Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 22


   ఆడపిల్ల కట్టుదాటకూడదు. అన్నివేళలా అల్లరి పనికిరాదు అంది హైమత్త. నామీద నాకు నమ్మకం. అతన్ని ఆపగలను అని బీరాలు పలికి అతనింటికి చేరిన నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో పడ్డాను. వెంటనే అతనికి చెప్పకుండా ఇలా పారిపోయి వచ్చేసాను. అతని మనసు కూడా తెలుసుకున్నాను. ఎంతో మంచివాడు. ముఖ్యంగా ప్రేమించగలడు. అదేమిటీ ప్రేమించడం ప్రతివాడూ చెయ్యగలడు కదా! అనుకుంటున్నావా? ఆ అభిప్రాయం తప్పు! కాంక్షించడం అందరూ చేస్తారు. కానీ ప్రేమించడం కొందరే చెయ్యగలరు. అతను ప్రేమించడం మొదలుపెట్టగానే దూరంగా పంపించెయ్యడానికి సిన్సియర్ గా ప్రయత్నించాడు. నా భవిష్యత్తు గురించీ, శ్రేయస్సు గురించీ ఆలోచించాడు. నేను ఛాన్స్ ఇచ్చినా అందుకోలేదు. ఇంతకంటే ఏం అర్హతలు కావాలి? అతనికి నేను ప్రేమించడానికి? నా స్వయంవరంలో అతను నెగ్గాడు. కానీ నాన్నగారి సంగతి తెలుసుగా! మీ అమ్మ స్వంత చెల్లెలయినా తన ఇష్టంలేని పెళ్ళి చేసుకున్న కారణంగా ఆమెతో పూర్తిగా సంబంధాన్ని తెంచేసుకున్నారు. అదే మీ నాన్న ఇలా తాగుబోతూ, నాటకాలరాయుడూ కాకుండా లక్షాధికారి అయ్యుంటే తలమీద పెట్టుకునేవారు. రిషికి లక్షలు లేవు. కానీ నాకు నచ్చే అన్ని లక్షణాలూ వున్నాయి. కాబట్టి ప్రేమించాను. ప్రేమించడం అంటే నా చేతిలో పని కాబట్టి చేసేసాను. ఆ తర్వాత సంగతి ఎలా? నాన్నని నొప్పించలేను. ఎంతయినా ఈ ప్రపంచంలో ఆయనకి నేను తప్ప ఎవరున్నారు? అందుకే మధనపడుతున్నాను. ఈ సమయంలో నువ్వుంటే నాకు కాస్త మనశ్శాంతిగా వుంటుంది. ఆయన నిన్ను ఎలాగూ గుర్తుపట్టలేరు కనుక స్నేహితురాలిగా పరిచయం చేస్తాను. వెంటనే వచ్చేసెయ్యి. వచ్చేటప్పుడు అతన్ని ఒక్కసారి తడిమిరా! వచ్చాక ని నుంచి ఆ స్పర్సని అపురూపంగా అందుకుంటాను. నాకు ఆశ్రిత అని నువ్వు పేరు పెడితే అని అసలు పేరని తెలీక అతను మెచ్చుకోలుగా చూసినప్పుడు ఆ పేరు పెట్టుకున్నందుకు ఎంతగా గర్వించానో తెలుసా!
                                                                                                                          నీ  ఆశ్రిత.

    శ్రీజ ఉత్తరం చదివి దీర్ఘంగా నిట్టూర్చి మరో కవర్ లోంచి ఇంకో ఉత్తరం తీసింది. అది రిషి వ్రాసినది. ఆశ్రిత ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజెయ్యమని మధు ఎడ్రస్ ఇచ్చాడు.

    ఆ రాత్రి శ్రీజ హైమతో చెప్పింది- "నేను రేపే హైదరాబాదు వెళుతున్నాను. ఆశ్రిత రమ్మని వ్రాసింది. అక్కడే ఏదయినా ఉద్యోగం చూసుకుంటాను."

    "మామయ్యా వాళ్ళింటికా?" హైమ భయంగా చూసింది.

