Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 20

                                 


    భీష్ముడు పరశురాముని మాటలకు ఉలిక్కిపడినాడు. సవినయముగా వివరించినాడు. అంబ స్వయముగా సాల్వుని వద్దకు వెళ్ళినది అని వివరించినాడు. సాల్వుని కామించిన అంబను విచిత్రవీర్యునకు ఇచ్చుట ధర్మము కాదు అన్నాడు. ఇంకను అనేక విధముల వివరించినాడు. తనను మన్నించమని కోరినాడు. పరశురాముడు వినలేదు. బంధుమిత్ర సహితముగా భీష్ముని నాశనము చేతునని నిప్పులు కక్కినాడు.
    "గురుదేవా! లోక విరుద్ధ మార్గమును అనుసరించిన గురువును అయినను దండించవలెనని పెద్దలు చెప్పుదురు. నీవు నాకు నేర్పిన అస్త్రశస్త్రములేనాకు సైన్యము అగును. ఇదిగో నా గురువునకు నమస్కరించుచున్నాను. యుద్డమునకు సిద్దముగా ఉన్నాను. ఆయుధము అందుకొనుము. శస్త్రము ప్రయోగించుము" అని నిలిచినాడు.
    పరశురామునకు, భీష్మునకు భీషణ సంగ్రామము జరిగినది. పగలంతయు యుద్దము సాగినది. భీష్ముడు రాత్రికి హస్తినకు వెళ్ళువాడు. మరల ఉదయము తిరిగి వచ్చువాడు. ఆ విధముగా ఇరువదిమూడు రోజులు యుద్దము జరిగినది. ఉభయులు ఘోరమయిన అస్త్రములను ప్రయోగించినారు. ఒకసారి భీష్ముడు, ఒకసారి పరశురాముడు మూర్చిల్లినారు. ఇరువురి బలములు సమముగా ఉన్నవి,.
    ఇరువది మూడవనాటి రాత్రి భీష్ముడు వ్యాకులుడు అయినాడు. పరశురాముని జయించుబలము ప్రసాదించవలసినదని దేవా బ్రాహ్మణులను ప్రార్ధించినాడు ఆనాటి తెల్లవారుఝామున భీష్మునకు స్వప్నమున ఎనిమిది మంది బ్రాహ్మణులు దర్శనము ఇచ్చినారు. సమ్మోహనాస్త్రమును ప్రసాదించినారు. అదృశ్యులు అయినారు.
    ఇరువది నాల్గవ రోజు భీష్ముడు యుద్దమునకు వచ్చినాడు. ఆనాడు పరశురాముడు రుద్రుడు అయినాడు. అనేక అస్త్రములను ప్రయోగించినాడు. భీష్ముడు శస్త్రములను ప్రయోగించినాడు. పరశురాముని మూర్చిల్లచేసినాడు. మూర్చ నుంచి లేచిన పరశురాముడు దావాగ్ని అయినాడు. బ్రహ్మాస్త్రమును విడిచినాడు. భీష్ముడు సహితము బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు. ఉభయ అస్త్రముల పోరునకు ఆకాశము ప్రజ్వరిల్లినది. సకల భూతములు సంక్షోభించినవి.
    భీష్ముడు సమయము చూచినాడు. సమ్మోహనాస్త్రము తీసినాడు. ప్రయోగించబోయినాడు. అప్పుడు "వలదు వలదు ప్రయోగించవలదు" అని నారదుడు దిగినాడు. భీహ్స్ముని ఆపినాడు. ఎనిమిది మంది బ్రాహ్మణులు దేవతలును దిగివచ్చినారు. "పరశురాముడు నీకు గురువు. అతనిని వధించరాదు" అని శాంతింపచేసినాడు.
    పరశురాముని తండ్రి జమదగ్ని మున్నగు పితృదేవతలు దిగివచ్చినారు. "భీష్ముడు అష్టవసు స్వరూపుడు. అతనిని గెలుచుట నీకు శక్యము కాదు" అని పరశురాముని శాంతింపచేసినారు.
    భీష్ముడు అస్త్రము విడిచినాడు పరశురాముని వద్దకు వెళ్ళినాడు. సాష్టాంగ దండ  ప్రణామము చేసినాడు.
