Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 72


                   జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                 ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                             ముప్పది రెండవ అధ్యాయము

    (పురుషమన్త్రా ఉక్తాః అథసర్వమేధమన్త్రా ఉచ్యన్తే| పురుషమంత్రములు - గత అధ్యాయమున చెప్పబడినవి. ఈ అధ్యాయమున - స్వరమేధ మంత్రములు చెప్పబడుచున్నవి.)

    1. తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయుస్తదు చన్ద్రమాః|
    తదేవ శుక్రం తద్బ్రహ్మతా ఆపః స ప్రజాపతిః||

    అతడే అగ్ని. అతడే ఆదిత్యుడు. అతడే వాయువు. అతడే చంద్రుడు. అతడే వీర్యము. అతడే శబ్దము. అతడే జలము. అతడే ప్రజాపతి అగుచున్నాడు.

    2. విద్యోత మానుడగు ఆ మహా పురుషుని నుండియే సమస్త కాల, అవయవ, నిమేష, వర్షాదులు ఉత్పన్నములు అయినవి. నేటివరకు ఆ పరమ పరుషుని అగ్రమును గాని, మధ్యమునుగాని, తిర్యక్కును గాని కనిపెట్టినవాడు లేడు.

    3. అతని పేరు మహాద్యశుడు. అతనికి ఉపమానము లేదు. హిరణ్యగర్భాది మంత్రములు మమ్ము బాధించకుండ వలెను. అతనిని మించి అవతరించినవాడు లేడు.

    4. అతడు అన్ని దిశలందు వ్యాపించియున్నాడు. అతడే అందరి కన్న మున్ను జన్మించినవాడు. అతడే గర్భమునందున్నాడు. అతడే పుట్టుచున్నాడు. అతడే ముఖాది సర్వఅవయవములందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు.

    5.  అతని కన్న మున్ను సృష్టి లేదు. అతడే సర్వభువనభూతుడయినాడు. అతడు ప్రజాపతి యైనాడు. ప్రజను రక్షించినాడు. అతడే అగ్ని, వాయు, ఆదిత్యులను మూడు జ్యోతులను నిర్మించినాడు. అతడే అవయవమంత షోడశి అయినాడు.

    6. ఎవడు ఉగ్రమగు ద్యులోకమును ధరించినాడో, ఎవడు భూలోకమును స్థిరపరచినాడో, ఎవడు స్వర్గమును నిలిపి ఉంచినాడో, ఎవడు పరమ పదమునకు ఆధార భూతుడైనాడో, అట్టి దేవతకు హవిస్సులు సమర్పింతును.

    7. క్రందనశీల ద్యావాపృథ్వులు ఎవనిని మనసున తలచి గడగడలాడునో, ఎవని యందు ఉదయించి సూర్యుడు ప్రకాశించునో, ఎవని గర్భమునందు సకల జలములు నిలిచి ఉన్నవో అట్టి దేవతకు మేము హవిస్సులు అర్పించుచున్నాము.

    8. విద్వాంసుడగు వాడు ఆ మహాపురుషుని తన బుద్ధి యందు ఉన్నవానిగా దర్శించుచున్నాడు. ఈ సమస్త సృష్టి అతని గూటి యందే ఇమిడి యున్నది. అతని యందే ఈ సమస్త చరాచర ప్రపంచము ప్రవర్తిల్లుచున్నది. అతడే అందరి యందు జీవ భావమున దేహ భావమున నిలిచి ఉన్నాడు. అతడే ప్రజల యందు వ్యాపించి ఉన్నాడు.

    9. ఏడి ఆ వేదవేత్త? ఏడి ఆ పండితుడు? అమృత స్వరూపుడు, వాని తత్త్వమును చెప్పినవాడు? తేజోధామమగు బుద్ధియందున్న వానిని చూపినవాడు!

    ఆ మహాపురుషుని ముప్పాతిక అంశము గుహ్యమై ఉన్నది. ఆ ముప్పాతిక అంశమును తెలిసినవాడు తండ్రికే తండ్రి అగుచున్నాడు. యస్తాని వేద సపితుః పితాసమ్

    10. అతడు మాకు బంధువు. మమ్ము పుట్టించినవాడు. మమ్ము ఇంత చేసినవాడు. అతడు సమస్త తేజములను  భువనములను తెలిసినవాడు. అతని వలననే దేవతలు అమృతమును ఆస్వాదించుచున్నారు. స్వర్గమున విహరించుచున్నారు.

    11. ఆ పరమ పురుషుడు సర్వ  భూతములకు అతీతుడు. సర్వ లోకములకు అతీతుడు. సర్వ దిశ- విదిశలకు అతీతుడు. అతడు తొలుత కలిగిన సత్యవాక్కు నందు ప్రతిష్ఠితుడైనాడు.

    12. ఆ మహా పురుషుడు అతిశీఘ్రముగా ద్యావాపృథ్వులను లంఘించి, సమస్త లోకములను లంఘించి, సకల దిశలను లంఘించి, స్వర్గమును అతిక్రమించి, సత్య సూత్రమును విడదీసి, సత్యమును దర్శించినాడు. సత్యము అయినాడు. సత్యము నందు నిలిచినాడు - తదపశ్యత్తద భవత్త దాసీత్.

    (సత్యము- ఋతము - వాని అన్నింటిని మించినది. భగవానుడు సత్యము - ఋతము నందే ఉన్నాడు)

    13. అతడు యజ్ఞ గృహస్వామి. అద్భుతుడు. ఇంద్రునకు ఇష్టుడు. అందరిచే కోరబడువాడు. యోగ్యుడు. ఆస్వామిని అన్నము, ధనము, మేధస్సు యాచించుచున్నాను. ఆ స్వామికి స్వాహా.

    14. అగ్నీ! మేధ పరమ పవిత్రము. దాని కొరకు దేవతలు పితరులు ఉపాసింతురు. నేడు నీవు నాకు అట్టి మేధను ప్రసాదించుము. నన్ను మేధావిని చేయుము. అగ్నయే స్వాహా.

    15. మేధాం మే వరుణో దదాతు. మాకు అగ్ని, ప్రజాపతి, ఇంద్రుడు, వాయువు, ధాత బుద్ధిని ప్రసాదింతురు గాత. వారందరకు స్వాహా.

    16. ఇదం మే బ్రహ్మచ క్షత్రం చోభే శ్రియ మశ్నుతామ్|
    మయి దేవా దధతు శ్రియ ముత్తమాం తస్సైతే స్వాహా||

    దేవతలు నా యందు ఉత్తమమగు సంపదను ప్రవేశపెట్టుదురు గాత. నా ఈ లక్ష్మిని బ్రాహ్మణులు. క్షత్రియులు అనుభవింతురు గాత.

    ఆ దేవతలకు స్వాహా.

   
                             దాశరథి రంగాచార్య విరచిత
                 శ్రీమదాంధ్రవచన శుక్లయుజుర్వేద సంహితయందలి
          సర్వమేధ మంత్రోక్తమగు ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
                             తదపశ్యత్తదభత్తదాసీత్.

 Previous Page Next Page