Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 24


    భోజనాలయిపోయాయ్.
    "రేపు మాణింగ్ ఎనిమిది గంటలకల్లా మన ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ చేద్దాం" అన్నాడు అప్పల్రాజు.
    "ఓ.యస్." అన్నాడు భవానీశంకర్.
    "ఓ.కే." అంది కన్యక.
    అందరూ లేచారు. భవానీశంకర్ తన గదిలోకి వచ్చేశాడు. బట్టలు మార్చుకుంటూంటే ఇంటర్ కమ్ మోగింది.
    "హలో... భవానీ... సారీ దీప్ చంద్ హియర్!"
    "హలో దీప్ చంద్! నేను మనోచిత్రనండీ!"
    "ఓ. మీరా?"
    "ఇంకా నేను మీ గురించే ఆలోచిస్తున్నానండీ! ఇందాక భోజనాల టేబుల్ దగ్గర ఫ్రీగా మాట్లాడటం కుదరలేదు. మీ రూమ్ కి రావచ్చునేమో అని..."
    "వెల్ కమ్ మైడియర్ యంగ్ గాళ్. వెల్ కమ్."
    "థాంక్యూ. ఇప్పుడే వస్తున్నాను."
    ఫోన్ డిస్కనెక్ట్ చేసి రెండు నిమిషాల్లో గది తలుపు తోసుకుని లోపలికొచ్చిందామె.
    "కూర్చోండి!" అన్నాడు భవానీశంకర్.
    "మీరు ఇప్పుడు రాస్తున్న సీరియల్ సూపర్బ్ గా ఉందండీ!"
    "అప్పుడే ఏమయింది? వచ్చేవారం ఓ బ్రహ్మాండమయిన మలుపు తిప్పుతున్నాను. అది చదివారంటే అసలు పిచ్చెక్కిపోతుంది."
    మనోచిత్ర ఉత్సాహంగా చూసింది "ఏమిటండీ ఆ మలుపు?"
    "ఎప్పుడూ దేవుడిని పూజిస్తూ, భర్తను ఆరాధిస్తూ, భర్త పాదాలు రోజూ కళ్ళకద్దుకుంటూ గడిపే మహాలక్ష్మి పాత్ర ఉంది చూడండి. ఆ మహాలక్ష్మి హఠాత్తుగా సెక్స్ మానియాక్ అయిపోతుంది. కనడ్డవాడినల్లా పడగ్గదిలోకి లాక్కెళ్ళిపోతుంది."
    మనోచిత్ర ఉలిక్కిపడింది.
    "అబ్బ! టెరిఫిక్ ట్విస్ట్!" అంది సంభ్రమంగా.
    "ఇక నవలంతా అలాంటి ట్విస్ట్ లే! ఆడపిల్లల వెంబడిపడి రోజుకో ఆడపిల్లతో ప్రణయం జరిపే కృష్ణ పాత్ర ఉంది చూడండి. సడెన్ గా అతను సన్యాసుల్లో చేరిపోతాడు."
    "అబ్బ! అన్ ఇమేజినబుల్" ఆనందంగా అందామె.
    "యస్ మైడియర్ గాళ్. ఇమేజినేషన్ కు అందకుండా రాయటమే మోడ్రన్ టెక్నిక్"
    ఆమె తన బాగ్ లోంచి ఓ చిన్న పుస్తకం తీసింది.
    "ప్లీజ్! ఇందులో మీ ఆటోగ్రాఫ్ చేయరూ?"
    భవానీశంకర్ పుస్తకం తీసుకుని 'దీప్ చంద్' అని సంతకం చేసి ఇచ్చాడు.
    "థాంక్యూ వెరీమచ్! మళ్ళీ రేపొద్దున్న కలుసుకుందాం"
    "షూర్ లీ డియర్ షూర్ లీ"
    "రోజూ కొంచెంసేపు సరదాగా మీతో మాట్లాడడం మీకేమీ అభ్యంతరం ఉండదు కదూ?"
    "నాటెటాల్ మిస్"
    "థాంక్యూ..."
    "గుడ్ నైట్"
    "స్వీట్ డ్రీమ్స్"
    ఆమె వెళ్ళిపోగానే తలుపులు మూసేసి 'అమ్మయ్య' అని గాలి పీల్చుకున్నాడతను.


