"ఇంతకూ పెళ్ళిచూపులు ఎప్పుడు?"
"ఇప్పుడేరా, ఓ పావుగంటలో."
సుధాకర్ చేతికున్న రిస్టువాచిలో టైము చూసుకున్నాడు. ఆ వాచి అతను స్కూలు ఫైనలు పాసయినప్పుడు తండ్రి కొనిచ్చింది. ఏడున్నర దాటింది.
"అందుకే నీకోసం వచ్చాను. మా అమ్మా, నాన్నా ఈ పాటికి వెళ్ళిపోయి వుంటారు. నేను తోడులేకుండా వెళ్ళలేక నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. వాళ్ళక్కడ నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు. రారా పోదాం!" రాజారావు బ్రతిమాలుతూ అన్నాడు.
సుధాకర్ అతని అభ్యర్ధనని త్రోసిపుచ్చుతూ 'నా విషయం తెలుసుగా? ఈ పెళ్ళి చూపులూ, ఆడవాళ్ళూ, గీడవాళ్ళూ నా తత్వానికి సరిపడదు. అదీగాక నలుగురిలోకి రావడానికి నాకు చాలా మొహమాటం. దయవుంచి నన్ను విడిచిపెట్టారా బ్రదర్! నీ విషయమయితే వేరు. నువ్వు పెళ్ళిచేసుకోవలసిన వాడివి. ఆ అమ్మాయిని ఏలుకోవలసినవాడివి. నామాట విని వెళ్ళిరా" అన్నాడు.
రాజారావు స్నేహితుడికి దగ్గరగా జరిగి భుజంమీద చేయివేశాడు. "నీమీద ఎంతో ఆశపెట్టుకుని వచ్చాను. నామాట కాదనకురా బాబూ ప్లీజ్! నేను ఒక్కడ్నీ వెళ్ళలేనురా!" అన్నాడు మరింత దీనంగా ముఖంపెట్టి.
సుధాకర్ మరింక నిరాకరించలేకపోయాడు. 'సరేపద' అన్నాడు విధిలేనట్లుగా ఇద్దరూ తిరిగి లోపలకువచ్చాక లైబ్రేరియన్ కి పుస్తకం హేండోవర్ చేసి బయటకు నడిచారు.
బయట నల్లరంగు ఫియట్ కారు స్ట్రీట్ లైటు వెలుతురులో నిగనిగలాడుతూ కనిపించింది.
బయట నల్లరంగు ఫియట్ కరు స్ట్రీట్ లైటు వెలుతురులో నిగనిగలాడుతూ కనిపించింది.
"కారులో వచ్చావా ఏమిటి? నేను సైకిలుమీద వచ్చానే......"
"మనం కారులోపోదాం సైకిలు లైబ్రేరియన్ కు అప్పజెబుదాం. రేపు ప్రొద్దునవచ్చి తీసుకోవచ్చు."
ఇద్దరూ మళ్ళీ వెనక్కివెళ్ళి సైకిలు మెట్లెక్కించి లైబ్రేరియన్ కప్పజెప్పి కరు దగ్గరకు వచ్చారు. రాజారావు స్టీరింగుముందు కూర్చున్నాడు. సుధాకర్ అటువైపు నుంచి తిరిగివచ్చి అతని ప్రక్కగా కూర్చున్నాడు.
బుయ్యి.....అని చప్పుడుచేస్తూ కారు కదిలి, ముందుకు దూసుకుపోయింది.
సుధాకర్ ఆనందంగా అన్నాడు "ఫియట్ కారంటే నాకు చాలాఇష్టం. బయల్దేరేటప్పుడు విమానంలా శబ్దంచేస్తూంది. ఆ శబ్దం నాకెంతో ఇష్టం.
రాజారావు ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు.
"సైకిలు మనం బయటవుంచి వచ్చేసినా పెద్ద ప్రమాదం జరిగివుండేది కాదు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఇలాగే లైబ్రరీకి వెళ్ళి సైకిలక్కడ మర్చిపోయి ఇంటికెళ్ళిపోయాను. మరునాడు ఆదివారమవడం వల్ల కాలేజీ కెళ్ళే అవసరం రాక, ఆరోజంతా బయటికొచ్చే పనికూడా లేక ఇంట్లోనే వుండిపోయాను. ఆ మరునాడు బయటకు వెడదామని చూసుకుంటే సైకిలు కనిపించలేదు. ఆలోచించగా ఆలోచించగా సైకిలు లైబ్రరీలో మర్చిపోయానని గుర్తువచ్చింది. సోమవారం అవటంవల్ల లైబ్రరీ వుండదు. అయినా వెళ్ళిచూస్తే ఎందుకయినా మంచిదని ఆదరాబాదరాగా వెళ్ళి చూసేసరికి లైబ్రరీ తాళం వేసివుంది కానీ సైకిలు మాత్రం ఎలా తాళంవేసి వుంచానో, అలాగే వుంది అని చెప్పి సుధాకర్ విరగబడి నవ్వాడు.
