Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 21

   

     ఈ అలవాట్లన్నీ అతను సాధనమీద చేసుకున్నాడు.
   
    లేకపోతే సమస్యలు ఎక్కువైపోతాయని అతను ముందుగానే గ్రహించాడు. కొందరిళ్ళలో తండ్రులు పిల్లలకు ఖర్చుకని కొద్దిగా డబ్బు ఇస్తూ వుంటారు. కొందరివ్వరు. అది వారి ఇష్టాఇష్టాలమీదా ఆధారపడి వుంటుంది.
   
    కానీ స్కూల్లో పై తరగతులు చదివేటప్పుడూ, కాలేజీ చదువుకొచ్చాక, పిల్లలకు పరిస్థితులను బట్టి, వాళ్ళచుట్టూ ఏర్పడే స్నేహితులనుబట్టి కొత్తగా అబ్బిన అలవాట్లనుబట్టి, అనేక రకాలుగా డబ్బు అవసరమవుతూ వుంటుంది. దురభ్యాసాలతో పాటు సదభ్యాసాలు వున్న వాళ్ళకికూడా, డబ్బు అవసరమవుతూవుంటుంది. ఒకరికి బొమ్మలు గీయాలన్న అభిలాష ఉంటుంది. రంగులకీ, కుంచెలకీ, అట్టలకూ, ఫ్రేములకూ డబ్బు కావాలి. ఇంకొకరికి ఏవేవో పుస్తకాలు చదవాలనీ, అవి కొనుక్కోవాలనీ ఉంటుంది. ఆటలంటే ఇష్టమున్నవారికి దానికి సంబందించిన వస్తువులు కొనుక్కునేందుకు డబ్బు అవసరమవుతుంది. ఇహ చిరుతిళ్ళు అలవాటున్నవాళ్ళూ, ఇంకా సిగరెట్లు కాల్చడం ఇలాంటి చిన్నచిన్న దురలవాట్లు వున్నవాళ్ళూ, అడుగడుక్కీ డబ్బుకోసం తారట్లాడుతూనే వుంటారు. వాళ్లు పెద్దవాళ్ళను రకరకాలుగా అడగటం, కొన్ని కోరికలు తీర్చబడటం, కొన్ని తీర్చబడకపోవటం జరుగుతూ ఉంటాయి.
   
    సుధాకర్ చిన్నతనంనుండీ ఇవన్నీ గమనిస్తూ వున్నాడు.
   
    తన పెద్దన్నయ్య కుమార్ కీ, తనకీ వయసులో ఎక్కువ వ్యత్యాసం వుండటం వల్ల, అతనిగురించి తనకంతగా తెలియదు. కానీ ఇంట్లో తండ్రి లేనప్పుడూ, మిగతావాళ్ళంతా కూర్చుని పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకునేటప్పుడు అనేకసార్లు విన్నాడు. కుమార్ కి అనేక సందర్భాలలో డబ్బు అవసరం వచ్చేదిట. కాలేజీల్లో నాటకాలు వేసేటప్పుడూ, ఇంకా ఏదయినా కార్యకలాపాల్లో పాల్గొనాల్సివచ్చినప్పుడూ పదిసార్లు రిహార్సలు వేసుకుని వచ్చి, తండ్రిముందు నిలబడి తీరా నిలబడ్డాక చెప్పవలిసింది చెప్పలేక తడుముకుంటూ, తడబడుతూ సగం సగం ఆయన కర్దమయీ కానట్లు చెప్పి, ఆయన పూర్తిగా వినిపించుకోకుండానే "ఏడిశావులే! డబ్బూలేదు గిబ్బూలేదు, అవతలికి వెళ్ళు" అని కసురుకునేసరికి, అవతలకి వెళ్ళి గుడ్లనీరు కక్కుకునేవాడట.
   
    డబ్బుదగ్గర తండ్రి ఎంత నిక్కచ్చిమనిషో తెలియజేయటానికి పెద్దన్నయ్య తనతోనే ఓసారి చిన్ననాటి అనుభవం చెప్పాడు.
   
    అతను బలహీనంగా వున్నాడని ప్రతిరోజూ ఓ పావలా ఇచ్చి బేకరీకి వెళ్ళి బన్నూ, వెన్నా తిని రమ్మనేవాడట. బేడ బన్నూ, బేడ వెన్నా, పాపం అన్నయ్య వెళ్ళి హెచ్చుతగ్గులు లేకుండా అలాగే తిని వచ్చేస్తుండేవాడట.
   
    ఓరోజు తండ్రికి అనుమానం వచ్చిందట. వీడు సరిగ్గా తింటున్నాడా, లేక డబ్బులు మిగుల్చుకుంటున్నాడా? అని.
   