    పరశురాముడు ప్రసన్నుడు అయినాడు. భీష్ముని లేవనెత్తినాడు. కౌగలించుకున్నాడు. "భీష్మా! నీ శక్తికి సంతోషించినాను. నీ భక్తికి మెచ్చినాను" అన్నాడు.
    అంతటితో సమరము ముగిసినది. భీష్ముడు హస్తినకు వెళ్ళినాడు. నారదులు వెళ్ళి పోయినారు. అంబ పరశురాముని ముందు చేతులు జోడించి నిలిచినది. "అంబా! నీ కొఱకు నేను చేయవలసినది చేసినాను. యుద్దమున భీష్ముడే గెలిచినాడు. ఒక నీ దారి నీవు చూచుకొనుము" అన్నాడు పరశురాముడు. అంబ అన్నది "మహాత్మా! నీకు శ్రమ కలిగించినాను. నీవు నా కొఱకు యుద్దము చేసినావు. కృతజ్ఞతలు, నీకు సాధ్యము కాని పని నీవు చేయలేవు. నేను తపస్సు చేసి సాధింతును. ఈ జన్మమున కాకున్నా మరుజన్మమున నయినా భీష్ముని సంహరింతును".
    పరశురాముడు అంబ ప్రతిన విన్నాడు. పలుకలేదు. ముని గణములతో మహేంద్రగిరికి వెళ్ళిపోయినాడు. అంబ తన పట్టు వదలలేదు. యమునా తీరమునకు వెళ్ళినది. తపస్సు చేసినది. కాశికాశ్రమము, సిద్దాశ్రమాదులకు వెళ్ళినది. కఠిన తపస్సు చేసినది. అప్పుడు ఆమెకు గంగ కనిపించినది.
    "అంబా! నీ తపస్సు నిర్మలము కాదు. కుటిలము. కుటిల తపస్సులు ఫలించవు. పగబూని తపము చేయరాదు. భీష్ముడు అజేయుడు. తపము మానుము" అని బోధించినది.
    అంబ వినలేదు. "ఈ జన్మమున కాకున్నా మరుజన్మమున నయినా భీష్ముని సంహరింతును" అని ప్రతిజ్ఞ చేసినది.
    "అంబా! నీవు ఈ దెహమును౮ విడిచి నదివి అయి ప్రవహింతువు గాక" అని శపించినది గంగ. వెళ్ళిపోయినది.
    గంగ శాపమునకు అంబ జంకలేదు. ఆమె పట్టువిడువలేదు. మత్స్య దేశమునకు వెళ్ళినది. ఘోర తపస్సు ప్రారంభించినది. ఆ తపఃఫలమున అర్ధ భాగము "అంబ" అను నదియై మత్స్యదేశమున ప్రవహించినది. మిగిలిన అర్ధ భాగపు తపస్సునాకు తన దేహము నిలుపుకున్నది.
    అంబ గంగ శాపమును కొట్టివేసినది. గంగను గెలిచినది. గంగ కొడుకును గెలుచుటకు పుణ్యాశ్రమములకు వెళ్ళినది. ఒంటరిగా, ఎవరి సాయము లేక అతి ఘోరమయిన తపస్సు చేసినది. ఆమె తపస్సునకు మెచ్చినాడు రుద్రుడు. ప్రత్యక్షము అయినాడు. "వరము కోరవలసినది" అన్నాడు.
    అంబ చేతులు జోడించినది. రుద్రుని స్తుతించినది. "మహాత్మా! రుద్రదేవా! నేను భీష్ముని చంపవలెను. అట్టి వరమును నాకు ప్రసాదించుము" అని ప్రార్దించినది.
    "అంబ! నీ కోరిక ఫలించును. నీవు ఈ శరీరమును విడిచిన తరువాత ద్రుపద రాజునకు కూతురుగా జన్మింతువు. తరువాత పుత్రరూపము దాల్తువు. అప్పుడు నీవు యుద్దమున భీష్ముని సంహరింతువు" అని చెప్పి రుద్రదేవుడు అంతర్ధానుదు అయినాడు.

