Read more!
 Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 3


    కొడుకు మరణవార్త వింటూనే అసలే బ్లడ్ ప్రెషర్, గుండెదడ వున్న చలపతిరావుగారు కూలిపోయారు. అది పక్షవాతంలోకి దించి ఆయన్ని శాశ్వతంగా లేవలేనట్టు చేసేసింది. జానకమ్మ నెలరోజులు మంచంపట్టేసింది. వారిద్దరి దుఃఖంకంటే సరోజ దుఃఖం తక్కువది కాకపోయినా, ఆమె తనకళ్ళు తను తుడుచుకుని పుత్రశోకంతో కుమిలిపోయేవారిద్దరిని ఓదార్చడం, ధైర్యం చెప్పడం, వారికి సేవ చెయ్యడం, యింటిలో పనిపాటలు చూసుకోడం అన్ని తప్పనిసరి అయ్యాయి సరోజకి. బంధువులన్న వాళ్ళు వచ్చి  పరామర్శించి వెళ్ళేవారు తప్ప ఆదుకునే వారెవరు, ఓ చేత్తో కళ్ళుతుడుచుకుంటు మరో చేత్తో అన్ని పనులు చేయసాగింది సరోజ.
    ఆదుకుంటాడని తమ కష్టాలకధ అంతమయింది అని సంతోషించిన ఆ తల్లి తండ్రులు నడుం విరిగిన మానుల్లా ఆ దెబ్బకి మరి లేవలేక పోయారు. చిగిర్చి, మొగ్గ తొడిగిన సరోజ ప్రేమ పుష్పించి, ఫలించకుండానే ఫెనుతుఫాను తాకిడికి ఆలక వేళ్ళతో సహా నేలమట్టమయింది. ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనుకుంటూనే ముగ్గురూ జీవచ్చవాల్లా, అలాగే బ్రతుకుతున్నారు. ఆముగ్గురూ ఒకరిని ఒకరు ఓదార్చుకోడానికి కూడా శక్తి, మాటలు లేనట్టు మూగగా తలో మూల కూర్చునేవారు. ఆయింటిలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఆయింటి వెలుగు, కళాకాంతులు అన్నీ రామంతోనే పోయినట్లయింది.
    ఆ దుర్భర శోకానికి తోడు చలపతిరావుగారు మంచాన పడిందగ్గిరనించి దారిద్ర్యం అగ్నికి వాయువుతోడయినట్లు యిల్లుగడవని స్థితికివచ్చింది ఆ కుటుంబం. ఆయన ప్రైవేట్లు ఆగిపోయాయి. బట్టలషాపులో పని పోయింది. ఆయన కొచ్చే పెన్షన్ డబ్బులు బియ్యానికి కూడా సరిపోయేవి కావు. దానికితోడు ఆయనకి జానకమ్మకి మందులు. వాళ్ళు వీళ్ళు జాలిపడి యిచ్చినడబ్బు కొన్నాళ్ళు, మరి కొన్నాళ్ళు చేబదుళ్ళతో గడిచింది. ఆ తరువాత రోజు గడవడం కష్టమైంది. ఇంటిలో తాకట్టు పెట్టగలిగినవన్నీ వెళ్ళాయి. అమ్మడానికి తగినవి ఎప్పుడో రామం చదువుకే అయ్యాయి. చలపతిరావు, జానకమ్మ గార్లు కొడుకు మరణ దుఃఖాన్నించి కాస్త తేరుకుని చూసేసరికి యింటిలో పరిస్థితి భూతంలా నిలబడి భయపెట్టింది.
    సరోజ ఏదన్నా ఉద్యోగం చెయ్యడం అనివార్య మైంది. ఉద్యోగం చెయ్యాలనుకున్నంత మాత్రాన ఉద్యోగం దొరికే కాలం కాదని సరోజకి అర్ధం అయ్యేసరికి రెండు మూడు నెలలు గడిచాయి. ఆ లోపల మామయ్య ప్రైవేట్లు చెప్పడానికి సిద్దపడినా ఆ మూడునెలల్లో ఆయన మానేయగానే క్రొత్తమాష్టర్లని కుదుర్చు కున్నవాళ్ళు కొందరు యింక ప్రైవేటు అక్కరలేదన్నవాళ్ళు కొందరు. ఒకటి రెండు ట్యూషన్లు మాత్రం దక్కాయి. వాటివల్ల వచ్చే రాబడి అనగా ఎంత? బట్టలకొట్టు ఖాళీ మరొకరికి భర్తీ అయిపోయింది. ఎన్ని ఆఫీసులు తిరిగినా ఎంతమంది ఆఫీసర్లని దర్శించుకున్నా ఫలితం శూన్యం అయింది. చలపతిరావుగారు మిత్రులు ఇద్దరు ముగ్గురు మనస్ఫూర్తిగా సహాయపడాలని ప్రయత్నించినా ఆ వూళ్ళో ఏదీ కలిసిరాలేదు. ప్రక్కింటి ప్లీడరు ఆంజనేయులుగారు చలపతి రావుగారి దుస్థితికి జాలిపడి ఆయన మేనల్లుడు హైదరాబాదు లో ఓ కంపెనీకి మేనేజరని అతనికి రాసి సరోజకి ఏదన్నా ఉద్యోగం యిప్పించేట్లు వప్పించారు. పొరుగూరు వెళ్ళడానికి యిష్టపడితే ఆ ఉద్యోగం యిప్పిస్తానని అన్నారు.
    "తప్పకుండా వెడతాను మామయ్యగారూ, మీరు వస్తానని రాయండి యీ ఉద్యోగం యిప్పించి పుణ్యం కట్టుకోండి. వున్న వూళ్ళోనే అంటే ఎలా కుదురుతుంది. యీ పరిస్థితిలో నాకు కావాల్సింది ఉద్యోగం, అది ఎక్కడన్నా సరే చేస్తాను" అంది సరోజ ఆరాటంగా.
    చలపతిరావుగారు కాదనలేక నిస్సహాయంగా కళ్ళనీళ్ళు నింపుకున్నారు. "ఉద్యోగాలు చేసి ఊళ్ళేలి సుఖ పెడతాడనుకున్న కొడుకు తన దారి తాను చూచుకుని వెళ్ళిపోయాడు. నీకెందుకమ్మా మా గురించి యీ చింత. ఆడపిల్లవు పెళ్ళిచేసుకుని సుఖంగా కాపురం చేసుకోవలసిన దానివి నీకేం ఖర్మ పట్టిందమ్మా. ఇంతకీ మా ఖర్మ, త్రాగేవేళకి గిన్నెడుపలు బూడిదపాలయ్యాయి....." ఆయన, జానకమ్మ కళ్ళనీళ్ళు నింపుకున్నారు.

 Previous Page Next Page