పై క్షణాల ఆమెని కారు వెనుక సీటులో పడుకోబెట్టారు.
తలుపు తాళం వేస్తున్న సత్య వద్దకి వచ్చి అడిగింది చంద్రమ్మ. "ఎవరే సత్యా అతను? కారులో వచ్చారు. సొంత కారా? బాగా డబ్బుందా? ఎంత బాగున్నాడే. పెళ్ళి చేసుకుంటున్నావా? పాత చుట్టరికమా? కొత్త సంబంధమా?" అని గబగబా అడిగేసింది.
అ ప్రశ్నలకి, అ ప్రశ్నల ధోరణికి విసుక్కున్న సత్య ఏం అనలేదు. అన్ని తలుపులూ జాగ్రత్తగా వేసి "వెళ్ళొస్తా చంద్రా! జాగ్రత్తగా చూస్తూ వుండు. అమ్మమ్మకి కాస్త నయం కాగానే వచ్చేస్తాం" అంది.
"మళ్ళి కారులోనే వస్తారా?" కుతూహలంగా అడిగింది.
"ఊఁ యీ నాన్నాళ్ళూ మా పశువులు నువ్వే చూసుకో. అవసరమైతే పాలిగాడ్ని పిలిచి పొలంవేపు వెళ్ళమని చెప్పమను మామయ్యని" అన్నీ చెప్పినట్టుగా చెప్పి వెళ్ళి కూర్చుంది.
"అబ్బో! ఏం టెక్కే నీకు కారున్నవాడు జత కాగానే అడిగిన దానికి జవాబు చెప్పవు. చూద్దాం చూద్దాం. రేపు తిరిగిరావూ. అప్పుడూ నీ సంగతి" ఉడుకుబోతుతనంగా అనుకుంది చంద్రమ్మ.
అందరూ వింతగా కుతూహలంగా ఆశ్చర్యంగా చూస్తూ వుండగా కారు బయలుదేరింది.
* * *
రోడ్డెక్కిన కారు వేగాన్నందుకుంది.
కారు కుదుపుకో చల్లగా వీచే గాలులకో, మరెందుకో హఠాత్తుగా మెళుకువ-స్పృహ వచ్చేసింది ముసలమ్మకి.
బలహీనంగా కళ్ళు తెరిచింది.
గాజు గోళీల్లా వున్న అ కళ్ళలో మనవరాల్ని చూడగానే ఏదో మెరుపు-ఏదో తళుకు - ఏదో అసంతృప్తి మెరిసింది.
"సత్యా...." బలహీనంగా పిలిచిందామె.
అంతదాకా అమ్మమ్మ ముఖంలోకి అదే తన జీవిత లక్ష్యమైనట్లుగా తదేక ధ్యానంతో దీక్షతో చూస్తున్న సత్యకి అమ్మమ్మ కళ్ళు తెరవగానే సంబరమైంది. ఆమె బలహీనంగా పిలిచిన పిలుపు సత్య ముఖాన్ని వికసింపజేసింది.
"అమ్మమ్మా!"
తన ప్రేమ విలువ అమ్మమ్మ ప్రాణాలయితే ఆ మొత్తం ప్రేమని అంతా ధారపోస్తున్నట్టుగా పిలిచింది సత్య.
"వచ్చావామ్మా?"
అతి కష్టంమీద పలికింది ఆమె.
"నేను వచ్చేశాను అమ్మమ్మా! నాకేం కాలేదు నేను క్షేమంగానే వున్నాను. నాకేం ఫరవాలేదు. నువ్వు భయపడకు. నీకు త్వరగా నయం కావాలి అమ్మమ్మా. నువ్వు త్వరగా కోలుకోవాలి" అంది ఆరాటంగా.
"పిచ్చితల్లీ" అది సాధ్యమా- నా పని అయిపోయింది. నువ్వు ఊరికే ఆవేశపడుతున్నావ్ అన్నట్లుగా బదులు పలికింది అమ్మమ్మ.
కారు నెమ్మదిగా పోనిస్తున్నాడు సతీష్.
అతికష్టంమీద తలతిప్పి చూసింది ఆమె.
"అతను.... అతను .... సతీష్...."
"ఎవరమ్మా?"
ఎవరు? ఎవరంటే తనేం చెప్పగలదు? అతను తనకేమవుతాడు. తను ఇక్కట్టులో వున్నప్పుడు కాస్త సాయం చేశాడు. ఓ కోటేశ్వరుడి కారు డ్రయివరు. ఆ యజమాని అతి మంచివాడు కాబట్టి ఇతనికి సర్వస్వతంత్రం ఇచ్చేడు. అంతే!
మనవరాలు ఎందుకు అతనెవరో చెప్పలేకపోతుందో అన్నేళ్ళు ప్రపంచాన్ని చూసిన అమ్మమ్మ తన ధోరణిలో అర్ధం చేసుకుంది.
"బాబూ...." మెల్లిగా పిలిచి కారు ఆపమన్నట్లుగా సైగ చేసింది.
సతీష్ కారు ఆపి తల వెనక్కి తిప్పి చూసేడు.
బలహీనమైన తన చేయి చాచింది ఆమె.
అతనికేదో అర్ధమైంది.
ఆ చేయి ఎంతో ఆదరణతో అందుకుని మృదువుగా నిమిరి ఆమె కళ్ళల్లోకి నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసునన్నట్లుగా చూసేడు.
తృప్తిగా నిట్టూర్చింది ఆమె.
"నా పనై పోయిందమ్మా! జాగ్రత్త! సతీష్ నీకు తగినవాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి కాపాడతాడు" అన్నట్టు చూసి కళ్ళు మూసుకుంది.
బలహీనమైన ఆమె గుండె చలన్నా కోల్పోయింది.
తన చేతిలోని అమ్మమ్మ చేయి చల్లపడటం చూసి అదిరిపడ్డాడు సతీష్.
అదే సమయంలో తన చేతుల్లోని అమ్మమ్మ చేయి చల్లనవటం గమనించిన సత్య "అమ్మమ్మా! సతీష్" అని వెర్రిగా కేకేసింది.
"సారీ సత్యా! మనం దురదృష్టవంతులం. ఆమె హాయిగా వెళ్ళిపోయింది" అన్నాడు నిర్లిప్తంగా సతీష్.
"అమ్మమ్మా" వెర్రిగా కేక పెట్టింది సత్య.
తన కారు దిగివచ్చి సత్యని ముందు సీటులోకి తీసుకెళ్ళి ఒక చేత్తో ఆమెని మృదువుగా పొదుపుకుని ఆమె నోదార్చుతూ మెల్లిగా కారుని కదిలించేడు సతీష్.
* * *
"వాసాంపి జీర్ణాని యధావిహాయ...." అన్నట్టుగా మనిషి దేహ త్యాగం చేస్తాడు. నిన్నటిదాకా ఆమె అమ్మమ్మ. ఇప్పుడేముంది. పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోయాయి. ఇది స్మశాన వైరాగ్యం అను. మరేమన్నా అను. కాదనను. కానీ మనమంతా మట్టిబొమ్మలం. బొమ్మ నీరు తగలగానే మెల్లిమెల్లిగా కరిగిపోయినట్లు ఈ శరీరం అనే బొమ్మ కూడా కాల ప్రవాహంలా కరిగిపోతుంది.