Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 38


    "అనూ! అలా అకస్మాత్తుగా ఇల్లు వదిలి యెందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఆ విధంగా చెయ్యకుండావుంటే మన జీవితాలు ఇలా...."

 

    అనూరాధ తలయెత్తి ప్రసాదు ముఖంలోకి నిర్లక్ష్యంగా చూసింది, ఆ చూపునుంచి తప్పించుకోవటానికి ప్రసాదు ముఖం దించుకున్నాడు. ఓ క్షణం ఇద్దరిమధ్య మౌనం.


    "జరిగింది మర్చిపో అనూ! ఇప్పటికైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనే అవకాశాన్ని ఇవ్వు. నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఇంతకాలానికి నాకు లభించావు."

 

    అనూరాధ ప్రసాదు ముఖంలోకి అర్థంకానట్లు చూసింది.

 

    "మన ఇంటికి వెళదాం. లే అనూ! హేమ చాలా మంచిపిల్ల. ఆ పిల్లకు తల్లిలేని లోటు తీర్చు."

 

    అనూరాధ ముఖం బాధతో బిగుసుకొనిపోవటాన్ని ప్రసాదు గమనించలేదు. కాని ఆమె మౌనాన్ని అంగీకారంగా వూహించుకున్న ఆనందంతో "ఒప్పుకుంటున్నావా అనూ! ఇప్పుడే కృష్ణారావుగారితో చెప్పేస్తాను. ఆయన కారులోనే మనం వెళ్ళిపోదాం" అంటూ లేచిన ప్రసాదు - "ఆగు" అన్న అనూరాధ కటుస్వరానికి ఉలిక్కిపడి కుప్పలా కూలిపోయాడు.  

 

    "కాదనకు అనూ!" రెండుచేతులూ పట్టుకున్నాడు.

 

    "ఎక్కడకు? మీ ఇంటికా? ఏ హోదాలో?" ఒక్కసారిగా చేతులు లాక్కుంది ప్రసాదు చేతుల్లోనుంచి.

 

    "నా ఇంటికి కాదు, మన ఇంటికి. ఇంక ఏ హోదాతో నంటావా? అది నీకు నేను వేరే చెప్పాలా?" ఆవేశంగా అన్నాడు ప్రసాదు.

 

    అనూరాధ నిర్లక్ష్యంగా నవ్వింది.

 

    "సరే, నేను వెళుతున్నాను. కనీసం నా చావువార్త విన్న తరవాతయినా ఒకసారి మనయింట్లో కాలుపెట్టు, అంతేచాలు, నా ఆత్మకు శాంతి లభిస్తుంది." ఈసారి ప్రసాదు స్వరంలో ఆవేశం స్థానాన్ని కోపం ఆక్రమించుకుంది.   

 

    అనూరాధ ప్రసాదు ముఖంలోకి దీక్షగా చూసింది. ఆ ముఖంలో ఆమెకు నిజాయితీ కొట్టవచ్చినట్లు కనిపించింది. అనూరాధ కళ్ళలో నీరు తిరిగింది.

 

    "అలా ఆవేశపడకు ప్రసాద్! ఈ వయస్సులో ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం అవసరం."

 

    అనూరాధ తిన్నగా ఎవరిదో విషాదగాధ చెబుతున్నట్లు, తనకు తానే మాట్లాడుకుంటున్నట్లు, ఎటో దూరతీరాల్లోకి చూస్తున్నట్లు చూస్తూ చెప్పుకుపోతోంది -

 

