8. తోడొకరుండిన
అదేభాగ్యము...
"అమ్మా!....నాకో వెయ్యి రూపాయలు అప్పుకావాలి" అంది బాలమ్మ.
"వెయ్యి రూపాయలా? ఎందుకే అంత డబ్బు?" బాలమ్మ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది లలితాదేవి
"మా సత్తెమ్మకు పెళ్ళిజేస్తున్న!" నవ్వుతూ చెప్పింది బాలమ్మ. ఆశ్చర్యంతో నోరు తెరిచింది లలితాదేవి.
అది గ్రహించిన బాలమ్మ, "అవునమ్మా....నేనే ఈ నిర్ణయం దీసుకున్న! మాకు దగ్గర సుట్టమే అయితడు. సత్తెమ్మకు బావ వరుసయితడు. సత్తెమ్మని చేసుకుంటనని ఇప్పటికి ఏడాది సంది అడుగుతుండు. నేనే ఆలోచిస్తా అని ఎప్పటికప్పుడు సెప్పి పంపుతుంటి. దాని మగ డొదిలిబెట్టిన సంగతీ తెలుసు నాయనకి. మారీ....రొండేడ్ల బిడ్డున్న సంగతీ ఎర్కనే! ఇగ.... మనసుబడి సేసుకుంటా అంటే ఎందుక్కాదనాలే? ఆయన గూడా అదేదో ఇనప అల్మారాలు తయారుజేసే కంపెనీల కొలువుజేస్తుండు. నెలకి ఎనిమిది నూర్లో ఏమో ఒస్తయట! ఏదో....నాకు మంచిగనే అనిపిచ్చింది. నేనున్నన్ని దినాలు నేను జూస్త! అయినంక ఎవరు జూస్తరమ్మ ఈ దినాలల్ల? ఏ అన్నలు ఏ వొదినలు జూడరు. అదీగాక ఎవరెట్ల జూసిన దానింట్ల అదున్నట్టు దానికుంటదా? ఎవరి సంసారాలల్ల అల్లుంటరు. కష్టం సుకం జెప్పుకోనికి దీనికొక తోడుండాలిగద! నేను ఎల్లకాలం వుంటానా? అయింత పానం పుటుక్కుమంటే దాని గతేంగాను? అందుకే ఏమన్నగాని, పెండ్లి జెయ్యనీకే నిశ్చయించుకున్న, జెర పైసలిచ్చి పుణ్యంగట్టుకో. నెలకింత జీతంల బట్టుకో, నీ కాలు మొక్కుతా!" అంటూ ఆమె పాదాలకి నమస్కరిస్తున్న బాలమ్మ ఒక్కొక్కమాటా లలితాదేవి గుండెల్లో దూసుకుపోయాయ్. కళ్ళప్పగించి దాని మాటలు వింటూంటే ఎవరో ప్రయోక్త జీవన సత్యాలు బోధిస్తున్నట్టనిపించింది.
"ఏమ్మా....ఆలోచిస్తున్నావు. నామీద నమ్మకం లేదా?" అంది అమాయకంగా బాలమ్మ.
ఉలిక్కిపడి బాలమ్మని చూస్తూ, "అదేం లేదే! ఇస్తాను" అంది యాంత్రికంగా లలితాదేవి.
బాలమ్మ తన పనిలో నిమగ్నమైపోయింది.
లలితాంబ మనసు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది.
"దానికొక తోడుండాలి గద!" బాలమ్మ మాటలు చెవిలో రింగుమంటున్నయ్. వాహిని రూపం కళ్ళలో మెరిసింది. కళ్ళు నీటికుండ లయ్యాయి. గుండె బరువెక్కిపోయింది. వేడి నిట్టూర్పులు సెగలై ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చెంపమీదుగా జలజలా కారుతున్న కన్నీరు గుండెని తడిపేసి, వేడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తున్నయ్. నాటి దృశ్యం కళ్ళకి కట్టినట్టు అద్దంలో ప్రతిబింబంలా కనిపించింది.
