Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 62


    పూర్వము కాకతీయ గణపతిదేవుఁడు దక్షిణదేశమును జయించు కాలముననే కాంచీనగరము నాక్రమించియున్న పాండ్యులను బాఱఁద్రోలి యా పట్టణమును స్వాధీనము గావించుకొని యుండెను. అచ్చటఁదనకుఁ బ్రతినిధిగా గండగోపాలచోళుని నియమించివచ్చెను. ప్రస్తుతము గణపతిదేవచక్రవర్తి పెద్దవాఁడై పోయినాఁడనియు నాయన ప్రాభవము తగ్గిపోయినదనియు భ్రమించి పాండ్యులు తిరిగి కాంచీపురముపై దండెత్తివచ్చిరి.
    ఆ విధముగా నెత్తివచ్చిన పాండ్యరాజులు నగరమును ముట్టడించి దుర్గమును స్వాధీనముగావించుకొని కాకతీయ సామంతరాజగు గండగోపాలునిఁ దఱిమివేసిరి. అంతటితో సంతృప్తినందక వారు విక్రమసింహపురము వఱకును నాంధ్ర సామ్రాజ్యములోనికిఁ జొచ్చుకొనివచ్చిరి. నిరుపమాన శౌర్యధనుఁడు, అభిమానవంతుడు అనంత సాహసోపేతుఁడు అఖండతేజో విరాజితుఁడును నగు గణపతి దేవచక్రవర్తి కది భరింపరాని యవమాన మయ్యెను. పాండ్యరాజులను బాఱఁద్రోలి మరల గండగోపాలుని తమ ప్రతినిధిగా నిలిపిరాఁగల మహావీరునక్కడకుఁ బంపవలయును. అట్టి మహోన్నత కార్యమును దీర్పఁగల సమర్థుఁడెవఁడాయని చక్రవర్తి యాలోచించుచుండెను.

