"ఇంకా నిద్రపోలేదమ్మా" ఆప్యాయంగా అడిగింది మంగమ్మ.
అప్పుడు ఆ టైంలో అక్కడికి వచ్చి తన బాగోగుల గురించి అడుగుతున్న పనిమనిషి మంగమ్మకేసి అభిమానంగా చూసింది మిస్ మాయాదేవి.
"మీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నారా? కళ్ళకింద కన్నీటి చారికలు, కరిగిన కాటుక మరకలు, రేగిపోయిన జుత్తు, ఉబ్బిపోయిన ముఖం ఏమైందమ్మా? మీకేం తక్కువైందని? కోరుకుంటే కొండ మీద కోతిని కూడా తెచ్చి ఇవ్వగల తండ్రీ, అన్న వున్నారు.
వారం రోజుల్నుంచీ చూస్తున్నాను. ఎక్కడో ఆలోచిస్తుంటారు. ఏదో కలవరిస్తుంటారు. సరిగ్గా నిద్రపోరు, తిండి తినరు.
నాకు అంతస్థు లేకపోయినా, మీకు అమ్మని కాగల అర్హతలున్నాయి. ఒక అమ్మగా అడుగుతున్నాను. నిజం చెప్పమ్మా....ఏం జరిగింది?" మంగమ్మ మిస్ మాయాదేవి దగ్గరకెళ్ళి ఆమెను తన అక్కున చేర్చుకుని ప్రేమగా ఆమె తల నిమురుతూ అడిగింది.
"నేను కోరుకున్న మగవాడ్ని సొంతం చేసుకోవడంలో తప్పేమయినా వుందా మంగమ్మా?" నెమ్మదిగా అడిగింది మాయాదేవి.
ఆ అడగటంలో ఒక యజమానురాలు పనిమనిషిని అడిగినట్లు లేదు.....ఒక తల్లిని ఒక కూతురు అడిగినట్లుగా వుంది.
వెంటనే 'ఏం' చెప్పాలో ఎలా చెప్పాలో అర్ధంకాలేదు మంగమ్మకి.
అయినా కొద్ది క్షణాలలో తేరుకుంది మంగమ్మ.
"ఏం తప్పులేదు....మా అయ్య నాకు వేరే మనువు తీసుకొస్తే, ఊరు ఊరంతా అల్లరిచేసి, అలజడి లేపి, నాకు నచ్చిన వెంకటేశం బావని మనువాడాను.....అతి చిన్నవాళ్ళమయిన మాలోనే, ఎవరి ఇష్టానికి వాళ్ళు అంతా విలువిచ్చుకుంటుంటే....మీకేంటమ్మా....?" బాల్కనీలో ఫ్లోర్ మీద కూర్చుని, మాయాదేవి తలని తన వొడిలో పెట్టుకుని ఆమె ముఖాన్ని మృదువుగా నిమురుతూ అంది మంగమ్మ.
మంగమ్మ మాటలు విన్న మిస్ మాయాదేవి కొద్ది క్షణాలు ఆశ్చర్యంలో మునిగిపోయింది.
"ఏంటమ్మా.....ఏం చెప్పవేం....? అయినవాళ్ళకు చెప్పుకుంటే సగం బరువు తగ్గుతుంది అంటారు. నేను మీకు అయినా దాన్ననిపిస్తే, జరిగిందేమిటో చెప్పమ్మా!" అని ఒత్తిడి తీసుకొచ్చింది మంగమ్మ.
నెమ్మదిగా మంగమ్మ వొడిలోనుంచి లేచిన మాయాదేవి బాల్కనీ వాల్ కి ఆనుకుని కూర్చుంది.
"అంతా చెబుతాను. ఒక కప్పు టీ తెచ్చిపెట్టనా...." ఆవలింతలను ఆపుకుంటూ అడిగింది మాయాదేవి.
"అదెంత భాగ్యం! రెండు నిముషాల్లో వచ్చేస్తా" అంటూ కిందకు వెళ్ళిపోయింది మంగమ్మ.
తిరిగి ఆలోచనల్లో కూరుకుపోయింది మాయాదేవి.
చెప్పినట్లుగానే రెండు నిముషాల్లో ఇలాచీటీతో పైకి వచ్చింది మంగమ్మ.
ఎక్కడో ఆలోచిస్తూ నెమ్మదిగా టీ తీసుకుంటున్న మాయాదేవి వేపు ఆశ్చర్యంగా చూసింది మంగమ్మ.
