లోబడిపోయాడో తెలీటం లేదు.
ఓ సారి శారద వేపు పరీక్షగా చూశాడతను.
"ఎర్రగా, లావూ సన్నం కాకుండా, పొట్టీ పొడువు కాకుండా యావరేజ్ గా ఉంది. ఆమె అందంలో ఆకర్షణ ఉన్నమాట నిజమేగానీ తను సంగీతను మించిపోయి ఈ అమ్మాయి మెడలో తాళి కట్టేసేంత అద్భుత అందగత్తేమీ కాదు."
తనెందుకలాంటి తొందరపాటు పని చేశాడో తెలీటంలేదు.
అతని వళ్ళో వాలిపోయింది శారద. "ఏమిటండీ! ఇంతసేపట్నుంచీ చెప్తున్నా ఇంకా ఏమీ గుర్తురావటం లేదా? ఇంక నిషా దిగటం లేదా? నా మాట విని కాఫీ తాగండి."
చిరంజీవి ఆమెను తప్పించుకుని మంచం దిగాడు. శారద బాత్ రూమ్ లో కెళ్ళింది.
తలనొప్పిగా వుంది. ఇదంతా హాంగోవర్ ప్రభావమే! ఇంతకూ సంగీతేమయినట్లు?
ఫోన్ అందుకుని కాఫీ ఆర్డర్ చేశాడతను.
బేరర్ లోపలికొస్తుంటే చూశాడు. తలుపుకి తగిలించి వుందా బోర్డ్ "జస్ట్ మారీడ్! డోంట్ డిస్టర్బ్"
పరుగుతో వెళ్ళి ఆ బోర్డ్ అందుకుని చూశాడు.
"ఎవరు పెట్టారిది?" అడిగాడు బేరర్ ని.
"మేమే సర్!" ఆనందంగా చెప్పాడతను.
మళ్ళీ సోఫాలో కూలబడి కాఫీ తాగాడతను. తలనొప్పి తగ్గిపోయింది.
ముందు సంగీత దగ్గరకెళ్ళాలి. తన ఫ్రెండ్స్ దగ్గరకెళ్ళాలి. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి.
బయటకు నడవబోతూంటే అతనికి చటుక్కున అడ్డు వచ్చింది శారద. ఆమెను చూస్తూనే బెదిరిపోయాడతను. ఆమె గెటప్ మొత్తం మారిపోయింది. విరబోసుకున్న జుట్టు, ముఖానికి బొట్టు, కళ్ళకు కాటుక.
"మొదటిరోజు అలా ఒక్కరే వెళ్ళిపోకూడదు" చిరునవ్వుతో అంది.
"ఏం? ఎందుకని?"
"మొదటిరాత్రి తర్వాత ఇద్దరం గుడికి వెళ్ళాలి. మా వంశాచారం అది."
"నీకు 'నా' అనేవాళ్ళు లేరుగాని ఈ వంశాచారాలు మాత్రం జలగలా పట్టుకున్నాయన్నమాట. నేనెక్కడికీ రాను. నువ్వెళ్ళిరా."
ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. "ఇదిగో! ఇలా చీటికి మాటికి నన్ను మాటలంటే పడేది లేదు! ఆ! నేనేమయినా మిమ్మల్ని బలవంతం చేసి తాళి కట్టించుకున్నానా? నన్ను పెళ్ళి చేసుకోమని బ్రతిమాలానా? మీరే నువ్వు దేవతవనీ, నేను కాదంటే బ్రతకలేననీ బ్రతిమాలి, బలవంతం చేసి తాళి కట్టారు. రాత్రంతా ప్రణయ కలాపాలు జరిపారు. తెల్లారాక నువ్వెవరు? నిన్ను నేనెప్పుడు పెళ్ళి చేసుకున్నాను? నీ మెడలో తాళి ఎవరు కట్టారు? అంటూ లక్ష ప్రశ్నలేస్తున్నారు. అలా అడుగుతూంటే నాకెంత అవమానకరంగా ఉందో తెలుసా? ఇంకోసారి అడిగారంటే నేనే నూతిలోనో దూకి చచ్చిపోతాను! ఆ!"
చిరంజీవి వులిక్కిపడ్డాడు.
ఆమె శవాన్ని నూతిలో నుంచి బయటకు తీయటం, పోలీసులు తనను బోనులో నుంచోబెట్టడం, జడ్జి తననో విషప్పురుగులా చూసి "నీలాంటి భార్యా హంతకుడిని ఏమాత్రం కనికరం చూపడానికి వీల్లేదు. అందుకే నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను" అనటం అంతా కళ్ళముందు కనిపించింది. దాంతో భయంవేసిందతనికి.
భారతదేశంలో ఆడాళ్ళ అన్గతి బాగా తెలుసు. బాగున్నన్నాళ్ళూ బాగానే వుంటారు. కొంచెం ఏదయినా తేడా రాగానే చటుక్కున ఆత్మహత్యలు చేసేసుకుంటారు.
"అయామ్ సారీ శారదా! మరీ అంత సీరియస్ అయిపోతావేమిటి? మందెక్కువవటం వల్ల రాత్రి ఏం జరిగిందో గుర్తుకురాక అలా అడిగానన్నమాట! అంతే!"
"అయితే త్వరగా రడీ అవ్వండి! మనం గుడికి వెళ్ళిరావాలి!"
"గుడికా!"
"అవును రండీ! ప్లీజ్!"
"సరే. వస్తా"
అరగంట తర్వాత కార్లో గుడికి వెళ్ళారు. గుళ్ళో పూజారి ప్రత్యేకంగా ఇద్దరితోనూ పూజలు చేయించాడు. పిల్లలు మనవలతో వాళ్ళ కుటుంబం కళకళలాడిపోతుందని దీవించాడు.
ఆ కాసేపూ చిరంజీవికి ముళ్ళమీద కూర్చున్నట్లుంది.
ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని వుండగా మధ్యలో తలెత్తి చూసేసరికి ఎదురుగ్గా నిలబడి కనిపించిందతనికి. అదిరిపడి లేచి నుంచున్నాడతను.
సంగీత పొగల్లో నిలబడినట్లుంది. ఆమె మొహంలో కోపం, ఉక్రోషం, రోషం, అవమానం అన్నీ కలిసి అగ్నిపర్వతంలా రాజుకోవటం కనబడుతోంది. ఆమె పెదాలు అదురుతున్నాయి.
పురోహితుడు మంత్రాలు చదువుతూనే "కూర్చోవయ్యా" అంటున్నాడు.
సంగీతకు దుఃఖం ఆగటం లేదు. కన్నీళ్లు రాలిపోతున్నాయి.
ఆమెను చూసి శారద కూడా లేచి నిలబడింది.