ఆలోచించి చేసేదేముంది?
ఆ మర్నాడు పెళ్ళి వారొచ్చారు. పెళ్ళి కొడుకు, అతని తల్లి, తండ్రి, అక్కా, బావగారూ.... కారులో వచ్చారు.
పెళ్ళికొడుకు పేరు రాజేంద్ర. ఆశ్చర్యకరమేమంటే నా ఊహలకు వ్యతిరేకంగా ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు.
వాళ్ళకు నేను నచ్చటమే కాదు. వాళ్ళంతా నన్ను చూసి అప్రతిభులయినట్లు కనిపించారు.
పెళ్ళి కుదిరిపోయింది.
7
పెళ్ళి అయిపోయింది.
కలలో జరిగినట్లుగా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.
మా ఇంట్లో వసతులూ, తట్టుకునే ఆర్ధిక స్థోమతా లేనందువల్ల అక్కర అక్కడే 'అన్నీ అక్కడే' అన్నారు.
ఆ రాత్రి....
నన్ను గదిలోకి పంపించారు.
ఎన్నో ఆశలతో, కోరికలతో అంటూ బూజు పట్టిపోయిన పెద్ద పెద్ద మాటలు చెప్పనుగానీ, నాకు సరదాగానే ఉంది.
ఆ అబ్బాయి పైజమా, లాల్చి వేసుకుని, బాగానే ఉన్నాడు. కాని, ఏమీ పట్టించుకోనట్లు సైలెంటుగా ఉన్నాడు. ఆశ్చర్యమేమంటే అతని రూపానికి, ప్రవర్తనకూ సంబంధం లేదు.
"ప్రక్కకు జరగండి" అన్నాను కొంచెమాగి.
బుద్ధిమంతుడిలా ప్రక్కకు జరిగి గోడవైపు తిరిగి పడుకున్నాడు.
నాకేం చెయ్యాలో తెలీక, కొంచెం సేపెదురు చూసి అతన్నానుకుంటూ ప్రక్కనే పడుకున్నాను.
ఆ ఘడియల్లో జీవితం పట్ల, మనిషి తీరు తెన్నులు పట్ల చాలా గౌరవభావంతో ఉన్నాను.
అతను నా భర్త. అతనికి సహచారిణిగా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కాలం గడపాలి.
అందులోంచే, ఆ దాంపత్య సారం నుంచే సుఖాన్నీ, ఆనందాన్నీ జుర్రుకోవాలి.
కట్టుబాట్లతో కూడిన సంసార యాత్రను కొనసాగించాలి. ఇలా.... ఏవేవో పవిత్రమైన భావాలు ఆవహిస్తూ ఒక విధమైన మత్తులో ఉన్నాను.
క్షణాలు.... అదిగో.... మళ్ళీ అదే పదం వాడాల్సి వస్తోంది. గడిచిపోతున్నాయి.
నాలో అసహనం పెరుగుతోంది.
అతనికి అంకితం కావాలి.
ఎందుకంటే.... అట్లా జరగాలి కాబట్టి.
ఈ భావం.... నాలో సెక్స్ గా అనుకుంటే పొరపాటు.... నాలోని అమాయకత్వంతో కూడిన మధుర తరంగాలని రెచ్చగొడుతోంది.
ఈ రెచ్చగొట్టటం అనే పదాన్ని గురించి అపార్థం చేసుకోవద్దు. ఓ పసిపిల్లలా, మృదువుగా, లేతగా వాడుతున్నాను. సుందరమైన పవిత్రానుభూతితో మునిగి నేనే చొరవ తీసుకుందామనుకున్నాను.
అతని భుజం మీద చెయ్యి వేస్తూ "ఇలా తిరగండి" అన్నాను.
"ఎందుకు?" అన్నాడు తిరక్కుండానే.
ఎందుకు? ఎందుకేమిటి? ఏం జవాబు చెప్పాలో తెలీలేదు.
బలవంతాన నవ్వటానికి ప్రయత్నిస్తూ "ఇలా తిరగండి చెబుతాను."
ఇష్టం లేనట్లు నావైపు తిరిగాడు. అతని శరీరం మీద ఉన్న నా చెయ్యి అలా చెయ్యటంతో భుజం క్రిందపడి నలిగింది.
"అబ్బా" అన్నాను నొప్పి కలిగి....
"ఏమిటి?"
"నొప్పి"
"ఎక్కడ?"
"నా వ్రేళ్ళు మీ భుజం క్రిందపడి నలిగాయి."
"మరి ఎందుకు తిరగమన్నావు. హాయిగా నిద్ర కూడా పట్టబోతోంది."
"పెళ్ళి చేసుకుందెందుకు? నిద్రపోటానికా?"
"పెళ్ళి చేసుకుంటే నిద్రపోరా?"
"పోతారు.... తర్వాత"
"దేని తర్వాత?"
దవడ పగిలేటట్లు చెంపదెబ్బ కొడదామనుకున్నాను. సహనం నశించిపోతోంది. అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటున్నాను.
కసిగా విడమర్చి చెప్పాను. అక్కడ సిగ్గు ఒదిలెయ్యటం నాకేం కష్టమనిపించలేదు. కొన్ని సందర్భాలలో మనుషులు సిగ్గు విడిచి ప్రవర్తించడమే మంచిదనిపించింది.
"ఏమో.... నాకవన్నీ ఇష్టం లేదు. ఆ ముద్దులూ, కౌగిలింతలూ, ఇంకేమేమో చెయ్యటం.... అబ్బ.... నా కసహ్యం."
ఇంకేమనాలో తోచక "మరి అట్లా ఊరుకుంటే పిల్లలెలా పుడతారు." అన్నాను.
"దేవుణ్ణి ప్రార్థిస్తే పుడతారు." అంటూ అటు తిరిగి పడుకున్నాడు.
నిశ్చేష్టితురాల్నయి పోయి, అలా చాలాసేపు ఉండిపోయాను.
* * *
ఇలాంటి అసమర్థులు, వాళ్ళ ధార్న వాళ్ళు పడి ఉండక పెళ్ళిళ్ళెందుకు చేసుకుంటారు? ఎంతో అపూర్వ సంప్రదాయమైన 'పెళ్ళి ఎన్నో జీవితాలను ఎంత వికృతంగా బలికొంటున్నది.
ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాలుగయిదు రోజులు పట్టింది.
క్రమంగా ఆ ఇంట్లోని వాతావరణ మర్థమవుతోంది. అంతా ఎవరు ఉద్దేశాలను బట్టి వాళ్ళు జీవించే స్వార్థపరులు. మా మావగారికి, బావగారికి డ్రింక్ అలవాటుంది. ఎవరి దార్న వాళ్ళు గదుల్లో కూచుని తాగేస్తూ ఉంటారు. మా అత్తగారి వైఖరి అంతుపట్టడం లేదు. ఈ వాతావరణంలో ఎవరితో చెప్పుకోవాలో తెలీక నిస్సహాయ స్థితిలో రోజులు గడిపేస్తున్నాను. నా మనసేదో మార్పుని కోరుకుంటున్నది. కాని.... ఏ విధంగా రూపకల్పన చేసుకోవాలో తెలీటం లేదు.