Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 41
ఒక దినమున బుద్ధ భగవానుఁడు తన శిష్యబృందముతో సంభాషించుచుండగా నొక బీదరాలు చేతులలో నొక పసిబిడ్డను బట్టుకొని గద్గదకంఠముతో వెక్కి వెక్కి యేడ్చుచు నచ్చటకు వచ్చెను. గౌతముఁడామెను జూచి యాశ్చర్యపడి దుఃఖమునకుఁ గారణమును బ్రశ్నించెను. అప్పుడా బీదరాలు "స్వామీ! వీడు నాబిడ్డ; వీనిని గడుంగడు గారాబంబున నరచేతులలో బెట్టి పెంచుకొంటిని. ప్రభూ వీని వైపు చూడుము! వీఁడు మరణించినాఁడు! ఇది వీని మృతశరీరము; నా బిడ్డ నన్ను విడచిపోయినాఁడు. నే నెట్లు నిలువ గలుగుదును. నే నీ శోకమును భరింపలేను. దయామయా! వీని వదన బింబముపై నొక్కమాటు నీ కృపారసవీక్షణములఁ బ్రసరింపఁజేయుము! అయ్యో! నా చిన్నతండ్రి మో మెంతచక్కనిదో చూడుము! ఇట్టి బంగారు పట్టినిఁ గోలుపోయి నేనెట్లు బ్రతుకుదును? కరుణానిధీ! నీవు మహానుభావుఁడవు. నన్నుఁ గటాక్షింపు" మని పరిపరివిధముల దీనముగాఁ బ్రార్థించి తన కుమారుని మృతకళేబరమును బుద్ధదేవుని పాదముల ముందుఁ బడవైచెను. గౌతమబుద్ధుఁడు బ్రశాంత మధురములగు పలుకులతో నామె దుఃఖము ననునయింపఁ జేయుచు "అమ్మా! నన్నిప్పుడేమి చేయమందువు? నా వలన నెట్టి యుపకార మర్థించి వచ్చితివి! చెప్పు" మని యడిగెను. ఆమె చేతులుమోడ్చి "మహానుభావా! నా బిడ్డను బ్రతికింపుము! నాకుఁ బుత్ర భిక్ష దయసేయుము! నీవు మహా మహిమాసంపన్నుడవని విని యాశతో వచ్చితిని. నా యాశ నిరాశ చేయకుము!" అని బ్రతిమాలసాగెను. గౌతముఁడు నవ్వి "అమ్మా! అట్లే ప్రయత్నించెదను. ఇందులకై నీవు గరిటెడు "ఆవాలు" గొనితేవలయును. వాని నెచ్చటనైన నడిగి కొనిరమ్ము. కాని యొక్కమాట మాత్రము వినుము! దుఃఖము నెఱుగనివారి వద్దనుండియే నీవా "యావాల"ను తేవలయును పొమ్ము; ఆలసింపకుము" అని పలికెను.
బీదరాలు సంతోషముతో నింత మొగము చేసుకొని యావాలు తెచ్చుటకై యూరిలోనికి బరువెత్తి పోయెను. ఆమె యింటింటి కరిగి "అమ్మా! నాకు గరిటెఁడు ఆవాల నిండు! మిక్కిలి యవసరమైవచ్చినాను. దుఃఖము నెఱఁగని వారి యొద్దనుండి గరిటె డావాలుతెచ్చినచో నీ బిడ్డను బ్రతికింతునని బుద్ధభగవానుడు మాట యిచ్చినాడు. దయయుంచి వేగిరమే యిప్పింపుడు. నా బిడ్డను రక్షింపుడు" అని పలికెను. అట్లామె పోయి యడుగుచున్నప్పుడు ప్రతివారును "అయ్యో! యావాల కేమి భాగ్యము, గరిటెఁడు గాదు, గంపెడైన నిచ్చెదము. కాని మేము దుఃఖము ననుభవింపక పోవుటయేమి? మే మనేక దుఃఖముల బొందితి" మని పలికిరి. ఈ విధముగా మాతండ్రి పోయెనని కొందఱును, తల్లిపోయెనని కొందఱును నందఱు నన్ని విధములఁ దమ తమ దుఃఖానుభవములను వర్ణించిరి.
ఆ బీదరాలా దినమంతయు తిరిగి తిరిగి ఎచ్చటను దుఃఖరహితులగు జనులను గాంచఁజాలక నిరాశతో మరలివచ్చి గౌతమున కావృత్తాంతమును నివేదించెను. గౌతముఁడామెను మృదుమధుర వచనములతో నోదార్చుచు నీ విధంబుగఁ బలికెను. "అమ్మా! జనన మరణములు సమస్త ప్రాణికోటికి స్వభావ సిద్ధములు. జన్మించిన ప్రతివాడును మరణింపక తప్పదు. విగతజీవులై విచారించుట వివేక లక్షణము కాదు. నీబిడ్డ మరణించినాఁడని నీకంత దుఃఖము కలిగినది. పిచ్చిదానా? లోకమున నెందఱి బిడ్డలు మరణించుట లేదు. ఇంటింటికిఁ జనివింటివికదా లోకుల కష్టములను. ఒక్కొక్కరికి నొక్కక్క విధమగు విషాదము కలిగియే యుండును. సంసారము దుఃఖమూలకము! విచారింపకుము. హృదయమును పదిలపఱచుకొనుము!"
గౌతముని ప్రబోధమును విన్నకొలఁది బీదరాలి సంతాపము దూరమయ్యెను. ఆమె ధైర్యము తెచ్చుకొని కన్నీరు తుడుచుకొని కన్నబిడ్డ మృతకళేబరమున కంత్యక్రియలు జరిపి తానును దుఃఖదూరమగు బౌద్ధ మతమున బ్రవేశించి ప్రజాసేవజేసి తన జీవితమును సార్థకము గావించుకొనెను.
బౌద్ధధర్మావలంబకులకు "బుద్ధుఁడు, ధర్మము, సంఘము" నను త్రిరత్నములే శరణ్యములు.
"కేవలము శరీరము శుష్కింపఁజేయుటచే లాభము లేదు. కేవలము నిరంతర భోగలాలసులైకాలము గడిపినను బ్రయోజనము లేదు. మధ్యమార్గమే యవలంబ నీయము. నిర్వాణ ప్రాప్తికి నష్టాంగమార్గము చక్కని రాచబాట.
అహింసయే పరమ ధర్మమూ. ఇతరులకుఁగీడు చేయరాదు. బీదలయందు దయ జూపవలెను. సర్వ ప్రాణులను ప్రేమింపవలయును. జీవహింస పాపదాయకము. తృష్ణ దుఃఖమూలకము. తృప్తియే స్వర్గము".
ఈ విధముగా బుద్ధభగవానుఁడు తన యుపదేశబీజములను మానవమానస క్షేత్రముల నెల్లయెడల వెదజల్లుచు నిర్వాణఫలము నందఱకు నందించుచు నెనుబదవయేట సిద్ధిపొందెను.
బుద్ధుని యనంతరము చాలకాలము వఱకు బౌద్ధ ధర్మావలంబులై యా యుత్తమ మతమును దేశ దేశాంతరముల, ఖండ ఖండాతరముల బ్రచారము గావించిరి.
బుద్ధునివంటి మహిమాసంపన్నుని, మహానుభావుని, దయామయుని, త్యాగమూర్తిని, ఆదర్శ జీవనుని గన్న మన భారతమాత ధన్యురాలు!
* * * *
Previous Page
Next Page