Read more!
 Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 2


    వీధిలో రిక్షా ఆగిన చప్పుడు వినిపించి,సరోజ ఆలోచన నించి తేరుకుని ఆరాటంగా వీధిలోకి గెంతింది. వచ్చింది రిక్షాకాదు, బావ కాదు, పక్కింటి గోపి, సైకిలు దిగి హడావిడిగా లోపలికి వస్తున్నాడు. సరోజ ఉత్సాహం నీళ్ళుగారిపోయింది.
    "అక్కా...అక్కా" అన్నాడు గోపి గాభరాగా, సరోజని చూడగానే.
    "ఏమిటి గోపీ?" సరోజ గోపిని, అతని గాబరాని చూసి గాభరాపడింది. జానకమ్మ మాటలు విని లేచి గుమ్మం దగ్గరికి వచ్చింది. గోపి యిద్దరి మొహాలు చూస్తూ కంగారుపడ్తూ, ఏదో చెప్పాలని ఆరాటపడ్తూ, చెప్పలేక తడబడ్డాడు. గోపి వాలకం ఏదో అనుమానం వేసింది సరోజకి. ఆరాటంగా ముందుకి వెళ్ళి గోపి భుజం పట్టుకుని ..."ఏం జరిగింది గోపి..ఏమిటి చెప్పు..."ఆత్రుతగా అడిగింది.
    "మీ రామం...మీ రామం..."
    "...బావా!... ఏమిటి బావ..." సరోజ గుండె లయతప్పింది. జానకమ్మ ఆరాటంగా "మా రామం వచ్చాడా...ఏడి ఏం జరిగింది...." అంటూ గాభరాగా అడిగింది.
    "నేను బజార్నుంచి వస్తుంటే చూశాను... మీ రామం....రిక్షాలో వస్తుంటే ఏక్సిడెంట్ అయింది....లారీకి గుద్దుకుని బాగాదెబ్బలు తగిలాయండి, అందరూ ఆస్పత్రికి తీసికెళ్ళారండి... అమ్మో రోడ్డంతా నెత్తురే... నేనిలా మీకు చెప్పాలని పరుగెత్తుకొచ్చాను" అన్నాడు వగరుస్తూ అప్పటికే గోపి మాటలు జానకమ్మ, సరోజలకి విన్పించడం మానేశాయి. ఇద్దరూ అలా బాహ్యస్మృతిని కోల్పోయినట్టే నిశ్చేష్టులయి నిల్చుండిపోయారు.
    "ఆస్పత్రికి వెడదామా అక్క, మాష్టారుగా రేరి..." గోపి అంటున్నాడు. సరోజ చప్పున తెలివి తెచ్చుకుని "మమ్మల్ని అక్కడికి తీసికెళ్ళు గోపీ" అంది వణుకుతున్న గొంతుతో.
    "నే నందుకే వచ్చాను. రిక్షా తెస్తాను వుండండి" అంటూ గోపీ సైకిలేసుకుని వెళ్ళాడు.
    "అత్తయ్యా!"ప్రాణం లేనట్టు నిలబడిపోయిన జానకమ్మని చూస్తూ "అత్తయ్యా !" అంది సరోజ ఏడుపు గొంతుతో. "అత్తయ్యా ... ఏమిటిది... మాట్లాడు అత్తయ్యా..." అంటూ ఆమెని కుదుపుతూ అంది. అప్పటికి జానకమ్మ ఈ లోకంలోకి వచ్చింది. "నాయనా రామం" అంటూ కింద కూలబడిపోయింది. "ఇదెక్కడి ఖర్మనాయనా, ఉద్యోగస్థుడ వయ్యావు. సంతోషంగా ఇంటికి వస్తున్నావు అనుకుంటే యిదేం ప్రారబ్ధం రా నా నాయనికి ఏమయింది దేముడా..." అంటూ భోరుమంది. "ముందు ఆస్పత్రికి వెడదాం పద అత్తయ్యా. అసలేమయిందో, బావ ఎలా వున్నాడో.... యిక్కడ కూర్చుని ఏడిస్తే ఏం ప్రయోజనం-" సరోజ గబగబ యింటికి తాళంపెట్టి జానకమ్మతో రిక్షా ఎక్కింది.
    ఆస్పత్రి చేరి అందరిని వాకబుచేస్తు క్యాజువాలిటీ వార్డుచేరే సరికి ఇరవై నిముషాలు పట్టింది. అక్కడున్న నర్సుని అడిగితే ఆమె వాళ్ళని ఎగాదిగా చూస్తు "రిక్షా ఏక్సిడెంటు అయిన ఆయన తాలూకా మీరు!"అంది. సరోజ గబగబ తలాడించింది. ఆ నర్సు కాస్త జాలిగా చూస్తూ..."సారీ, ఇక్కడికి తీసుకొచ్చే త్రోవలోనే ప్రాణము పోయింది. తలకి బలమైన దెబ్బలు తగిలాయి. డాక్టర్లు ఏం చేసేది లేదని చెప్పేశారు- రండి చూపిస్తాను" అంది. జానకమ్మ కెవ్వుమని అరిచి నేల వ్రాలిపోయింది. సరోజ వెర్రిదానిలా చూసింది. కాసేపు తరువాత ఏమి జరిగిందో ఆమెకి తెలియలేదు.
    
                                        *    *    *
    
    రామం పోయి మూడునెలలు గడిచిపోయాయి....మూడునెలలు గడిచాయి అనడం చాలాసుళువుగాని... జానకమ్మ చలపతిరావు సరోజలకి ఆ రోజులు ఎంత దుర్భరంగా గడిచాయో చెప్పడం సుళువుగాదు. ఆ మూడునెలల్లో ఆ కుటుంబం మళ్ళీ లేచి నిలబడలేనంతగా ఆర్ధికంగా శారీరకంగా చితికిపోయింది.

 Previous Page Next Page