                            3

    సార్వభౌముఁడు నాఁటి సాయంకాలము వజ్రసింహాసనముపైఁ గొలువు దీరినాఁడు సమస్త సామంతరాజులతో, మహామంత్రులతో, సేనా నాయకులతో నిండియున్న సభలో పాండ్యుల దుర్మార్గమును వివరించినాఁడు. పాండ్యరాజులకుఁ దగినట్లు శాస్తి యొనర్చి బుద్ధిసెప్పఁగల వీరాధివీరుఁడెవ్వఁడోలెండని ప్రశ్నించినాఁడు.
    పాండ్యులన్న సామాన్యులుగారు. అప్రతిమానశౌర్యవంతులు; అభిమానధనులు; రణవిద్యావిశారదులు. పాండ్యరాజుల జయించుటన్న ప్రతివారికిని భయమే. సార్వభౌముని ప్రశ్నమున కెంతసేపటికిని సమాధానమురాలేదు. "నేను పాండ్యులను జయించి మఱల కాకతీయ విజయపతాకను కాంచీపుర దుర్గగోపురముపై ప్రతిష్ఠాపింతు" నని ముందడుగువేసి ధైర్యముగాఁ బలుకు యోధాగ్రేసరుఁడెవ్వఁడును జక్రవర్తికిఁ గానుపింపలేదు.
    మహారాజు ముఖము. కోపముతో జేవురించినది. ఆయన పెదవుల దరసాగినవి. చక్రవర్తి తిరిగి ఏదియోపలుకఁబోవుచుండఁగనే పురుష వేషధారిణియగు రుద్రమదేవి లేచి "మహారాజా! నా కనుజ్ఞయొసంగి పంపినచో దుర్మార్గులగు పాండ్యుల పీఁచమడఁచి తిరిగి కాంచీపురమును బట్టుకొందు" నని మేఘగంభీరస్వరముతోఁ బలికెను.
    గణపతి దేవచక్రవర్తి మహాశౌర్య ధైర్యవిరాజితులగు వీరసేనా నాయకులను గొందఱను తోడిచ్చి రుద్రమదేవిని పాండ్యులను జయించుటకొరకుఁ గాంచీపురమునకుఁ బంపెను. కొలఁదికాలములోనే యామె పాండ్యులనుజయించి యపరిమితములగు ధనరాసులను, నమూల్యములగు మణిమయహారములను, నసంఖ్యాకములగు గజతురగాదులను నపరాధముక్రిందఁగైకొని మఱల గండగోపాలుని కాకతీయ సామ్రాజ్య ప్రతినిధిగాఁ గాంచీపురమున నిలిపి విజయలక్ష్మీ విరాజమానయై యేక శిలానగరమునకు విచ్చేసి తన విజయోపహారమును మహారాజు పాదములందు సమర్పించెను. తన వీరపుత్రిక ప్రథమవిజమునకు చక్రవర్తినయనము లానందభాష్పములతో నిండిపోయెను.
    ఆచార వ్యవహారములందును, బాహ్యవేషధారణము నందును, రుద్రమదేవి పురుషాకృతిధరించియున్నను స్వభావసిద్ధముగ నామె స్త్రీ. కావుననే సార్వభౌముఁడు దగినవరునన్వేషించి యామెకు వివాహముగావింప దృఢనిశ్చయుఁడయ్యెను.
    ఆంధ్రుల శక్తిసామర్థ్యములను కేంద్రీకరించి శాతవాహనుల యనంతరము విశాలాంధ్రసామ్రాజ్యమును సంస్థాపించినవాఁడు రాజరాజ నరేంద్రుడు. ఆయన వంశస్థులలోఁ బ్రసిద్ధికెక్కిన చాళుక్య వీరభద్రేశ్వరుఁడు ప్రస్తుత కాలమున గోదావరీమండలమును బరిపాలించుచుండెను. గణపతిదేవ చక్రవర్తి తన ముద్దులపుత్రి నాచాళుక్యవంశరత్నమున కిచ్చి వివాహము గావించెను. సుప్రతిష్ఠితమైన చాళుక్యవంశసంభవులతో వైవాహిక సంబంధ మేర్పరచుకొని సుక్షత్రియచూడామణికిఁ గన్యాదాన మొనర్పఁగలిగినందులకు గణపతి దేవుఁడపరిమితానందమునందెను.
    రుద్రమదేవికి దాంపత్యసౌఖ్యమెంతయో కాలము నిలువలేదు. కాకతీయ సార్వభౌమునకును గంగయసాహిణికినినైన మహాసంగ్రామమున వీరశిఖా మణియగు చాళుక్య వీరభద్రేశ్వరుఁడు వీరస్వర్గము నందెను. అంతకుముందే రుద్రమదేవీ వీరభద్రుల యనురాగవల్లి రెండు మొగ్గలు దొడిగినది. ఆ మొగ్గలే ముమ్మడమ్మయును రుయ్యాంబికయును. వీరిరువురిలో ముమ్మడమ్మ కుమారుఁడు ప్రతాపరుద్రుఁడు. అతనిని రుద్రమదేవి పెంచుకొనినది. ఈతఁడే చరిత్రప్రసిద్ధుఁడగు కాకతీయ వీరప్రతాపరుద్రచక్రవర్తి.
    అంతకంతకు గణపతిదేవచక్రవర్తికి వార్ధక్యము ముందడుగు వేయసాగెను. దానితోపాటు దీర్ఘవ్యాధి వెంటఁబడినది. స్వర్గయాత్రకు సంసిద్ధుఁడై మరణశయ్యపై నున్న మహారాజొకనాఁడు మహాప్రధానియగు గోవిందా మాత్యులవారినిఁ బిలిపించి యే'కాంతముగా నిట్లు పలికెను:
    "మంత్రిశేఖరా! తమ సాహాయ్యమున నింతవఱకు నీ యాంధ్ర సామ్రాజ్యము నేకచ్ఛత్రముగాఁ బరిపాలింపఁగలిగితిని. నేను వృద్ధుఁడనై యీ లోకమును వీడిపోవుచున్నాను. నా యనంతరము నా ముద్దులబిడ్డయగు నీ రుద్రమదేవికి 'వీరరుద్రదేవ' నామముతోఁ బట్టాభిషేక మొనరించి మహా సామ్రాజ్యము నవిచ్చిన్నముగా నిలిపి ప్రజారంజకముగాఁ బరిపాలనము సాగింపఁజేయుబాధ్యత మీ హస్తములయందు సమర్పించుచున్నాను. కాకతీయ కీర్తిలతామతల్లికలను దిగంతముల కెగఁబ్రాకింప సర్వసమర్థులగు మీ హస్తకమలములలో నా ముద్దులపుత్రిక నునిచి నిశ్చింతతో ప్రాణములను వీడుచున్నాను". ఇట్లు పలికి రుద్రమదేవి హస్తమును ప్రధానా మాత్యులచేతిలో నుంచెను. గోవిందామాత్యులవారి నయనములశ్రుపూరితములయ్యెను. ఆయన తన కర్తవ్యమును నెఱవేర్పఁగలనని మహారాజునకు వాగ్దానముచేసెను. అనంతరము కొంతసేపటికి మహారాజు కన్నులు మూసికొనెను.
    సార్వభౌముని మరణానంతరము కొలఁది కాలమునకే తదాజ్ఞాను సారముగా గోవిందామాత్యులవారు వజ్రసింహాసనముమీఁద రుద్రమదేవికిఁ బట్టాభిషేక మొనర్చుటకై సర్వసన్నాహములు గావించెను. రాజగురువులగు విశ్వేశ్వర శివ దేవయ్యవారినిఁ బిలిపించి శుభముహూర్తము నిర్ణయము చేయించిరి. సామంతభూపాలురు నానాభరణ ధనకనకవస్తు వాహనములను బహుమానములుగా సమర్పించిరి. నిర్ణీతమగు శుభలగ్నమున సమస్త ప్రజామండలి సమక్షమున కాకతీయ సింహాసనమునం దాసీనురాలై మహారాజ్ఞి రుద్రమదేవి పట్టాభిషిక్తురాలయ్యెను. ఆ మహోత్సవమును కన్నులారఁగాంచి యాంధ్రప్రజానీకము మహానందసాగరమున నోలలాడినది.

 Previous Page Next Page