    "ఒకప్పుడు నీ ఇంటికి పెళ్ళికూతురుగా రావాలని కలలుకన్నాను. నీకోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూశాను. ప్రతి చిన్నవస్తువు కదిలికలోనూ, ప్రతి చిన్నశబ్దంలోనూ నీ అడుగుల చప్పుడే విని కొండంత ఆశతో నీకోసం ఎదురు చూశాను. హృదయ కలశంలోని మథువునంతా వెచ్చించి, ఆకాంక్షలనే పుష్పాలలో నింపాను. జీవితాన్నే నారగా పేని, ఆ ఆశల పుష్పాలను అందంగా కూర్చి మాల కట్టాను. ఆ మాలతో నీ కంఠాన్ని అలంకరించాలనే ఆశతో నీకోసం అనుక్షణం ఎదురుచూశాను. చూస్తుండగానే మాల వాడిపోయింది. చివరకు ఎండిపోయింది. కాని, నీవు రాలేదు. ఆ మాలకు ఒకరి కంఠాన్ని అలంకరించే శక్తి ఏనాడో నశించింది. దాన్ని కదలిస్తే ఆ పూలు రాలిపోతాయి. చివరకు మిగిలేది వట్టి నార మాత్రమే. ఆ నార ఒక కంఠానికి ఉరితాడు కాగలదేమో కాని, కంఠమాల కాలేదు. నన్ను ఇలాగే బ్రతకనియ్యి. వేరే జీవితాన్ని భరించే శక్తి నాలో ఏనాడో నశించింది..." అనూరాధ కంఠంలో నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తూంది.

 

    "అలా అనకు అనూ! నువ్వు నా భార్యవు, ఏనాటికి కనిపించినా ఆ స్థానం నీకు భద్రంగానే వుంది. నా అపరాధాన్ని క్షమించి నాతో రా."

 

    "హుఁ - అపరాధం.... క్షమ..... నిన్ను క్షమించే శక్తి నాలో లేదు. నిన్ను క్షమించవలసింది నేను కాదు..." అనూరాధ కంఠం రుద్ధమయింది.

 

    "ఎవరో చెప్పు, వారు నీ తల్లిదండ్రులేగా? ఇవాళే బొంబాయి వెళ్ళి వారి పాదాలమీద పడి క్షమాపణ వేడుకుంటాను. వారు నన్ను క్షమిస్తారని నాకు నమ్మకం వుంది" అన్నాడు ప్రసాదు ఉద్రేకంతో.  

 

    "తల్లీ! తండ్రీ! మళ్ళీ వారికి నేను బతికి వున్నట్లు తెలియటం కూడా నాకు ఇష్టంలేదు. నాలాంటి చరిత్రహీనురాల్ని కన్నందుకు ఫలితం వాళ్ళు అనుభవించి తీరాలి...." ఆమె కంఠంలో కక్ష ఎవరి మీదో ఆమెకే తెలియదు.

 

    ఆశ్చర్యంగా చూశాడు ప్రసాదు. ఏమీ అర్థం కాలేదు. మరయితే ఎవరా మూడోవ్యక్తి? బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కాలేదు.

 

    "అర్థం కాలేదుకదూ?" హెచ్చరిస్తున్నట్లున్న ఆమె మాటలకు తెల్లబోయి చూడటం తప్ప జవాబు ఇవ్వలేకపోయాడు.

 

    అయితే, అనూరాధ మళ్ళీ వివాహం చేసుకుందా? లేక, ఇంతకాలం తనకోసమే ఎదురుచూస్తూ వుంటుందనుకొనటంలో అర్థం లేదు. తన స్వార్థమే తనను అలా ఆలోచించనివ్వలేదు.

 

    "చెప్పమంటావా? వినే ధైర్యం వుందా?" అనూరాధ స్వరంలోని కాఠిన్యానికి ఇంకా తెల్లబోయాడు ప్రసాదు. మాట్లాడలేకపోయాడు.

 

    "ఆ మూడోవ్యక్తి ఎవరోకాదు. నువ్వూ - నేనూ చేసిన పాపానికి ప్రతిఫలమైన ఒక అభాగ్యురాలు!"

 

    ప్రసాదు చెంపన ఏదో అదృశ్యహస్తం ఛెళ్ళున కొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు.

 

    "ఏం, అలా ఉలిక్కిపడతావు?"

