Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 19

    మాయాదేవి కూడా లేచి పొర్లిపోతున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేసి బెడ్ రూంలోకి నడిచింది.

   
    ఉదయం తొమ్మిది గంటలకల్లా తయారై ఆఫీసుకు బయలుదేరాడు మనోహర్.
   
    "ఆ అమ్మాయితో అంత ఘర్షణ జరుగుతునప్పుడు నువ్వింకా ఆ అమ్మాయి ఆఫీసులోనే పని చేయాలా?"
   
    మానేసి వేరేచోట ఉద్యోగం చూసుకోవచ్చుగా...." గంభీరంగా అన్నాడు సూర్యప్రకాశరావు.
   
    "అగ్రిమెంట్ ప్రకారం నేనిప్పుడు ఉద్యోగం మానెయ్యలేను. నేనిచ్చిన బాండ్ ప్రకారం మరో సంవత్సరంపాటు మాయాదేవి కంపెనీలోనే పని చేయాల్సి వుంటుంది. లేదంటే పెద్ద మొత్తంలో నష్టపరిహారం కట్టాలి. అంత పెద్ద మొత్తం నా దగ్గరలేదు..." బైటికి నడుస్తూ అన్నాడు మనోహర్.
   
    "నువ్వేమన్నా బానిసవా....? ఎన్ని బాండ్ లు, ఎన్ని అగ్రిమెంట్ లు రాస్తేమాత్రం ఆమె దగ్గరే పనిచేయాల్సి రావటం అన్యాయం కాదా? అలా పని చేయవలసి వచ్చినప్పుడు మనిషి స్వేచ్చకి అర్ధం ఏముంది?" అప్పుడే గదిలోంచి బైటికి వచ్చిన కుటుంబరావు అన్నాడు.
   
    "ఉద్యోగం కోసం నా స్వేచ్చను నేనే అమ్ముకున్నాను. అమ్ముకో బట్టే ఎక్కువ జీతం ఇస్తున్నారు. ఇందులో మాయాదేవి తప్పేముంది?" అంటూ వెళ్ళి, మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు మనోహర్.
   
    "మీ అబ్బాయి వాలకం చూస్తుంటే నా అనుమానమే నిజమనిపిస్తోంది. ఆ అమ్మాయిమీద కేసు పెట్టాడు....తిరిగి ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏమిటి దీనికర్ధం? మమ్మల్ని, మా బిడ్డని మోసం చేయటానికే మీ కొడుకు ఈ కుట్రపన్నాడు" రుసరుసలాడుతూ అంది విశాలాక్షి.
   
    తనకే అర్ధం కాకుండాపోతున తన కొడుకుని ఎలా సమర్ధించాలో తెలియని సూర్యప్రకాశరావు తల దించుకుని మౌనాన్ని ఆశ్రయించాడు.
   
                                                                   *    *    *    *
   
    ఉదయం తొమ్మిదిన్నరకి ఆఫీసుకు చేరుకున్న మిస్ మాయాదేవి, తన లాయర్ ఆదిత్యని తన చాంబర్ కి పిలుపించుకుంది.
   
    "మన తరపు వాదన గురించి ఏమి ఆలోచించారు? ప్రశ్నించింది మాయాదేవి.
   
    "మనమేమాత్రం భయపడాల్సిన పనిలేదు మేడమ్.....మిస్టర్ మనోహర్ అభియోగం కోర్టులో నిలబడదు" ఉత్సాహంగా అన్నాడు లాయర్ ఆదిత్య.
   
    "జస్టిస్ మెహతా జస్టిస్ ప్రమీలారాణిగార్లు ఇండియన్ ఫేమస్ సెక్సాలజిస్ట్ డాక్టర్ కొఠారిని,  ఇండియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ సెక్స్కౌన్సిలర్ డాక్టర్ మహేందర్ వత్సాని పిలుస్తున్నట్లు తెలిసింది.....ఈ విషయం మీదాకా వచ్చిందా?" ప్రశ్నించింది మాయాదేవి.
   
    తెలియదన్నట్లుగా తెల్లమొఖం వేశాడు లాయర్ ఆదిత్య.
   