"ఇంకోసారేం జరిగిందంటే పోస్టాఫీసుకు వెళ్ళి అక్కడే కూర్చుని ఉత్తరం రాసి పోస్టుచేసి సైకిలుకోసం చూసుకునేసరికి కనిపించలేదు. ఇంకేముంది? పోయిందనుకుని, ఏంచేయటమా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. అక్కడ చాలామంది సైకిళ్ళున్నాయి. అంతకుముందు వచ్చినవాళ్ళు సైకిళ్ళెక్కి వెళ్ళిపోతున్నారు. చాలాసేపు గడిచిపోయింది. ఇంతలో ఎవరో ముసలాయన.....కళ్ళజోడు అదీ వుంది. పోస్టాఫీసుముందు సైకిలు దిగాడు. నా కళ్ళను నమ్మలేకపోయాను. అది నా సైకిలు. చూపు సరిగ్గా ఆనక నా సైకిలు పట్టుకెళ్ళిపోయి వుంటాడు. ఆనక పొరపాటు గుర్తించి మళ్ళీ వచ్చాడనుకుని ఏం చేస్తాడా అని చూస్తున్నాను. సైకిలు స్టాండువేసి, లోపలకు వచ్చి జేబులోంచి కారుతీసి డబ్బాలోవేసి మళ్ళీ బయటికి వచ్చి నా సైకిలుదగ్గరకే వచ్చి ఎక్కబోతున్నాడు. ఇహ ఆలస్యంచేస్తే పనికాదని గబగబ ముందుకువెళ్ళి "ఈ సైకిలు నాది" అని అరుస్తూ హ్యాండిలు మీద చెయ్యివేసి పట్టుకున్నాను. ఆ ముసలాయన నావంక ఎగాదిగా చూసి "సైకిలు నీదంటావేమిటబ్బాయి? నాదైతేనూ...." అంటూ ఇంతలో ఏదో అనుమానం తోచి, సైకిలు వంక పరకాయించి చూసి, "అరెరె, ఇది నాదికాదే? దీనిమీద ఎలా ఎక్కాను?" అని దాన్నక్కడ వదిలేసి, లోపలికెళ్ళి పదినిముషాల పాటు వెతుక్కుని నా సైకిలుకు ఏమాత్రమూ రూపురేఖల్లో పోలిక లేని సైకిలు నొకదాన్ని బయటకీడ్చుకొచ్చి నావంక చూసి ఓ బోసినవ్వు పారేసి, దాన్నెక్కి బరబర తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. గమ్మత్తేమిటంటే కార్డు పోస్టు చెయ్యటానికి అతను తిరిగిరాకుంటే అతను సంవత్సరాల తరబడి పొరపాటు గుర్తించకుండానే నా సైకిలునే వాడుకుంటూ వుండేవాడు" అని మళ్ళీ విరగబడి నవ్వాడు.
నవ్వులమధ్య పెళ్ళివారిల్లు వచ్చేసింది. గేటుముందు రాజారావు తండ్రివాళ్ళు ఎక్కివచ్చిన అంబాసిడర్ కారు నిలబడివుంది. గేట్లో ఇద్దరు పెద్దమనుషులు. ఒకాయన ఇల్లుగలాయన, ఒకాయన పెళ్ళికూతురి తండ్రి అయివుంటారు. నిలబడి రాజారావుకోసమే కాబోలు ఎదురుచూస్తున్నారు.
రాజారావు సుధాకర్ కారు దిగారు.
అందులో ఒకాయన ముందుకువచ్చి "రండి, రండి" అని ఆహ్వానించాడు. ఆయన ఇల్లుగలాయన అనుకున్నాడు సుధాకర్.
