Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 23


    మధుకు రిషి సంగతి వివరిస్తుండగానే మల్లేష్ వచ్చాడు. "భద్రం తంబీ! ఆ ఓనర్ దరిద్రపు మొకమోడున్నాడు. లొల్లి జరిగేట్లుంటే పోలీసులకి ఫోన్ జెయ్యనీకి కూడా పైసలకి చూస్కుంటాడు! థూ! దరిద్రం జల్మ!" అన్నాడు.

    "మన అవసరంగా తప్పదు" అని రిషి క్రిందకి నడిచాడు.

    వనజాక్షి టిఫిన్ బాక్స్ అందిస్తూ- "అవసరానికి ఆదుకుంటున్నావు నాయనా నీ రుణం వుంచుకోము" అంది.

    మధు స్కూటర్ గేట్ లోంచి బయటపెట్టి స్టార్ట్ చేస్తూండగా ఇంటిముందు ఓ రిక్షావచ్చి ఆగింది. అందులోంచి ఓ మెరుపు తీగలాంటి అమ్మాయి చటుక్కున దూకి- "ఏవండీ ఈ ఎడ్రెస్ చూడండీ! ఈ మధుసూదన్ ఎక్కడుంటాడు?" అని అడిగింది.

    మధుకి ఎడ్రస్ చూడనవసరం కనిపించలేదు. "ఏ మధుసూదన్ కావాలి?" అనడిగాడు.

    ఆ అమ్మాయి చిరాకుగా "బృందావనంలో మాధవుడు! ఎవరయితే మీకెందుకూ? అడ్రస్ ఇదేనా చూసి చెప్పండి" అంది.

    మధు ఆ కాయితం వంక చూసి "ఇదే" అన్నాడు.

    "అమ్మయ్యా! ఇంకా ఎంతసేపు ఈ రిక్షాలో నరకం అనుభవించాలో అనుకున్నాను. ఒళ్ళంతా ఒకటే నొప్పి. అవునండీ నాకు తెలీకడుగుతాను ఈ విశాలమయిన భాగ్యనగరంలో వీధులు ఇరుకు, ఇళ్ళు ఇరుకు, రిక్షాలు ఇరుకు, మనుషుల మనసులు కూడా ఇరుకేనా?" అనడిగింది.

    ఇబ్బందిగా చూసి "మధుతో మీకేం పని?" అన్నాడు.

    ఆమె విసురుగా "నా మేనత్త కొడుకు! లగ్గం ఎప్పుడు పెట్టిస్తాడో అడుగుదామని వచ్చాను కానీ అవన్నీ నీకెందుకయ్యా! ముందు ఆ రిక్షా అతనికి డబ్బులిచ్చే ఏర్పాటు చూడు! ఏంటలా నిలువు గుడ్లేసుకు చూస్తావు? మా బావ వచ్చాకా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాడులే" అంది.

    మధు మాట్లాడకుండా డబ్బులు తీసి రిక్షా అతన్ని ఎంతయిందో అడిగి ఇచ్చేసాడు. ఆ అమ్మాయి వదిలిపెట్టిన సూట్ కేసు చేతబట్టుకుని అతను ఆశ్చర్యంగా గేట్లోకి అడుగు పెట్టేసరికి అప్పటికే ఆ అమ్మాయి చుట్టూ అందరూ సభతీర్చి వున్నారు.

    "మధు నా బావ. అతని వాటా ఎక్కడ?" ఆ అమ్మాయి అడుగుతోంది.

    "మధుకి మరదలు వున్నట్లు ఎప్పుడూ అనలేదే?" బామ్మగారు అనుమానంగా అంది.

    "పిల్ల లక్షణంగా వుంది"

    వనజాక్షి మెచ్చుకుంటూ క్రీగంట బామ్మగారి మనవరాలివేపు చూసింది. ఆ అమ్మాయి మొహం వాడిపోయింది.

    మధు సూట్ కేసుతో వచ్చి మెట్లెక్కుతుంటే అందరూ ఆశ్చర్యాన్ని అణచుకోలేక అతన్ని ప్రశ్నలు వెయ్యసాగారు.

    "ఏ వూరునుండి వచ్చిందీ?"

    "ఎంతకాలం వుంటుందీ?"

    "వస్తున్నట్లు ఉత్తరం అయినా వ్రాయలేదా?"

    మధు జవాబివ్వలేదు. పైకి వెళ్ళాకా గది తాళం తెరిచాడు.

    "బావ ఇంట్లోలేడా?" శ్రీజ అడిగింది.

    "లేడు" మధు చెప్పాడు.