* * *
"మన పరువూప్రతిష్ఠా ఏంగాను? ఇప్పుడు నీకు ఏం తక్కువయింది? నా ఎనిమిదెకరాల మాగాణిలో రెండెకరాలు అన్నయ్యకు, రెండెకరాలు అక్కయ్యకి పోను, నీ రెండెకరాలే కాక, నా వంతు రెండెకరాలూ నీకేయిస్తాను. అక్కయ్యతోపాటు నీకు పెళ్ళిలో ఇచ్చిన ముప్పైతులాల బంగారంకాక, నా వొంటిమీదున్న పాతిక తులాలూ, ఈ ఇల్లూ కూడా నీకే రాసిస్తాను. నువ్వు చదివిన చదువు ఎమ్ బి.ఏ కి నీకు మంచి ఉద్యోగమే వొచ్చింది! ఆ దౌర్భాగ్యుడికి నీతో కాపురంచేసే అదృష్టంలేక అఘోరిస్తున్నాడు. అది వాడిఖర్మ! నీకేం మహారాణిలా బతకొచ్చు" అంది తను. ఆ మాటలకి వాహిని అదోలా నవ్వింది. ఆ నవ్వు....ఎన్ని అర్ధాలు చెప్పిందో తను ఈనాటికీ మర్చిపోలేదు.
ఆ నవ్వు.... 'డబ్బొక్కటేనా జీవితం?' అన్నట్టుంది.
ఆ నవ్వు.... "నువ్వు ఎంత అమాయకురాలివి? డబ్బుంటేచాలు సుఖం వుంటుందా?" అన్నట్టుంది.
ఆ నవ్వు.... 'నువ్వెంత పిచ్చిదానివి. జీవితం గురించి నీకింతే తెలుసా?' అన్నట్టుంది.
అందుకే ఆ నవ్వు.... ఇప్పటికీ గుర్తుండిపోయింది తనకి. అయితే ఆరోజు ఆ నవ్వుకి తనకెంత కోపం వొచ్చిందో? "ఏమే! డబ్బంటే అంత చులకనా? డబ్బులేకుండా జీవితాన్ని అంత హాయిగా గడపొచ్చుననుకున్నావా? నువ్వు డబ్బున్నదానివని తెలిసే, ఎవ్వరూ నోరెత్తకుండా నీ చుట్టూ తిరుగుతున్నారు. లేకపోతే, మొగుణ్ణొదిలేసిన ఆడదానిగా, ఉద్యోగం చేసుకుబతికే మగరాయుడిగా, మొండిదానిగా, దురదృష్టవంతురాలిగా. ఈ సమాజం నిన్ను కాకుల్లా పొడిచేది. ఈ డబ్బూ అండదండలే లేకపోతే, నీ తోబుట్టువులూ నిన్ను చులకనగానే చూసేవారు. అంతేకాదు.... నీకు కొండంత అండగా నేనున్నాను కాబట్టే నీ ఒంటిమీద ఈగవాలడంలేదు" అంది ఆవేశంతో.
మళ్ళీ వాహిని అలాగే నవ్వింది.
ఆ నవ్వు 'అస్తమించే సూర్యుడి వెలుగులా నీ అంద నాకెంతకాలం వుంటుందమ్మా?' అన్నట్టుంది.
ఆ నవ్వు 'నీ అండదండలు నాకు కోటబురుజుల్లా నీడనిస్తాయి కానీ, తోడు నెలా ఇస్తాయి?' అన్నట్టుగా వుంది. అందుకే ఆ నవ్వు ములుకులా గుండెకి గుచ్చుకుని ఈనాటికీ గుర్తుంది.