                                              *    *    *    *


    మర్నాడు పొద్దున్నే ఆరుగంటలకల్లా ఫోన్ మోగటం మొదలుపెట్టింది. నిద్రకళ్ళతో రిసీవర్ అందుకున్నాడు భవానీశంకర్.
    "గుడ్ మాణింగ్ సర్! ఎనిమిది గంటలకల్లా ప్రాజెక్టు వర్క్ ప్రారంభిస్తే బాగుంటుందని అప్పల్రాజుగారి అభిప్రాయం సార్! అందుకని మీకు మెలకువ వచ్చిందో లేదోనని..." అన్నాడు మారుతీరావ్.
    "వచ్చింది మైడియర్ మారుతీ! నిజం చెప్పాలంటే నేను గెడ్డం చేసుకుంటూండగా నీ ఫోన్ మోగింది."
    "థాంక్యూ సర్..."
    "అన్నట్లు నువ్వు తెల్లారుజామున అయిదింటికే లేవటం అలవాటనుకుంటాను"
    "నాలుగ్గంటలకు సార్!"
    "వెరీగుడ్ మారుతీ! అద్భుతమయిన సమయం నిద్రలేవటానికి! కీపిటప్"
    "థాంక్యూ సర్!"
    భవానీశంకర్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి బాల్కనీ తలుపు తెరచి బాల్కనీలోకి వచ్చాడు ఆవులిస్తూ.
    సరిగ్గా అప్పుడే కన్యకకూడా మాక్సీతో బాల్కనీలోకొచ్చింది.
    "హలో గుడ్ మాణింగ్ కన్యకాజీ! మీ అందమయిన నిద్రను కూడా ఆ మారుతీరావ్ గాడు చెడగొట్టాడనడంలో ఎలాంటి సందేహం లేదు నాకు"
    "అవును!" అంది కన్యక చిరునవ్వుతో.
    "ఇంత ప్రశాంతమయిన వాతావరణంలో ఇంత రమణీయమయిన ప్రకృతి మధ్య__వీడో పెద్ద న్యూసెన్స్ అని నా అభిప్రాయం"
    "పాపం అతని డ్యూటీ అతను చేస్తున్నాడు."
    "అయ్ డౌట్ వెరీ మచ్ మైడియర్ ఫ్రెండ్! అన్నట్లు ఆ అద్భుతమయిన సీనరీ చూశారా! దూరంగా కనబడుతున్న పెద్ద చెరువూ_దానిమీద గొడుగులాపట్టిన మంచూ ఆ మంచు తెరవెనుక దాక్కున్న చెట్లు"
    "మీరు కవిత్వం కూడా రాస్తారా?" నవ్వుతూ అడిగిందామె.
    "మీరిలా పక్కనే ఉంటానని గ్యారంటీ ఇస్తే ఏది రాయమన్నా రాస్తాను. ఉదాహరణకు మీరు నా ఎదురుగ్గా రోజంతా కూర్చుంటానంటే మీ చిత్రం కూడా గీసి పారిస్ మ్యూజియమ్ కి పంపిస్తాను"
    "మీకు బొమ్మలు వేయటం వచ్చా"
    "ఇంతవరకూ రాదుకానీ మీరు ఎదురుగా ఉంటే?"
    "మీరిలా మాట్లాడుతూంటే ఇక్కడే ఎనిమిదయిపోతుంది!" అంటూ లోపలికెళ్ళిపోయిందామె.
    భవానీశంకర్ మరోగంట తర్వాత రడీ అయ్యేసరికి నౌకరు ఓ ప్లేట్లో పలహారం, ప్లాస్కులో కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీదుంచాడు.
    "కాఫీ ఫలహారం అయ్యాక తనువచ్చి అప్పల్రాజుగారి లైబ్రరీ రూమ్ కి మిమ్మల్ని తీసుకెళతానని మారుతీరావ్ గారు చెప్పారండి!" అన్నాడతను.
    అతను చెప్పినట్లే కాఫీ ఫలహారాలు ముగించేసరికి మారుతీరావ్ వచ్చేశాడు.
    కన్యకతోపాటు అప్పల్రాజు లైబ్రరీ రూమ్ చేరుకున్నాడు భవానీశంకర్. ఓ పెద్ద విశాలమయిన టేబుల్ వెనుక రివాల్వింగ్ చైర్ లో కూర్చున్నాడు అప్పల్రాజు.
    "వెల్ కమ్ రైటర్! వెల్ కమ్" అన్నాడతను దీప్ చంద్ ను చూడగానే.
    టేబుల్ కి భవానీశంకర్ ఓపక్క, కన్యక మరోపక్క కూర్చున్నారు.
    "ఇది డయిరీ నెంబర్ వన్! మా తండ్రిగారు మొట్టమొదటిసారి ఎలక్షన్ లలో నిలబడిన రోజుల్లో మొదలుపెట్టాను నేనప్పుడు హైస్కూల్లో చదువుతున్నాను. ఇక్కడినుంచే ప్రారంభిద్దాం ఆత్మకథ! ఏమంటారు మిస్టర్ దీప్ చంద్?"
    "గుడ్ అయిడియా సర్! ఏదయినా సస్పెన్స్ తో కూడిన సంఘటనతో ప్రారంభిస్తే మరింత బ్రహ్మాండంగా ఉంటుంది ఏమంటారు కన్యకగారూ?"
    "అవును!" అందామె.
    "అయితే మా తండ్రిగారు రాష్ట్రముఖ్యమంత్రి అవాల్సిన సమయంలో ఆయన గ్రూపులో ఉన్న ఎనిమిదిమంది అవతలి గ్రూపు వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సంఘటనతో ప్రారంభిద్దాం!"

 Previous Page Next Page