రోడ్డుకి ఎడం ప్రక్కన రెండు బిల్డింగులు వంటరిగా వున్నాయి.
"ఫోన్ నెంబర్... సుందర్ లాల్... అన్న వ్యక్తి పేరు మీద వుంది సార్" ఆపరేటర్ సెప్పిన మాటలు మరోసారి గుర్తుకు చేసుకున్నాడు ఆయన.
ఆ రెండు బిల్డింగుల్లో మొదటి బిల్డింగ్ వైపు నడిచాడు.
"సుందర్ లాల్ బిల్డింగ్ యిదేనా?" దేశ్ ముఖ్ వైపు ఎగాదిగా చూశాడు ఆ గేటు దగ్గరున్న గూర్ఖా.
"ఆ బిల్డింగు సార్" చెప్పాడు గూర్ఖా.
రెండో బిల్డింగు వైపు అడుగులు వేశాడు ఆయన.
ఆయన గేటు దగ్గరకు వెళ్ళగానే వినయంగా గూర్ఖా గేటు తెరిచాడు. సలాం చేశాడు.
సిమెంట్ బాట మీంచి నడిచి హల్లోకి అడుగుపెట్టిన దేశ్ ముఖ్ నాలుగు వైపులా చూశాడు.
ఎక్కడా మనిషి వున్న శబ్దం లేదు.
"బేబీ!" పిలిచాడు ఆయన ఆ పిలుపుకి జవాబు లేదు.
హాలు మధ్యలో వున్న మెట్లమీంచి ఫస్టు ఫ్లోర్లోకి అడుగు వేశాడు.
ఎదురుగా ఓ గది!
ఆ గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. నెమ్మదిగా ఆ తలుపుల్ని లోనికి తోశాడు.
"వెల్ కమ్... దేశ్ ముఖ్... సాబ్... వెల్ కమ్..." హాలు మధ్యన ఉయ్యాల్లో కూర్చున్న అచ్యుతమునిని చూసి ఉలిక్కిపడ్డాడు దేశ్ ముఖ్.
"మీరు ఎవరికోసం వచ్చారో నాకు తెలుసు. మీరు ఆ వ్యక్తిని కలవాలనుకుంటున్నారు కదూ?"
జవాబు చెప్పలేదు ఆయన. అలాగే నిలబడ్డాడు.
"ది గ్రేట్ ఇండస్ట్రయలిస్ట్ ఒక పసిదాని కోసం రావడం మార్వలెస్."
ముందుకొచ్చి-
దేశ్ ముఖ్ చెయ్యి పట్టుకుని ముందుకు తీసికెళ్ళి సోఫా మీద కూర్చోపెట్టాడు గౌరవంగా.
అచ్యుతముని ముఖంలోకి సూటిగా చూశాడు దేశ్ ముఖ్.
నిశాంత అచ్యుతమునికేమవుతుంది? ఆలోచిస్తున్నాడు ఆయన.
"నేను నిశాంతని కలవడానికొచ్చాను" పొడిగా అన్నాడు ఆయన.
అచ్యుతముని ఇంటర్నేషనల్ బ్రోకర్. పొలిటీషియన్లకు, బిజినెస్ మెన్కు మధ్య వారధి. అందుకే అచ్యుతమునిని ఎప్పుడూ ఎంటర్ టైన్ చెయ్యలేదు దేశ్ ముఖ్- సాక్షాత్తూ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ నుంచే ఫోను చేసేవాడు అచ్యుతముని.
"మీరూ వ్యాపారవేత్తే, నేనూ వ్యాపారవేత్తే మీరు కోరుకునేది మనీ పోలిటిక్స్... నేను కోరుకునేది పవర్ పోలిటిక్స్. సో... మిస్టర్ దేశ్ ముఖ్! నేను మీ సహాయం కోరి, మీ దగ్గరకు రావాలనుకున్నాను... అనుకోకుండా మీరే వచ్చారు."
"నీకూ! నా సహాయం కావాలా?" నమ్మలేనట్లుగా చూశాడు దేశ్ ముఖ్ అచ్యుతమునివైపు.
"అవును! మీకేం కావాలన్నా యిస్తాను. అది డబ్బు రూపంలో కావచ్చు, అధికార రూపంలో కావచ్చు" గర్వంగా చెప్పాడు అచ్యుతముని.
"నీకేం సహాయం కావాలి?" అడిగాడు దేశ్ ముఖ్.
