"రిచ్చా కావాలా సార్..."
ఊహాలోకం నుండి ఈలోకంలోకి వచ్చాడు రాంబ్రహ్మం.
రిక్షా బేరమాడుకుని ఎక్కాడు.
ఆఫీసు వచ్చింది.
రిక్షా దిగి రిక్షావాడి చేతిలో రెండ్రూపాయలు పెట్టాడు. రిక్షావాడు రెండ్రూపాయలు నోటుని అటూ ఇటూ తిప్పాడు.
రాంబ్రహ్మం భయంగా గుడ్లు మిటకరిస్తూ చూశాడు.
రిక్షావాడు నోటుని జేబులో పెట్టేస్కున్నాడు.
రాంబ్రహ్మం తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. రిక్షావాడు నోటుకి ఉన్న చిరుగుని చూస్కోలేదు! దేవుడు రక్షించాడు!!...
తన సీట్లో కూర్చుని పనిచేస్కుంటుండగా కాంట్రాక్టరు చలమయ్య వచ్చాడు.
రాంబ్రహ్మం చలమయ్యని చూసి కళ్లెగరేశాడు.
చలమయ్య "హిహిహి"అన్నాడు
"అలా నవ్వకయ్యా... లాభం లేదు..." అన్నాడు రాంబ్రహ్మం.
"మీరలా అంటే ఎలాగండీ...మనం మనం ఒకటీ..." అన్నాడు చలమయ్య.
"ఒకటి ఎలా అవుతామయ్యా... నీ కులం వేరు నా కులం వేరు...ఆ ?"
"మీరు తల్చుకుంటే అవుతామండి"
"కానీ ఎలాగయ్యా... ఈ కాంట్రాక్టు నీకెలా ఇస్తాం... నీ టెండరుకంటే వెంకట్రావు టెండరు తక్కువుందే"
"కానీ టెండరుని చింపవతలపారేసి పోస్టులో మిస్సయి ఉంటుంది అందలేదని అనండి"
"కానీ దానివల్ల నాకేం లాభం?"
"హిహిహి..."
"నీ నవ్వులెవడికి కావాలయ్యా...
"నవ్వులు కావండి... కట్టలండి!... కట్టలు!!... మీరు కాస్త బల్లకింద చెయ్యిపెట్టండి" అన్నాడు చలమయ్య తన వాలెట్ లోంచి నోట్ల కట్టలు తీస్తూ.
రాంబ్రహ్మం ఘొల్లున నవ్వాడు.
"నువ్వు చాలా పాత కాలపు మనిషిలా ఉన్నవే! ఇదివరకు అంతా సత్తెకాలపు మనుషులు. లంచం తీసుకోవాలంటే భయపడేవాళ్లు! అందుకే బలకింద చేతులు పెట్టేవారు. ఇది రాకెట్ యుగం. బల్లమీంచే బాహాటంగా తీసుకోవచ్చు!!
దేశం సాధించిన అభివృద్ధికి చలమయ్య ఆశ్చర్యపోయి నోట్లకట్టలు టేబులుమీద ఉంచాడు.
"ఇంక నువ్వెళ్ళొచ్చు ... కాంట్రాక్టు నీకే..."
చలమయ్య వెళ్లిపోయాడు.
రాంబ్రహ్మం సీలింగువైపు చూసి చెంపలేస్కున్నాడు.
"దేవుడి దయవల్ల ఈ వేళ ఇరవైవేలు సంపాదించాను" అనుకున్నాడు.
మధ్యాహ్నం ఆఫీసంతా గగ్గోలెత్తిపోయింది.
పనిచేస్తూ పనిచేస్తూనే వీరాస్వామి హార్ట్ ఎటాక్ తో మరణించాడు!
అంత మంచిమనిషి పోయినందుకు ఆఫీసులో అందరూ చాలా విచారించారు.
సాయంత్రం సంతాపసభ ఏర్పాటు చేశారు.
అందరూ ఒక మంచిమనిషి పోయినందుకు ఎంతో విచారిస్తూ స్పీచిలిచ్చారు.