    శ్రీజ స్థిరంగా- "హైదరాబాద్ వెళుతున్నాను" అంది.

    హైమ బాధగా- "ప్రతి తల్లీ ఈడొచ్చిన కూతురితో అదే పనిగా ఓ మాట చెపుతూ వుంటుంది. అది నేను చెప్పినా నువ్వు పాటించవు. అదేమిటో తెలుసా?" అంది,

    "జాగ్రత్త" శ్రీజ ఠక్కున చెప్పి అక్కడ్నించి లేచి వెళ్ళిపోయింది.

    హైమ చేతులు జోడించి భగవంతుణ్ణి ప్రార్ధించింది- "ఈ పిల్ల బ్రతుకు సవ్యంగా సాగేటట్లు చూడు భగవాన్!" అని.

                                                                   *    *    *    *

    నిద్రలేచి మొహం కడుక్కుంటున్న రిషికి క్రిందనుంచి ఏదో గొడవ విన్పించింది.

    "క్రింద గొడవ ఏమిటో చూసిరా!" మధు స్నానం చేస్తూ చెప్పాడు.

    రిషి క్రిందికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కొత్త మనుషులున్నారు. వనజాక్షి రుద్ధకంఠంతో అంటోంది- "డ్యూటీలో వుండగా ఆయన్ని చితక్కొడితే వైద్యంకూడా చేయించలేదు మీ ఓనర్. ఇప్పుడు ఇబ్బందితో వుండి వున్నపళంగా వచ్చి చేరిపొమ్మంటే ఎలా? ఇంకా కాలూ, చెయ్యీ స్వాధీనంలోకే రాలేదు. ఆ కొట్టిన వెధవల కాళ్ళూ, చేతులూ పడిపోనూ- వాళ్ళింట్లో పీనుగులెళ్ళా...."

    "అబ్బబ్బా ఆపండమ్మా! ఓనర్ గారు వెంటనే వచ్చి జాయిన్ అవకపోతే ఉద్యోగం వూడినట్లేనని చెప్పమన్నారు. చెప్పా అంతే! ఇంకో మనిషి వెంటనే కుదరక మాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా?" వచ్చినతను రుసరుసలాడాడు.

    "పోనీ మా అబ్బాయి బదులు నేను చేస్తా! సినిమాహాల్లో టిక్కెట్లు ఇయ్యడమేగా!" ముసలాయన ఒంటికి నూనె రాసుకుంటూనే అడిగాడు.

    వచ్చిన వాళ్ళలో కాస్త బలంగా వున్న ఆ వ్యక్తి నవ్వి- "పాత తాటాకులా ముట్టుకుంటే ఫెళుక్కుమనేట్లున్నావు. నువ్వేం చెయ్యగలవయ్యా! మాకు కావాల్సింది మంచి బలంగా ఏదొచ్చినా తట్టుకునేటట్లుండే యువకుడు" అన్నాడు.

    రిషి కలగజేసుకుని- "విశ్వనాధం గారికి ఆరోగ్యం చేకూరేదాకా నేను చేస్తాలెండి ఆ పని!" అన్నాడు.

    వాళ్ళు రిషివంక పరీక్షగా చూసారు. బలంగా, స్ఫురధ్రూపంతో వున్న ఆ యువకుడు వాళ్ళకి నచ్చినట్లే కన్పించాడు. "సరే ఐతే చప్పున రండి" అన్నారు.

    వనజాక్షి కృతజ్ఞతగా చూసింది.

    ముసలాయన రిషి దగ్గరకొచ్చి- "జాగ్రత్త నాయనా! ఆ భారత్ టాకీస్ లో టికెట్లు అయిపోయాయంటే చాలు చితకబాదేస్తారు. కొత్త సినిమా విడుదలయిన రోజు కాస్త అందకుండా చూస్కో!" అన్నాడు.

    రిషి నవ్వి- "ఉండండి ఇప్పుడే వస్తా!" అని మధుకి చెప్పి రావటానికి పైకి వెళ్ళాడు.

 Previous Page Next Page