Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 23


    కన్యక జవాబివ్వకుండా లేవబోయింది.
    "అరె! వెళ్ళిపోతున్నారా? నో మిస్ కన్యకా! ప్లీజ్ కూర్చోండి. మనం ఆంధ్రదీపిక ఆఫీస్ లో ఎంతో ఆనందకరంగా గడిపిన రోజులు మర్చిపోయారా?"
    "రోజులా?"
    "అఫ్ కోర్స్ అలా నిలదీస్తే ఒకే ఒక్కరోజు అనుకోండి! అయినా ఆ ఒక్కరోజులోనే యుగయుగాలు కలసి విహరించినట్లు మీకు అనిపించటం లేదూ?"
    "లేదు."
    "ఐసీ. లాక్ ఆఫ్ ఇమేజినేషన్! బహుశా ప్రస్తుతం మనసు బాగుండక మీరలా అంటున్నారు కానీ ఒంటరిగా మీ గదిలో పడుకున్నప్పుడు మీరు ఆనాటి తలపులన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆనందంలో ఉక్కిరిబిక్కిరవుతూ మీలో మీరే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ__"    
    కన్యకకు నవ్వాగలేదు గానీ బలవంతంగా ఆపుకుంది.
    "అదంతా మీ ఊహ."
    "అయుండచ్చు కన్యకగారూ! కానీ నేటి ఊహలే రేపటి నిజాలు అన్నాడు షేక్ స్పియర్."
    "షేక్ స్పియర్ పుస్తకాల్లో నాకెక్కడా కనిపించలేదా మాట!"
    "లేదా? వెరీ స్ట్రేంజ్! అయితే ఆ బెర్నార్డ్ షా పుస్తకం అయుంటుంది"
    అతని మాటలు కన్యకను విపరీతంగా ఆకర్షిస్తున్నాయ్. ఇంత సరదాగా మాట్లాడే యువకులు తనకింతవరకూ తటస్థపడలేదు. అక్కడినుంచి వెళ్ళిపోవాలన్న కోరిక నెమ్మదిగా బలహీనమయి పోసాగింది అదీగాక తనూ, అతనూ కలసి నెలరోజులు_ఉద్యోగం చేయాల్సి ఉంది. తనకిష్టం లేకపోయినా సరే.
    "నేనిక్కడకు రావటం మీకేం మాత్రం ఇష్టంలేదు కదూ?"
    కన్యకకేం చెప్పాలో తెలీలేదు. అదేంలేదు ఎవరున్నా నాకొకటే! నేను నా ఉద్యోగం చేయడానికొచ్చాను" అంది కొద్దిక్షణాలాగి.
    "బహుశా ఈ కవర్ పేజీ వ్యవహారం వల్ల మీకింకా కోపం ఉండి ఉంటుంది నామీద. కనీ అయామ్ హెల్ప్ లెస్ కన్యకాజీ! ఇంత అందం ఒకేసారి ఫోటోలో కనబడేసరికి..."
    "ఆ విషయం ఇంక వదిలేయండి" అందామె.
    "ఓ.యస్! నా పాలసీ కూడా అదే మిస్ కన్యకా! పాస్ట్ ఈజ్ పాస్ట్. అందుకే మీరు నన్ను ఆ ఉద్యోగంలోనుంచి డిస్మిస్ చేయించినా నేను పట్టించుకోలేదు. వెంటనే మర్చిపోయాను."
    కన్యక చకితురాలయింది. "మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేశారా?"
    "అవును. మీ శరత్ బాబుగారు మా ప్రొప్రయిటర్ కి ఫోన్ చేసి ఆ విషయం కంప్లైంట్ చేశారట."
    కన్యక కలవరపడింది. తన కోపంవల్ల అతని ఉద్యోగం పోతుందని ఊహించలేకపోయిందామె. ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించటం ఎంత కష్టమో తనకే అనుభవం ఉంది. అలాంటిది తనవల్ల ఓ యువకుని ఉద్యోగం పోవటం.
    "అయామ్ సారీ" అందామె.
    "నోనోనో. మీలాంటి అందమయిన అమ్మాయి అలా 'సారీ' ఫీలవకూడదు కన్యకగారూ! ఎప్పుడూ హ్యాపీగా, నవ్వుతూ, తుళ్ళుతూ, టయోటా కారులో తిరుగుతూ..."
    "మీ ఉద్యోగం..."
    "డోంట్ వర్రీ ఎబౌబ్ మై జాబ్ మైడియర్ ఫ్రెండ్! ఆ ఉద్యోగం పోబట్టే కదా. మీతో ఇక్కడ గడిపే అవకాశం దొరికింది?"
    కన్యక నవ్వింది.
    "ఏదేమయినా మీరలా న ఫోటో కవర్ పేజీమీద వేయకుండా ఉండాల్సింది."
    "వేయకపోవటం నేషనల్ క్రైమ్ కన్యకాజీ! ఇంత అందాన్ని ఎక్కడో మారుమూల మగ్గనీయటం దారుణం. దేశమంతా చూచి తరించాల్సిన అందం. ప్రతి ఇంట్లోనూ ఆ కవర్ పేజీని ఫ్రేమ్ కట్టించి దాచుకున్నారనటంలో ఎలాంటి సందేహంలేదు నాకు"
    "ఇంక వెళతాను" లేచి నిలబడుతూ అందామె.