    ఓ ఊపు ఊపి చూద్దామని ఏదో పనిలో వున్నవాడికి హఠాత్తుగా పిలిచి "అవునూ, బన్ను ఒకటే తింటున్నావు కదూ వెన్నలేకుండా?" అని అడిగాడట.
   
    అన్నయ్య నోటమాట లేకుండా నిలబడిపోయాడట. ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. ఎలాగో నాలిక స్వాధీనం చేసుకుని "కాదండీ....బన్నూ, వెన్నా రెండూ తింటున్నాను" అని చెప్పాడట.
   
    "సరే, కారులో అలా పోయివద్దాం రా. ఇవేళ డ్రైవరు రాలేదు" అని చెప్పి ఇద్దరూ మేడమీదనుంచి మెట్లు దిగుతుండగా మళ్ళీ హఠాత్తుగా "ఇందాక బేడ మిగిలిందన్నావుగా? వెళ్ళి అమ్మకిచ్చేసి రా" అని ఆగాడట.
   
    ఇందాక తను చెప్పింది తండ్రి సరిగా అర్ధం చేసుకోలేదేమో అనుకున్నాడట అన్నయ్య. తనదగ్గిర నిజంగా డబ్బులు మిగిలిలేవు కానీ ఆయన ఉన్నాయనుకుంటున్నాడు. మళ్ళీ సరిగ్గా చెప్పడానికి సాహసంలేదు. పోనీలే, పేచీ ఎందుకని గబగబ లోపలకు వెళ్ళి "అమ్మా! ఇదిగో బేడ. ఇది నీ దగ్గర వుంచు" అని అరిచాడు అక్కడ ఎవరూ లేకుండానే తండ్రికి వినబడాలని. అతను తిరిగి రాగానే తండ్రి తగులుకున్నాడట. "నువ్వు ఇలాంటి వెధవపని చేస్తున్నామని నాకెప్పుడో అనుమానం వచ్చిందిరా. అందుకనే ఇవేళ నిలదీశాను. ఇందాక డబ్బులు లేవన్నావు. ఇప్పుడింట్లోకి వెళ్ళి మీ అమ్మచేతికి బేడ ఇచ్చివచ్చావు. ఇలా ఎన్నాళ్ళబట్టీ చేస్తున్నావు? పోయి హాయిగా తిని రారా అంటే కక్కుర్తిపడి డబ్బులు మిగులుస్తున్నావా? పైగా అబద్దాలు చెబుతున్నావా? నువ్వేదో ప్రయోజకుడివవుతావనుకుంటే ఇలాంటి పనికిమాలిన బుద్దులన్నీ పెట్టుకుంటే ఇంకేం పైకివస్తావు?...." అని రోజంతా సాధిస్తూనే వున్నారట.
   
    సుధాకర్ కి ఆ అనుభవం గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది.
   
    అందుకనే తను చిన్నప్పటినుంచీ డబ్బుతో అవసరం లేకుండా చేసుకున్నాడు. సాధ్యమయినంతవరకూ జీవితంలో కఠినత్వాన్ని అలవాటు చేసుకున్నాడు. అతను మంచి రన్నర్. స్కూలులో చదువుతున్నప్పుడూ, కాలేజీ డేస్ లో కూడా అన్ని పోటీల్లో పాల్గొంటూ వుండేవాడు. చాలావాటిల్లో ఫస్టు వస్తుండేవాడు, ఎన్.సి.సి.లో వుండేవాడు. క్రికెట్, బాస్కెట్ బాల్ లాంటి ఆటలు కూడా ఎంతో ఉత్సాహంతో ఆడేవాడు.
   
    సుధాకర్ అక్కడ్నుంచి లైబ్రరీదగ్గరకొచ్చి ఆగాడు. లైబ్రరీ కాంపౌండులోకి వెళ్ళి సైకిలుకు తాళంవేసి లోపలకు వెళ్ళాడు.
   
    లైబ్రరీలో జనం ఎక్కువగానే వున్నారు. కొన్ని పత్రికలు ఎవరికీ అక్కర్లేదన్నట్లుగా బల్లలమీద పడివుంటే, కొన్ని అందరికీ తామే కావాలన్నట్లు మంచి బిజీగా వున్నాయి. కొందరు చేతిల్లో పత్రికలు యధాలాపంగా చూస్తూ ప్రక్కవాడి చేతిలో మేగజైన్ ఎప్పుడు పూర్తి అవుతుందా, అది ఎప్పుడు ఆక్రమిద్దామా అని డేగల్లాగ చూస్తూ సమయంకోసం కాచుకున్నారు. కొందరు మొహమాటం లేకుండా ప్రక్కవాడిచేతిలో పత్రికను తామూ చదివేస్తూ, వాళ్ళు ఆ పేజీ చదవటం అయిపోయి ప్రక్కపేజీ త్రిప్పబోతుంటే ఆపి తాముకూడా చదవటం పూర్తయ్యాక అప్పుడు త్రిప్పండి అని అనుమతిస్తున్నారు.
   