    శ్రీజ విలాసంగా లోపలికి నడిచింది.

    మధు సూట్ కేస్ క్రింద పెట్టి మొహమాటంగానే అడిగాడు "మీరెవరు? ఎక్కడ్నించి వచ్చారు?"

    శ్రీజ అక్కడున్న ప్లాస్కు మూతతీసి చూస్తున్నదల్లా విసుగ్గా ముఖం చిట్లించి "చెప్పానుగా! మధు నాక్కాబోయే మొగుడు" అంది.

    "కాదు అబద్ధం" కాస్త గట్టిగా అన్నాడు మధు. "మీకెలా తెలుసు?" కాఫీని ప్లాస్కు మూతలోనే పోసుకుని తాగుతూ అడిగింది.

    "మధుని నేనే కాబట్టి" అని ఆమె మోహంలో రియాక్షన్ కోసం ఆత్రుతగా చూసాడు.

    "అలాగా.... మరి ఇందాకట్నించీ చెప్పలేదేం?" కాఫీ తాగుతూనే అడిగింది చాలా మామూలుగా.

    "ఇప్పటికయినా నిజం చెప్పండి" మధు అసహనంగా అన్నాడు.

    "ఇందాకట్నుంచీ చెపుతున్నది ఇప్పుడు నిజం అనుకోండి. నేను మిమ్మల్ని పెళ్లాడబోతున్నాను" సీరియస్ గా చెప్పింది శ్రీజ.

    "ఇట్స్ టూ మచ్...." కాస్త కంగారుగా, కాస్త భయంగా అరిచాడు మధు.

    శ్రీజ అతనివేపు నడిచి "ఎందుకంత కంగారూ? మీరు చాలా అందంగా వున్నారు. నిజంగానే మీలాంటి బావ వుంటే బావుండేదని పిస్తోంది" అంటూ అతని చేతిని అందుకుంది.

    మధుకి ఒళ్ళు జిల్లుమంది. గుండె దడదడలాడి ముఖంమీద చిరు చెమటలు అలుముకున్నాయి.

    "మీ చెయ్యి ఇలా ఒణుకుతోంది? అంటే ఆడపిల్లను తాకడం ఇదే మొదటిసారన్నమాట!" శ్రీజ నవ్వుతూ అడిగింది.

    మధు కంగారుగా చెయ్యి విదిలించుకుని "ముందు.... ముందు మీరెవరో చెప్పండి.... లేకపోతే" అన్నాడు.

    "ఊ.... లేకపోతే? ఏం చేస్తారు? అరుస్తారా? అరవండి చూద్దాం. మీరేం చెప్పినా ఎవరూ నమ్మరు" అంది కవ్విస్తున్నట్లు.

    మధు నిస్సహాయంగా చూస్తూ "నేను ఆఫీసుకి వెళ్ళాలి.... త్వరగా...." అన్నాడు.

    శ్రీజ చటుక్కున అతని తల వంచి పెదవుల మీద ముద్దు పెట్టుకుని "ఊ.... ఇక వెళ్ళిరండి" అంది.

    మధుకి తల తిరిగిపోయింది. కర్చీఫ్ తో మూతి తుడుచుకుని, "ఇదేమిటీ?" కోపంగా అరిచాడు.

    "మీరేగా ఆఫీసుకి వెళ్ళాలి త్వరగా ఇచ్చెయ్యమన్నారు?" తాపీగా మంచంమీద కూర్చుంటూ అంది శ్రీజ.

    మధు వేలు ఆడిస్తూ "సహనానికి కూడా హద్దుంటుంది" అన్నాడు.

    "శృంగారంలో ఆ మాట వాడకూడదు" జీనియస్ గా చెప్పింది శ్రీజ.

    మధుకి తను మాట్లాడ్తున్నది ఆడపిల్లతోనేనా అని అనుమానం వచ్చింది. నిశితంగా చూసాడు. చక్కగా తీర్చిదిద్దినట్లున్న అవయవ సంపదా, చామన ఛాయతో వున్నా, పెద్ద పెద్ద కళ్ళూ, కోటేరు ముక్కు, చిన్ని మూతీ, ఒంకులు తిరిగిన జుట్టూ అందంగానే వుంది. చూడగానే పదహారణాల ఆంధ్రుల ఆడపడుచు అనిపించేటట్లుగా వుంది. మడికట్టు కట్టుకుని తులసికోట చుట్టూ తిరుగుతున్న ఇల్లాలు ఎదురింటి బ్రహ్మచారి వైపు చూసి కన్ను కొట్టినట్లుగా వుంది ఆమె వరస!

 Previous Page Next Page