"మీ బిజినెస్ గ్రూపులో మావాడిని పార్టనర్ గా చేర్చుకోవాలి" వెంటనే చెప్పాడు అచ్యుతముని.
"ఎవరా వ్యక్తి?"
"ధర్మశేఖర నాయుడు! ఎక్స్ ఎం.పి. అతను మీకు బాగా వుపయోగపడతాడు."
"అతను నాకంటే! ముందు నీకు బాగా వుపయోగపడతాడనుకుంటాను" నర్మగర్భంగా అన్నాడు దేశ్ ముఖ్.
"అవును! నాకు వుపయోగం లేనిదే నేనే పనీ చెయ్యను. ధర్మశేఖర నాయుడ్ని మీ గ్రూప్ లో కలుపుతానని మాటిచ్చాను. ఆ సహాయం నాకు చెయ్యండి. మీకే సహాయం కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా నేను రెడీగా వున్నాను."
లేచి నిలబడ్డాడు దేశ్ ముఖ్.
"ఓ.కె. మిస్టర్ అచ్యుతముని! ధర్మశేఖర నాయుడ్ని నాదగ్గరకు పంపించు."
ఆయన తన ప్రపోజల్ కు వెంటనే ఒప్పుకుంటాడని వూహించని అచ్యుతముని గర్వంగా తనలో తను నవ్వుకుని లేచి నిలబడ్డాడు.
"అచ్యుతముని! నేను కూడా నాకు వుపయోగం లేని పనిని నేనెప్పుడూ చెయ్యనని నీకు తెలుసు. నా ద్వారా ధర్మశేఖర నాయుడు ఎలా లాభ పడాలనుకుంటున్నాడో, ఆ నాయుడు ద్వారా నువ్వెలా లాభపడాలనుకుంటున్నావో! అన్నీ నాకు తెలుసు. కానీ నువ్వు నాకొక సహాయం చెయ్యాలి."
"అడగండి! మీకెలాంటి సహాయం కావాలి... ఏ దేశం నుంచి కావాలో అడగండి... ఐయామ్ రెడీ టు డు ఇట్ ఇమ్మీడియట్లీ..." అన్నాడు అచ్యుతముని ఆ సహాయం ఎలాంటిదో వూహిస్తూ.
"నాకు డబ్బు అఖ్ఖర్లేదు. పొలిటికల్ పవర్ అఖ్ఖర్లేదు. నాకు కావల్సింది ఒక వ్యక్తి ఆ వ్యక్తి నిశాంత" దేశ్ ముఖ్ నోటి నుంచి వచ్చిన ఆ మాటకు లోలోనే నవ్వుకున్నాడు దేశ్ ముఖ్.
"ఆ అమ్మాయితో మీకేం పని?" అడిగాడు అచ్యుతముని తెలిసినా తెలియనట్లుగా.
"నాకు వ్యక్తులతో పనిలేదు. వ్యక్తుల్లోని శక్తులతో పని" ముందుకు నడుస్తూ అన్నాడాయన.
"మీరు హోటల్ కి వెళ్ళేసరికి మీకెదురుగా వస్తుంది. మీ నిశాంత" అన్నాడు అచ్యుతముని తన పథకం పారబోతున్నందుకు ఆనందిస్తూ.
బయటికెళ్ళిపోయిన దేశ్ ముఖ్ గురించి ఆలోచిస్తూ ఉయ్యాల్లో వూగుతున్న అచ్యుతమునివైపు-
అప్పుడే పక్కగదిలోంచి వచ్చిన జయమేజయరావు ఆశ్చర్యంగా చూశాడు.
అచ్యుతముని, దేశ్ ముఖ్ మధ్య జరిగిన సంభాషణంతా విన్న జనమేజయరావుకి ఎం అర్ధంకాలేదు.
అదే అడిగాడు జనమేజయరావు.
ఆ ప్రశ్నకు చిద్విలాసంగా నవ్వాడు అచ్యుతముని.
"పదునైన ఆయుధానికి పది అంచులుంటాయి. అలాగే తెలివితేటలకు కూడా. ఆయన నిశాంతను ఎందుకు కోరుకున్నాడో నాకు తెలుసు... నిశాంతను ఎందుకు ఉపయోగిస్తాడో నాకు తెలుసు. నాకు కావల్సింది అదే. అందుకే..."
"అంటే?"