Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 71


                 జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                         ముప్పది ఒకటవ అధ్యాయము


1.    సహస్రశీర్షా పురుషః  సహస్రాక్షః సహస్రపాత్ |
    సభూమిం సర్వతః స్పృత్వాత్యతిష్ఠద్దశాంగులమ్||

    అతడు మహా పురుషుడు. వేల తలలున్నవాడు. వేల కన్నులున్నవాడు. వేల పాదములున్నావాడు. అతడు భూమి యందంతటను వ్యాపించినాడు. అతడు ఇంకను పది అంగుళులంత ఎక్కువైనాడు.

    2. ఇది సాంతము ఆ మహాపురుషుడే. జరిగినది, జరుగుచున్నది అంతయు అతడే. అమృతమునకు అన్నింటికి అతడే ప్రభువు. అతడు అన్నమున వర్ధిల్లుచున్నాడు.

    3.  ఇది అతని మహిమ. ఆ పురుషుడు మరింత మహిమ గలవాడయినాడు. ఈ సమస్త విశ్వములు అతని చతుర్దాంశము అగును. ఇతని మూడు భాగములు అమృత స్వరూపము. ఆ స్వరూపము దివి యందు ఉన్నది.

    4. ఆ మహాపురుషుని ముప్పాతిక అంశము పైన నిలిచినది. చతుర్దాంశ మాత్రముననే అతడు ఈ బ్రహ్మాండమున  బీజరూపుడైనాడు. ఆ పాతిక అంశముననే అతడు సర్వత్ర పరివ్యాప్తుడయినాడు.

    5. ఆ మహాపురుషుని నుండి 'విరాట్' ఉత్పన్నమైనది. అందునుంచి పురుషుడు కలిగినాడు. తదుపరి అతడు భూమిని, లోకములను కల్పించినాడు.

    6. అతడే సర్వ హొమ యజ్ఞ పురుషుడు. అతని వలననే ఖాద్య, పేయములు నిండినవి. అతడు గ్రామములందును, అరణ్యములందును ఉండు వాయు ప్రధాన పశువులను కల్పించినాడు.

    7. అతడు సర్వహుత మహా పురుషుడు, అతని నుండియే ఋక్కులు, సామములు ఉత్పన్నములైనవి. ఛందస్సులు, యజుస్సులు ఆ మహా పురుషుని నుండియే ఆవిర్భవించినవి.

    8. అతని నుండియే అశ్వములు పుట్టినవి. వానితోనే రెండు వైపులా దంతములు గల పశువులు జన్మించినవి. అతని నుండియే గోవులు వచ్చినవి. మేకలు పుట్టినవి.

    9. ఆ మహాపురుషుడు 'జాతమగ్రతః' అందరి కన్న ముందు అవతరించినాడు. యజ్ఞార్థము అతడు దర్భలచే ప్రోక్షించబడినాడు. 'తేన దేవా అజయన్త సాధ్యా ఋషయశ్చయే' అతడే దేవతలను, సాధ్యులను ఋషులను సృష్టించినాడు.

    10. ఋషులు ఒక మహా పురుషుని కల్పన చేసినారు. వారు అతనిని ఎన్ని తీరుల కల్పన చేసినారు? ముఖం కిమస్యాసీత్? అతని ముఖము ఎట్టిదై యుండెను? కిం బాహూ? బహూవులు ఏవై యుండెను? కిమూరూ పాదా ఉచ్యతే. ఏవి ఊరువులు? - పాదములు అనబడినవి?

    11. బ్రహ్మణ్కోస్య ముఖమాసీత్ - బ్రాహ్మణులు అతని ముఖమైనారు. బాహూ రాజన్యః కృతః బాహువులు క్షత్రియులైనారు. ఊరూతదస్య యద్వైశ్యః అతని ఊరువులు వైశ్యులైనారు. పర్బ్యం శూద్రో అజాయత పాదముల నుండి శూద్రులు పుట్టినారు.