"మీరు మీకు నచ్చింది ఏదో ఒకటి చేసేశారని నాకనిపిస్తోంది. దాని గురించి ఆలోచిస్తున్నారా....? భయపడుతున్నారా....? ఏ పనైతే చేస్తామో, చేసినందుకు ఆ తర్వాత భయపడవలసి వస్తుందో ఆ పని చేయకుండానే ఆగిపోవాలి. చేశాక భయం వేసినా, బాధ కలిగినా మనం చేసిన పనిపై మనకే సందేహం కలుగుతుంది. భయమయినా, బాధయినా ఒక నిర్ణయానికి రాక మునుపు ఆ నిర్ణయం గురించి ఆలోచిస్తున్నంతసేపే వుండాలి....
ఇక, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెనుకడుగు వేయకూడదు. మడత తిప్పకూడదు. మీరు చేస్తున్న పని మంచిది అనే నమ్మకం మీకుంటే చాలు....అప్పుడు ఈ సమాజానికీ, మనుష్యులకీ, భగవంతుడికీ కూడా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు.
నేను కేవలం పని మనిషేకాదమ్మా...ఎంతో జీవితాని, ఈ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసినదాన్ని నా పెనిమిటి వెంకటేశం అంటే నాకు చచ్చేంత ప్రేమ వాడికోసం ప్రాణాలిచ్చేందుకయినా సిద్దమే. వాడిక్కూడా నా మీద అంతే ప్రేమ వుండాలని కోరుకుంటా.....నన్ను వాడు భార్యగా గౌరవించి, ప్రేమించి, నా కష్టాల్లో - మఖాల్లో చివరికి నా పనుల్లో కూడా భాగం పంచుకున్నప్పుడు వాడిని నేను దగ్గరికి తీసుకుంటా. లేదంటే లేదు. నేను ఏ పని చేసినా అది అనుభవించేది నా పెనిమిటి అయినప్పుడు, దాన్ని నేను మనసుపెట్టి చేశానా లేదా అన్నదే ప్రధానం, అయినా నా పెనిమిటి నా పనికి ఏ వంకా పెట్టడు. ఆ పనిలో పనితనం లేకపోయినా నా మనసు వుందని తృప్తి పడాలి. అది గ్రహించకుండా నా పనికి వంక పెడితే__అతనికి నా మీద నిజమయిన ప్రేమ లేనట్లే.....అప్పుడు అతను భర్తయినా, కొడుకయినా నేను క్షమించను. నిన్నటి పూలైనా న అకోసం ప్రేమతో తెస్తే వాటి నానందంగా తలలో పెట్టుకుంటాను.
మా స్థాయి వాళ్ళు కూడా ఎంతో స్వేఛ్చగా, సంతోషంగా బతుకుతున్నప్పుడు, మీ స్థాయివాళ్ళు ఎందుకు ప్రతి నిముషం టెన్షన్ పడతారో నాకర్ధంకాదు...." అమాయకంగా జీవితసారాన్ని అలా కళ్ళెదుట వుంచేసరికి, అనుకోకుండా మాయాదేవి కళ్ళను నీటిపొర కప్పేసింది.
కొద్ది క్షణాల్లో వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది....
"నా భవిష్యత్తు ఏమవుతుందో నాకే తెలియటం లేదు. అందనిదాని కోసం అర్రులు చాస్తున్నానేమో ననిపిస్తోంది. మనిషి మనసుకు రెక్కలిచ్చిన భగవంతుడు, మనిషికెందుకు రెక్కలివ్వలేదో నా కిప్పటికీ అర్ధం కాలేదు. అప్పుడప్పుడు భగవంతుడి శాసనాన్ని ధిక్కరించి, నా భుజాలకి రెక్కలని మొలిపించుకుని, ఎక్కడెక్కడికో ఎగిరి పోవాలనుకుంటుంటాను-
అది సాధ్యం కాదని తెలిసినా.....మనోహర్ సమక్షంలో నా మనసెంతో ప్రశాంతంగా వుంటుంది. నాలోని అణువణువు ప్రతి క్షణం స్పందిస్తూ ఉంటుంది.
ప్రపంచంలోని ఆనందాన్నంతటినీ మనోహర్ రూపంలో భగవంతుడు నా ముందుంచాడనిపిస్తుంది. అతనికి నేను, నా ప్రేమ ఎందుకు అర్ధం కావటం లేదో నా అవగాహనకు అందటంలేదు...." నిట్టూరుస్తూ అంది మాయాదేవి.
"మనిషి పరిష్కారానికి అందని కొన్ని సమస్యల్ని కర్మకు అప్పజెప్పి, కాలానికి వదిలెయ్యాలని మా తాత అంటుండేవాడు....మీరూ ఇప్పుడు అదే పని చేసి ప్రశాంతంగా వుండండి....మీ కోర్కెలో న్యాయమున్నప్పుడు__ వున్నప్పుడేమిటి వుంది-కనుక మీరు కోరుకున్నది ఎప్పటికయినా సొంతం అవుతుంది!" అంటూ లేచింది మంగమ్మ.