Previous Page Next Page 
ఆక్రోశం పేజి 22


    టక్కున ఫోన్ పెట్టేసింది నిశాంత.

 

    కృపానంద దేశ్ ముఖ్!

 

    నిశాంత పెదవుల మీద చిరునవ్వు విరిసింది. గబగబా డైరెక్టరీ పేజీలు తిప్పుతోంది.

 

    ఎందుకో వంటిమీద చిరుచెమటలు పట్టేశాయి.

 

    కృపానంద దేశ్ ముఖ్... పేరు కెదురుగా 2425246 ఫోన్ నెంబర్-

 

    బటన్స్ పుష్ చేయడం ప్రారంభించింది.


                                                      *    *    *    *


    గ్లాస్ టీపాయ్ మీదున్న కార్డ్ లెస్ టెలిఫోన్... బర్ర్ మని శబ్దం చేయడంతో అటూ యిటూ పచార్లు చేస్తున్న-

 

    దేశ్ ముఖ్ గబుక్కున ఫోన్ అందుకున్నాడు.

 

    "హలో..."

 

    ఫోన్ లో వెంటనే మాట వినబడలేదు. నవ్వు వినబడింది.

 

    ఆ నవ్వు ఎవరిదో గుర్తు పట్టడానికి క్షణకాలం కూడా పట్టలేదు ఆయనకీ.

 

    "వాటే ఇంటెలిజెంట్ గర్ల్ షీ ఈజ్..." మెచ్చుకోకుండా వుండలేక పోయాడతను.

 

    "చూశారా... మిస్టర్ దేశ్ ముఖ్! మీరు దొరికిపోయారు."

 

    "కంగ్రాచ్యులేషన్స్... ఎలా పట్టుకున్నావ్?" ఆయనకి నిజంగా చాలా ఆశ్చర్యంగా వుంది.

 

    "దిసీజ్ కాల్డ్ బ్రెయిన్ గేమ్ సర్." హుషారుగా అంది నిశాంత.

 

    "ఇప్పటికైనా నీ పేరు చెప్తావా?" అడిగాడు ఆయన.

 

    "గెలిచింది నేను ఓడిపోయింది మీరు... మీరే కనుక్కోవాలి... కనుక్కోగలరా?" కవ్వింపుగా అడిగింది నిశాంత.

 

    ఒకక్షణంలో ఆలోచనలో పడ్డాడు ఆయన.

 

    "ఓ.కె. బీ రెడీ... నువ్వెక్కడున్నావో పట్టుకుంటాను. నీ దగ్గర కొచ్చి, నీ పేరు చెప్తాను... చెప్తే నాకేమిస్తావు?"

 

    థ్రిల్ గా వుంది ఆయనకి.

 

    "మీరు నన్ను ట్రేస్ చేసిన తర్వాత గదా... టైమ్, ఫస్ట్, సీయూ" టక్కుమని ఫోన్ పెట్టేసింది నిశాంత.

 

    మనసులో నవ్వుకున్నాడు ఆయన. వెంటనే ఆపరేటర్ కి ఫోన్ చేశాడు.

 

    తనకు ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో తెల్సుకోమని.

 

    "పూర్ బేబీ! నువ్వు నన్ను తెల్సుకోవడం కష్టం... నిన్ను నేను తెల్సుకోవడం ఇట్స్ టూ ఈజీ ఫర్ మీ..."

 

    ఆపరేటర్ దగ్గర్నించి వచ్చే ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆయన.


                               *    *    *    *


    దేశ్ ముఖ్ తో మాట్లాడి రిసీవర్ని క్రెడిల్ మీద వుంచిన నిశాంత- అడుగుల చప్పుడికి తలెత్తి చూసింది.

 

    ఎదురుగా అచ్యుతముని, ఆ ప్రక్కన జనమేజయరావు, కొంచెం దూరంలో ఆయా ఎలిజబెత్.

 

    నిశాంతవైపు ఆపాదమస్తకం చూశాడు అచ్యుతముని.