    12. అతని మనసు నుండి చంద్రుడు వెడలినాడు. కన్నుల నుండి సూర్యుడు పుట్టినాడు. కర్ణము నుండి వాయువు, ప్రాణము కలిగినారు. ముఖాదగ్ని రాజాయత ముఖము నుండి అగ్ని ఉద్భవించినాడు.

    13. ఆ మహా పురుషుని నాభి నుండి అంతరిక్షము, శిరము నుండి ద్యులోకము, పాదముల నుండి భూమి, శ్రోత్రముల నుండి దిశలు, అట్లే సమస్త లోకములు కల్పితములైనవి.

    14. పురుషరూపహవిచే దేవతలు, యజ్ఞము చేసినప్పుడు వసంతము ఈ యజ్ఞపు ఘృతము గ్రీష్మము, సమిధ- శరత్తు హవి అయినవి.

    15. దేవతలు యజ్ఞమును విస్తరింపచేసినప్పుడు ప్రజాపతి పురుషుచే ఆలంభ్య పశువుగా బంధించినపుడు - అపుడు "సప్తాస్యాసన్పరిధయః" ఏడు పరిధులైనవి. ఇరువది యొక్క సమిధలైనవి.

    16. దేవతలు యజ్ఞముననే యజ్ఞ పురుషుని యజించినారు. అవే ప్రథమ ధర్మములు అయినవి. మహిమాన్వితులగు ఋషులు- పూర్వము సాధ్యులు, దేవతలు వసించిన స్వర్గమును - యజనము చేసి చేరుకున్నారు.

    17. జలముల సంభృతము, పృథివి రసము నుండియు ప్రప్రథమముగా హిరణ్యగర్భుడు ఆవిర్భవించినాడు. త్వష్ట అతని రూపమును నిర్ధారించినాడు. అతడే తొలిసారిగా మర్త్యుల లోని దేవత్వమును గుర్తించినాడు.

    18. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలిసికున్నాను. అతనిని తెలిసిన వాడె మృత్యువును జయించగలడు. నాన్యః పన్థా విద్యత్కేయనాయ. అది తప్ప అనుసరించుటకు - అన్య మార్గము లేదు.

    19. ప్రజాపతి గర్భమునందు సంచరించును. అజాయ మానో బహుధా విజయతే - పుట్టుక లేనివాడు అనెక్ విధములుగా జన్మించుచున్నాడు. అతని మూలమును విద్వాంసులు మాత్రమే దర్శించగలుగుచున్నారు. అతని యందే సమస్త భువనములు నిలిచి ఉన్నవి.

    20. ఎవడు దేవతల కొరకు తపించునో, ఎవడు దేవతలకు పురోహితుడు అగునో, ఎవడు దేవతల నుంచి పూర్వమే ఆవిర్భవించినాడో, అట్టి బ్రహ్మయొక్క తేజస్సునకు నిత్యము నమస్కరించుచున్నాను.

    21. పూర్వకాలమందు దేవతలు బ్రహ్మతేజమును సృష్టించినారు. అప్పుడు వారు ఆ తేజముతో ఇట్లన్నారు.

    ఏ బ్రహ్మణుడు ఈ తేజమును తెలిసి కొనునో, దేవతలు అట్టి బ్రాహ్మణుని అధీనమునందు ఉందురు.

    22.  హే పరమపురుషా! శ్రీయు, లక్ష్మియు నీ పత్నులగుదురు. అహోరాత్రములు నీ పార్శ్వములగును. నక్షత్రములు  నీ రూపమగును. అశ్వినులు నీ విశాల ముఖమండలము అగుదురు.

    స్వామీ! నన్ను నీవానిగా భావించుము. నన్ను విముక్తుని చేయుము.


                          దాశరథి రంగాచార్య విరచిత
           శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేద సంహిత యందలి
         నరమేధాధ్యాయమను ముప్పది ఒకటవ అధ్యాయము సమాప్తము.
                                "నమో రుచాయ బ్రహ్మయే"

 Previous Page Next Page