ఆ పెద్దవాళ్ళిద్దరివెంట చిన్నవాళ్ళిద్దరూ లోపలకు వెళ్ళారు. లోపల పెద్ద హాలులో సోఫాల్లో రాజారావు తండ్రి కుటుంబరావుగారు, ఆయన భార్యా కూర్చునివున్నారు. కొడుకు కనిపించగానే కుటుంబరావుగారి ముఖంలో ఆందోళన తీరినట్లు కనిపించింది.
ఇల్లుగలాయన పెళ్ళికూతురి తండ్రిని రాజారావుకు పరిచయం చేశాడు.
ఇల్లుగలాయన పేరు మాధవరావట. ఆయన రాజారావుకు అంతకుపూర్వమే కొంచెం తెలిసినట్లుగా వుంది. ఆయనకూ, పెళ్ళికూతురి తండ్రికీ స్నేహితుడిని పరిచయం చేశాడు రాజారావు.
సుధాకర్ కి సిగ్గుగా, బిడియంగా వుంది. ఇక్కడికెందుకొచ్చానా అని తనని తాను తిట్టుకుంటున్నాడు.
స్నేహితులిద్దరూ సోఫాలో కూర్చున్నారు.
కుటుంబరావుగారూ, మాధవరావుగారూ, పెళ్ళికూతురి తండ్రీ ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.
సుధాకర్ స్నేహితుడివంక చూశాడు. టెర్లిన్ ప్యాంట్, శ్లాక్ వేసుకుని నీట్ గా డ్రెస్ చేసుకొచ్చాడు. కాకపోతే మనసులోని సంఘర్షణవల్ల ముఖంలో కొంచెం అలసట ద్యోతకమవుతోంది.
ఇంతలో ఓ అమ్మాయి లోపల్నుంచి ట్రేలో ఫలహారాలు తీసుకొచ్చింది. పదిహేడు, పద్దెనిమిదేళ్ళుంటాయి. పెద్ద పెద్ద కళ్ళు, రెండు జడలూ, సన్నగా, కొంచెం పొడవుగా, చాలా నాజూగ్గా వుంది.
"మా అమ్మాయి రాధ!" అని పరిచయం చేశాడు మాధవరావుగారు.
రాధ నమస్కారపూర్వకంగా చిరునవ్వు నవ్వి ట్రే బల్లమీద పెట్టి ఒక్కొక్కరికీ ప్లేట్ లు అందించసాగింది.
ఈ అమ్మాయిని ఎక్కడో చూశాననిపించింది సుధాకర్ కి. ఈ ఊరేకదా! ఏ రోడ్డుమీదో, సినిమాహాలుదగ్గరో చూసి వుంటాననుకున్నాడు.
"ఏం చదువుతున్నావమ్మా?" అనడిగాడు రాజారావు తండ్రి.
"బి.ఏ. చదువుతున్నానండీ!"
"మేరీస్టెల్లా కాలేజీలో చదువుతుంది" అని చెప్పాడు మాధవరావుగారు.
తన చెల్లెలుకూడా మేరీస్టెల్లా కాలేజీలోనే చదువుతుంది. ఒకవేళ ఇద్దరూ క్లాస్ మేట్స్ అయివుంటారు అనుకున్నాడు సుధాకర్.
కాఫీలుకూడా అయాక, పెళ్ళికూతుర్ని తీసుకొచ్చి రాజారావుకూర్చున్న సోఫాకెదురుగా వున్న సోఫాలో కూర్చోబెట్టారు.
సహజంగా ఇలాంటి పెళ్ళిచూపుల తతంగమంటే చాలా చిన్నచూపు వుంది సుధాకర్ కి. పెళ్ళికూతుర్ని తీసుకొచ్చి కూర్చోపెట్టటం, ఆమె తలవంచుకుని కూర్చోవటం, తలెత్తి అబ్బాయిని చూడమ్మా! అని చుట్టూవున్నవారు పదేపదే హెచ్చరించటం, ఆ అమ్మాయి ఇంకా భూమిలోకి కృంగిపోయినట్లుగా అయిపోవటం, ఆ అమ్మాయిని పెళ్ళికొడుకు తరపువాళ్ళు ఏవో ప్రశ్నలు వేయటం, హిందీ వచ్చునా? సంగీతం వచ్చునా? అని అడగటం, పాటలు పాడమనటం, ఆ అమ్మాయి తన సంగీతజ్ఞానాన్ని ప్రదర్శించటం - ఇవన్నీ జరుగుతూ వుంటాయి.