వయస్సు నలభై వుండొచ్చు. అధునాతనంగా వుంది. ఆమె అందగత్తె అని వేరే చెప్పనవసరం లేదు.
ఆమె ఎవరిని ఆలోచించే వ్యవధిలేదు. మరోమాట మాట్లాడకుండా కారెక్కేశాడు పరుశురామ్.
కారు కదిలింది.
వెనక్కి తిరిగి చూశాడు. పోలీస్ జీపు కనిపించక పోయేసరికి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు.
ఆమె ఎవరో తెలీదు. ఎక్కడికి తీసుకెళుతుందో తెలీదు.
సాలెగూటిలో చిక్కుకున్న తను బయటపడాలంటే ఓ ఆసరా తనకి కావాలి.
ఆ ఆసరా తనకి ఆమె దగ్గర లభిస్తుందా!
రొప్పుతూ ఆమెకేసి చూశాడు పరుశురామ్.
జాబ్ చేసిన జుత్తుని సుతారంగా చేతితో వెనక్కి తోసుకుంటూ....
"నా పేరు నందిని" అందామె ఇంగ్లీషులో. తన జీవితం గొప్ప మలుపు తిరగడానికి నందిని "నాంది" కాబోతుందని అతనికా క్షణంలో తెలీదు. ఆమె అతని భుజంపైన చేయివేసి చిరునవ్వు నవ్వింది.
2
జూబ్లీహాల్స్ లో అధునాతనంగా నిర్మించబడిన ఓ భవనాన్ని కారు సమీపిస్తుండగానే అల్లంత దూరాన చూసిన వాచ్ మెన్ కాంపౌండ్ వాల్ గేటుని తెరిచి కారు లోపలికి దూసుకెళుతుంటే సాల్యూట్ చేశాడు. కారు లోపలికి వెళ్ళగానే గేటుని మూసేశాడు వాచ్ మన్.
కారు దిగుతూ ఆ భవనంకేసి ఆశ్చర్యంగా చూశాడు పరుశురామ్.
ఇంద్రలోకంలా వుందా భవనం.
అతనికేసి చిరునవ్వు నవ్వుతూ---
"పద లోపలికి!!" అంది నందిని అతని భుజంపైన చేయివేసి.
అలాంటి భవనం మచ్చుకి కూడా ఒకటి తను పుట్టి పెరిగిన ఊళ్ళో లేదు. మరో ఇరవై ఏళ్ళకైనా కడతారన్న గ్యారంటీ లేదు. ఆ వూరు తను పుట్టినప్పుడెలా వుందో ఇప్పటికీ అలాగే వుంది.
సవుడు నేల.... మురికి కాలువలు, గోతులు, గుంటలు పడిన రోడ్లు, రేపోమాపో కూలిపోవడానికి సిద్ధంగా వున్న, ఎన్నో ఏళ్ళక్రితం కట్టిన పాత ఇళ్ళు..... అసలా వూరికి అభివృద్ధి అనేది లేదనుకొంటుంటే సంవత్సరానికి ఒకటి రెండు తుఫాను దెబ్బలు తగులుతుంటాయి.
ఎప్పుడయినా అలాంటి భవనంలో అడుగుపెడతానని అతను ఊహించలేదు.
ఆమె సామాన్యురాలు కాదు. చాలా గొప్ప వ్యక్తి అయి వుండాలనుకున్నాడు పరుశురామ్.
ఆమెకేసి ఓసారి చూశాడు.
అద్భుతమైన సౌందర్యం ఆమెది. కాకపోతే వయసులో తనకంటే పెద్దది.
ఆమె ఉద్యోగస్తురాలు అవడానికి వీలులేదు.
ఉద్యోగం చేసి బతుకు ఈడ్చే మనిషి. అలాంటి భవనానికి యజమాని కాలేదు.
సినీస్టార్ కాదని ఖచ్చితంగా చెప్పగలడు. అతనికి సినిమాలతో పరిచయం వుంది. ఎప్పుడూ ఆమెని తెరపైన చూడ్లేదు.
ఇకపోతే రాజకీయ నాయకురాలా?
ఏమో?
ఆమె పేరు నందిని అని చెప్పింది. ఆ పేరుగల నాయకురాలి పేరు వినలేదు.
మరి ఆమె ఎవరు?
ఎవరో కోటీశ్వరురాలు.... అంతే!
ప్రస్తుతం ఆమె తనని ఆదుకొంది. ఆకలిగా వున్న తనకి భోజనం పెడుతుంది.
అతని భుజంపైన చేత్తో తడుతూ "పరీక్షించడం పూర్తయిందా? ఇక లోపలికి పద. నీతో చాలా పని వుంది" అంది నందిని.
"నాతోనా? పనా?" ఆశ్చర్యంగా చూశాడు పరుశురామ్.
"నీతో 'పని' చేయించుకోవాలనే తీసుకొచ్చింది. 'పని' చేస్తావా?" ఆమె సగం మూసిన కళ్ళతో చూస్తూ అడిగింది.
"ఏం చెయ్యాలి?" అడిగాడు పరుశురామ్.
"తర్వాత చెప్తాను. ముందు లోపలికి పద" ఆమెతో లోపలికి నడిచాడు పరుశురామ్.
సింహద్వారం లోంచి ఆమెతోపాటు లోపల అడుగుపెట్టి జారిపడబోయాడు. కాళ్ళ క్రింద ఖరీదైన కార్పెట్.