    "అచ్చు పొరపాటు డియర్! 'వెళ్దాము' అనాలి" తను కూడా లేచి ఆమెతోపాటు ఇంటివేపు నడుస్తూ అన్నాడతను.
    నాలుగడుగులు వేసేసరికి మారుతీరావ్ ఎదురొచ్చాడు.
    "డిన్నర్ రడీ సార్!"
    "థాంక్యూ మైడియర్ మారుతీరావ్. ఎవరెవరున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర."
    "అప్పల్రాజుగారూ, శమంతకమణిగారూ, వర్ధనరావ్ గారూ, మనోచిత్రగారూ ఉన్నారండీ."
    "ఈ వర్ధనరావ్, మనోచిత్రా ఎవరు?"
    "వర్ధనరావ్ గారు శమంతకమణిగారి తమ్ముడుగారండీ! మనోచిత్రగారు శమంతకమణిగారి అక్కయ్య కూతురు."
    "అయితే ఇంచుమించుగా ఇల్లు 'హౌస్ ఫుల్' అన్నమాట."
    "ఇప్పుడే కాదండీ! వచ్చేవారం శమంతకమణిగారు అధ్యక్షురాలిగా ఉన్న "టైగర్స్ క్లబ్" మీటింగ్ కోసం చాలామంది అతిథులు వస్తున్నారండీ. అప్పుడు హౌస్ ఫుల్ అయిపోతుంది."
    "ఐసీ_"
    ముగ్గురూ డైనింగ్ హాల్లో కొచ్చేశారు.
    "రండి! రండి!" వారిని సాదరంగా ఆహ్వానించింది శమంతకమణి.
    "ఇతను మా తమ్ముడు వర్ధనరావ్! ఈమె మనోచిత్ర! మా అక్కయ్య కూతురు ఎమ్.ఏ. పరీక్షలు రాసి శెలవులకు వచ్చింది. వీరే ప్రఖ్యాత రచయిత దీప్ చంద్? ఈమె కన్యక." అందరికీ పరిచయం చేసిందామె.
    "నమస్తే. రచయితలంటే నాకు చాలా ఇష్టం" అన్నాడు వర్ధనరావ్.
    "థాంక్యూ!" అన్నాడు భవానీశంకర్.
    "అయితే_ నేనెవరి రచనలూ చదవనులెండి"
    "ఓ! మైగాడ్! వాటే సర్ ప్రైజ్. మీరు నా అభిమాన రచయితండీ." ఆనందంగా అంది మనోచిత్ర.
    "థాంక్యూ"
    "మా ఆంటీ ఇందాకట్నుంచీ నన్ను ఊరిస్తోంది. "నీకో ఇష్టమయిన వ్యక్తి"ని పరిచయం చేస్తానని! అయినా నాకు ఆశ్చర్యంగానే ఉంది. మిమ్మల్ని కలుసుకోవటం ఇంత తేలికగా కుదురుతుందని అనుకోలేదు."
    "జస్ట్ పాజిబుల్"
    "మీకు ఎనిమిది ఉత్తరాలు రాశాన్నేను కాలేజీ హాస్టల్ నుంచి! మీరు ఒక్కదానికి కూడా జవాబివ్వలేదు."
    "అలాగా! అయ్ సీ. మా సెక్రటరీకి స్పష్టంగా చెప్పాను. అన్ని ఉత్తరాలకూ జవాబులు రాయాలని"
    "ఒక్కదానికి కూడా రాయలేదతను."
    "ఇంటికి వెళ్ళగానే డిస్మిస్ చేసేస్తాను వాడిని."
    "పోనీండి పాపం. నా మూలంగా డిస్మిస్ చేయటం నాకిష్టం లేదు."
    "నోనో. మీకు తెలీదు. నా అభిమాన పాఠకులనలా నిరుత్సాహపరచటం నాకేమాత్రం సహించని విషయం"
    "రండి. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం" అన్నాడు అప్పల్రాజు.
    అందరూ భోజనానికి కూర్చున్నారు.
    "ఎప్పుడో ఓసారి నేను గోదావరి ఎక్స్ ప్రెస్ లో వైజాగ్ వెళ్తోంటే ఓ రచయితతో పరిచయం అయింది. వెరీగుడ్ ఫెలో! నాకు కాఫీ ఫలహారాలు అన్నీ సప్లయ్ చేశాడు ఫ్రీగా! నేను తను రాయబోయే కథ విన్నందుకు అంత కృతజ్ఞత చూపించాడు పాపం. అందుకే రచయితలంటే నాకిష్టం" అన్నాడు అప్పల్రాజు.
    "అల్ప సంతోషులు మావాళ్ళు_" అన్నాడు భవానీశంకర్.
    "యస్! మరోసారి ఇంకో రచయిత కలిశాడెప్పుడో _ 1968లోనో 84 లోనో గుర్తులేదు. ఎక్కడో కూడా గుర్తులేదు. చాలా మంచివాడు. రెండో మూడో ఫుల్ బాటిల్స్ తాగాడుగానీ కొంచెంకూడా గొడవ చేయలేదు" అన్నాడు అప్పల్రాజు.

 Previous Page Next Page