    సుధాకర్ కి చిన్నతనంనుండీ యుద్ద కథలంటే ఇష్టం. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలకు సంబంధించిన ఎన్నో సాహసోపేతమైన కధలు బయట ప్రపంచానికి తెలియకుండా గుప్తంగా వుండిపోయాయి. అవి అప్పుడప్పుడూ ఎవరో తవ్వి వెలికితీసినప్పుడు పుస్తక రూపాన వెలువడుతూ వుంటాయి.
   
    అతను బీరువా అంతా వెదికి తనకిష్టమైన యుద్దకధల సంపుటాన్నొకటి తీసుకుని ఒక మూలకెళ్ళి కూర్చుని చదువసాగాడు.
   
    కాస్సేప్పట్లో తనెక్కడున్నదీ మరిచిపోయినంతగా మస్తకంలో నిమగ్నమైపోయాడు.
   
    కొంతసేపటికి "హలో సుధాకర్!" అన్న సంబోధన విని తల త్రిప్పి చూశాడు.
   
    రాజారావు!
   
    రాజారావు, సుధాకర్ ప్రాణస్నేహితులు థర్డ్ ఫారం చదువుకుంటున్నప్పటి నుంచి బి.ఎస్. సి. పాసయ్యేవరకూ క్లాసుమేట్సు అయితే ఎంత ప్రాణ స్నేహితుడయినా తరచు కలిసే అలవాటు సుధాకర్ కు లేకపోవటంవల్ల వారానికి ఏ రెండుమూడుసార్లో మాత్రం కలుసుకుంటూ వుంటారు.
   
    స్నేహితుడ్ని చూడగానే సుధాకర్ ముఖంలోకి నవ్వు వచ్చింది.
   
    "ఏరా రాజూ! ఇలా వచ్చావు?" అన్నాడు నెమ్మదిగా. గట్టిగా మాట్లాడితే ప్రక్కవాళ్ళకు డిస్ట్రబెన్సు వుంటుందని. రాజారావుకు పుస్తకాలన్నా, పత్రికలన్నా తలనొప్పని అతనికి తెలుసు. అందుకే కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు.
   
    రాజారావుకూడా తగ్గించిన కంఠస్వరంతో "చాలా సీరియస్ గా చదువుతున్నట్లుగా వున్నావు. మధ్యలో ఆటంకం కలిగించాల్సి వచ్చినందుకు క్షమించరా బ్రదర్! మీ ఇంటికి వెడితే బయటకు వెళ్ళావని చెప్పారు. దార్లో చూసి లైబ్రరీకి వెళ్లుంటావని వెతుక్కుంటూ వచ్చాను" అన్నాడు.
   
    ఇంతదూరం వచ్చాడంటే ఏదో విశేషమే ఉంటుందనుకున్నాడు సుధాకర్. "అలా పోయి మాటాడుకుందాం పద" అంటూ చేతిలో వున్న పుస్తకం పట్టుకుని లేచాడు సుధాకర్. ఇద్దరూ హాలుదాటి వరండాలోకి వచ్చి ఎవరూ లేనిచోట నిలబడ్డారు.
   
    "మా నాన్న గట్టి చిక్కు తెచ్చిపెట్టాడురా బ్రదర్!" అన్నాడు రాజారావు స్తంభానికి ఆనుకుని ముఖంలో విరక్తి ఉట్టిపడుతుండగా.,
   
    "ఆ విషయం నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిగానీ, సంగతేమిటో చెప్పు?"
   
    "ఉన్నట్లుండి పెళ్ళిచూపుల తతంగం తెచ్చిపెట్టాడురా."
   
    "ఎవరికి? నీకే? భలేఛాన్సు కొట్టావురా"
   
    రాజారావు స్నేహితుడివంక దీనంగా చూశాడు. "ఒరేయ్ ఆక్షేపించకురా. నీకంటే ఒకటి రెండేళ్ళు పెద్దవాడినేమోగానీ నాకు పెద్ద వయస్సేమీ లేదు. అసలు నేను పెద్దవాణ్నయ్యానని నేను అనుకోవటంలేదు. మా నాన్న నాచేత భారీఎత్తున ఆయిల్ పరిశ్రమ పెట్టించే ఉద్దేశంలో వున్నాడని నీకు తెలుసు. అందులో ట్రెయినింగ్ కోసమని స్టేట్స్ కు కూడా పంపిద్డామనుకుంటున్నాడు. మధ్యలో ఈ పెళ్ళి బెడదొకటి లేవదీశాడు. అదేమిటంటే పెళ్ళయితే ఇద్దరూ అక్కడికి పోయి ఓ ఏడాదిపాటు ఉందురుగానిలే అంటున్నాడు. ఎలారాబాబూ?"

 Previous Page Next Page