    "ఏ పని చేసినా.... అందులో పరిపూర్ణమయిన అంకితభావం వుండాలి మిస్టర్ ఆదిత్య....ఏ విషయంలోనైనా అప్రమత్తత చాలా అవసరం.....మనోహర్ నామీద పెట్టిన కేసు మన దేశానికేకాదు, ప్రపంచ దేశాలకు కూడా కొత్త....అలాంటప్పుడు మనమెంత ఏక్టివ్ గా, షార్ప్ గా ఉండాలి....? ఐయామ్ సారీ మిస్టర్ ఆదిత్య. ఓటమి అంటే నాకు అసహ్యం....మీ మూలంగా నేను ఓటమికి గురికావటానికి సిద్దంగాలేను.
   
    ఇక నుంచయినా, ఇప్పటి నుంచయినా మీరు ఏక్టివ్ గా ఉంటె బాగుంటుంది. ఇది చాలా సున్నితమయిన కేసు. వాదనలో ఏ చిన్న పొరపాటుకి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఈ రోజు కోర్టులో న్యాయమూర్తులు మనల్ని ఏ విషయంమీద నిలదీయబోతారో, వాటిని నిన్ననే మనం వూహించి సమాధానం సిద్ధంచేసి పెట్టుకోవాలి" స్టయిల్ గా ఆ సూట్లో పచార్లుచేస్తూ అంటున్న మాయాదేవికేసి విస్మయంగా చూశాడు లాయర్ ఆదిత్య.
   
    కాలాన్ని వెనక్కేసి, తను ముందుకెళ్ళి  ఆలోచిస్తున్న మిస్ మాయాదేవీ మామూలు యువతికాదు. ఎ రేర్ క్రియేచర్ ఆన్ దిస్ ఎర్త్.....! మగజాతికి ముక్కుతాడు వేసి మూలన కూర్చోబెట్టగల సమర్ధురాలు....పురుషాధిక్య ప్రపంచానికి పెనుసవాలుగా నిలువబోతున్న మిస్ మాయాదేవి కఠినమయిన మనో ప్రపంచం అర్ధం చేసుకోవటానికి చాలా శక్తి కావాలని పించింది ఆదిత్యకి.
   
    "ఇక మీరు వెళ్ళొచ్చు....ఒక మగవాడు ఒక స్త్రీని రేప్ చేసినప్పుడు, అది న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు, ఉత్పన్నమయ్యే వాదాల్ని, వివాదాన్ని, న్యాయస్థానాల దృక్పధాన్ని బాగా స్టడీ చేయండి. అవన్నీ రివర్స్ లోవస్తే ఎలా వుండవచ్చు అనే ప్రశ్నలకి కూడా సమాధానాలని రాబట్టుకొని సిద్దంగా వుండండి....నేను సరిగ్గా పదకొండు గంటలకు కోర్టులో వుంటాను" అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని టేబుల్ టాప్ కంప్యూటర్ ని ఆన్ చేసి, తన పనుల్లో నిమగ్నమయిపోయింది మిస్ మాయాదేవి. కంపార్ట్ మెంటలిజమ్ ఈమెకంత క్లిష్టమయిన మనో ప్రక్రియకాదేమో...దేనికి దాన్నే విడగొట్టి చూడగల మేధస్సు ఈమె సొంతం.....ఆమెకేసి ఒక అత్యద్భుతాన్ని చూస్తునట్లుగా చూసి బైటికి వెళ్ళిపోయాడు ఆదిత్య.
   
                                                             *    *    *    *
   
    హై కోర్టులో జస్టిస్ మెహతా చాంబర్ లో, ఆయన కెదురుగా జస్టిస్ ప్రమీలారాణి కూర్చున్నారు. ఉదయం తొమ్మిదిగంటలకే ఆ ఛాంబర్ చేరుకున్న న్యాయమూర్తులు ఇద్దరూ మనోహర్ కేసులో ఇమిడివున్న కొత్త పార్శ్వాన్ని, సరికొత్త కోణంలో చర్చించుకుంటున్నారు.
   
    స్పెషల్ కోర్టుకి కేటాయించిన సెక్యూరిటీ స్టాఫ్ అప్పటికే ఆ కోర్టు హాలుని తమ ఆధీనంలోకి తీసుకుని చుట్టుపక్కలెవరూ రాకుండా కాపలా కాస్తున్నారు.
   
    అప్పుడు సరిగ్గా టైం ఉదయం పదకొండు గంటలైంది.
   
                                      *    *    *    *

 Previous Page Next Page