రాంబ్రహ్మం తన సంతోషాన్ని దాచుకుంటూ వీరాస్వామి మృతికి బాధపడ్తున్నట్లు స్పీచి ఇచ్చాడు. మనసులో మాత్రం దేవుడికి కృతజ్ఞతలు తెల్పుకున్నాడు.
వీరాస్వామి మరణం వల్ల రాంబ్రహ్మంకి సెక్షన్ ఆఫీసరుగా ప్రమోషన్ వచ్చింది.
ఆ సందర్భంగా రాంబ్రహ్మం తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నాడు.
వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం అయ్యింది. తలనీలాలు కూడా సమర్పించుకున్నాడు కాబట్టి అతని పాపాలన్నీ పటాపంచలై పోయాయ్.
రాంబ్రహ్మం తేలికగా ఊపిరిపీల్చుకున్నాడు.
మళ్ళీ హాయిగా పాపాలు చేస్కోవచ్చు!!
రాంబ్రహ్మం తిరుగు ప్రయాణమయ్యాడు.
భక్తులు ప్రయాణిస్తున్న బస్సు తిరుపతి కొండల లోయల్లోకి దొర్లిపోయి బస్సులోని అందరూ మరణించాడు.
మర్నాడు దినపత్రికల్లో వార్త ఇలా ప్రచురింపబడింది.
"లోయలోకి బస్సు దొర్లి భక్తుల మృతి-వెంకటేశ్వరస్వామి భక్తులను తనలో లీనం చేస్కుని వారికి ముక్తిని ప్రసాదించాడు"
* * *
(దేవుడికి ఇలాంటి భక్తుల కోర్కెలు తీర్చడం, వారు చేసే పాపాల్ని ఒక్క కొబ్బరి కాయతో తుడిచెయ్యడం తప్ప మరేం పనీపాటా ఉండదు)
ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్
కృష్ణారావు రాస్తున్న ఫైలు పక్కనపెట్టి బద్దకంగా ఒళ్లు విరుచుకున్నాడు. ఆ తర్వాత "ఊ..." అన్నాడు. పది సెకన్లు ఆగి "ఆ..." అన్నాడు. ఆ తర్వాత మరో పన్నెండు సెకన్లు ఆగి "ఊహ్హూ..." అని మరోసారి ఒళ్లు విరుచుకుని 'ఉహుహుహు' అన్నాడు.
"ఏంటోయ్ నీ బాధా?" అని అడిగాడు ఉండబట్టలేక పక్క సీట్లోని విశ్వనాథం.
"నాకు చెడ్డ దురదగా ఉందోయ్... ఒళ్లంత తీటగా కూడా ఉంది... మరి మా ఆవిడలేదు కదా?... హిహిహి ..." అన్నాడు కృష్ణారావు మెలికలు తిరుగుతూ.
"అంటే మీ ఆవిడ రోజూ నీకు గోకుతూ ఉంటుందా?" అమాయకంగా అడిగాడు విశ్వనాథం.
విశ్వనాథం కన్నుమూసి తెర్చేలోగా కృష్ణారావు సీట్లో లేడు.
ఏమైపోయాడబ్బా వీడు అని అనుకుంటుండగా కింద నేలమీద గిలగిల కొట్టుకుంటూ కనిపించాడు.
"హర్రెర్ర్రె... వీడికి మూర్చలరోగం ఎప్పట్నుండి వచ్చిందబ్బా?..." అని కంగారుగా ప్యూనుకోసం అటూ ఇటూ చూసి "ఒరియ్ చెంచయ్యా... అర్జంటుగా బిందెడు నీళ్లు పట్రా" అని అరిచాడు.
"నోర్ముయ్... నాకేం మూర్ఛల రోగం లేదు... నీ అమాయకత్వానికి నేను నవ్వలేక చస్తూ కిందపడి దొర్లతున్నా..." నేలమీది నుండే ఓ అరుపు అరిచి మళ్లీ కాసేపు గిలగిల్లాడిపోతూ నవ్వి ఆనక కిందనుండి లేచి బట్టలు దులుపుకుని సీట్లో కూర్చున్నాడు.