                  
    అంబ సంతోషించినది. ఈ దేహము రాలునంత వరకు ఆమెకు ఓపిక లేకపోయినది. అదేరోజున కట్టెలను పేర్చినది. కట్టెలకు నిప్పు పెట్టినది. నిప్పు అంటుకున్నది. అగ్ని నాల్కలు చాచి మండసాగినది. అంబ అగ్నికి నమస్కరించినది. ప్రదక్షిణములు చేసినది. "భీష్ముని చంపుటకు ఆహుతి అగుచున్నాను" అని అగ్నిలో దూకినది.
    అంబ అగ్నికి ఆహుతి అయినది.
    అది చూచి విని మునులందరూ ఆశ్చర్యచకితులు అయినారు.
    అక్కడ ద్రుపద రాజునకు సంతానము లేదు. అతడు శివుని గురించి తపస్సు చేసినాడు. శివుడు ప్రత్యక్షము అయినాడు. "ద్రుపద తపస్సునకు మెచ్చినాను. వరము కోరుము" అన్నాడు.
    ద్రుపదుడు శివునకు మ్రొక్కినాడు. కీర్తించినాడు. "శివదేవా! నాకు భీష్ముని సంహరించగల పుత్రుని ప్రసాదింపుము"  అని ప్రార్ధించినాడు.
    "రాజా!" శివుడు వచించినాడు. "నీకు మొదట కూతురు కలుగును. ఆమె పురుషుడు అయి భీష్ముని వధించును".
    శివదేవుడు వరమును ఇచ్చినాడు. అంతర్ధానుడు అయినాడు. ద్రుపదుడు తన రాజ్యమునకు చేరినాడు. వరమును గురించి భార్యకు వివరించినాడు. ద్రుపదుని భార్య గర్భమున అంబ యొక్క చైతన్యము ప్రవేశించినది. ఆమె గర్భము దాల్చినది నెలలు నిండినవి. ఆమె రహస్యముగా ప్రసవించింది. ఆమెకు కూతురు కలిగినది. ద్రుపద రాజ దంపతులు ఆ విషయమును దాచిపెట్టినారు. తమకు పుత్రుడే కలిగినాడని వెల్లడించినారు. పుత్రునకు వలెనే జాతకర్మములు జరిపినారు. "శిఖండి" అని పేరు పెట్టినారు. శిఖండి పుత్రుని వలెనే పెరిగినాడు. ద్రోణుని వద్ద అస్త్ర శస్త్ర విద్యలు నేర్వసాగినాడు. శిఖండికి యుక్త వయస్సు వచ్చినది. దశార్ణరాజు  హేమవర్మ తన కూతురును ఇచ్చి వివాహము చేసినాడు. కాలక్రమమున శిఖండి భార్య, భర్త రహస్యము గుర్తించినది. తన భర్త పురుషుడు కాడు అని గమనించింది. ఈ విషయమును రహస్యముగా పుట్టినింటికి తెలియపరచినది.
    హేమవర్మ కూతురు చేరవేసిన వార్త విన్నాడు. భగ్గుమన్నాడు. ద్రుపదుడు తనను మోసము చేసినందులకు మండిపడినాడు. తన సైన్యమును తీసుకుని బయలుదేరినాడు. ద్రుపదుని పట్టణమును ముట్టడించినాడు. అప్పటికి సాయంకాలము అయినది. తెల్లవారి ఎదుర్కొనుటకు ద్రుపదుని సైన్యము సిద్దము అగుచున్నది.
    శిఖండి ఇవన్నియు విన్నాడు. తన మూలముననే ఇదంతయు జరుగుచున్నదని గ్రహించినాడు. ఇంటి నుండి బయలుదేరినాడు. ఆ రాత్రి అరణ్యమున ఆత్మహత్యకు ప్రయత్నించినాడు. 'స్థూల కర్ణుడు' అను యక్షుడు అది చూచినాడు. శిఖండిని వారించినాడు. తన నివాసమునకు తెచ్చినాడు. ఓదార్చినాడు. ఆత్మహత్యా ప్రయత్నమునకు కారణము అడిగినాడు.

 Previous Page Next Page