వాహిని అలా నవ్వుతూన్న కొద్దీ తనలో పౌరుషం ఎక్కువవుతూ వచ్చింది. కోపం, ఆవేశం, ఆవేదనా అన్నీ కలిసి త్రివేణి సంగమంలా పొంగుకొచ్చాయి. "వాహినీ! చివరిసారిగా చెప్తున్నాను. నువ్వు ఆ కులహీనుణ్ణి పెళ్ళి చేసుకుంటే తిరిగి నా గడప తొక్కడానికి వీల్లేదు. నీకిచ్చిన నగలూ నట్రా అన్నీ అక్కడ పెట్టి మరీ వెళ్ళు. తమకన్నా పెద్ద కులస్థురాలివీ, ఇంత డబ్బుతో వొస్తున్నా, రెండో పెళ్ళి దానివని వాళ్ళేకాదంటూంటే, నేనెందుకు రాజీపడతాను?" కోపంతో ఊగిపోతూన్న తనని చూసి, "అమ్మా! మొగవాడు రెండో పెళ్ళి చేసుకుంటున్నాడంటే ఒప్పుకున్నంత త్వరగా ఆడది రెండో పెళ్ళి చేసుకుంటోందంటే హర్షించదమ్మా సమాజం. రెండో పెళ్ళి అమ్మాయిని కోడలిగా స్వీకరించడానికి అందుకే వాళ్ళు బాధపడతారు. కులమతాలు అంటావా? అవి నానాటికీ పెరిగిపోయి ద్వేషాలనూ, రోషాలనూ పెంచుతున్నాయే తప్ప, తగ్గడం లేదు. కులమతాల పేరుతో విద్యా, వుద్యోగం, రాజకీయం చెలామణి అవుతూన్నంతవరకూ, ఈ కులమత తేడాలు సమసిపోవూ, సమానత్వం రాదు. అమ్మా! ఒక్కమాట చెప్పు. ఇంత చెబుతూన్న నువ్వు మాత్రం రాజీపడుతున్నావా? లేదే! కుల గోత్రం సంప్రదాయం - అన్నీ చూసి లక్షణంగా కట్నమిచ్చి, నువ్వు చేసిన పెళ్ళి ఏమయింది? సంవత్సరం తిరగకుండా నానా హింసలూ పడి, చావుతప్పు కన్ను లొట్టబోయినట్టు ప్రాణాలతో బయట పడగలగానే! మరి దానికేమంటావమ్మా? ఖర్మ అని సరిబెట్టుకున్నావ్! అంతేనా?" నచ్చచెబుతూన్నట్టుగా అంది వాహిని.
అయినా తనలో కోపం చల్లారలేదు పై పెచ్చు అహం పెరిగింది. జీవితంలో పెళ్ళొకటేనా ముఖ్యం? ఒక పెళ్ళి అలా తగలడింది. ఎవరిమీదా ఆధారపడకుండా బతకడానికి కావలసినంత ఆస్తీ, నీ హోదాని చాటే ఉద్యోగమూ వుంది. మరెందుకే ఆ కానివాడితో పెళ్ళి? సెక్స్!....ఈపాటికి నువ్వు నీ మొదటి మొగుడితోపడ్డ బాధలకి, అసహ్యం పుట్టుండాలి. లేదా, మనవాళ్ళలోనే ఎవర్నో చూసి, మనకి అనుకూలమైనవాడితో పెళ్ళి చేసుండేదాన్ని! అంతేకానీ, ఇలా గప్ చిప్ గా రిజిష్టర్ చేసుకుని దరిద్రంగా బతకవలసిన అవసరమే మొచ్చింది?" వాహిని కళ్ళల్లోకి చూస్తూ అంది తను.
వాహిని మొహం కోపంతో జేవురించింది. కోపం కూడా ఆమె అందానికి వన్నె తెచ్చిందేమో ఎర్రమందారంలా వెలిగిపోయింది మొహం. తన మాటలు వాహిని గుండెని కోసేశాయేమో, బాధ ఆమె కళ్ళలో సుళ్ళుతిరిగి వేడి కన్నీళ్ళు చెంపలమీద ధారకట్టింది.
"ఎంత నీచంగా మాట్లాడుతున్నావమ్మా! ఒక తల్లి ఒక బిడ్డను, ఒక ఆడది మరొక ఆడదాన్ని అర్ధం చేసుకున్నది ఇంతేనా? ఛీ! ఛీ!....సెక్సూ....డబ్బూ....ఇవ్వేవీ కావమ్మా ప్రధానం జీవితంలో! మనసున మనసుగా పెనవేసుకుపోయి, కష్టాన్నీ, సుఖాన్నీ, ప్రతి అనుభూతినీ పంచుకునే వ్యక్తి, తనని తననిగా ప్రేమించే వ్యక్తి ఒక్కరు తోడుగా నిలిస్తే అంతకన్నా ధనం, ఐశ్వర్యం మరొకటి లేదు. ఇవి ఎవరో కవిగారన్న మాటలు కావు. అక్షర సత్యాలు ప్రేమా, తోడూ - ఇవన్నీ ఊహకందని అనుభూతులు పొందగలిగిన జన్మధన్యం. వీటికి ఆస్తితో, అంతస్థుతో, కులమతాలతో, ఎటువంటి ప్రమేయం లేదు." ఒక్కొక్క పదాన్నీ నొక్కి నొక్కి చెప్పింది వాహిని.
అయినా, తనుమాత్రం తలవంచలేదు.