 

    "అనుకున్న గడువు కంటే ముందే వజ్రాయుధాన్ని తయారు చేసావ్... ఐ ఎప్రిషేట్ యూ జనమేజయా... నిశాంత అందమైందే కాదు, తెలివైంది కూడా" నవ్వాడు అచ్యుతముని.

 

    ఎందుకు అచ్యుతముని అలా నవ్వుతున్నాడో అర్ధంకాలేదు నిశాంతకు. తనెందుకు దేశ్ ముఖ్ ని ఆకర్షించాలో కూడా అర్ధంకాలేదు నిశాంతకు.


                                                   *    *    *    *


    హోటల్ తాజ్ మహల్ ఇంటర్ కాంటినెంటర్లో తన సూట్లోంచి బయటికొచ్చిన దేశ్ ముఖ్.

 

    తిన్నగా లిఫ్ట్ వైపు నడిచాడు. మరో మూడు నిమిషాల తర్వాత లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్లోకొచ్చింది.

 

    అప్పుడు సమయం-

 

    సరిగ్గా రాత్రి పదిగంటలు

 

    ఆయన్ని చూసిన సెక్యూరిటీ స్టాఫ్, నాలుగువైపుల నుంచి పరిగెత్తుకొచ్చారు.

 

    అదే సమయంలో పి.ఎ. సుభాష్ చంద్ర మెట్లమీద నుంచి కిందకు దిగుతున్నాడు.

 

    "మిస్టర్ సుభాష్! అర్జంటు పనిమీద బైటకెళ్తున్నాను. కారు వద్దు... సెక్యూరిటీ స్టాఫ్ వద్దు... ఆటోని కేకేయ్."

 

    ఆయన ఏమంటున్నాడో వెంటనే అర్ధంకాలేదు సుభాష్ చంద్రకి. అర్ధంకాగానే షాక్ తిన్నాడు. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకుని-

 

    "టాక్సీని పిలుస్తాను సర్!" అన్నాడు ఒకింత భయంగా.

 

    కాదనలేదు దేశ్ ముఖ్. మరో నిమిషానికే టాక్సీ ఎక్కాడు ఆయన.

 

    టాక్సీ ముందుకు దూసుకుపోయింది.

 

    సుభాష్ చంద్రతో పాటు, సెక్యూరిటీ స్టాఫ్ నిశ్చేష్టులై నిలబడిపోయారు.


                                                      *    *    *    *


    జుహూ బీచ్ ఏరియాలోని శివసాగర్ రోడ్డు...

 

    ఆ రోడ్లో వున్న బిల్డింగుల్లో ఓ బిల్డింగ్ లోంచి తనకు ఫోను వచ్చింది.

 

    ఆపరేటర్ చెప్పిన మాటలు మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు కృపానంద దేశ్ ముఖ్.

 

    నిశాంత తననెందుకు ఎట్రాక్ట్ చేసింది? నిశాంత కోసం తనెందుకు వెళ్తున్నాడు? కొన్ని గంటల నుంచి ఆయన్ని వేధిస్తున్న ప్రశ్నలివి.

 

    ప్రతి సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ కి తనొక గుడ్ టాలెంట్ స్పాటర్ ననే నమ్మకం సహజంగా వుంటుంది. అలాంటి నమ్మకమే దేశ్ ముఖ్ లో కూడా వుంది.

 

    నిశాంత జ్ఞాపకం వచ్చినప్పుడల్లా క్లియోపాత్రా గుర్తుకొస్తోందతనికి.

 

    అందం గొప్పదా? తెలివితేటలు గొప్పవా?

 

    ఆకర్షణ గొప్పదా? చొరవ గొప్పదా?

 

    ఇంతకీ నిశాంత ఎవరు? అది తెల్సుకోడానికే వెళుతున్నాడు దేశ్ ముఖ్.

 

    ఆ ప్రశ్నకు జవాబు తెలిస్తే... కథ వేరే మలుపు తిరిగేదేమో...?


                                                   *    *    *    *


    శివసాగర్ రోడ్డు నిర్మానుష్యంగా వుంది.

 

    టాక్సీ దిగి రోడ్డు ప్రక్కనున్న బిల్డింగుల వైపు చూస్తూ నడుస్తున్నాడు ఆయన.

 Previous Page Next Page