 

    ప్రసాదు అయోమయంగా అనూరాధ ముఖంలోకి చూడసాగాడు. అనూరాధ ముఖంలో ఇంతసేపూ కనిపించని కాఠిన్యం ఏదో కనిపించింది. మరో క్షణంలో అనూరాధ ఆకస్మాత్తుగా ఇల్లువదిలి పారిపోవటానికి కారణం లీలగా కళ్ళకు కట్టింది.

 

    "అంటే..... మన బిడ్డ.... ఎక్కడ.... ఎక్కడ వుంది?" అన్నాడు ప్రసాదు తడబడుతున్న మాటల్లో.

 

    అనూరాధ జవాబివ్వలేదు. ప్రసాదు లేచి విసురుగా ఆమె దగ్గరకు వచ్చాడు. రెండు భుజాలను మొరటుగా పట్టుకొని వూపుతూ "నా బిడ్డ ఎక్కడ? చెప్పు, నువ్వు క్షమించకపోయినా నా బిడ్డ నన్ను తప్పక క్షమిస్తుంది" అన్నాడు.

 

    అనూరాధ అసహ్యంతో ప్రసాదు చేతుల్ని తోసేసింది. ఉద్రేకంతో పిచ్చివాడయాడు. బుర్ర పనిచేయటం మానేసింది. కేవలం ఒక పిచ్చి ఆవేశం మాత్రమే అతని ప్రతి అణువులో ఉరకలు తీస్తున్నది.

 

    "చెప్పవుకదూ? నీకు నేను బాధపడటమే కదూ కావల్సింది? నన్ను ఇలా చిత్రవధ చేస్తావా? సరే చూడు, ఆనందించు-" అంటూ ఉద్రేకంకొద్దీ నుదుటిని గోడకువేసి కొట్టుకోసాగాడు.

 

    అనూరాధ ఒక్కసారిగా లేచివెళ్ళి ప్రసాదు తలను పట్టుకుంది బలంగా.

 

    "ఏమిటీ పిచ్చి? వచ్చి కూర్చో, చెబుతాను" అంది అనూరాధ మందలింపు స్వరంతో.

 

    "నేను కూర్చోను. అమ్మాయి ఎక్కడుందో చెప్పు. స్కూలుకు వెళ్ళిందా? ఏ స్కూలో చెప్పు. ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను."

 

    "అదే నాకూ తెలియదు. ఎక్కడ వుందో, ఏం చేస్తూందో?" స్వప్నంలో కలవరిస్తున్నట్లు అంటూ మంచం మీద నీరసంగా కూలిపోయింది అనూరాధ.

 

    ప్రసాదు నమ్మలేనట్లు చూశాడు. "నా పాపపు ముఖాన్ని మన అమ్మాయి చూడటం నీకు ఇష్టంలేదు కదూ? నాకు మీ జీవితాల్లో జబర్దస్తీగా ప్రవేశించే అధికారం లేదు. సరే, నేను వెళుతున్నాను. నేను చనిపోయిన వార్త విని అయినా నువ్వు నన్ను క్షమిస్తావని నాకు నమ్మకం వుంది." విసురుగా బయటకు వెళ్ళిపోతున్న ప్రసాదు షర్టును గట్టిగా పట్టుకొని వారించింది.  

 

    "వెళుదువుగాని ప్రసాద్! కాని, నేను చెప్పేదికూడా విని వెళ్ళు. నిజంగానే నా బిడ్డ ఎక్కడవుందో నాకు తెలియదు." అనూరాధకు దుఃఖం పొర్లుకొచ్చింది. ప్రసాదు కుప్పకూలిపోయాడు అనూరాధను ఓదార్చే శక్తి కూడా లేదు. స్థాణువులా చూస్తూ కూర్చున్నాడు. అనూరాధ క్రమంగా తనను తను సంబాళించుకొని చెప్పసాగింది-

 Previous Page Next Page