చిన్ననాడే పెళ్ళయి, కాపురానికొచ్చి, అతి పిన్న వయసులోనే బిడ్డని కని, భర్త వ్యసనాలకీ, కుటుంబంలోని వారి అనేక రకాల ఆరోపణలకీ, హింసలకీ గురయి. భర్త అనేక రకాల రోగాలతో మంచం పట్టినప్పుడు దాసీ దానికంటే హీనంగా తనుచేసిన చాకిరీ, ఆ తరువాత అనుభవించిన వైధవ్యం, రాపిళ్లూ అన్నీ, భర్త తాలూకు ఆస్తి మాత్రం కలిసి రావడంతో, అన్నిటినీ ఎదిరించి, ఆర్ధిక స్వాతంత్ర్యంతో అడుగు ముందుకువేసి, కళ్ళల్లో వొత్తులు వేసుకుని ఆరోప్రాణంగా వాహినిని పెంచి పెద్దచేసి, చదివించి, అడిగినంత కట్నమూ ఇచ్చి పెళ్ళి చేసి, ఆ పెళ్ళి విఫలమై విడాకులతో తిరిగొచ్చిన కూతుర్ని చూసి పెళ్ళిమీదా సమాజంమీదా అసలు ఈ వ్యవస్థమీదే కక్షనీ అసహ్యాన్నీ పెంచుకుంది తను. వాహిని మాటలల్లోని హితం తనకి ఏ మాత్రం రుచించలేదు.
"ఈ కవిత్వం, కాకరకాయలూ నాకక్కర్లేదు. చివరిసారిగా చెప్తున్నాను. నువ్వతణ్ణి వొదిలెయ్యకపోతే నీకూ నాకూ ఏ సంబంధమూ లేదు. నీకు నేను కావాలా, వాడు కావాలా తేల్చుకో!" అంది తను.
వెంటనే వాహిని తన సూటుకేసులో బట్టలు మాత్రం పెట్టుకుని వొంటిమీద నగలతోసహా అన్నీ అక్కడ పెట్టి, తన పాదాలకి నమస్కరించి వెళ్లిపోయింది.
ఆ తరువాత వాహినీ, సుమన్ కెనడాలో సెటిలయిపోయారు. ఎన్నో ఉత్తరాలు రాసింది వారి అనుకూల దాంపత్యాన్ని గురించి. పాప మహిమా, బాబు ధీరజ్ ల ఫోటో ఆల్బమ్ లు పంపించింది. తను ఒక్కదానికీ సమాధానం రాయలేదు. కాలచక్రంలో రెండు దశాబ్దాలు దాటిపోయాయి. చూపు మందగిస్తోంది. నడుం వొంగిపోతోంది. కోడలితో పడలేదని కొడుకు వేరుకాపురం పెట్టాడు కలకత్తాలో. పెద్ద కూతురూ అల్లుడూ సింగపూర్ వెళ్ళిపోయారు. బంగాళా అంతటికీ తనొక్కర్తే మిగిలింది. ఈ రోజున ఎండిన మోడులా, పండిన ఆకులా! కానీ ఇప్పుడు ఎవరైనా కాస్సేపు పలకరించాలనీ. కబుర్లు చెప్పాలనీ, మనసు తపించిపోతోంది. తను ఎవ్వరికీ అక్కర్లేదు! తన ఆస్తీ అవసరం లేదు! అనాధాశ్రమానికి రాసిచ్చెయ్యమన్నాడు కొడుకు. గతం జ్ఞాపకాలు కత్తుల్లా గుండెను ముక్కలు చేసేస్తున్నాయ్! బాలమ్మ పాటి జ్ఞానం తనకి లేనందుకు బాధ కలిగింది. వెంటనే ఎయిర్ ఇండియాకి ఫోన్ చేసి కెనడాకి టిక్కెట్టు బుక్ చేసుకుంది. కళ్ళనిండా వాహిని రూపం! మనసునిండా ప్రేమామృతం. వస్తూ వస్తూ సింగపూర్ లో కూడా ఆగాలి. ఆ తరువాత కలకత్తా వెళ్ళి కొన్నాళ్ళుండాలి!" ఆ తలపులే కొండంత బలాన్ని కలిగించాయి. తను వాళ్ళకోసం, వాళ్లు తన కోసం! అబ్బ, ఎంత మంచితోడు!
ప్రపంచం అంతా పచ్చగా కనిపించింది హరిత వనంలా! కోయిల గానాలూ, గాలి తెమ్మెరలూ, నారదతుంబుర గానాల్లా అనిపించాయి! మధురానుభూతుల మైకంలో తేలిపోయింది లలితాదేవి!
(స్వాతి వారపత్రిక, 1994)